Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది హైదరాబాద్లోని శాసనసభా ప్రాంగణం. అక్కడి ఒక హాల్లో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే నిర్వహించబోయే మీడియా సమావేశం కోసం విలేకర్లు ఎదురు చూస్తున్నారు. చెప్పిన సమాయానికి 45నిమిషాలు లేటుగా ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయ్యింది. ఒక జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుణ్ని తిట్టిపోసేందుకు ఉద్దేశించిన పాత్రికేయుల సమావేశం అది. ఈ క్రమంలో వయసులో సీనియర్ అయిన మంత్రి గొంతు సవరించుకుని మైకందుకున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిపై ఏకబిగిన అరగంటపాటు విమర్శలు దంచికొట్టారాయన. అయితే ఎక్కడా సందర్భశుద్ధి చెడకుండా, పరుష పదజాలాలు వాడకుండా, దుర్భాషల్లేకుండా తాను చెప్పాలనుకున్న విషయాలను సూటిగా, స్పష్టంగా చెబుతూ గంభీరంగా ఉపన్యసించటం ద్వారా మీడియా కెమేరాల ముందు తనదైన రీతిలో బ్యాలెన్సును కాపాడుకుంటూ వచ్చారు ఆ పెద్ద మనిషి. ఆయన మాట్లాడటం పూర్తయ్యాక... వయసులో జూనియర్ అయిన మరో మంత్రి మైకందుకుందామని చూశారు. కానీ ఆయనకంటే జూనియర్ అయిన మరో ఎమ్మెల్యే ఆ అవకాశాన్ని ఠక్కున అందిపుచ్చుకున్నారు. అంతే అప్పటి వరకూ సీనియర్ మంత్రి చేసిన బ్యాలెన్సు కాస్తా పట్టు తప్పింది. 'తొక్కిపెడతా, బొందపెడతా, జైల్లో కుక్కేస్తా... శాశ్వతంగా నిన్ను లోపలేయిస్తా... నీకు ఖైదీగా ఒక స్పెషల్ నెంబరు ఇప్పిస్తా... చూసుకుందాం... దమ్ముంటే రా...' ఇలా తనకే సొంతమైన, సాధ్యమైన పద సంపదను వాడుతూ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. దీంతో మనోడు బ్యాలెన్సే కాదు, పట్టు కూడా తప్పుతున్నాడని గ్రహించిన సీనియర్ అమాత్యుడు జూనియర్ మంత్రి చెవిలో ఏదో ఊదారు. ఆ వెంటనే జూనియర్ మినిష్టర్... తన పక్కనే ఉన్న ఆ ఎమ్మెల్యేను సముదాయించేందుకు కొద్దిగా కిందికి వంగి, జేబులోంచి రుమాలు తీస్తున్నట్టో, లేక కింద పడిపోయిన పెన్నును పైకి తీస్తున్నట్టో నటిస్తూ... ఆ ఎమ్మెల్యేను గోకారు. తద్వారా... 'ఇక చాలు ఆపరా బాబూ... మాటల్లో తీవ్రత తగ్గించు...' అనే విధంగా సంకేతాలు, సంజ్ఞలు ఇచ్చారు. ఆ విధంగా గోకినా, మనోడు స్పీడు తగ్గించకపోవటంతో, సీనియర్ మంత్రి సూచన మేరకు ఐదు నిమిషాల తర్వాత మరోసారి గోకారు. అయినా ఎమ్మెల్యే వింటేనా... 'మీరెంత గోకినా, తగ్గమని చెప్పినా... నే తగ్గేదే లే...' అన్నట్టు మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తూ మరింతగా రెచ్చిపోయారు. దీంతో చేసేందేంలేక మంత్రులు చూస్తూ మిన్నకుండిపోయారు.
-బి.వి.యన్.పద్మరాజు