Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనూహ్యంగా పెరుగుతూ, ఆకాశాన్నం టుతున్న నిత్య జీవితావసర వస్తువులతోపాటు అన్నిరకాల వస్తువుల ధరల పెరుగుదల కారణంగా కేంద్ర ప్రభ్వు ఉద్యోగుల జీవనాదాయం రోజురోజుకు తరిగిపోతున్నది. దానికి వెసులు బాటుగా ఉద్యోగులు పోరాడి సాధించుకున్న కరువుభత్యం (డీఏ)ను, పెన్షనర్ల డీఆర్‌ను 18నెలలపాటు అనగా మూడు విడతల కరువుభత్యాలను (11శాతం జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు) కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వలన త్యజించవలసి వచ్చింది. ప్రధానమంత్రి పిలుపునివ్వగానే ఒక రోజు వేతనాన్ని 50లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2020 ఏప్రిల్ నెలలో ప్రధాని సహాయనిధికి (పీయం కేర్స్) భారీ మొత్తంలో అందచేశారు. ఇది మూడు విడతల కరువుభత్యం, అరియర్స్నకు అదనంగా ఇచ్చినది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లక్షకోట్ల సొమ్ము, ఎంత పెద్ద సాయమో ఊహించవచ్చు. అంతేకాదు, కోవిడ్ సమయంలో కొన్ని డిపార్టుమెంట్సులోని వేలాది మంది ఉద్యోగుల నైట్‌డ్యూటీ అలవెన్సును కూడా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేసింది. ఈ అలవెన్సు ఎన్ని వేల కోట్ల మొత్తమో! ఇది ముమ్మాటికి అక్షరాలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అనిర్వచనీయమైన సేవ, త్యాగం, దేశభక్తియుత చర్య. కాని, ప్రజాసేవకులమని చెప్పుకునే కేంద్ర, రాష్ట్ర ఎంపీలు, ఎంఎల్ఏలు, మంత్రులు తమ అలవెన్సును, వేతనాలను, ప్రోత్సాహకాలను, కరోనా కష్టసమయంలో కూడా వదులుకోలేదు. గమనించాలి.
అనేక చర్చలు, విజ్ఞాపనలు, ఆందోళనల అనంతరం, తప్పనిసరి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తన ఉద్యోగులకు డీఏను, పెన్షనర్లకు డీఆర్‌ను 17శాతం నుంచి ప్రస్తుత ధరలకనుగుణంగా 28శాతంగా 2021 జూన్‌లో ప్రకటించింది. అదికూడా 2021 జులై నుంచి చెల్లించాలని (2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల అరియర్స్ కాకుండా) ప్రకటించింది. 18 నెలల అరియర్స్ గురించి ప్రస్తావించలేదు. ఇందులో కొత్తగా ఇచ్చిందిగాని, అదనంగా ఇచ్చిందిగాని, పెరిగిన జీతంగాని ఏమిలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రేమతో ప్రభుత్వం ఇచ్చిన కానుక, వితరణ అంతకన్నా కాదు.
అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డీఏ, డీఆర్ విషయంలో మీడియా మాత్రం కేంద్ర ప్రభుత్వ వితరణగా పేర్కొనటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఉద్యోగులపై కేంద్ర ప్రభుత్వం కురిపించిన కనక వర్షం! ఉద్యోగులకు బోనాంజా! ఉద్యోగులకు తీపి కబురు! కేంద్ర ఉద్యోగులకు కేంద్రం ఇచ్చిన వరం! కేంద్ర ఉద్యోగులకు ప్రోత్సాహం! అంటూ అతిశయోక్తుల వార్తలను మీడియా ప్రచారం చేసింది.
నిజానికి జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు అనగా 18 నెలల డీఏ, డీఏ రిలీఫ్ బకాయిలకు కేంద్రం ఎగనామం పెట్టింది. దీనివలన ఒక్కొక్క ఉద్యోగి లక్షపైచిలుకు నష్టపోతారు. క్లాస్‌వన్ అధికారులయితే అధిక మొత్తంలో నష్టపోతారు. విశ్రాంత ఉద్యోగులు కూడా ఒక్కొక్కరు దాదాపు 50వేల వరకు నష్టపోతారు. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఏమి ప్రకటించకపోయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కరువుభత్యం రిలీఫ్‌ను స్తంభింపచేసింది.
1968లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఆందోళనలతోబాటు ఒకరోజు దేశవ్యాప్త సమ్మె నిర్వహించి కేంద్ర ప్రభుత్వ సర్వీసులను స్తంభింపచేసిన నేపథ్యంలో నాటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ గజేంద్ర గడ్కర్ కమిటీని ఏర్పాటుచేసి కరువుభత్యం విషయంలో చర్చించి రిపోర్టు ఇవ్వమని ఆదేశించింది. 1968 సమ్మె డిమాండ్స్‌లో పెరిగిన ధరలకనుగుణంగా కరువుభత్యం చెల్లించాలన్నది డిమాండ్. 1968 సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీసు కాల్పుల్లో 17మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలను కోల్పోయారు. తీవ్రమయిన వేధింపులు, సస్పెన్షన్లు, ఉద్యోగాల నుంచి తొలగించుటలాంటి కక్షసాధింపు చర్యలకు అప్పటి కేంద్ర ప్రభుత్వం పాల్పడింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతున్నవారిని కూడా కాల్చి పొట్టనపెట్టు కున్నారు. 40వేల మంది ఉద్యోగులు సస్పెన్షన్లకు గురయ్యారు. 64వేల మందిని టర్మినేట్ చేసింది. లెక్కలేనంత మంది ఉద్యోగులకు చార్జిషీట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా మరో 250 మందిని ఉద్యోగాల నుంచి పూర్తిగా తొలగించింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు పొందుతున్న సౌకర్యాలు ఆ రోజు వారి త్యాగాల ఫలితమేనని గమనించాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక పోరాటాలు, నిర్బంధాలు, కక్షసాధింపు చర్యలకు గురయి అనేక త్యాగాలు చేసిన ఫలితంగా కరువుభత్యం సాధించు కున్నారు. గతంలో జీవనవ్యయ సూచిక ఆధారంగా ఎనిమిది పాయింట్ల పెరుగుదలకు కరువుభత్యాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదలచేసేది. ఈ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సంవత్సరానికి నాలుగుసార్లు మించి కరువుభత్యం పొందేవారు. 1975 జూన్ 25న అప్పటి కేంద్ర ప్రభుత్వం, దేశంలో ఎమర్జెన్సీ విధించి 1977 జనవరి వరకు సాగించింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో ఐదువిడతల కరువుభత్యంను స్తంభింపచేసి తమ ఖజానాలో జమచేసుకున్నది. ఎమర్జెన్సీని ఎత్తివేసిన తదుపరి ప్రభుత్వం తిరిగి ఐదువిడతల కరువుభత్యాన్ని విడుదలచేసి 18నెలల అరియర్స్‌ను కూడా చెల్లించింది. భరోసాగా చెల్లించే కరువుభత్యాన్ని తిరిగిపొందడానికి ఆనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనేక పోరాటాలు నిర్వహించి సాధించుకున్నారు. కాని నేడు ఎలాంటి ఎమర్జెన్సీ లేకపోయినా, ప్రకటించకపోయినా 18 నెలల కరువుభత్యం అరియర్స్‌ను కోల్పోవటం జరిగింది.
1968లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ సమాఖ్య కరువుభత్యం కోసం పోరాటానికి ఉద్యోగులను సమ్మెకు సిద్ధంచేసింది. పోరాడి సాధించుకున్న భరోసాగా చెల్లించే కరువుభత్యాన్ని తిరిగిపొందేవరకు మనం విశ్రాంతి తీసుకోకూడదని పోరాటానికి పిలుపునిచ్చింది. ఆ తదుపరి మాత్రమే భరోసా కరువు భత్యాన్ని జీవన వ్యయ సూచి ఆధారంగా ఇవ్వవలసిన సమయంలో డ్యూ (ణబవ) అయినప్పుడల్లా కరువుభత్యం చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. నాటి నుంచి నేటివరకు క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుభత్యం చెల్లించబడుతున్నది. ఉద్యోగుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా సాధించుకొన్న కరువుభత్యంను స్తంభింపచేసి కేంద్ర ఖజానాలో జమచేసుకోవటానికి నేటివరకు ఏ ప్రభుత్వాలూ సాహసించలేదు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా పేరుతో ఎలాంటి అత్యవసర పరిస్థితి ప్రకటించనప్పటికీ, కరువుభత్యంను స్తంభించేసి తన ఖజానాలో జమచేసుకొని 18 నెలల అరియర్స్ కూడా చెల్లించకూడదని నిర్ణయించింది. ఇది అత్యంత దుర్మార్గం, తన నిరంకుశ విధానాలలో భాగంగా తీసుకున్న నిర్ణయం. ఈ వాస్తవాలను ఏ మీడియా..ఎక్కడా చర్చించలేదు. ప్రకటించలేదు.
కోవిడ్ యొక్క విషమ పరిస్థితులలో కర్ఫ్యూ, లాక్డౌన్ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఇతర కోవిడ్ వారియర్స్ (శానిటైజేషన్ కార్మికులు, నర్సులు, ఆయాలు, పోలీసులు, డాక్టర్సు వగైరా)తోపాటు శ్రమించారు. సేవలందించారు. అనేక విపత్కర పరిస్థితులలో అనగా వరదలు, తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు, యుద్ధ సమయాలలో అదనంగా పనివేళలలో విధులను దేశభక్తితో నిర్వహించారు. ఆ సమయాలలో ఉద్యోగులు తమ డిమాండ్స్ కోసం నిలబడకుండా జాతి కోసం, దేశం కోసం నిలబడ్డారు. తమ దేశభక్తిని చాటుకున్నారు. కానీ ''దేశభక్తులమని'' చెప్పుకునే నేటి పాలకులు వారి సేవలను గుర్తించకపోగా, కనీస హక్కులను కాలరాస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు ఇతర ఉద్యోగులతో ఐక్యమై ఐక్య పోరాటాలకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు మించి వేరే షార్ట్‌కట్ మెథడ్స్ లేవు. పోరాడితే పోయేది ఏమీలేదు.. బానిస సంకెళ్ళు తప్ప...
- ఎస్ఎస్ఆర్ఎ ప్రసాద్
సెల్:9490300867