Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఉందిగా సెప్టెంబరు మార్చి పైన... వాయిదా పద్ధతుంది దేనికైనా'' అని ఓ పాటల రచయిత రాశారు. ఈ కరోనా రోజులలో ఇది మామూలు విషయంగా మారింది కాని అసలు దీని వెనుక ఎంతో ఇది దాగుంది. దీని వెనుక ఎంతో తర్కం దాగుంది. దీనిపై ఎందరో పరిశోధనలు కూడా చేశారు. ఇదంతా ఆషామాషీ విషయం మాత్రం కాదు. అసలు పనిచేసే వాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తారు కాని ఈ వాయిదా మనుషులు అంతగా కనిపించరు. అయితే వీళ్ళ వల్ల మేలు కూడా జరుగుతుందని పెద్దలు సెలవిచ్చారు. అంతెందుకు పరమానందయ్య శిష్యుల కథల్లో అమాయకత్వం వల్ల శిష్యులు ఒకపని చేయమంటే ఇంకొకటి చేయడం, అసలు పని మర్చిపోవడం ఇలా ఏది జరిగినా గురువుకు, గురువు కుటుంబానికి మంచే జరుగుతుంది. అందుకే ఆయన తన శిష్యులతో వేగలేక ఎవరి ఇండ్లకు వారిని పంపిద్దామన్న ఆలోచనను వాయిదా వేస్తుంటాడు.
ఇంకేదో విషయంపై రాయడం వాయిదా వేసి ఈ వాయిదా అన్న సబ్జెక్టును షురూ చేసాడని నాపై కూడా దీన్ని రుద్దవచ్చునని నా అనుమానం. ఏమైనా ఈ వాయిదా అంశం పై వాయిదా వేయకుండా రాస్తున్నానని మాత్రం మనవి చేస్తున్నాను. అక్షరయాత్ర అన్న పుస్తకంలో ఈ వాయిదా వేసే విషయంపై నండూరి రామమోహనరావు గారు చాలా మంచి పాయింట్లే చెప్పారు. ''రేపటి పని ఇప్పుడే చేయి, ఈరోజు పని ఇప్పుడే చేయి'' అన్న పెద్దల మాటను గుర్తుచేశారు. ఆ పెద్దల మాట నిలబెట్టడం కోసం ఈరోజు చేయవలసిన పనిని రేపటికి కాకుండా ఎల్లుండికి వాయిదా వేసేవారున్నారని ఆయన వేసిన వ్యంగాస్త్రం అందరూ చదవవలసిందే వాయిదా వేయకుండా!!
అప్పు తీసుకున్నోడు దాన్ని తీర్చడం ఖఛ్చితంగా వాయిదా వేస్తాడని చాలా యేండ్లు కష్టపడి కనుక్కున్నారు బ్యాంకులవాళ్ళు. అందుకే దాన్ని ఈ.ఎం.ఐ రూపంలో ప్రతి నెలా పట్టేస్తారు. అసలు వడ్డీ రెండూ ముక్కు పిండి వసూలు చేస్తారు. కాబట్టి వాయిదా వేయడం వీలు కాదు. లేదు తన ఖాతాలో డబ్బులేకుండా చేస్తే ఓ రెండు మూడు ఛాన్సు లిచ్చి తరువాత కోర్టు వాయిదాలకు తిరిగేలా చేస్తారు. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. ఒక నెల కాకపోతే ఇంకో నెలలోనైనా మన ఖాతాలో సొమ్ములుండేలా చూసుకోవాలి.
ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ఎన్నికల సమయంలో చేసిన ప్రమాణాలన్నీ పూర్తి చేయలేరు, కాదు చేయరు. ఎందుకంటే ఇంకా మేము చేయవలసినవి చాలా ఉన్నాయి అందుకే మరో ఐదేండ్లు మాకు ఛాన్సు ఇవ్వండి ఈసారి అస్సలు వాయిదా వేయమని మనల్ని నమ్మబలుకుతారు. మళ్ళీ మాకే అధికారం ఇవ్వండి ప్రతిపక్షాలకు ఆ ఛాన్సు ఇవ్వడం దయచేసి వాయిదా వేయండని ఇంటింటికీ వెళ్లి సలాములు కొడతారు. నిజమే కదా అనిపించేలా తమ వాయిదా పద్ధతిని కారణాలతో వివరిస్తారు. సరేలే ఇంకోసారి పవర్ ఇచ్చి చూద్దామని ప్రజలు మళ్ళీ దీవిస్తారు. ఆపైన కొత్త వాయిదా అంశాలు పెట్టి మరో ఐదేండ్లకు ఏవో డైలాగులతో వస్తారు. అప్పుడు మాత్రం ప్రజలు ఈ వాయిదా పద్ధతిని పక్కన పెట్టి, వీళ్ళను కూడా పక్కన కూచోబెడతారు. సదరు నాయకులు అప్పుడు అర్థం చేసుకుంటారు ఈ వాయిదా అన్నది తమ ప్రభుత్వం రాకుండా వాయిదా వేసిందని.
ఇలా తవ్వుకుంటూ పొతే ఎన్నో మంచి పనులు ఎందరో వాయిదా వేయడం మనం రోజూ చూస్తుంటాం. వాటిని దగ్గరనుండి పరిశీలిస్తే అన్నీ అర్థమవుతాయి. సదరు వాయిదా అలవాటు మనిషికి ఎప్పుడు అలవాటై ఉండవచ్చు అని మనం ఆదిమ కాలం నుండి మనుషులు ఎలా ఉండేవారు అన్న విషయం పరిశీలిస్తే ఆహారం దొరికింది దొరికినట్టు తినే రోజుల్లో మానవులు ఏమాత్రం సోమరిపోతులుగా ఉండేవాళ్ళు కాదని అర్థమైపోతుంది. ఏవైనా క్రూర జంతువులు దాడి చేస్తే కూడా వెంటనే స్పందించకుండా అలసత్వంతో ఉంటే ఇంక అంతే సంగతులు. తరువాత తన బొక్కలు ఏరుకోవలసిందే బంధువులు. వ్వవసాయం చేయడం అలవాటై, మిగులు మొదలై, పని చేసే వాళ్ళు చేయించే వాళ్ళు అన్న తేడా మొదలయ్యాక కొంత మందికి విశ్రాంతి దొరకడం ఎప్పుడు మొదలయిందో సరిగ్గా అప్పుడే ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ ''వాయిదా'' జాఢ్యం మొదలై ఉంటుంది. పరిశోధనలన్నీ మనుషులు చేసిన పనులు, సాధించిన విజయాలగురించే ఉంటాయి కాబట్టి ఈ వాయిదా అలవాటుపై ఆరా తీయడం పోస్టుపోను చేసి ఉంటారు అని నాకనిపిస్తుంది. అయినా ఈ విషయాన్ని ఎందుకు హైలైట్ చేయవలసి వచ్చిందంటే ఆ అలవాటు మాన్పించడంకోసమేనని అర్థం చేసుకోవాలి.
ఇక వాయిదా వేసే పనులు చాల ముఖ్యమైనవే ఉంటాయి. బండి రిపేర్, ఇంట్లో ఎవరినైనా దవాఖానకు తీసుకుపోవడం ఇలా. అయితే ఇంతకంటే ముఖ్యమైన పనులు అస్సలు వాయిదా వేయరు. అవేమంటే మిత్రులకు మందు పార్టీ ఇవ్వడం, పేకాటకు కూచోవడం, ఇంకో సందర్భం మీద మిత్రులకు పార్టీ ఇస్తుంటే పోవడం ఇలా అతి ముఖ్యమైన పనులు ఈ లిస్టులోకి వస్తాయి. వీటికి పోకుంటే కొంపలంటుకు పోతాయి. అదే రిపేర్ చేయకపోయినా బండి నడుస్తూ ఉంటుంది. మెడికల్ షాపు దోస్తు ఇచ్చిన మందులతో వైద్యం జరుగుతూనే ఉంటుంది. పెద్ద ఇబ్బంది కాదు మనసుకు.
ప్రభుత్వాలు కూడా కొన్ని పనులు వాయిదా వేస్తుంటాయి. తమ మిత్రులకు మేలు చేసే బిల్లులను మాత్రం పార్లమెంటు అత్యవసర భేటీ పెట్టి మరీ పాస్ చేసుకుంటారు. లేదా ఆర్డినెన్సులు తెస్తారు. అదే కరోనా సమయంలో చట్టసభలను వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. మహిళా బిల్లును ఎన్నిసార్లు వాయిదా వేసారో, ఎన్ని అడ్డంకులు కల్పించారో మనందరికీ తెలుసు. యాభై శాతం ఇవ్వవలసినది ముఫై మూడు శాతానికి మాత్రమే ఆమోదించి మిగతా పదిహేడు శాతాన్ని వాయిదా వేశారు. ఇవన్నీ చూసినప్పుడు మనకర్థమయ్యేదేమిటంటే మంచి పనులే పెద్దలు వాయిదా వేస్తారు కానీ ప్రజలను, దేశాన్ని ఇబ్బంది పెట్టె పనులను వెంటనే, వెనువెంటనే చేసేస్తారు అని. పెట్రోలు, డీజిలు ధరలు, గ్యాస్ బండ ధర ఇలా పెంచవలసి వస్తే రాత్రికి రాత్రి పెంచేస్తారు. పెట్రోలు బంకు వద్ద క్యూలో ఉన్న మొదటివాడికి ఉన్న ధర, చివరిలో ఉన్న మనకు ఉంటుందన్న గ్యారెంటీలేని రోజుల్లో ఉన్నాం. ఇంటికి పోయేటప్పుడు ఈరోజు ట్యాంక్ నిండా పెట్రోల్ వేయించాలనుకొని దాన్ని వాయిదా వేసి, భోజనం చేస్తూ టీవీ వార్తలు చూస్తే పెట్రోలు ధర పెరిగిందని అందులో చెబుతుంటే ఇక తిన్నది ఏం సహిస్తుంది చెప్పండి. అయినా ఫుల్ ట్యాంక్ పెట్రోలు ఎన్ని రోజులొస్తుంది, తరువాతైనా పెరిగిన రేటు ఇవ్వవలసిందే కదా అని సరిపెట్టుకోవాలి. లేకుంటే బతుకు బండి ముందుకు సాగదు.
చివరిలో మిత్రులందరికి ఒక మనవి... అదేమిటంటే వాయిదా వేసి ఎంజారు చేయడం కంటే ఆ పని ఇష్టమున్న లేకున్నా చేసేసి రెస్టు తీసుకోవడంలో ఉన్న మజా బాగుంటుందని మా మిత్రుడు ప్రభాకర్ చెబుతూ ఉంటాడు. ఆ సూత్రాన్ని పాటించమని సూచన. ఆ తర్వాత మీ ఇష్టం.
- జె. రఘుబాబు
సెల్: 9849753298