Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్యాంగ పరిధిలోకి వచ్చే అన్ని సంస్థలను మోడీ ప్రభుత్వం దెబ్బతీస్తోంది. వాటి సారాన్ని తిరస్కరిస్తోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సి) 28వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ విషయం స్పష్టమైంది. ఈ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ, హౌం మంత్రి అమిత్ షా ఇద్దరూ హాజరయ్యారు. మానవ హక్కులను ఏ విధంగా చూడాలో ప్రధాని మోడీ తన ప్రసంగంలో తనదైన రీతిలో చెప్పుకొచ్చారు. ''కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా తమదైన కోణంలో మానవ హక్కులకు భాష్యం చెప్పడం ఆరంభించారు. రాజకీయాలు, రాజకీయ లబ్ధి, నష్టం అనే కోణం నుండి వారు చూసినప్పుడు మానవ హక్కులకు అతి పెద్ద ఉల్లంఘన జరుగుతుంది'' అని మోడీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఇది మోడీ పాలనను గుర్తించే మానవ హక్కుల ఎంపిక విధానంగా ఉంది. మెజారిటీవాద రాజకీయాల కోణం నుండే మానవ హక్కులు చూడబడుతున్నాయి. ప్రత్యేకమైన ఈ విధానం వల్లనే, మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలు, దళితులు, ఆదివాసీల మానవ హక్కుల ఉల్లంఘనలను పాలక వ్యవస్థ పట్టించుకోవడంలేదు. లేదా వాటి పట్ల గుడ్డిగా వ్యవహరిస్తోంది. మతపరమైన, భాషాపరమైన, జాతి పరమైన వివిధ మైనారిటీల హక్కులను ఏ మేరకు పరిరక్షించగులుగుతుందన్నది ప్రజాస్వామ్యానికి పరీక్షగా ఉంటుంది. అయితే, హిందూత్వ హయాంలో, వారు పట్టించుకునేది కేవలం మెజారిటీవాదుల హక్కులు మాత్రమే. మూకుమ్మడిగా కొట్టి చంపడం, భౌతిక దాడులు, జీవనోపాధులు కొల్లగొట్టడం, ప్రాథమిక హక్కులు నిరాకరించడం వంటివన్నీ నిరాటంకంగా, ఎవరూ ప్రశ్నించని రీతిలో కొనసాగిపోతున్నాయి. మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రంలో హౌంమంత్రే మైనారిటీలపై ఇటువంటి దాడులను సమర్థించుకున్నారు. ఇండోర్‌లో ఒక కాలేజీలో నిర్వహించిన గార్బా కార్యక్రమంలో పాల్గొన్నందుకుగాను నలుగురు ముస్లిం విద్యార్థులను, యువతను అరెస్టు చేయడం తాజా ఉదాహరణ. కాబట్టి, రాజకీయాలు, రాజకీయ లబ్ధి, నష్టం అనే కోణం నుండి చూసినప్పుడు మానవ హక్కులకు అతి పెద్ద ఉల్లంఘన జరుగుతోందంటూ మోడీ మాట్లాడిన మాటలు, ఈ అరోపణలు అన్నీ కూడా బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర, రాష్ట్రాలకే పూర్తిగా వర్తిస్తాయి. సాధారణ ముస్లింల హక్కులను పణంగా పెట్టి మతోన్మాద ధోరణలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నది ఈ సంకుచిత హిందూత్వ రాజకీయాలే.
ఎన్హెచ్ఆర్సీ ప్రస్తుత ఛైర్పర్సన్ పాలక ప్రభుత్వంతో పూర్తిగా కుమ్మక్కయ్యారు. జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా చేసిన ప్రసంగం ద్వారా ఇది స్పష్టమైంది. జమ్మూ కాశ్మీర్లో, ఈశాన్య ప్రాంతంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించడం కోసం, అక్కడ కొత్త శకం ఆవిష్కరించేందుకు హౌం మంత్రి అమిత్ షా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారంటూ మిశ్రా అభినందించారు. ఇటీవలి కాలంలో, మానవ హక్కుల పరంగా గరిష్ట ఉల్లంఘనలు జరిగాయంటే అది జమ్మూ కాశ్మీర్‌లోనే జరిగింది. ప్రత్యేకించి హౌం మంత్రి అమిత్ షా 370వ అధికరణను రద్దు చేయడం, అటుపై రాష్ట్రాన్ని ముక్కలు చేసిన తర్వాత ఈ ఉల్లంఘనలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి గురించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ ప్రస్తావించారు. సెప్టెంబరు 13న మానవ హక్కుల మండలి 48వ సమావేశంలో మిచెల్లి బాచ్లెట్ మాట్లాడుతూ, బహిరంగంగా నలుగురు గుమిగూడడంపై నిషేధం విధించడం, తరచుగా కమ్యూనికేషన్ బ్లాక్ అవుట్లు జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్నాయని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకున్నందుకు వందలాదిమంది ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. జర్నలిస్టులు ఎన్నడూలేని రీతిలో ఒత్తిళ్లను ఎదుర్కొనాల్సి వస్తోంది. భారత్‌లో 'యుఎపిఎ'ను ఉపయోగించడం పట్ల కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోకెల్లా జమ్మూ కాశ్మీర్ లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి.
అయితే, భారత ప్రభుత్వ ప్రతినిధి ఈ వ్యాఖ్యలను తిరస్కరించారు. కానీ, ఎన్హెచ్ఆర్సీ ఛైర్పర్సన్ కూడా ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. భారత్‌పై మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి బూటకపు ఆరోపణలు చేయడం విదేశీ శక్తులకు సర్వసాధారణమై పోయిందని వీటిని కచ్చితంగా తిరస్కరించాలని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. జస్టిస్ మిశ్రాకు సంబంధించినంత వరకు, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ కూడా విదేశీ శక్తే, అది కూడా బూటకపు ఆరోపణలు చేస్తుంది.
ఇటువంటి వ్యక్తి అంతటి ఉన్నత స్థానాన్ని అధిరోహించినప్పుడు, భారత పౌరుల ప్రాథమిక మానవ హక్కులను ఎన్హెచ్ఆర్సీ పరిరక్షిస్తుందని ఏ విధంగా ఊహించగలుగుతాం? హిందూత్వ నియంతృత్వ పాలనలో, పౌరుల ప్రాథమిక హక్కులు ఒక పద్ధతిలో, పెద్ద ఎత్తున ఉల్లంఘించబడుతున్నాయి. ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ ప్రభుత్వ బాధితురాలిగా మారిపోయింది.
- పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం