Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోడు భూముల సమస్య కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉంది. 2006 సంవత్సరం పార్ల మెంట్లో కమ్యూనిస్టుల మద్దతుతో ఏర్పాటైన యూపీఏ-1 ప్రభుత్వం కొన్ని ప్రజా శ్రేయస్సు కోసం చట్టాలు చేసింది. దానిలో అటవీ హక్కుల చట్టం 2006 ఒక ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ప్రకారం గిరిజనులయితే 2005 డిసెంబర్ 13వ తేదీ నాటికి సాగులో ఉంటే, గిరుజనేతరులు అయితే మూడు తరాలుగా సాగులో ఉంటే హక్కు పత్రం ఇవ్వాలని ఉంది. 2006లో చట్టం వచ్చినప్పటికీ దానీ రూల్స్ మాత్రం 2008లో రూపొందించారు. చట్టం ప్రకారం అటవీ హక్కులకమిటీ(ఎఫ్ఆర్సీ) కీలకం. కానీ నాటి పాలకులు కమిటీలు ఏర్పాటు చేయడంలో గాని, చట్టం అమలు చేయడంలో గాని నిర్లక్ష్యం వహించిన ఫలితంగా అనేకమంది ఆదివాసీలు, ఇతర పేదలు నేటికీ హక్కు పత్రాలు రాక, అటవీ అధికారుల దాడులు భరించలేకా నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోడు భూముల విషయంలో నేటి టీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న విధానం ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ఏటా ఫారెస్ట్ అధికారులకు, పోడు సాగుదారులకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంటున్నది.
''2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నాటికి సాగులో ఉన్న భుములకు హక్కు పత్రాలు ఇస్తాం. నేను స్వయంగా కుర్చీవేసుకొని పోడు భూముల సమస్య పరిష్కరిస్తాను'' అని 2018లో ముఖ్యమంత్రి కేసీఆర్ కాగజ్ నగర్‌తో పాటు ఆదివాసీ ప్రాంతాల్లో జరిగిన ప్రతి ఎన్నికల సభలో వాగ్దానం చేశారు. దీనికి అనుగుణంగా హక్కు పత్రాలు వస్తాయని రైతులు ఎదురుచూస్తుంటే కేసీఆర్ తన ప్రకటనకి విరుద్ధంగా ఫారెస్ట్ అధికారులకు టార్గెట్లు ఇచ్చి (ఒక ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంవత్సరానికి 20హెక్టార్ల భూమిని తన పరిధిలో రైతుల నుండి తీసుకోవాలని) అనేకమంది రైతుల భూములు గుంజుకుంటున్నారు. అనేకమంది రైతులపై కేసులు పెట్టారు, జైళ్ళకు పంపారు. చివరకు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు చేసే వాళ్ళపై పెట్టే పి.డి యాక్ట్ కేసులు రైతులపై పెడుతున్నారు. దాదాపు 85ఎండ్ల క్రితం భూమి కోసం అడవి మీద హక్కు కోసం కుమురం భీమ్ నైజాంకి వ్యతిరేకంగా పోరాడిన విషయం మనందరికీ తెలిసిందే..
ప్రస్తుత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని రౌటసంకనేపల్లి గ్రామంలో అక్టోబర్ 22, 1901న మురం భీం జన్మించారు. భీం తన చిన్నతనంలోనే ఆయన కుటుంబం ప్రస్తుత కెరమేరి మండలం సుధా పూర్ గ్రామానికి వెళ్లారు. అక్కడ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించారు. ఆనాటి నైజాం ప్రభుత్వంలోని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల ఆగడాలు ఎక్కువగా ఉండేవి. గ్రామాల్లో మహిళలను సైతం లైంగికంగా వేధించేవారు. ఒకరోజు భీమ్ వదినను కూడా పోలీస్ పటేల్ వేధింపులకు గురి చేయగా అతడిని కొమరం భీమ్ కొట్టడంతో తను చనిపోతాడు. అప్పుడు భీం ఇతర ప్రాంతాలకు వెళ్లి దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర పోరాటాన్ని, ఇతర ఉద్యమాలను గమనించి తిరిగి సొంత ఊరికి వచ్చి నైజాం ప్రభుత్వ ఆగడాలను వ్యతిరేకిస్తూ జోడేఘాట్ కేంద్రంగా 12 గ్రామాల ప్రజలను ఐక్యం చేసి ''జల్, జంగల్, జమీన్ హమారా'' అని, ''మావ నాటే మావ రాజ్'' అని ''మా అడవిలో నైజాం ఆటలు ఇంకా సాగనివ్వం'' అని 1935-40 వరకూ పోరాటం కొనసాగించారు. 1940 సెప్టెంబర్ 1న అప్పటి ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో భీంతో పాటు 15మంది అమరులయ్యారు. ఆ పోరాటం అనంతరం హైమన్ డార్ఫ్ దంపతులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సూచన మేరకు నాటి ప్రభుత్వం వేల ఎకరాలకి పట్టాలు ఇచ్చింది. ఫారెస్ట్, రెవెన్యూ దాడులు తగ్గాయి. భీం నిననాదానికి అనుకూలంగా ఏజెన్సీ ప్రాంతంలో గ్రామసభకే అధికారాలు ఇస్తూ పెసా చట్టం వచ్చింది. ఎన్ని చట్టాలు వచ్చినా, భీం అమరుడై 81సంవత్సరాలు గడిచినా నేటికీ ఆదివాసుల బతుకులు మారలేదు. ఉన్న భుములను నేటి పాలకులు గుంజుకో చూస్తున్నారు. నేటి సమాజంలో భూమి చాలా కీలకమైంది. కాబట్టి కుమురం భీం స్ఫూర్తితో పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చేంత వరకు ఉద్యమించాలి.
- కోటా శ్రీనివాస్