Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2015లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ప్రకారం '2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సానుకూల సుస్థిరాభివృద్ధి మార్పులు' చేపట్టాలనే సదుద్దేశంతో 17 'ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030'ని నిర్ణయించారు. ఈ 17 లక్ష్యాలను '2030 ఎజెండా' అని కూడా పిలుస్తాం. పేదరికం, ఆకలి చావులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణ మార్పులు, లింగ సమానత్వం - మహిళా సాధికారత, సురక్షిత నీరు, పారిశుధ్యం, శక్తి వనరులు, పట్టణీకరణ, భూతాపం, సామాజిక న్యాయం లాంటి ప్రధాన అంశాలు లక్ష్యాలుగా తీసుకోబడినవి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030లో నాల్గవ లక్ష్యంగా 'నాణ్యమైన విద్య (క్వాలిటీ ఎడ్యుకేషన్)' అనబడే అంశం అధ్యయనం చేయబడుతున్నది. గత దశాబ్దకాలంగా విద్యారంగంలో ప్రపంచమానవాళి ఎంతో ముందడుగు వేసింది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 6వ అంశంగా 'సురక్షిత నీరు - పారిశుధ్యం' ముఖ్యమైనదిగా తీసుకోబడింది. గత దశాబ్దంగా రక్షిత నీరు, పారిశుధ్య రంగాల్లో కొంత అభివృద్ధి సాధించినా నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో వీటి లభ్యత అందని ద్రాక్షలాగే కనిపిస్తున్నది. ప్రపంచ జనాభా ప్రతి ముగ్గురిలో ఒకరికి (33శాతం) ఇప్పటికీ రక్షిత నీరు దొరకడం లేదు. అలాగే ప్రతి ఐదుగురిలో ఇద్దరు సబ్బుతో చేతులు శుభ్ర పరుచుకోవడానికి నీరు లేకుండా కడు పేదరికంలో మగ్గుతూ ఉన్నారు. ప్రపంచ మానవాళిలో 673 మిలియన్ల ప్రజలకు టాయిలెట్ వసతులు లేనందున అమానవీయంగా బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి వచ్చింది.
కోవిడ్-19 విపత్తుతో రక్షిత నీరు, పారిశుధ్యం, వ్యక్తిగత శుభ్రత లాంటి అతి ముఖ్యమైన కనీస అవసరాల ప్రాధాన్యత ప్రపంచ మానవాళి గుర్తించింది. చేతులు శుభ్రం చేసుకోవడంతో ప్రాణాలు నిలబడ్డాయని కరోనా పాఠం తెలుపుతున్నది. నీటితో చేతులను చక్కగా, శాస్త్రీయంగా శుభ్రపరుచుకోవడం వల్ల అనేక కరోనా లాంటి అంటువ్యాధులు కట్టడి చేయబడుతున్నాయి. అయినప్పటికీ నేడు అనేక ప్రపంచ దేశాల్లో సురక్షిత నీరు, పారిశుధ్యం, వ్యక్తిగత శుభ్రత పెద్ద సమస్యగా వెంటాడుతూ, నిధుల కొరతతో కొట్టు మిట్టాడుతున్నాయి. ఐరాస అభిప్రాయం ప్రకారం సురక్షిత నీరు లేకుండా ఆరోగ్యం సాధించడం అసాధ్యమని తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల ప్రజలకు రక్షిత నీరు, 785 మిలియన్లకు రక్షిత తాగు నీరు అందడం లేదు. కోవిడ్-19 కల్లోలంలో 3 బిలియన్ల ప్రజలకు చేతులు శుభ్రం చేసుకోవడానికి నీరు సరిపడా దొరకలేదు. 2030 నాటికి నీటి కొరత పెరిగి 700 మిలియన్ల ప్రజలు వలసలదారి పడతారని అంచనా వేస్తున్నారు. పేద మధ్య ఆదాయ దేశాల్లో 61 శాతం జల నిధుల కొరత ఉన్నది. పాఠశాలలు, మురికివాడలు, మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు తక్షణమే రక్షిత నీటిని సరిపోయేంతగా అందించే నిమిత్తం అభివృద్ధి చెందిన దేశాలు నిధులను వెచ్చించాలని యూనిసెఫ్ విజ్ఞప్తులు చేస్తున్నది.
2018-28 : నీటి చర్యల దశాబ్దం
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని 2018-2028 కాల పరిమితిని 'జల చర్యల దశాబ్దం (వాటర్ ఆక్షన్ డికేడ్)'గా నామరకరణం చేసి తగు చర్యలు తీసుకుంటున్నారు. 2030 నాటికి ప్రపంచ జనాభా పెరగడంతో పాటు 40శాతం నీటి లభ్యత తగ్గి, రాబోయే రోజుల్లో ప్రపంచమే 'జల సంక్షోభం (వాటర్ క్రయసిస్)'లో పడనుంది. ప్రపంచ జనాభాలో 25శాతం ఆరోగ్య కేంద్రాల్లో రక్షిత నీటి వ్యవస్థ లేదని తెలుస్తున్నది. ప్రతి 10మందిలో 6గురికి పారిశుధ్య నిర్వహణకు సరిపోయే నీరు దొరకడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 80 కుటుంబాలకు నీటి సేకరణ విధులు మహిళలు, బాలికలు మాత్రమే నిర్వహిస్తు న్నారు. మానవాళి వినియోగించినప్పుడు వెలువడే కలుషిత నీరు 80శాతం వృధాగా పోతున్నది. ప్రతి రోజు కనీసం 1,000మంది పిల్లలు నీటి సంబంధ వ్యాధులతో మరణి స్తున్నారు. నదులు, వాగులు, చెరువులు, సరస్సులలోని 70 శాతం నీరు వ్యవసాయానికి వినియోగించబడుతున్నది. వరదలు, అపరిశుభ్ర నీటితోనే 70శాతం మరణాలు నమోదు అవుతున్నాయి.
అందరికీ రక్షిత నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత కనీస మానవ హక్కుగా గుర్తించబడింది. నేడు ప్రపంచ జనాభాలో సగం మంది ఏడాదిలో ఒక్క మాసం అయినా నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. నీటి లభ్యతతో ఆరోగ్యం, పేదరికం, ఆహార భద్రత, ప్రపంచ శాంతి, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, విద్య లాంటి ముఖ్యమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. పలు దేశాలు నీటి కొరత, నీటి కాలుష్యం, జలవనరుల వివాదాలు లాంటి సమస్యలను అనుభవిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వాలు, పౌరసమాజం నీటి నిలువ, వ్యర్థాలను అరికట్టడం, వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం, డేయామ్లు, జలాశయాలు, వాటర్ షెడ్లను నిర్మించడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, నీటి వాడకంలో క్రమశిక్షణ పాటించడం లాంటివి తక్షణ అత్యవసరాలుగా గుర్తుంచుకోవాలి. నీటిని మనం రక్షిస్తే, ధరణిపై ప్రాణికోటిని నీరు రక్షిస్తుందని తెలుసుకోవాలి. జలం కోసం జగడాలు కాకుండా సహజ నీటి వనరులను పరిరక్షించుకుంటూ, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, వాడిన నీటిని రీసైక్లింగ్ చేసి ఇతర అవసరాలకు వాడుకోవడం, జలాశయాలను నిర్మించుకోవడం లాంటి చర్యలను ప్రభుత్వాలు, పౌర సమాజం చేపట్టాలి. నీరు ఉంటేనే ప్రాణమని, నీటి కొరతే కరువు కాటకాలని, జల సంపదతోనే జీవకోటి మనుగడ సాధ్యమని తెలుసుకోవాలి.
- డాక్టర్ బుర్ర మధుసూధన్‌రెడ్డి
సెల్: 9949700037