Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ ఇంగ్లీషు పత్రిక హిందూ అక్టోబరు 14న వ్యాసాలు వ్యాఖ్యల పేజీలో తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల రాజకీయాలపై ఒక వ్యాసం ప్రచురించింది. సీనియర్ పాత్రికేయుడైన ఆ వ్యాసకర్త రాసిన వాటికి కొన్ని పరిమితులున్నా ఆలోచించవలసిన కీలకాంశాన్ని ముందుకు తెచ్చింది. ఏడేండ్ల కిందట విభజన తర్వాత ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణలను పాలిస్తున్న వైసీపీ, టీఆర్ఎస్లు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన గన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పట్ల మరీ ముఖ్యంగా ప్రధాని పట్ల అనుసరిస్తున్న విధేయ వైఖరి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు చేటు చేయడమే గాక దేశవ్యాపితంగా రాష్ట్రాల హక్కులపై దాడి తీవ్రం కావడానికి ఎలా దోహదం చేస్తున్నదో అందులో ఉంది. ఇది ఆ పార్టీలు గతంలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉండటమే కాదు, దేశంలో ప్రజాస్వామ్య ఫెడరలిజానికి చెప్పలేని హాని కలిగిస్తున్నది. తెలుగు ప్రజల పోరాట వారసత్వానికి కళంకం తెస్తున్నది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటించడం, తమ కోర్కెలు చెప్పిరావడం జరుగుతూనే ఉంటుంది. కాని అందులో ఒక్కటంటే ఒక్కటి నెరవేరకపోయినా కొనసాగింపుగా కార్యాచరణ గాని ఉద్యమాలు గాని ఉండటం లేదు. తాము ఇచ్చిన కోర్కెలపైనే పోరాటం లేనప్పుడు జాతీయవిషయాల గురించి అసలు మాట్లాడేదేముంటుంది?
ఏపీకి వాగ్దాన భంగం
ఏపీ విషయమే తీసుకుంటే ప్రత్యేకహౌదా. ఎప్పటికప్పుడు వాయిదాలు పడి ప్యాకేజీ ప్రహసనాలు ముగిసి ప్రత్యేక ధోకాగా మారిపోయింది. ఆ పేరెత్తితే కేంద్ర రాష్ట్ర బీజేపీ నేతలు అపహాస్యం చేస్తున్నా వైసీపీలో చలనం లేదు. గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్యాకేజీ గొప్పతనం చెప్పడానికి ఎంత శ్రమపడ్డారో గుర్తుచేసుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిరాహారదీక్షలు, యూనివర్సీటీ సెమినార్లు ఒకటేమిటి ప్రత్యేక హౌదాను ప్రధానాంశంగా ప్రచారం చేశారు. ఆ దెబ్బతో చంద్రబాబు కూడా ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీఏ నుంచి వైదొలగి ప్రత్యేకహౌదాపై పోరాటం, ధర్మయుద్ధం పేరిట హడావుడి చేశారు. ఏపీ ప్రజలు టీడీపీ, బీజేపీ రెంటినీ ఓడించి, వైసీపీకి అసాధారణ ఆధిక్యతతో అధికారం అప్పగించారు. అంతే! ప్రమాణస్వీకారానికి ముందే ప్రత్యేకహౌదాపై చేతులెత్తేశారు. మోడీకి పూర్తి మెజార్టి ఉంది గనక ఏం చేయలేమనడం ప్రజలకు మొదటి రాజకీయ షాక్‌గా మారింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం పెరిగిన ఖర్చులు పునరావాస బాధ్యతలతో కలసి 55,565కోట్ల విడుదల కూడా జరగడం లేదు. పోలవరం ప్రాజెక్టు సాధికార సంస్థ(పిపిఎ) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించడమూ అలాగే ఉంది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడంపై ఏకాభిప్రాయం ఉన్నా పలుసార్లు అడిగినా అతీగతీ లేదు. రెవెన్యూలోటు కింద మొదట్లో ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం సమస్యగా భావించడం లేదు. కాని వీరు అడిగిన మేరకు రూ.50వేల కోట్ల అప్పుల పునర్వ్యవస్థీకరణ గానీ, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన రూ.3299 కోట్ల సబ్సిడీ బకాయిలు, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ.4652 కోట్లు కూడా రావడం లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం అందకపోయినా మూడు రాజధానుల ప్రతిష్టంభన కారణంగా అదీ అడిగే పరిస్థితి లేదు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం సహాయం లేకపోవడంపై కేరళ, ఢిల్లీ, బెంగాల్ వంటి రాష్ట్రాలు కలసి పోరాడితే ఏపీ గొంతు కలపలేదు. న్యాయంగా అదనంగా కేంద్రం నుంచి రావలసినవి తెచ్చుకోలేని నిస్సహాయతతో, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా జగన్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని కేంద్రంపై పోరాడాలనే ఆలోచన మాత్రం చేయడం లేదు. గతంలో ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా చంద్రబాబు ఆఖరులోనైనా మారాల్సి వచ్చింది. కాని ఇప్పుడు చూస్తే టీడీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విమర్శలు గుప్పించడం తప్ప కేంద్రం చేస్తున్న అన్నాయాన్ని ఆక్షేపించడం లేదు. ఇంకా చెప్పాలంటే మీరు లోబడిపోయారంటే మీరు లొంగిపోయారని పరస్పరం తిట్టుకుంటూ బీజేపీకి రాష్ట్రాన్ని లోకువ చేస్తున్నారు. ఇదే ప్రత్యేక హౌదాపై రౌండ్ టేబుళ్లు పెట్టి హిందీలో ప్రసంగాలు చేసి హడావుడి పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా బీజేపీతో జతకట్టి ఆ ఊసే వదిలేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన బీజేపీ రాజకీయంగా ఎదురుదాడికి దిగడమే గాక అలవాటైన మతరాజకీయాలతో హిందూ క్రైస్తవ చిచ్చు పెట్టాలని పథకాలు వేస్తే వైసీపీ గట్టిగా ఎదిరించదు. టీడీపీ, జనసేన డిటోగా మాట్లాడతాయి. జనసేన, బీజేపీలను కూడా టీడీపీ తరపున పనిచేస్తున్నట్టు వైసీపీ విమర్శిస్తుంది. బీజేపీ, జనసేన అస్తిత్వాన్నే గుర్తించనట్టు వ్యవహరిస్తున్నా పవన్ కళ్యాణ్‌లో స్పందన ఉండదు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణ వంటిదానిపై కూడా గట్టిగా పోరాడకపోగా తనను అక్కడ గెలిపించలేదని వాపోయారు. హిందూ వ్యాసం బీజేపీకి వైసీపీ లోబడిపోతున్న తీరును బాగానే చెప్పింది గాని మిగిలిన రెండు పార్టీలూ అదే తరహాలో వ్యవహరిస్తున్న వాస్తవం ప్రస్తావించలేదు.
తెలంగాణ సీఎం మకాం.. మంతనాలు
ఏపీలో బీజేపీకి ఎన్నికల విజయాలు లేవు గాని తెలంగాణలో ఎంఎల్ఎ, ఎంపీ స్థానాలున్నాయి. మజ్లిస్ కూడా హైదరాబాదులో ఒక కీలక పాత్రధారిగా ఉంది. బండి సంజరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనాక హిందూత్వ రాజకీయాలు రగిలించే ప్రయత్నం తీవ్రంగానే జరుగుతున్నది. హౌంమంత్రి అమిత్ షాతో సహా వచ్చి వెళ్లారు. ఆ రీత్యా రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం బీజేపీపై విమర్శలు చేయడం పోరాడటం అనివార్యంగా జరుగుతుంది. కాని రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసినవి రాబట్టడంలోనూ మోడీ నిరంకుశ విధానాలపై జరిగే పోరాటాన్ని బలోపేతం చేయడంలోనూ పాల్గొనడంలేదు. ఒక దశలో ఆవిధమైన సంకేతాలిచ్చిన కేసీఆర్ తర్వాత వ్యూహం మార్చుకున్నారా అని పరిశీలకులు సందేహిస్తున్నారు. రైతాంగ వ్యతిరేక శాసనాలపై జరిగిన మొదటి బంద్‌ను బలపర్చిన కేసీఆర్ ప్రభుత్వం రెండవ బంద్‌కు సహకరించలేదు. గత నెలలో ఆయన ఢిల్లీకి రెండుసార్లు వెళ్లి పదిరోజులు ఉండటమే గాక అమిత్‌షాతో సహా బీజేపీ అగ్రనాయకులను ఒకటికి రెండుసార్లు కలసి వచ్చారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నా కేంద్రంలో బీజేపీకి సహకరిస్తామనీ, రేపు రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల వనరుల సమీకరణలోనూ ఒక చేయి వేస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కన్నా బీజేపీని ప్రత్యర్థిగా కలిగివుండటమే మేలని కేసీఆర్ భావనగా ఉంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కూడా బీజేపీపై రాజకీయ పోరాటం కన్నా టీఆర్ఎస్ను ఎదుర్కొవడం కీలకమనే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ కుదురుకు చెందిన కొండా విశ్వేశ్వరరెడ్డి వంటివారు హుజూరాబాద్‌లో బీజేపీ తరపున పోటీచేస్తున్న ఈటెల రాజేందర్‌ను బలపరుస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని కూడాపెట్టలేదనే విమర్శ ఉంది.
హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణకు ఏపీకి ఉన్న రెవెన్యూ లోటు సమస్య కూడా లేదు గాని అపరిష్కృత అంశాలు అనేకం కేంద్రం దగ్గర ఉన్నాయి. గత నెల ప్రధానిని కలిసిన కేసీఆర్ ఆ జాబితా ఇచ్చి వచ్చారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, నాగపూర్‌తో పారిశ్రామిక క్యారిడర్, వరంగల్‌లో జౌళి పార్కు, గిరిజన విశ్వ విద్యాలయం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి రహదార్ల మెరుగుదల, ఒక ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వంటివి తెలంగాణ దీర్ఘకాలిక కోర్కెలు.
ఉభయ హానికరం
రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నదీజల వివాదాలను సాకుగా చూపి కేంద్రం మొత్తం ప్రాజెక్టులను తన గుప్పిట్లోకి తీసుకుంటున్నది. ఇంత జరుగుతున్నా కేసీఆర్, జగన్‌లు గట్టిగా గొంతెత్తి మాట్లాడటం లేదు. రాష్ట్రాలలో పార్టీల మధ్య విమర్శలతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య అవాంఛనీయ వివాదం పెంచుకోదడానికే పరిమితమవుతున్నారు. ఏపీ కేంద్రం చెప్పిన వాటిని ముందుగా అమలు చేస్తుంటే, తెలంగాణ రాజ్యాంగ బాధ్యత పేరిట మద్దతు నిస్తుంటుంది. 370 పక్కన పెట్టడం, పౌరసత్వ సవరణలతో సహా బీజేపీ బిల్లులన్నిటినీ ఈ పార్టీలు ఏదోరకంగా బలపర్చాయి. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించిన టీఆర్ఎస్ రాష్ట్రంలో దాన్ని అమలు చేయబోమని ప్రకటించలేదు. వైసీపీ అక్కడ మద్దతునిచ్చి ఇక్కడ అమలు చేయబోమని ప్రకటించింది. వీటి విషయమే ఇలా ఉంటే మతరాజకీయాలకు పౌరహక్కులపై దాడులకు సంబంధించిన ఇతర అంశాలు చెప్పనవసరం లేదు. తనపై విమర్శలకు సమాధానంగా మరిన్ని ఆలయ ప్రదిక్షణలు చేయడం జగన్ విధానంగా ఉంది. యాదాద్రి నూతన నిర్మాణానికి మోడీని రప్పించడంలో కేసీఆర్ రాజకీయం కనిపిస్తుంది.
దేశవ్యాపిత ప్రభావం
తెలుగునాట ఒకనాడు కమ్యూనిస్టుల సంఖ్యా బలం, ఉద్యమాలు కేంద్రానికి సింహస్వప్నంగా ఉండేవి. తర్వాత కాలంలో తెలుగుదేశం స్థాపించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా జ్యోతిబాసు, రామకృష్ణహెగ్డే, ఫరూక్ అబ్దుల్లా వంటివారితో కలసి రాష్ట్రాల హక్కులకోసం పోరాడారు. ఆయనను కూలదోస్తే ప్రజలూ ప్రతిపక్షాలూ కలసి పున:ప్రతిష్టించుకున్నారు. ఆ క్రమంలోనే బీజేపీలేని నేషనల్ ఫ్రంట్ కూడా ఏర్పడింది. దాన్ని కూలదోసేందుకు అద్వానీ రథయాత్ర చేసిన తర్వాత ఎన్టీఆర్ బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈ పరిణామంంలోనే జాతీయ పాత్ర నిర్వహించి తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. విడిపోయి మళ్లీ కలిపారు. 2019లోనూ ప్రతిపక్షాల వేదిక అన్నారు. ఓడిపోయాక మళ్లీ బీజేపీ విధానాలపై విమర్శలు విరమించుకున్నారు. టీడీపీ రాజ్యసభ పక్షం మొత్తం బీజేపీలో కలసి పోయినా ఉపేక్షించారు. తనపై కేసుల కారణంగా జగన్ మోడీకి లోబడి వ్యవహరిస్తున్నారనే విమర్శ ఉన్నా మిగిలిన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా స్థానం కాపాడు కోవడానికే పరిమితం కావడం, రాష్ట్రాల ప్రయోజనాలకు రాజ్యాంగ బద్దంగా రావలసిన వాటికి కూడా ఒత్తిడి చేయకపోవడం దారుణం. మోడీ సర్కారు కేంద్రీకృత నిరంకుశ విధానాలను నిలవరించే పోరాటం వీరికి అసలు పట్టకపోవడం మరింత నష్టదాయకం. కాంగ్రెస్ అవ్యవస్థ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటివారి అనిశ్చిత వ్యూహాలు, ఒరిస్సాను నిరాఘాటంగా పాలిస్తున్న నవీన్ పట్నాయక్ వంటివారి పరిమిత పోకడలు బిఎస్పి ఎస్పిల కలహాలు వంటివన్నీ మోడీకి మేలుగా మారుతున్నాయి. ఫిరాయింపులతోనూ బెదిరింపులతోనూ బీజేపీ చెలరేగి పోవడానికి ఊతమిస్తున్నాయి. స్పష్టమైన సైద్ధాంతిక భూమిక ఉండే కేరళ ముఖ్యమంత్రి పినరయివిజయన్ వంటివారి గురించి చెప్పనవసరం లేదుగానీ, ఆ తర్వాత బెంగాల్ సిఎం మమతాబ బెనర్జీ, బీహార్‌లో తేజస్వియాదవ్ వంటివారే ఈ వాతావరణంలో బీజేపీని ఎదుర్కొనే నేతలుగా కనిపిస్తున్నారు. మోడీ ప్రయివేటీకరణ విధానాలపై కార్మిక ఉద్యోగులు, వినాశకర వ్యవసాయ శాసనాలపై రైతులు పోరాడుతుంటే తెలుగు రాష్ట్రాలలో గత ప్రస్తుత పాలకపార్టీలు ఈ విధంగా బీజేపీకి ఉపగ్రహాలుగా మారడం తెలుగు ప్రజల చైతన్యానికి సమరశీల సంప్రదాయాలకు విరుద్ధం, విపత్కరం.
- తెలకపల్లి రవి