Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమెరికా వ్యాప్తంగా ఇటీవలి మాసాల్లో వేలాదిమంది తమ ఉద్యోగాలను వీడుతున్నారు. పని పరిస్థితులను మెరుగుపరచాలని, వేతనాలు పెంచాలని కోరుతూ సమ్మె బాట పడుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం వెనుక కార్మికుల్లో పెరుగుతున్న అసంతృప్తి ప్రతిబింబిస్తున్నది. గత నెల 14న లూసియానాలో వాల్‌మార్ట్‌లో పనిచేస్తున్న బెత్ మెక్‌గ్రాత్ అనే మహిళ ఫేస్బుక్లో ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. ''ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ అధికంగా పనిచేయాల్సి వస్తోంది, తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారు'' అంటూ మొదలెట్టిన ఆమె తన ప్రసంగంలో చాలా విషయాలు పంచుకున్నారు. 'మాతో మాట్లాడుతున్న రీతిలో మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడరనుకుంటున్నా' అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ జాబ్ నాకు అక్కర్లేదు అంటూ ఆమె తెగేసి చెప్పారు.
ఏడాది క్రితం టెక్సాస్‌కి చెందిన షానా రాగ్లాండ్ అనే మహిళ కూడా ఇదే రీతిలో వాల్‌మార్ట్ స్టోర్ ఇంటర్‌కంలో తన రాజీనామాను ప్రకటించారు. ఈ యువ మహిళల రాజీనామాలు వైరల్ కావడంతో అమెరికా కార్మికుల్లో నెలకొన్న అసహనం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. రాజీనామాలు చేసే వారిలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ఇలా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడాన్ని గ్రేట్ రిజిగేషన్గా ఆర్థికవేత్తలు అభివర్ణిస్తున్నారు. తాజాగా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన నివేదిక పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆగస్టు మాసంలో రికార్డు స్థాయిలో 2.9శాతం మంది కార్మికులు అంటే 43లక్షల మంది తమ ఉద్యోగాలను వీడారు. ఉద్యోగాలు చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ స్థాయిలో రాజీనామాలు చోటు చేసుకున్నట్లైతే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందనడానికి సంకేతంగా చూడవచ్చు. కార్మికులు మెరుగైన వేతనం పొందడానికి చేసే యత్నంగా భావించవచ్చు. ఉద్యోగ అవకాశాలు క్షీణించాయని నివేదికలు పేర్కొంటున్న తరుణంలో ఇలా జరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికా కార్మికుల్లో సగానికి పైగా మంది తమ ఉద్యోగాలను వీడి వెళ్లాలనుకుంటున్నారని హారిస్ పోల్‌లో వెల్లడైంది. యజమానులు ఏ విధమైన సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే తాము ఉద్యోగాలు వీడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు.
కార్మికుల్లో కనిపిస్తున్న ఈ ధోరణిని 'ఒక రకమైన కార్మిక విప్లవం'గా ఫోర్బ్స్ డాట్ కామ్ సీనియర్ కంట్రిబ్యూటర్ జాక్ కెల్లీ వ్యాఖ్యానించారు. చెడ్డవారైన బాస్‌లపై, వేతనాలు పెంచాలన్న కార్మికుల మాటే వినిపించుకోని కంపెనీల తిరుగుబాటుగా అభివర్ణించారు. 'క్విట్ మై జాబ్ పోస్ట్' ట్రెండింగ్‌లో ఉండడాన్ని, మెక్‌గ్రాత్, రాగ్లాండ్ వంటి మహిళా కార్మికులు చేసిన వీడియోలు వైరల్ కావడాన్ని ప్రస్తావిస్తూ ఆయన, మేనేజర్ల పెత్తనాన్ని ఇక ఎంత మాత్రమూ సహించేది లేదన్నారు. ఇదే సమయంలో సమ్మె చేయడానికి యూనియన్ సభ్యుల్లో పెరుగుతున్న విముఖతను చాలామంది ఆర్థికవేత్తలు విస్మరిస్తున్నారు. ఈ అంశాన్ని, రాజీనామాలను పక్క పక్కనబెట్టి చూడాల్సి ఉంటుంది. కార్మికుల బేరాసారాల శక్తిని దెబ్బతీసేందుకు దశాబ్దాల తరబడి కార్పొరేట్ల నేతృత్వంలో సాగిన కుతంత్రాల ఫలితంగా అమెరికాలో యూనియన్ల ప్రాతినిధ్యం చాలా తక్కువనే చెప్పాలి. ఈనాడు కేవలం 12శాతం మంది కార్మికులు మాత్రమే యూనియన్లలో ఉన్నారు. మరింతమంది కార్మికులు సంఘాల నుండి బయటకు వచ్చినట్లైతే జరిగే సమ్మెలు, సమ్మె చేసే కార్మికుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మెక్‌గ్రాత్, రాగ్లాండ్ వంటి యూనియన్లలో లేని కార్మికులు వ్యక్తిగతంగా రాజీనామాలకు పాల్పడే బదులు సహచరులైన కార్మికులను సంఘటితం చేసి ఉండవచ్చు.
కార్మికుల్లో పెరుగుతున్న అసంతృప్తిని పేర్కొంటూ సోషల్ మీడియా పోస్టులు వైరల్ అవుతున్నాయి. మూకుమ్మడి రాజీనామాలను, దశాబ్దాల తరబడి అమెరికాలో పాతుకుపోయిన పని సంస్కృతి పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కార్మికులతో కలిపి చూడాల్సి ఉంటుంది. విధానాల రూపకల్పనపై కార్పొరేట్ అమెరికాకు చాలా గట్టి పట్టు ఉంది. తనకు వచ్చే లాభాలను ప్రభుత్వాన్ని లాబీయింగ్ చేయడానికి ఖర్చు పెడుతుంది. కార్మికుల హక్కులను పణంగా పెట్టి మరిన్ని లాభాలు జుర్రుకోడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో యూనియన్ల శక్తి సామర్థ్యాలు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న ఆర్థిక అసమానతలతో లింక్ చేసినప్పుడే ఇది అర్థమవుతుంది. కార్మికులు తమ శక్తిని పెంచుకోవడానికి యత్నిస్తుండడంతో కార్పొరేట్ అమెరికా తీవ్ర కలవరం చెందుతోంది.
-ఫీచర్స్ అండ్ పాలిటిక్స్