Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సావర్కర్ గురించి అబద్ధాలు పదే పదే విస్తారంగా ప్రచారంలో ఉంటున్నాయి. జైళ్ల నుంచి విముక్తి కోసం అనేక క్షమాభిక్ష పత్రాలు దాఖలు చేసాడని ప్రచారం సాగుతున్నది. మహాత్మా గాంధీయే సావర్కర్‌ను క్షమాభిక్ష కోరుతూ పిటీషన్లు పెట్టమని చెప్పారు...'' ఇదీ కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్, వి.డి సావర్కర్ మీద ఒక పుస్తకాన్ని విడుదల చేస్తూ అన్నమాటలు.
మొత్తానికి మొట్టమొదటిసారి ఒక బీజేపీ సీనియర్ నాయకుడు తమ హిందుత్వానికి ఐకాన్‌గా నిలిచిన సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి క్షమాభిక్ష కోరుతూ పిటిషన్ సమర్పించుకున్నాడని మన అందరి సమక్షంలో అంగీకరించాడు. అంతేకాదు, బ్రిటిష్ వారికి ఎన్నో క్షమాభిక్ష పిటీషన్లు పెట్టుకున్న యదార్థాన్ని కూడా ఒప్పుకున్నాడు.
పిరికిపందగా బ్రిటిష్ వారి క్షమాభిక్షను వేడుకున్న తమ హిందుత్వ ఐకాన్‌ను మచ్చలేని స్వచ్ఛమైన వ్యక్తి అని చూపడానికీ, బ్రిటిష్ పాలనను ధిక్కరిస్తూ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, చిత్రహింసలను, అమానుష అండమాన్ జైల్ జీవితాన్ని అనుభవించిన వీరులతో పోల్చటానికీ, ఇప్పుడు బీజేపీ గాంధీ పేరును ముందుకు తెస్తున్నది.. బ్రిటిష్ వారు గాంధీజీని 11 సార్లు అరెస్టు చేశారు.
తన విడుదలకోసం గాంధీజీ ఒక్కసారైనా బ్రిటిష్ వారికి క్షమాపణ చెప్పాడా?
వాస్తవవిషయాల గురించి వాదనకు దిగకు, వాస్తవ విషయాలనుంచి సత్యాన్ని శోధించు- అనే నానుడి ఉంది. సావర్కర్ గురించి వాస్తవాలను తెలుసుకోవాలనే కోరిక ఉన్న వాళ్లు ఏ.జి. నురాని రచనలు చదవాలి. అవి హెచ్చు సమాచారమిచ్చేవి, విజ్ఞానదాయకమైనవేకాక, చాలా శ్రద్ధతో చేసిన పరిశోధనలు.
నేషనల్ ఆర్కైవ్స్ లోని అనేక పత్రాలను పరిశోధించి అనేక విషయాలను ఏ.జి.నురాని విజయవంతంగా బయటపెట్టారు. సావర్కర్ అండ్ హిందుత్వ అనే పుస్తకంలోను, సావర్కర్ క్షమాభిక్ష పిటీషన్ అనే వ్యాసంలోను, సావర్కర్ ఒక్కసారి కాదు... అనేకసార్లు బ్రిటిష్ వారికి క్షమాభిక్ష అర్జీలు సమర్పించాడని ఏ. జి నురాని వెల్లడించారు. బ్రిటిష్ అధికారులను హత్య చేసాడని, అలా హత్యలు చేయటంలో సహాయపడ్డాడనే ప్రత్యేక ఆరోపణలతో బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్‌ను అరెస్టు చేసింది. జూన్, 1911లో సావర్కర్‌ను బ్రిటిష్ వాళ్ళు అరెస్టు చేసి అండమాన్ జైల్లో నిర్బంధించారు. అరెస్టు అయిన కొద్ది మాసాలకే సావర్కర్ తన మొట్టమొదటి క్షమాభిక్ష విన్నపాన్ని బ్రిటిష్ వారికి అందించాడు. 1911లో చేసిన ఆ విజ్ఞాపన పత్రంలో ఏమి రాసాడో ఇప్పుడు అందుబాటులో లేదు. అయన దానిని గురించి నవంబర్ 14, 1913లో బ్రిటిష్ వారికి అందచేసిన రెండో విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నాడు.
''1911లో మీకు అందచేసిన క్షమాభిక్ష అర్జీని ప్రభువులవారికి గుర్తు చేస్తున్నాను..'' అని రాశారు. ''ప్రభుత్వానికి వారికిష్టమైన విధంగా ఏ స్థాయిలోనైనా సేవ చేయడానికి నేను సంసిద్ధుడనై ఉన్నాను... సర్వ శక్తివంతులైన వారు మాత్రమే దయాళువుగా ఉండగలరు. అందుచేత తిరుగుబోతు పోకిరి కొడుకు తిరిగి తిరిగి తల్లిదండ్రి వంటి ప్రభుత్వపు ద్వారాల చెంతకు చేరతాడు'' అని కూడా ఆ అర్జీలో పేర్కొన్నాడు.
ఈ పిటీషన్లో నేరస్థుడు బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. నిజానికి, 1911-1913 మధ్య ఈ రెండు క్షమాభిక్ష పిటీషన్లు సావర్కర్ రాసే సమయానికి గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. గాంధీ 1915లో మాత్రమే ఇండియాకు తిరిగి వచ్చారు. అటువంటప్పుడు క్షమాభిక్షను అభ్యర్థిస్తూ పిటిషన్ పెట్టుకోమని సావర్కర్‌కు సలహా ఎలా ఇవ్వగలడు? ఈ నిజాలు రాజ్‌నాథ్ సింగ్ చెపుతున్నదంతా శుద్ధ అబద్ధమని రుజువు చేస్తున్నాయి.
1914లో మరోసారి సావర్కర్ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష కోసం ప్రార్థించాడు. ఈసారి, బ్రిటిష్ వారు వారే ఎంచుకున్న పద్ధతిలో వారి ప్రభుత్వానికి సేవ చేయగలనని హామీనిచ్చాడు. రాజకీయ ఖైదీలందరికి క్షమాభిక్ష పెట్టమని సావర్కర్ అడిగాడు. సార్వత్రిక క్షమాభిక్ష అనేది తన విడుదలకే కాక, సోదరుడిని జైలు నుంచి విడుదల చేయడానికి ఉపకరిస్తుందని భావించాడు. 1917లో తిరిగి ఇదే డిమాండ్‌ను పునరుద్ఘాటించాడు. ఆ విధంగా కనీసంగా నాలుగు క్షమాభిక్ష అభ్యర్థనలను సావర్కర్ చేశాడు. ఇందులో మూడు పిటీషన్లు గాంధీతో ఎటువంటి పరిచయం ఏర్పడకముందే అందచేసినవి. తన సంతకంతో కూడిన ఆ అర్జీలలో సావర్కర్ బ్రిటిష్ వారికి పూర్తి మద్దతును తెలియ చేశాడు.
గాంధీ రచనల సంకలనంలో ప్రచురించిన దానినిబట్టి గాంధీ 1920 జనవరిలో మాత్రమే సావర్కర్ మూడవ సోదరుడి దగ్గరనుంచి ఒక లేఖను అందుకున్నాడు. అందులో కూడా తన ఇద్దరి సోదరుల విడుదలకు ఏమి చేయాలో సలహా ఇమ్మని అభ్యర్ధించాడు. గాంధీజి ఇచ్చిన సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ''మీ లేఖ అందింది. దీని మీద మీకు సలహా ఇవ్వటం కష్టం. మీ మీద మోపబడిన అభియోగంలోని వాస్తవాలను తెలియచేస్తూ, మీ సోదరుడు చేసిన నేరం పూర్తిగా రాజకీయపరమైనదిగా, నేరం నుంచి ఉపశమనం ఇవ్వతగినది అన్న వాస్తవాన్ని తెలియచేసే విధంగా ఒక సమగ్రమైన అర్జీని పెట్టమని సలహా ఇవ్వగలను''.
సావర్కర్ బ్రిటిష్ వారికి రాసిన దానిలో గాంధీ సలహాను ఏమాత్రం తీసుకోలేదు. దానికి భిన్నంగా, మరొకసారి నక్కవినయంతో, బ్రిటిష్ వారి పట్ల అత్యంత విధేయతను చూపుతూ, బ్రిటిష్ వారిప్రయోజనాల కోసం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తన విడుదల బ్రిటిష్ వారితో అనుబంధాన్ని పెంచుతుందని, రాజకీయంగా ఉపయోగంగా ఉంటుందని సావర్కర్ రాశాడు. సావర్కర్ చర్యలు గాంధీజీ సలహాపై జరిగాయని చెప్పుకోవడానికి గాంధీ రాసుకున్న జ్ఞాపకాలను వక్రీకరించటం అంటే గాంధీని అవమానించటమే. రెండింటికీ ఎక్కడా పోలికే లేదు. అంతకుమించి ఈ క్షమాభిక్ష పిటీషన్లు సాధారణంగా ఉండే లాంటివి కూడా కాదని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అనారోగ్య, మానవతా కారణాలతో ఖైదీలు క్షమాభిక్ష వేడుకుంటూ అర్జీలు పెట్టుకోవటం సాధారణంగా జరిగేదే. ఇటువంటి పిటీషన్ల వల్ల వారు జైలు నుంచి బయటపడవచ్చు. నిజానికి బ్రిటిష్ వాళ్ళు ఎంతో మంది ఖైదీలను ఇటువంటి కారణాలపై విడుదల చేశారు. కానీ సావర్కర్ క్షమాభిక్ష పిటీషన్లు ప్రభుభక్తిని చాటాయి, బ్రిటిష్ వారికోసం పనిచేస్తామని హామీని గుప్పించాయి. 1924లో విడుదల తరువాత, సావర్కర్ చేసింది కూడా ఖచ్చితంగా ఇదే- బ్రిటిష్ వారికి సేవ.
1911లో మొదటి క్షమాభిక్ష పిటిషన్లో సావర్కర్ తనకుతాను బ్రిటిష్ ప్రభుత్వపు ''కొడుకు''నని చెప్పుకోవటం నుంచి, 1920లో వలస ప్రభుత్వానికి రాజకీయంగా ఉపయోగం అనే దాకా ఈ క్షమాభిక్ష సాగింది. భారతదేశపు స్వాతంత్య్ర పోరాట విలువలనుంచి సావర్కర్ దూరంగా ఉన్న తీరును, రాజ్‌నాథ్ సింగ్ లాగా, చరిత్రను అబద్ధాలతో అల్లటం ద్వారానో, లేక తప్పుడు భాష్యాలు చెప్పటం ద్వారానో, పూడ్చలేరు.
ఆరెస్సెస్ పక్షపాత దృష్టితో ఇచ్చిన సమాచారం ఆధారంగా రాజ్‌నాథ్ మాట్లాడినట్టుగా ఉంది. ఆరెస్సెస్ అంటే ఏమిటో మనకు తెలుసు. ఆస్పష్టమైన నిజాలు, వాస్తవాల నుంచి అసత్యాలను రక్షించే మంత్రిత్వశాఖకు చెందిన కేంద్ర రక్షణ మంత్రి లాంటిదే ఆరెస్సెస్ అని మనకు తెలుసు. రాజ్‌నాథ్ ప్రసంగించిన వేదిక మీదనే ఉన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ సావర్కర్ ఏనాడూ ముస్లిం వ్యతిరేకిగా లేడని అన్నారు. సావర్కర్ ఉర్దూలో రాసిన గజిల్స్ దీనికి రుజువు అని అన్నారు.
ఈ విధంగా సావర్కర్ ప్రచారం చేసిన విభజన హిందూత్వ భావనను, సిద్ధాంతాన్నివెల్లవేసి బయటికి కనపడకుండా చేయాలని చూస్తున్నారు. హిందూత్వ అనేది ఒక రాజకీయ భావన, మత విశ్వాసాలతో సంబంధమే లేదు. 1935లో హిందూ మహాసభలో సావర్కర్ చేసిన అధ్యక్షోపన్యాసంలో మొదటిసారి హిందువులు, ముస్లింలు రెండు ప్రత్యేక జాతులని చెప్పిన విషయం అందరికి తెలుసు. విభజించు, పాలించు అనే బ్రిటిష్ విధానానికి ఇది అనుకూలమైనది. మతానికి, జాతికి సైద్ధాంతికంగా ముడిపెట్టటం ఈ సిద్ధాంతంలోని కీలక విషయం. ఈ పితృభూమికి లేక పుణ్యభూమికి చెందినవారు మాత్రమే తల్లి భారతికి చెందిన బిడ్డలుగా అంగీకరించటం ఈ సిద్ధాంత సారాంశం. ఆ విధంగా ముస్లింలను, క్రిస్టియన్లను ఈ దేశ పౌరసత్వం నుంచి సమర్థవంతంగా తప్పించటమే హిందూ రాష్ట్రం అని సావర్కర్, అతని ఫాలోయర్స్ భావిస్తున్నారు. ఈ సిద్ధాంతంతో ఉత్తేజితులైన వారి చేతిలోనే గాంధీజీ హత్యకు గురియైనాడు. ఈరోజు అధికార పీఠంపై ఉన్నవారు ఈ సిద్ధాంతాన్ని గొప్పదిగా చేసి కీర్తిస్తున్నారు. ఎన్నెన్ని సార్లు మహాత్ముడిని హత్య చేస్తారు?
- అనువాదం: కర్లపాలెం
- బృందా కరత్