Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉద్యోగావకాశాలు తగ్గిపోయినప్పుడు సంపన్న దేశాలలో ఎక్కువమంది ఉద్యోగులను పనులనుండి తొలగిస్తారు. కాని భారతదేశంలో ఆ విధంగా కాక, దాదాపు ఉద్యోగులందరికీ పనిదినాలు తగ్గిపోతాయి. మన దేశంలో చాలా తక్కువ శాతం ఉద్యోగులు, కార్మికులు పూర్తికాలం పనుల్లో (ఫుల్‌టైం) ఉన్నారు. తక్కినవారిలో రైతులు, దుకాణాల యజమానులు వంటివారు స్వయంగా ఉపాధి కల్పించుకున్నవారి కోవలోకి వస్తారు. వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు ఆ పనిలో భాగం పంచుకుంటారు. ఇక క్యాజువల్ వర్కర్లు ఉన్నారు. వారికి కొన్ని రోజులు పని ఉంటే మరికొన్ని రోజులలో పని ఉండదు. అన్ని రోజులూ పని ఉండేవారి సంఖ్య తగ్గిపోయి, కొద్దిరోజులు మాత్రమే పని ఉండేవారి సంఖ్య పెరిగిపోతున్నది. అసలు చేయడానికి ఉన్న పని ఎంత, ఆ పనిని చేయడానికి ఎంతమంది ఉద్యోగులు అవసరం అన్న ప్రాతిపదికే లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగాన్ని అంచనా ఏవిధంగా వేయాలి?
ఈ సమస్య ఉన్న కారణంగానే మన దేశంలో అధికారులు చాలా కాలంనుంచి నిరుద్యోగాన్ని అంచనా కట్టడానికి ఒక కొలబద్దనుగాక పలు కొలబద్దలను ఎంచుకున్నారు. వాటన్నింటి జోలికీ ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు. కాని వాటిలో ఏ ఒక్కదానిని తీసుకుని పరిశీలించినా, ఆ విధమైన కొలబద్దలన్నింటితోనూ ఉన్న సమస్యలు ఏమిటన్నది తెలిసిపోతుంది. దీనిని వివరించడం కోసం ''ఈ వారం ఉపాధి స్థితి'' అన్న కొలబద్దను తీసుకుందాం. పనికోసం ప్రయత్నిస్తున్న ఒకానొక వ్యక్తికి గడిచిన వారంలో ఏదైనా ఆదాయం లభించే పని కనీసం ఒక గంటసేపు అయినా దొరకకపోతే అప్పుడు అతను ''ఈ వారం ఉపాధి స్థితి'' కొలబద్ద ప్రకారం నిరుద్యోగిగా పరిగణించబడతాడు. ఒకవేళ గతవారంలో ఒక గంట పని దొరికివుంటే ఈ వారం అతను ఉద్యోగిగా పరిగణించబడతాడు. గడిచిన వారంలో ఒకానొక వ్యక్తికి నాలుగు గంటలపాటు పని దొరికిందనుకుందాం. ప్రభుత్వ సర్వే ప్రకారం అతను ఉద్యోగిగా పరిగణించబడతాడు. మళ్ళీ ఏడాది సర్వే చేసిననాటికి అతనికి ఆ ముందువారంలో రెండు గంటల పని మాత్రమే దొరికినా అతను మళ్ళీ ఉద్యోగిగానే పరిగణింపబడతాడు. అంతేకాని అతనికి లభించే పని సగానికి సగం తగ్గిపోయిందన్న వాస్తవం లెక్కలోకిరాదు. ఆ తరహాలోనే పని తగ్గిపోయినవారు ఎక్కువమంది ఉన్నారనుకోండి. అప్పుడు ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుద్యోగం గతేడాది ఏ స్థాయిలో ఉండిందో, ఈ ఏడూ అదే స్థాయిలో ఉన్నట్టు అంచనా వస్తుంది. కాని, వాస్తవానికి నిరుద్యోగం రెట్టింపు అయింది కదా!
ప్రభుత్వం ఉపయోగించే తక్కిన కొలబద్దల పరిస్థితీ ఇదేమాదిరిగా ఉంటుంది. ఆ కొలబద్దలేవీ వాస్తవ నిరుద్యోగాన్ని సక్రమంగా అంచనా వేయడానికి ఉపయోగపడవు. మరి వాస్తవ నిరుద్యోగాన్ని కరెక్టుగా అంచనా వేయడమెలా? పనిచేయగల శక్తి, అవసరం ఉన్నవారిలో తలా ఒక్కరికీ లభిస్తున్న పని తగ్గిపోతుంటే అప్పుడు నిరుద్యోగం పెరుగుతున్నట్టు నిర్థారణకు రావాలి. ఒక కార్మికుడికి ఒక గంట పని చేసినందుకు లభించే జీతంలో మార్పు లేకపోవచ్చు. అయితే అతగాడికి ఎన్ని గంటలపాటు పని లభించిందన్న విషయంలో మార్పు ఉంది. గతంలోకన్నా తక్కువ గంటలు పని దొరికినప్పుడు అతని ఆదాయం తగ్గిపోతుంది. ఒకవేళ అతనికి గతంలోకన్నా ఎక్కువ గంటలపాటు పని దొరికితే అతని ఆదాయం పెరుగుతుంది. అందుచేత కార్మికుల తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయా, లేక తరుగుతున్నాయా అన్నదానిని బట్టి నిరుద్యోగం తగ్గుతున్నదీ, లేక పెరుగుతున్నదీ నిర్థారించవచ్చు.
కాబట్టి, ఇతర విషయాలలో మార్పులు లేవనుకుంటే కార్మికుల తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయా లేక తగ్గిపోతున్నాయా అన్నదానిని బట్టి నిరుద్యోగాన్ని అంచనా కట్టవచ్చునని చెప్పగలం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఇతర విషయాలలో మార్పులు లేకుండా ఉండడం అనేది కుదిరేపని కాదు. కార్మికుల తలసరి ఆదాయాలు తగ్గిపోవడం అంటే ఉత్పత్తిలో వచ్చిన మిగులులో వారి వాటా తగ్గిపోయిందని అర్థం. ఆ మిగులును దక్కించుకునేవారిలో లాయర్లు, అడ్వర్టైజ్మెంట్ ఏజన్సీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు వంటి 'పరజీవులు' ఉంటారు. వారి వాటాకు వచ్చే మిగులు పెరుగుతుంది. అయితే ప్రభుత్వం లెక్కల్లో వీరందరూ ఉద్యోగులుగానే పరిగణించబడతారు. కార్మికులు, రైతులు, చేతివృత్తిదారులు, మత్స్యకారులు తదితర సాంప్రదాయ వృత్తుల్లో జీవించేవారు - వీరందరి జీవనోపాధి ఏమిటన్నది మనకు సమస్య. వీరి తలసరి ఆదాయం పెరిగిందా, లేక తగ్గిందా అన్నది మన ప్రశ్న. కాని ప్రభుత్వం లెక్కల్లో వీరందరితోబాటు ఆ 'పరజీవులు' కూడా ఉద్యోగులు గానే లెక్క. వీరి పెరిగిన ఆదాయాలను కూడా కలిపి లెక్క కడితే వాస్తవ నిరుద్యోగం అంచనాలు తప్పుతాయి. అందుచేత తలసరి ఆదాయాలు పెరిగాయా లేక తరిగాయా అన్నది సరైన కొలబద్దగా ఉపయోగపడదు.
ప్రభుత్వం ఉద్యోగ వర్గాలుగా పరిగణించేవారిలో తక్కిన తరగతులకన్నా పైన ఉండే ఈ 'పరజీవుల' ఆదాయాలు పెరిగినా, లేక స్థిరంగా ఉన్నా వారి తలసరి ఆహార ధాన్యాల వినియోగం తగ్గదు. అందుచేత, దేశం మొత్తం మీద తలసరి ఆహార ధాన్యాల వినియోగం తగ్గిందంటే అసలైన శ్రామికుల తలసరి ఆదాయాలు తగ్గినట్టే భావించవచ్చు. ఆహార ధాన్యాల లభ్యత విషయంలో మరే ఇతర సమస్యలూ లేనట్టయితే, అప్పుడు తలసరి ఆహారధాన్యాల వినియోగాన్ని నిరుద్యోగం అంచనా వేయడానికి సరైన కొలబద్దగా తీసుకోవచ్చు.
నిరుద్యోగ పరిస్థితిలో మార్పులను, ఆకలి సమస్యలో వస్తున్న మార్పులను ఒకే గాటన కట్టడం సబబేనా అని కొందరు ప్రశ్నించవచ్చు. ఒకవేళ కరువు కాటకాల వంటివి వచ్చి ఆహార ధాన్యాల లభ్యత తగ్గి, అందువలన తలసరి వినియోగం తగ్గితే దానిని బట్టి నిరుద్యోగం పెరిగిందని చెప్పగలమా? అని అడగవచ్చు. ఆహార ధాన్యాల లభ్యతకు ప్రకృతి వైపరీత్యాల వంటి ఇతర సమస్యలు ఏవీ ఆటంకాలు కాకపోతే, మార్కెట్లో ఆహారధాన్యాలు పుష్కలంగా దొరుకుతున్నా, ఆదాయం లేని కారణంగా వాటిని కొనుక్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం తప్పకుండా నిరుద్యోగం పెరిగిందని చెప్పవచ్చు. ఈ నయా ఉదారవాద కాలం మొత్తంగా చూసుకున్నప్పుడు దాదాపుగా ఎప్పుడూ భారతీయ ఆహార సంస్థ దగ్గర ఆహారధాన్యాల నిల్వలు పుష్కలంగా ఉంటూనే వచ్చాయి. ఏ మోతాదులో నిల్వలు అవసరమో అంతకన్నా ఎక్కువగానే ఈ నిల్వలు ఎప్పుడూ ఉన్నాయి. అందుచేత ఈ కాలంలో ఇతర కారణాల వలన ఆహారధాన్యాల లభ్యతకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అనలేం. కనుక తలసరి ఆహారధాన్యాల వినియోగం ఈ కాలంలో నిరుద్యోగం మీద అంచనాకు ఒక సరైన కొలబద్దగా ఉండితీరుతుంది.
ప్రతీ ఏడూ ఆహారధాన్యాల లభ్యత ఒకే విధంగా ఉండదు. అది వాస్తవమే. కాని ఆ లభ్యత ధోరణులు ఎలా ఉన్నాయనేది మనకు ఇక్కడ ముఖ్యం. అందుకని మనం ఇక్కడ మూడేండ్ల సగటును పరిగణనలోకి తీసుకుందాం. ఉదారవాద విధానాల ప్రారంభ సంవత్సరాలలో ఒక మూడేండ్ల కాలంతో పోల్చినప్పుడు ఇటీవలి మూడేండ్ల కాలంలో ఆహారధాన్యాల వినియోగంలో వచ్చిన మార్పు పరిశీలిద్దాం.
ఆర్థిక ఉదారవాద విధానాలు ఇక ప్రారంభంకానున్నాయి అన్న కాలంలో, 1989-1991 మూడేండ్ల కాలంలో తలసరి ఆహార ధాన్యాల వినియోగం సాలుకు 180.2 కిలోలు ఉండగా, కరోనా వచ్చే ముందరి కాలంలో 2016-18 మూడేండ్ల కాలంలో అది 178,7కిలోలకు పడిపోయింది. అంటే మన వాదన ప్రకారం, అంతకు ముందరి కాలంతో పోల్చితే నయా ఉదారవాద విధానాలు అమలు జరిగిన కాలంలో నిరుద్యోగం పెరిగింది. ఈ మూడేండ్లలోనే కాదు, 1989-91 తర్వాత ఏ మూడేండ్ల కాలంలోనూ అంతకు మునుపు ఉన్న ఆహారధాన్యాల వినియోగస్థాయిని చేరుకోలేదు. అందుచేత నిరుద్యోగం ఈ కాలంలో పెరిగిందనేది తిరుగులేేని వాస్తవం.
ఈ నిర్థారణను బలపరిచే వాదన ఇంకొకటి ఉంది. ఉపాధిహామీ పథకం ప్రారంభించాక కూలీలకు అదనంగా పని దొరికింది. దాని ఫలితంగా ఆహారధాన్యాలను కొనుగోలు చేయగల శక్తి వారికి పెరిగింది. అలా పెరిగినా, తలసరి ఆహారధాన్యాల వినియోగం తగ్గిపోతూనే వచ్చింది. అంటే, ఒకవేళ ఉపాధి హామీ పథకం లేకపోయినట్టయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండి ఉండేది.
నిజానికి ఉపాధిహామీ పథకం అదనపు పనిదినాలను కల్పించగలిగే ఒక విధానమే తప్ప నిరుద్యోగానికి అసలైన పరిష్కారం కాదు. అన్ని పరిమితులున్నప్పటికీ దాని వలన ఎంతో కొంత ఉపాధి కల్పించబడింది. అయినప్పటికీ, ఈ నయా ఉదారవాద కాలంలో నిరుద్యోగం పెరిగింది. అంటే, నయా ఉదారవాద విధానాలకు ఉపాధిని కల్పించే శక్తి ఎంత తక్కువో మనకు స్పష్టం అవుతుంది.
ఈ విధంగా నిరుద్యోగం పెరిగిపోడానికి రెండు కారణాలు ప్రధానం. మొదటిది : సహజంగా కార్మికుల కుటుంబాలలో జనాభా పెరుగుదల వలన పెరిగే నిరుద్యోగం తోబాటు గ్రామాల్లో చితికిపోయిన రైతులు, చేతివృత్తులవారు ప్రత్యామ్నాయ ఉపాధిని వెతుక్కుంటూ పట్టణాలకు వలస పోవడం. ఇలా వారు గ్రామాలను వదలి రావడానికి కారణం ఈ నయా ఉదారవాద విధానాలే. రైతులకిచ్చే సబ్సిడీలకు కోత పెట్టడం, వారి పంటలకు గిట్టుబాటు ధరలను, మార్కెట్‌ను గ్యారంటీ చేయడానికి నిరాకరించడం ఆ విధానాలలో భాగమే. ఇక రెండో కారణం: సాంకేతిక పరిజ్ఞానాన్ని యధేచ్ఛగా దిగుమతి చేసుకోడానికి అనుమతులు ఇవ్వడం, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఆదేశాలకు తలొగ్గి అన్ని రంగాలలోనూ వ్యవస్థీకృత మార్పులకు తెర తీయడం వలన ఉన్న ఉపాధి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఎంత ఎక్కువగా జీడీపీ పెరిగినా, ఉపాధి అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. ఈ రెండు కారణాల వలన నయా ఉదారవాద కాలంలో నిరుద్యోగం పెరుగుతూనేవుంది. అయితే ప్రభుత్వ గణాంకాలు మాత్రం ఈ నిరుద్యోగం పెరుగుదలను ప్రతిబింబించవు. మనం పైన తెలిపిన ప్రత్యామ్నాయ, పరోక్ష పద్ధతుల ద్వారా మాత్రమే ఈ నిరుద్యోగాన్ని సరిగ్గా మదింపు చేయగలం.
- స్వేచ్ఛానుసరణ
- ప్రభాత్ పట్నాయక్