Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేవలం ఎనిమిది లక్షలలోపు జనాభా ఉన్న భూటాన్‌తో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు చైనా ఒక ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది. చైనా-భూటన్ - భారత్ త్రికోణ కూడలికి దగ్గరలో నాలుగు సంవత్సరాల నాడు తీవ్ర వివాదంగా మారిన డోక్లాం ప్రాంతం ఉంది. అది ప్రస్తుతం చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ భూటన్ తనదిగా చెబుతోంది. దానితో పాటు మరికొన్ని ప్రాంతాలు కూడా ఆ రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోడ్డు, ఇతర నిర్మాణాలు చేసేందుకు 2017లో చైనా ప్రయత్నించినపుడు మన సైన్యాలు అడ్డుకున్నాయి. డెబ్బైమూడు రోజుల పాటు ఆ వివాదం కొనసాగింది. రోడ్డు నిర్మాణాన్ని చైనా నిలిపివేసిన తరువాత సద్దుమణగింది. వేస్తున్న రోడ్డును ఆపివేసింది తప్ప చైనా ఆప్రాంతంలోనే అప్పటి నుంచీ కొనసాగుతోంది. సిక్కిం వైపున ఉన్న నిర్థారిత సరిహద్దు నుంచి 2017జూన్ 18న భారత సైన్యం తమ భూభాగంలోకి ప్రవేశించి అతిక్రమణకు పాల్పడిందని అప్పుడు చైనా విమర్శించింది. మూడు దశలుగా లేదా మూడంచెలలో వివాదాలను పరిష్కరించుకొని రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలన్నది ఒప్పందం, వివరాలు వెల్లడి కాలేదు.
రెండు దేశాల మధ్య 1984 నుంచీ చర్చలు జరుగుతున్నాయి, 24 సార్లు కూర్చున్నా పరిష్కారం కాలేదు. 2017లో డోక్లాం ఉదంతం తరువాత అవి కూడా నిలిచిపోయాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పదవసారి జరిగిన నిపుణుల సమావేశం తరువాత తాజా ఒప్పందం కుదిరింది. దీని గురించి ఎవరికి వారు తమ ప్రయోజనాలు, భాష్యాలకు అనుగుణ్యంగా వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందం గురించి ఆశ్చర్య పోవాల్సిందేమీలేదని, ఎప్పటి నుంచో ఊహిస్తున్నదే అనే అభిప్రాయం వెల్లడించిన వారు కొందరు. నిజానికి దీనికి 2010లోనే పునాది పడింది. వివాదాస్పదంగా ఉన్న ప్రాంతాలను భౌతికంగా పరిశీలించాలని నిర్ణయించారు. ఆ మేరకు 2015నాటికి దాన్ని పూర్తి చేశారు. వివాదం ఉన్న వాటిలో డోక్లాంను తమకు అప్పగిస్తే దానికి బదులు ఇతర ప్రాంతాల మీద హక్కును వదులుకుంటామని చైనా చెబుతోంది. భూటాన్ మొత్తం విస్తీర్ణం 38వేల చదరపు కిలోమీటర్లు, నాలుగు వందల కిలోమీటర్ల మేరకు చైనాతో సరిహద్దును కలిగి ఉంది. రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం 765 చదరపు కిలోమీటర్లు. ఈ ఒప్పందాన్ని వీడియో సమావేశంలో చేసుకున్నారు.
త్రికోణ కూడలి ఇటు మన దేశానికీ చైనాకూ ప్రాధాన్యత కలిగినదే. మన ప్రధాన భూభాగం నుంచి ఈశాన్య రాష్ట్రాలను కలిపే ప్రాంతం కూతవేటు దూరంలో ఉంది. పరస్పరం అనుమానాలు ఉన్నందున డోక్లాం చైనా ఆధీనంలో ఉండేందుకు మన దేశం అంగీకరించటం లేదు. భూటాన్ విషయానికి వస్తే అటు చైనా ఇటు మన దేశంతో దానికి భద్రతాపరమైన ముప్పు ఉందని భావించటం లేదు. మనదేశం-భూటాన్ మధ్య ఒక చిత్రమైన ఒప్పందం ఉంది. తరువాత అది అనేక మార్పులకు లోనైంది. ఆ ఒప్పందం ప్రకారం భూటాన్ మన రక్షిత ప్రాంతమని మన దేశం భావించింది.
1949 ఆగస్టు 8న కుదిరిన స్నేహ ఒప్పందం ప్రకారం అంతర్గత వ్యవహారాలలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. అయితే విదేశీ, రక్షణ విషయాలలో పరస్పరం సంప్రదించుకోవాలి, మన దేశం భూటాన్‌కు మార్గదర్శనం చేయాలి. భూటాన్ స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించవచ్చు కనుక కొందరు దీన్ని రక్షణ కల్పించే దేశం తప్ప రక్షణలో ఉండేది (అలాంటి దేశాలను అన్నివిధాలుగా నియంత్రిస్తారు) కాదని చెప్పారు. 1958లో నాటి ప్రధాని నెహ్రూ భూటాన్ సందర్శించిన తరువాత పార్లమెంటులో ఒక ప్రకటన చేస్తూ భూటాన్ మీద ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే అది భారత్ మీద జరిపినట్లే పరిగణిస్తామని ప్రకటించారు. నాడు వేరేదేశంగా ఉన్న సిక్కిం, భూటాన్లను చైనా ఆక్రమించనుందనే పుకార్లు (సిక్కింలో తిష్టవేసేందుకు అమెరికా సీఐఏ అల్లిన కట్టుకథలు) వచ్చినపుడు 1959లో పార్లమెంటులో ప్రకటన చేస్తూ భూటన్ రక్షణ బాధ్యత భారత్ వహిస్తుందని నెహ్రూ ప్రకటించారు. దాన్ని నాటి భూటాన్ ప్రధాని ఖండిస్తూ తమది భారత రక్షిత దేశం కాదని ఒప్పందంలో అలాంటి అంశం లేదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ భారత్ - భూటాన్ సరిహద్దు వివాదాలు 1973-84 కాలంలోనే పరిష్కారమయ్యాయి. తమ సార్వభౌమత్వం పెంపుదలకు ఒప్పందంలోని కొన్ని అంశాలను తిరిగి రాసుకోవాలని 1970లోనే భూటాన్ కోరింది. దానిలో భాగంగానే మన ప్రమేయం లేకుండానే 1971లో అది ఐక్యరాజ్య సమితిలో చేరింది. బంగ్లాదేశ్ విముక్తిని గుర్తించి మరుసటి ఏడాది ఒక ఒప్పందం చేసుకుంది. అలీన కూటమిలో చేరింది. కంపూచియా ఖేర్మరోగ్ సంస్థను ఐరాసలో ప్రతినిధిగా గుర్తించాలా లేదా అన్న అంశంపై కొన్ని ఆ ప్రాంత దేశాలు, భారత వైఖరికి భిన్నంగా చైనాతో కలసి అనుకూలంగా ఓటు వేసాయి. 2007లో 1949 నాటి ఒప్పందాన్ని నవీకరించారు. అంతకు ముందు భూటాన్ సరిహద్దు సార్వభౌమత్వం గురించిన విదేశాంగ విధానంలో భారత్ మార్గదర్శనం చేయాలని ఉన్న అంశాన్ని తొలగించారు. ఆయుధ దిగుమతులకు కూడా భారత అనుమతి అవసరం లేదని సవరించారు. ఒప్పందంలో ఈ మార్పులు జరిగినప్పటికీ మన దేశం మీద భూటాన్ అనేక అంశాలలో ఆధారపడటం వంటి కారణాలతో ప్రభావితమైంది. డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణ సమయంలో భూటాన్ వినతి మేరకు తాము దాని భూభాగాన్ని రక్షించేందుకు వచ్చినట్లు ప్రకటించి మన మిలిటరీని అక్కడకు పంపారు. అయితే భూటాన్ ఆ సమయంలో మౌనం పాటించింది. భూటాన్ కోరితేనా లేక మనమంతట మనమే మిలిటరీని పంపామా అన్నది ఇప్పటికీ చిక్కుముడే.
సరిహద్దులతో సహా భూటాన్ పూర్తి సార్వభౌమత్వ దేశంగా ఉన్నట్లు చైనాతో కుదుర్చుకున్న ఒప్పందంతో మన దేశానికి, ప్రపంచానికి స్పష్టం చేసింది. ఈ కారణంగానే కావచ్చు లేదా వివరాలు పూర్తిగా వెల్లడి కానందున గానీ మన దేశం జాగ్రత్తగా స్పందించింది. 1997లో ఇచ్చి పుచ్చుకొనే ప్రాతిపదికన చైనా చేసిన ప్రతిపాదనకు భూటాన్ అంగీకరించకపోవటానికి మన దేశం తెచ్చిన వత్తిడే కారణమని చైనా చెబుతోంది. డోక్లాం ప్రాంతం ఉన్న చుంబీ లోయ చైనా ఆధీనంలోకి వెళితే భవిష్యత్‌లో ఏవైనా వివాదాలు తలెత్తితే సిక్కిం, పశ్చిమబెంగాల్లోని సిలిగురి ప్రాంతం మీద సులభంగా దాడి చేయటానికి వీలు కలగటమే గాక ఈశాన్య ప్రాంతంతో సంబంధాలు తెగిపోతాయన్నది మన దేశ భయం. మన దేశం నుంచి తమ టిబెట్‌కూ అలాంటి ముప్పు ఉంటుందని చైనా చెబుతోంది.
రర రెండు దేశాల మధ్య అవగాహన కుదిరినప్పటికీ అది సజావుగా ముందుకు పోతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఒప్పందం గురించి మన విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పందిస్తూ అవగాహన కుదిరినట్లు గమనించాం. 1984 నుంచి రెండు దేశాలూ సరిహద్దు గురించి సంప్రదింపులు జరుపుతున్నాయి. మనమూ చైనాతో సంప్రదింపుల్లోనే ఉన్నాం అని క్లుప్తంగా స్పందించారు. భారత్‌కు తెలియచేయకుండా భూటాన్ ఒప్పందం చేసుకుందా అన్న ప్రశ్నకు బాగ్చీ స్పందించలేదు. తమ సరిహద్దు చర్చలకు ఇది నూతన ఉత్సాహాన్నిస్తుందని, విజయవంతంగా ముగుస్తుందనే ఆశాభావాన్ని భూటాన్ వ్యక్తం చేసింది. ఒప్పందం భారత్‌కు అవమానమని, తమ దేశానికి విజయం అని చైనా పత్రికలు వర్ణించాయి. చైనాను నిలువరించాలని, సరిహద్దు వివాదాలను ఆయుధమయం కావించాలని చూస్తున్న నరేంద్రమోడీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ అని చైనా టీవీ సిజిటిఎన్ పేర్కొన్నది.
భూటాన్‌ను తన చెప్పుచేతల్లో ఉంచుకొనేందుకు అంతర్జాతీయ సంబంధాలు పెట్టుకోకుండా మనదేశం నిలువరించిందనే విమర్శలను చైనా చేసింది. గతంలో భూటాన్ తరఫున సరిహద్దు సమస్యను తమతో చర్చించాలని భారత్ ప్రతిపాదించిందని అది విఫలం కావటంతో భూటాన్ మీద వత్తిడి తెచ్చినట్లు చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ రాసింది. ఇప్పుడు రెండు సార్వభౌమ దేశాల మధ్యజరిగిన ఒప్పందం గురించి వేలెత్తి చూపితే బలహీన, చిన్న దేశ సార్వభౌమత్వాన్ని భారత్ దెబ్బతీస్తున్నదని ప్రపంచంలో రుజువు అవుతుందని, అందువలన ఒప్పందం గురించి భారత్ ఒక ప్రకటన చేస్తుందని భావించటం లేదని కూడా పేర్కొన్నది. బహిరంగంగా ఏమీ చెప్పలేదు కనుక అంతర్గతంగా భూటాన్ మీద వత్తిడి లేదా ఏం చేయాలో చెప్పేందుకు ప్రయత్నిస్తుందని రాసింది.
ఈ ఒప్పందానికి భూటాన్ కట్టుబడి ఉంటే మరోసారి డోక్లాం ఉదంతం పునరావృత అవకాశం లేదు. వర్తమాన ప్రపంచ రాజకీయ పరిణామాల్లో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రపంచంలో ఎక్కువ దేశాలతో సరిహద్దులను కలిగి ఉన్నది చైనా. వాటిలో మన దేశంతో సహా అనేక దేశాలతో చరిత్ర సృష్టించిన సరిహద్దు వివాదాలు ఉన్నాయి. ఒక్కొక్క వివాదాన్ని చైనా పరిష్కరించుకొనే దిశలో ఉంది. ఆ క్రమంలో ఇదొక కీలక అడుగు. నాలుగు వందల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన ఒక్క భూటాన్‌తో తప్ప మిగిలిన అన్ని దేశాలతో దౌత్య సంబంధాలను కలిగి ఉంది. అయితే భూటన్‌కు ఐరాస భద్రతా మండలిలోని ఏ ఒక్క శాశ్వత సభ్యదేశంతో కూడా సంబంధాలు లేవు. ఇదొక విచిత్రమైన స్ధితి. ఈ ఒప్పందంతో చైనాతో సంబంధాలు ఏర్పడితే పెనుమార్పులేమీ సంభవించవుగానీ అమెరికా దాని కుట్రలకు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్:8331013288