Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల ముగిసిన తెలంగాణ శాసనసభలో పోడు భూముల సమస్యపై గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తావనలు, ప్రకటనలు వింతగా ఉన్నాయి. అటవీ హక్కుల చట్ట సారానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ మాటల గారడీలు ముఖ్యమంత్రి ఎందుకు ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారు? పరిమితులులేని పారిశ్రామీకరణ, మైనింగ్, భారీ ప్రాజెక్టుల నిర్మాణలే అటవీ, పర్యావరణ వినాశనానికి కారణమని ప్రపంచ పర్యావరణ శాస్త్రం చెపుతుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఆదివాసులు చేసే కొండపోడు సాగు వలన అడవి తగ్గిపోతుందని గగ్గోలు పెడుతోంది. నిజమేమిటో పోడు చట్టంలో ఉంది.
అడవిని ఆదివాసులను విడదీసి చూడరాదు. పర్యావరణ సమతుల్యాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నది వారే. అడవిని తల్లిగా భావించి చేసే ఆరాధనలో ఒక పార్శ్వం పోడుసాగు. పచ్చదనాన్ని పునరుత్పత్తి చేయడమే పోడుసాగు సారం. వర్షాలు రాకపోవటానికి పోడు వ్యవసాయానికి సంబంధం లేదు. మేఘాలనాకర్షించే మహావృక్షాలను పోడులో నరకరు.
చేపలు నీరు తాగటం వలనే చెరువులు ఎండిపోతున్నాయని నమ్మటం ఎంత అశాస్త్రీయమో రిజర్వు ఫారెస్టులో గిరిజనులు పోడు చేయటం వలన అడవులు నాశనమవుతున్నాయని చెప్పటం అంతే అశాస్త్రీయం. అటవీ భూములపై సాగు హక్కు మాత్రమే కాదు, ఈ చట్టం అన్ని అటవీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చమని చెప్పింది. సెక్షన్ 4 (5) ఏ పోడు సాగుదారుల్ని హక్కుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు అతని సాగులో ఉన్న భూమి నుండి తొలగించరాదని స్పష్టంగా చెపుతోంది. కాని టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగింపులకు పాల్పడుతున్నది.
అసిఫాబాద్ జిల్లా, కొలాంగొంది గ్రామాన్ని రాత్రికిరాత్రి బలవంతంగా ఫారెస్టు, పోలీసు వారు కలిసి ఖాళీ చేయించారు. వారు ఇస్తామన్న భూమిగాని, కడతామన్న ఇండ్లుగాని రెండేండ్లుగా ఇవ్వలేదు. హైకోర్టు సుమోటుగా ఆదేశించినా కూడా ములుగు జిల్లా తాడ్వాయి మండలం జనగలంచ, దేవునిగుట్ట, ఏటూరునాగరం మండలం చింతలమొర్రి, మంగపేట మండలం ప్రాజెక్టు నగర్ గుంపుపై ఫారెస్టు సిబ్బంది దాడులు, గుడెసెల కూల్చివేత, కాల్చివేత సాగుతూనే ఉన్నది. అసిఫాబాద్ జిల్లా కొత్త సారసాలలో ట్రెంచింగ్ పనులను అడ్డగించారని నాయక్ పోడ్ గిరిజనులపై పీడీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేసారు. మంచిర్యాల జిల్లా, జెన్నారంలో చేతివృత్తులవారిపై కేసులు పెట్టారు. వారి గొడ్డళ్ళు, కత్తులు స్వాధీనంచేసుకున్నారు.
తెలంగాణ వచ్చాక 200పైగా కొత్త ఫారెస్టు చెక్‌పోస్ట్‌లు పెట్టి ప్రతి చెక్‌పోస్ట్‌కి సాయుధ పోలీసులను, మిలిషియా గస్తీ దళాలను ఏర్పాటు చేయటం దేనికోసం. ఇది అటవీ రక్షణకా? లేక అడవి బిడ్డ లను భయభ్రాంతులను చేయటానికా?
వలస రావటం, వలస పోవటం నేరం కాదు. బతుకుదెరువు కోసం ఆ వాగు ఒడ్డున ఈ కొండమాటున నివాసాలు ఏర్పాటు చేసుకొని తమదైన సాంప్రదాయ జీవనం గడిపేవారిని, 3, 4 దశాబ్దాల క్రితం నుండి మన అడవులలో ఉన్నవారిని మనవారు కాదని నిందించటం న్యాయం కాదు. గిరిజన గ్రామాల పొలిమేరలకు (సరిహద్దులు) వారిని రక్షించే శక్తులుంటాయని నమ్ముతారు. గిరిజన గ్రామ సాంప్రదాయపు పొలిమేరను (ుతీaసఱ్ఱశీఅaశ్రీ ూవతీఱషష్ట్రవతీy) గిరిజనుల కట్టుబాట్లు, అలవాట్లు (జబర్శీఎaతీy శ్రీaష) కు చట్టబద్దత కల్పించటమే ఈ చట్టం యొక్క ప్రత్యేకత.
2015 జూలైలో మొదలైన ''హరిత హారం'' లక్ష్యాన్ని మించి విజయవంతమైందట! 230 లక్షల మొక్కలు నాటాలకుకొని 239 లక్షల మొక్కలు నాటారట. ఫలితంగా 3.67శాతం అడవి పెరిగిందట! కాని ఎవరి భూమిలో ఎక్కువగా నాటారు. హక్కులు గుర్తించని గిరిజనుల భూములు, హక్కు పత్రాలు ఇచ్చిన భూములను కూడా ఆక్రమించి మరీ నాటారు. గిరిజనులు వేసుకున్న పంటలను దన్నేశారు. మొక్కలు నాటడం-పీకడం, గోతులు తవ్వటం, పూడ్చటం ఒక్కమాటలో ఆదివాసులకు అటవీ అధికారులకు మద్య ఘర్షణ (తగాదా) కేంద్రీకృతమైంది. దీనికి ప్రభుత్వం కాదా కారణం?
తిరస్కరించిన క్లెయిమ్స్ పరిశీలిస్తే 35శాతం తిరస్కరణకు కారణం 2005, డిశంబర్ 13 తర్వాత సాగు చేస్తూ ఉన్నారని అటవీశాఖ వాదించింది. ముఖ్యమంత్రి సభకి చెప్పిందేమిటి? తెలంగాణ ఆవిర్భావం నాటికి (అంటే 2-6-2014) కట్ ఆప్ డేట్ కొరకు చట్టాన్ని సవరించి ఎక్కువమందికి పట్టాయిచ్చేలా చేస్తారట, అందుకు శాసనసభ తీర్మానం చేస్తారట, ప్రధానమంత్రి వద్దకు అఖిల పక్షం తీసుకువెల్తారట! సమస్యని పరిష్కరించటం మాని మరింత సంక్లిష్టం చేయటం ఏం న్యాయం..?
''కన్నతల్లికి కూడుపెట్టని కొడుకు పినతల్లికి పట్టుచీర కొంటానన్నాడట...'' అలా ఉంది సర్కారు తీరు. పార్లమెంట్ చేసిన చట్టానికి అసెంబ్లీ తీర్మానం ఏమిటి? ప్రధాన మంత్రి వద్దకు అఖిలపక్ష రాయబారాలు దేనికి? నిజంగానే చట్ట సవరణ చేయాలన్నా కరోనా గ్యాప్ వచ్చినా 2014 నుండి పార్లమెంటు సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మీ పార్టీ ఎంపీలు సవరణ తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఇటీవల మన పక్కరాష్ట్రంలో లక్షన్నర ఎకరాల పోడుకు పట్టాలిచ్చారు. మీరెందుకు ఇవ్వలేరు?
అక్టోబరు మూడో వారంలో ధరఖాస్తులు తీసుకుంటారట. శాసనసభ్యులు దీనికి నాయకత్వం (బాధ్యత) వహించాలట. అంటే చట్టంలో / రూల్స్‌లో ఉన్న విధంగా కాక పోడు రైతులు పదవీకారుల చుట్టూ తిరగాలన్నమాట!
అడవిలోపల ఇక గ్రామాలను ఉండనివ్వరట. సభ బయట గౌరవ ముఖ్యమంత్రి చెప్పే శుభాషితాలు విని పోడు రైతులు రెండు నిర్థారణలకు రావచ్చు. 1. టీఆర్ఎస్ ప్రభుత్వం-దాని నాయకుడు పోడు చట్టంలోని ప్రతి పేరాకు, ప్రతి సెక్షన్‌కు వ్యతిరేకం. 2. హక్కు పత్రాలు ఇవ్వకుండా సాకులు వెతుకుంటున్నారు. కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన దాడిను పోడు రైతులపై (ఆదివాసులపై) మొహరించివుంది. గతంలో 2002-2003లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాలలో 3లక్షల మంది ఆదివాసీ పోడు రైతులను 1,52,600 ఎకరాల అటవీభూమి నుండి తొలగించిన చరిత్ర బీజేపీకి ఉంది.
సుప్రీంకోర్టు 13-2-2020 నాటి తీర్పులో తిరస్కరించిన ధరఖాస్తుదారులైన పోడు రైతులను భూమి నుండి తొలగించాలని ఆదేశించింది. ఇది పోడు రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం గిరిజనులను తొలగించి అడవిని, అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి అవసరమైన చట్ట సవరణలు చేస్తోంది.
పోడు రైతులు కోరేదేమిటి?
ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 25లక్షల ఎకరాలు అటవీ భూమికి పోడు హక్కు పత్రాలు ఇస్తానని నాటి ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా 2007-2008 కాలంలో మొదటి రోడ్ మ్యాప్ ప్రకటించి 1,65,502 మంది గిరిజనులకు సుమారు 4.5 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు ఇచ్చారు. 1,53,231 ధరఖాస్తులు తిరస్కరించారు. సుమారు 2103 వన సంరక్షణ సమితుల పేరుతో 10 లక్షల ఎకరాల ఉమ్మడి హక్కు పత్రాలు పొంది అటవీ శాఖ ఆధీనంలోనే ఉంచుకుంది. జాతీయ మోనిటరింగ్ కమిటీ వీటిని రద్దు చేసి విఎస్ఎస్ సభ్యులకు పంచమన్నా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 13లక్షల ఎకరాల అటవీభూమి గిరిజనుల, గిరిజనేతర పేదల సాగులో ఉన్నది. దీనిలో గణనీయమైన భాగం రెవెన్యూ అటవీశాఖ మధ్య వివాదాస్పదంగా ఉంది. సమగ్ర సర్వే జరగలేదు. అటవీ హక్కుల నిర్ధారణ కోసమైనా శాస్త్రీయమైన సర్వే తక్షణ అవసరం. ఈ ప్రభుత్వానికి నిజంగా గిరిజనులపై ప్రేమ ఉంటే చట్టంపై గౌరవముంటే అటవీ హక్కుల చట్టం అమలుకు రెండో రోడ్ మ్యాప్ (షెడ్యూల్) తక్షణం ప్రకటించాలి. పోడురైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. వలస ఆదివాసీ గ్రామాలపై ఫారెస్టు వారి దౌర్జన్యాలు ఆపాలి. కందకాల తవ్వకాలు (టెంచింగ్) నిలిపివేయాలి. చట్టంపై అధికారులకు పోడు సాగుదార్లకు అవగాహన కలిగించాలి. పోడు రైతులందరికి క్లైయిమ్ ఫారాలు ఉచితంగా సరఫరా చేయాలి. కళాజాతాలు నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించాలి. తిరస్కరించిన ధరఖాస్తులను పున:పరిశీలన చేయాలి. గ్రామసభ పరిధిని అధికారాలను కుదించరాదు. నూతన ఎఫ్.ఆర్.సి. కమిటీలు ఏర్పాటు చేయాలి.
కానీ సాంప్రదాయపు హక్కులకు చట్టబద్దత కల్పించుటలో, జరిగిన చారిత్రక అన్యాయాల్ని సరిచేయటంలో ఈ చట్టం ఒక ముందడుగు. కంపెనీలకు కార్పొరేట్లకు దాసోహం అంటున్న పాలక వర్గాలు భూమి సమస్యను సంపూర్ణంగా పరిష్కరిస్తా యని భ్రమపడరాదు. అందుకే చట్టం పట్ల అవగాహన పెంచుకుని, పోరాటాన్ని ఐక్యంగా కొనసాగించడమే ఇప్పుడు పోడురైతుల ముందున్న కర్తవ్యం.
- డాక్టర్ మిడియం బాబూరావు