Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో జనగణనకు శతాబ్దన్నరకు పైగానే చరిత్ర ఉన్నది. పన్నుల వసూళ్ల కొరకు బ్రిటిష్ వాళ్లు జనాభా లెక్కల సేకరణను 1866లో మొదలు పెట్టారు. వాళ్ల ప్రయోజనాల కోసమే అయినా కులాల వారి జనగణన పద్ధతిని 1931 వరకు కొనసాగించారు. జనాభా లెక్కల్లో కులాల లెక్కింపు చివరి సారిగా అప్పుడే జరిగింది. దేశంలో వివిధ రకాల సామాజిక శ్రేణుల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, రాజ్యాంగ నిర్మాణాంతరం అమలవుతున్న రిజర్వేషన్లు గత 90ఏళ్ల నాటి కులాల డేటా ప్రాతిపదికనే అమలవుతున్నవి. దీనికి షెడ్యూల్ కులాలు, తెగల గణన మినహాయింపు, వారికి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు పర్చాలన్న రాజ్యాంగ నియమావళిని అనుసరించి వారి జనగణన జరుగుతున్నది. అయితే బీసీ కులాల జనగణన చేయకూడదన్న నిబంధనలు రాజ్యాంగంలో ఏమీ లేవు. దేశంలో 1931 నాటి లెక్కల ఆధారంగానే బీసీ కులాలు 62శాతం పైగా ఉన్నట్టు మండల్ కమిషన్ తేల్చింది. అసలు జనాభా లెక్కలు అంటే యాంత్రికంగా మనుషులను నిలబెట్టి తలలు లెక్కించడం కాదు. మొత్తం ఒక దేశ మానవ వనరుల నిర్ధారణ. దేశ రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక చిత్రణ. మానవ వనరులకు, వసతులకు మధ్య సమతూకం సాధించడానికి ఉపయుక్తమైన ప్రాతిపదికను జనగణన కార్యం ఏర్పరుస్తుంది. దేశంలో ప్రతి పదేండ్లకు ఓ సారి జరిగే ఈ కార్యక్రమానికి పాలనా పరమైన సుదీర్ఘ కసరత్తే ఉంటుంది. ఓ సంవత్సరం ముందే ఈ గణనకు సమాయత్తం కావాల్సి ఉన్నప్పటికీ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా ఉపద్రవం వల్ల ఈ సారి జనగణన ఓ సంవత్సరం పైగానే ఆలస్యమైంది. అయితే దేశ వ్యాప్తంగా కులాల ఆధారంగా జనగణన చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. నిజానికి కుల పరమైన గణాంకాలు సేకరించడానికి జనాభా సేకరణ పత్రంలోనే మరికొన్ని అంశాలు అదనంగా చేరిస్తే చాలు. ప్రభుత్వం ఆ పని చేయలేక కాదు గానీ గుట్టలు గుట్టలుగా వచ్చి పడిన ఆ సమాచారాన్ని క్రోడీకరించి ప్రజా క్షేత్రంలో బహిరంగ పర్చడానికే జంకుతున్నది. ఈ జంకుకు కారణాలు ఆ పనిలో ఇమిడి ఉన్న సంక్లిష్టత వల్ల కూడా కాదు. అనేక పార్టీలు, సామాజిక సంఘాలు కుల ఆధారిత జనగణనను తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి.
కులాల వారీ జనగణన చేయడానికి బీజేపీ 2011 నాటి జనాభా లెక్కల సందర్భంలో బలంగా డిమాండ్ చేసి 2018లో అంగీకరించింది. కానీ తన ప్రభుత్వమే ఆ పని చేయాల్సి రావడాన్ని ఆహ్వానించలేకపోతున్నది. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో పాలనా పరమైన చిక్కులు, సంక్లిష్టత ఎక్కువగా ఉంటుందని, కులగణన వివరాలు బయటికి చెప్పడం సున్నితమైన అంశమని చెబుతున్నది. సంఫ్‌ుపరివార్ అఖండ హిందూ భారత్ లక్ష్యానికి అనుగుణంగా రాజకీయ యంత్రాంగాన్ని నడుపుతున్న బీజేపీ చెపుతున్నవన్నీ సాకులు మాత్రమే. కులగణన కులాన్ని మరింత వ్యవస్థీకృతం చేసి స్థిర పరుస్తుందని ఏదో కుల నిర్మూలనా ఎజెండాను భుజాన వేసుకున్న స్థాయిలో మాట్లాడుతున్నారు. సామాజిక సత్యాలను దాయాలనుకోవడం ఏ ప్రయోజనాలను నెరవేర్చదు. కులాల ఆధారంగా జనాభా లెక్కలు జరిగితే రిజర్వేషన్ల పరిధిని 50శాతానికి పైగా పెంచాలనే డిమాండ్ ఉధృతమవుతుంది. విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాల్లో మరింత ప్రాతినిధ్యం, పట్టు కోసం డిమాండ్ పెరుగుతుందనే అక్కసు కూడా ఈ ప్రభుత్వ కులగణన వ్యతిరేకత వెనుక ఉన్నది. ఈ దేశ బహుజన శ్రమ జీవుల సమస్తం అయిన ఈ సంపద పైన యాజమాన్యం ఎక్కడ చేజారి పోతుందో అన్న భయం కూడా ఈ డిమాండ్‌ను అడ్డుకుంటున్నది. 2020లో ఆక్స్ ఫామ్ సంస్థ అందించిన నివేదిక ప్రకారం దేశ జనాభాలో 10శాతం దగ్గర 74.3శాతం సంపద, 40శాతం జనాభా దగ్గర 22.9శాతం, మరో 50శాతం జనాభాకి కేవలం 2.8శాతం సంపద మాత్రమే ఉన్నది. పైన పేర్కొన్న పది శాతం జనాభా ఎవరో ఇట్టే అర్థమైపోతుంది. దీనిని బట్టి సంపద అంతా ఏ ఏ కులాల మధ్య కేంద్రీకృతమై ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018లో సావిత్రి పూలే యూనివర్సిటీ, పూణే, జెఎస్యు, దళిత్ స్టడీస్ సంస్థ జరిపిన సంపద, యాజమాన్యం, అసమానత, సామాజిక పరమైన అధ్యయనంలో ఇలాంటి నిజాలే బయటపడ్డాయి. 41శాతం ఆదాయం ఉన్నత కులాల చేతుల్లో, 31శాతం ఓబీసీలు, 3.7శాతం షెడ్యూల్ కులాలు, 7.6శాతం షెడ్యూల్ తెగల చేతుల్లో సంపద ఉన్నట్టు తేలింది. ఇంతటి అసమానతలు ఇప్పటికీ ప్రబలంగా ఉన్నప్పుడు, వాటిని పూరించి, సామాజిక వికాసం పెంచాల్సిన సందర్భంలో కూడా సరైన కుల జనాభా గణన జరగకుండా నిర్దిష్ట చర్యలు చేపట్టడం అసాధ్యం. ఓ వైపు ఓబీసీని ప్రధానిని చేశామని గొప్పగా చెప్పుకుంటున్న బీజేపీ అదే ఓబీసీల లెక్కలు వద్దంటున్నది. ఒక్క ప్రధాని పదవి కాదు గదా సకల వ్యవస్థల్లో వారికి హక్కుగా చెందాల్సిన ప్రాతినిధ్యం వారి జనగణన లేకుండా సాధ్యం కాదు. నిజానికి చరిత్రలో 1901లోనే 1646 కులాలని తేల్చారు. 1931లో అవి 4,147గా లెక్కగట్టారు. మండల్ కమిషన్ 1931 జనగణన ఆధారంగా వెనుకబడిన తరగతులు 52శాతం అని చెప్పింది. 1953లో కాకా ఖలేల్కర్ కమిషన్ 2,399 కులాలు ఉన్నాయని, అందులో 837 అత్యంత వెనుకబడిన కులాలని పేర్కొన్నది. 2011 నాటి జనాభా లెక్కల్లోని కులాలను అధికారికంగా బయటకు వెల్లడించలేదు.
సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో కొత్తగా రిజర్వేషన్లు అందివ్వడానికి విశ్వసనీయమైన గణాంకాలు ఉండాలని స్పష్టంగా పేర్కొన్నది. ఆ తీర్పుతో ఇదొక రాజ్యాంగ అనివార్యతగా కూడా భావించవచ్చు. చట్టపరమైన అడ్డంకులు ఏమీ లేని సందర్భంలో కూడా కులాల అధారంగా జనగణనకు తిరస్కరించడం అత్యంత ప్రజా వ్యతిరేక చర్య అవుతుంది. కులమొక సామాజిక వాస్తవం అయినపుడు, కులమే ప్రతి మనిషి స్థానాన్ని నిర్ణయించినపుడు వాటి లెక్కల లోతుల్లోకి పోకుండా ఎలా ఉండగలం. ఏఏ కులాల స్థితిగతులు ఏమిటో, ఆయా వ్యవస్థల్లో వారి వారి ప్రాతినిధ్యం ఏమిటో, రాజ్యాంగం వారికిచ్చిన హక్కులు ఏ మేరకు నెరవేరి, ఉల్లంఘించబడ్డాయో తెలుసుకునే హక్కు ఆయా సామాజిక శ్రేణులకు ఉన్నది. కానీ కులగణనకే ఒప్పుకోని శక్తులు సంపూర్ణ సామాజిక న్యాయం, సమానత్వం అందిస్తాయని ఆశించడం అవివేకమే అవుతుంది.
- నాదేండ్ల శ్రీనివాస్
సెల్ : 9676407140