Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కత్తితో మెడను కోసుకుంటూ కత్తిని నిందిస్తే ఎలా..? మత్తు, మాదక ద్రవ్యాల విషయంలో మన పాలకుల గోస అలానే మిగిలిపోతున్నది. డ్రగ్ మాఫియా నేడు ఎక్కడికక్కడ దేశ దేశాలను అస్థిరపరుస్తున్నది. యువత అంటేనే భవిత. భారత యువత బతుకులతో మత్తు, మాదకద్రవ్యాలు నేడు చలగాటమాడుతున్న విషయం కాదనలేం. స్లో పాయిజన్‌లా ఇది యువతను నిర్వీర్యపరు స్తున్నది. మానవ వినాశనానికి దారితీస్తున్నది. అనేక సాంఘిక నేరాలకు, హత్యలకు కారణమవుతున్నది. అలాంటి డ్రగ్ మాఫియాను కూకటివేళ్ళతో సమూలంగా పెకలించాల్సిందిపోయి చెట్టపట్టాలేసుకుని తిరిగితే ఎలా..?
'తండ్రీ! వారేమి చేస్తున్నారో వారికే తెలియదు' అన్న దేవుని (బైబిల్) వాక్యం రీతిలో మత్తులో జోగుతూ నిస్సారమవటమే గాక, మితిమీరి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల గంజాయి చీకటి వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా బాగా ఊపందుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్పత్తి, రవాణా, వినిమయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది అనే కంటే, కావాలనే దోపిడీ పెట్టుబడిదారులు పెంచుతున్నారనేది సరైన మాట అవుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ వందలాది క్వింటాళ్ళ గంజాయి పట్టుబడుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అక్కడక్కడా నిందితులను అరెస్టు చేస్తున్నారు. అరకొరగా శిక్షలు పడుతున్నట్టు సమాచారం. ఇదంతా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగానే ఉంటుంది. అయితే పట్టుబడ్డవారిలో పట్టభద్రులు కూడా ఉండటం శోచనీయం. ఈ విషయం ముదిరి పాకానపడుతున్నదేమోనన్న ఆందోళనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
గంజాయిపై జంగ్ (యుద్ధం) చేయాలని చెప్పారు. అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. అక్రమ పనిగా గుడుంబాను మట్టుపెట్టాల్సిందేనని తెలిపారు. ఈ పీడను తొలగించకపోతే చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ గంగలో కలిసిపోతారు అన్న అర్థంలో మాట్లాడారు. మంచిదే. ఆచరణలో కదా ఆ చిత్తశుద్ధి తేలేది. పొరుగునున్న ఆంధ్రప్రదేశ్ కూడా ఇందుకు ఏమీ తీసిపోలేదు. అసలు యావత్ భారతదేశమే మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారిందని అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటి 2018లోనే తెలియజేసింది.
ప్రపంచ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో ఆరుశాతం అంటే మూడువందల టన్నుల గంజాయి భారతదేశం నుండే 2016లో పట్టుబడిందని, 2017లో అది 20శాతానికి పెరిగిందని పేరన్కొన్నది. ఇప్పుడది 40శాతానికి ఎగబాకి ఉండవచ్చని అంచనా. ఇక హెరాయిన్ అయితే మరీ ఘోరం. వెయ్యిటన్నుల వాడకం. వేలాది కోట్ల రూపాయలు హెరాయిన్ పట్టుబడుతున్నది. దేశవ్యాప్తంగా 186జిల్లాల్లో నాలుగు లక్షల మందిని సర్వే చేస్తే చెదపుట్టల్లాగా విషయాలన్నీ బయటకొస్తున్నాయి. నల్లమందు గురించి చెప్పే పరిస్థితి లేదు. మూడు కోట్ల మంది దాని విష కౌగిట్లో చిక్కుకున్నారు.
గల్ఫ్ దేశం ఒమెన్‌లో గతంలో దీని సాగు కేవలం ఎనిమిది ఎకరాలే. మరిప్పుడు 60లక్షల ఎకరాల్లో భారీ పంటగా మారింది. భారత్‌తో సహా అమెరికా, అఫ్ఘన్, టర్కీ, మయన్మార్, బల్గేరియా మొదలైన దేశాల్లో వాటి వాడకం అంతకంతకు పెరిగిపోతున్నది. ఉగ్రవాద ఘాతుక చర్యలతో సహా, మాఫియా డాన్ల ముఠాచర్యలకు వీటి చీకటి వ్యాపారమే కీలకమైన ఆదాయవనరుగా ఉన్నట్టు మాదక ద్రవ్యాల ప్రపంచ అధ్యయన నివేదిక ఏనాడో తేటతెల్లం చేసింది. ఐక్యరాజ్యసమితి ధృవీకరించింది. అయినా మన పాలకులకు చీమకుట్టినట్టు లేదు సరికదా అంతకంతకూ ఆ ఊబిలోకి కూరుకుపోతున్నారు. కారణాలు ఏమైనా మన యువత ఈ మత్తు బలిపీఠమెక్కుతున్నదనేది వాస్తవం.
అన్ని ఖండాల్లోని వర్థమాన దేశాలను ఈ చీకటి వ్యాపారం నేడు కమ్ముకుంటున్నది. కొన్ని దేశాల్లో ఈ డ్రగ్ మాఫియా రాజ్యాలను మార్చివేసే రాజ్యాంగేతర శక్తిగా కూడా ఎదుగుతున్నది. పాలకులకు, మాఫియాలకు, పెట్టుబడిదారులకు ఉండే లోపాయకారి సంబంధమే ఈ చీకటి వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నది. ఇది తెలుసుకోలేనంత అమాయక స్థితిలో ప్రజలు లేరు. అయితే పాలకులు బరితెగించారు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఇటీవల గుజరాత్ ముంద్రా పోర్టులో దాదాపు మూడుటన్నుల హెరాయిన్ పట్టుబడటం దేశమంతటిని నిర్ఘాంతపరిచింది. అఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ ద్వారా ముంద్రా పోర్టుకు చేరిన ఈ 20వేల కోట్ల ఖరీదైన హెరాయిన్ రవాణాకు విజయవాడ కంపెనీతో సంబంధం ఉండటం తెలుగువాడికి నోట మాటరాకుండా చేసింది. ముంద్రా పోర్టు ఆర్థిక దిగ్గజం అదాని చేతిలో ఉన్నది. ప్రభుత్వాల నడకలో అదాని పాత్ర ఎంతో తెలియంది కాదు. ఈ విషయం నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు బాలివుడ్ నటుడు షారూఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను ముంబైతీరం రేవుపార్టీలో నిందితునిగా మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్‌సిబి) అరెస్టు చేసింది. ఈ డ్రగ్స్ గురించి ఆర్యన్ వాట్సప్‌లో చాట్స్ జరిపినట్టు గుర్తించామని తెలుపుతూ కోర్టు బెయిల్ నిరాకరించింది.
వందల టన్నుల మాదక ద్రవ్యాల రహస్య వాణిజ్యంతో కోట్లాదిమంది యువతను మత్తులో ముంచడాన్ని నేరంగా చూడకుండా, ఓ హీరో కొడుకు వాడకాన్నే పదే పదే మీడియా చూపడంలోని ఔచిత్యాన్ని ప్రజామేధావులు, పాత్రికేయులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. గిట్టనివారిని వేదించడం, తప్పుడు కేసుల్లో ఇరికించి లొంగదీసుకోవడం బీజేపీ కుట్రపూరిత చర్యల్లో భాగమేనని, అసలు ముంద్రాపోర్టు తీగతోనే ఈ గంజాయి డొంకంతా కదులుతుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
'ఎద్దుపుండు కాకికి ముద్దు' అన్నట్టు అసలే కరోనా దెబ్బకు నిరుపేద, మధ్య తరగతి యువత ఉపాధి అవకాశాలు దెబ్బతిని, కుటుంబ భారంతో చావుబతుకుల మధ్య జీవన్మరణ పోరాటం చేస్తుంటే, దానినే పెట్టుబడిగా చేసుకుని ఇలా మత్తు, మాదకద్రవ్యాల, అశ్లీల, అనారోగ్య రొచ్చుల్లోకి దించడం పైశాచికత్వం కాక మరేమిటి?
సమస్య పరిష్కారానికి సంకల్పశుద్ధి లేకుండా, మూలాల జోలికి పోకుండా ఎంతసేపు తైతెక్కలాడినా తోలుబొమ్మలాటే కనిపిస్తుందే తప్ప ఆడించే చేతులు కనిపించవుగా... మత్తులో చిత్తైపోవడమా? మత్తును వదిలించుకుని ముందుకు పోవడమా..? ఏదో ఒకదారే మనముందు మిగిలింది.
- కె.శాంతారావు
సెల్: 9959745723