Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లఖింపూర్ స్థానిక న్యాయస్థానం కేంద్ర మంత్రి అజరు మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాకు బెయిల్ కోసం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈ సంఘటనకు సంబంధించిన కొంత మంది నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్బంధంలో ఉంచారు. రైతులు, జర్నలిస్టులను ఉద్దేశపూర్వకంగానే వాహనంతో గుద్ది వారి మరణానికి కారణం అయ్యారనేది ఆరోపణ. నిందుతులే ఆ ఘటనకు కారకులు. ఈ సంఘటన జరిగినప్పుడు తీసిన వీడియో దృశ్యాలను చూసి సామాన్య ప్రజానీకం అవాక్కయ్యారు. కొద్దిమంది బీజేపీ కార్యకర్తలు కూడా చనిపోయారనే నిజం చాలా ఆందోళనకరం, విచారకరం. ఈ సంఘటన తరువాత, ఉత్తరప్రదేశ్ న్యాయశాఖా మంత్రి బ్రజేష్ పాఠక్, బీజేపీ కార్యకర్తల కుటుంబాలను సందర్శించాడు కానీ, ఈ సంఘటనలో ప్రాణాలను కోల్పోయిన అమాయక రైతుల కుటుంబాలను మాత్రం సందర్శించలేదు.
ప్రజలచేత ఎన్నికయిన ఒక ప్రభుత్వం, దానిని నడిపించే మంత్రులు వారి రాజకీయ విశ్వాసాలపైన ఆధారపడి కాకుండా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన ఒక మంత్రి త్రికరణశుద్ధిగా అలాంటి ఒక నైతిక పరివర్తను కలిగి ఉండడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకమైన విషయం. స్వాతంత్య్రం సాధించిన తరువాత స్వాతంత్య్రోత్సవాల సందర్భంగా దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాట్లాడుతూ.. ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ అది కాంగ్రెస్ పార్టీ నాయకుల నియంత్రణలో ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ విశిష్ట లక్షణం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రతీ పాలక ప్రభుత్వానికి అన్వయించాలి. కానీ ప్రజాస్వామ్య సంక్షోభ సమయంలో, అందరికీ ఆమోదయోగ్యమైన, ఇంతమంచి విభజన అస్పష్టంగా, కనపడకుండా కనుమరుగవుతుంది. అదే ప్రభుత్వం రాజకీయ పార్టీతో గుర్తించబడుతుంది. అధ్వాన్నమైన విషయమేమిటంటే, ఆఖరికి రాజకీయ పార్టీలు కూడా ఒక వ్యక్తి స్థాయికి దిగజారి, వ్యక్తిని దేశానికి సమానం చేసి కీర్తిస్తాయి. ఒక్కసారి 1975-77 ఎమర్జెన్సీకి ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుడు డీ కే బారువా రూపొందించిన ''ఇండియానే ఇందిరా, ఇందిరే ఇండియా'' అనే నినాదాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ప్రస్తుతం దేశంలో రాజకీయ విగ్రహారాధన పునరావిర్భావం జరుగుతుంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో న్యాయశాఖా మంత్రి వ్యవహరించిన విధంగా, కేబినెట్ మంత్రులు కూడా పక్షపాత ధోరణితో రాజకీయ నాయకులుగా వ్యవహరించే పరిస్థితులకు దారి తీస్తుంది. ఇది ప్రజాస్వామ్య విలువలు దిగజారాయనడానికి ఒక సూచిక. 2014 ప్రారంభం నుండి కేంద్ర ప్రభుత్వం ''స్థిరంగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, కార్యనిర్వహక జవాబుదారీతనాన్ని కోరే వ్యవస్థలను ఒక క్రమపద్ధతిలో బలహీనపరిచే చర్యలను పెంచుతూ వస్తుందని'' ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన తరుణభ్ ఖైతాన్ పేర్కొంటాడు. ఉత్తరప్రదేశ్, అసోం, గుజరాత్ రాష్ట్రాలలో ఖైతాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి ప్రజాస్వామిక అస్థిరత్వం యొక్క తీవ్ర ప్రభావాలు పైన తెలిపిన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సమన్యాయ పాలనను పెకిలించివేయడంలో స్పష్టంగా వ్యక్తం అయ్యాయి.
రాజ్యాంగబద్ధమైన అభిప్రాయాలను నిరర్థకం చేసే చట్టం అమలు భావనను మార్చిన తీరును లఖింపూర్ ఘటన రుజువు చేస్తుంది. ఈ సంఘటన నేరపూరితమైన రాజకీయాలకు మించిన విషయాలను మనకు చెపుతుంది. 2014లో మనోజ్ నారులా కేసులో ''నేరపూరితమైన రాజకీయాలు పవిత్రమైన ప్రజాస్వామ్యానికి ఒక శాపం'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తీర్పులో న్యాయస్థానం రాజ్యాంగ నీతిని, మంచి పాలనను గురించి నొక్కి వక్కాణించింది. ''ప్రజల విశ్వాసం మంచి పాలనా భావాల మూలాల్లోనే దాగి ఉంటుంది. మంచి పాలన అంటే పౌరహక్కులంటే గౌరవ భావం కలిగి ఉండడం, ఏ ప్రభుత్వ చర్యలలోనైనా ప్రాథమిక హక్కులను, చట్టబద్ధమైన హక్కులను, అలిఖిత రాజ్యాంగ విలువలను, వ్యవస్థల సమగ్రతను గౌరవించడం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే విషయం గురించి ఉపదేశాలు ఇవ్వడం అని అర్థమని'' న్యాయస్థానం పేర్కొంది.
ఉన్నావో నుంచి హత్రాస్ వరకు జరిగిన అనేక ఇతర సంఘటనలతో పాటు లఖింపూర్ ఘటన, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేరాల రేటు పెరుగుతుందని రుజువు చేయడమే కాక, అలాంటి సంఘటనల పట్ల పాలనా వ్యవస్థ తీరును కూడా బట్టబయలు చేసింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2020లో ఉత్తరప్రదేశ్ అత్యధిక హత్య కేసులను(3779) నమోదు చేసుకుంది. చట్టం అమలు ప్రక్రియ తరచుగా వెనుక సీటులోనే ఉంటుంది. లఖీంపూర్ ఘటనలో నిందారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను నిర్భంధంలోకి తీసుకునేందుకు కూడా ఉన్నత న్యాయస్థానం మందలించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
అదే రాష్ట్రంలో జర్నలిస్టులు వారి విధులను నిర్వర్తిస్తున్న సందర్భంలో అరెస్ట్ చేసి, చట్టవ్యతిరేక చర్యల నివారణా చట్టం (ఉపా) లాంటి అనాగరిక చట్టాలను ప్రయోగించి, నిర్బంధంలో ఉంచారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలను వ్యక్తం చేస్తున్నవారు కూడా అదే విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా బూటకపు ఎన్కౌంటర్ మరణాలు, నిఘా పర్యవేక్షణలు మామూలైపోయాయి. దాదాపుగా, ప్రజలు ఒక ఆందోళన చేయడానికి ఒక్కచోటుకు చేరే ప్రతీ సందర్భంలో వారు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ముద్ర వేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 144వ సెక్షన్ను ప్రయోగిస్తున్నారు. 2020లో జాతీయ భద్రతా చట్టం కింద 139 మందిని జైళ్ళలో నిర్భంధిస్తే, వారిలో 76మంది గోవధ చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నవారని సామాజిక కార్యకర్త హర్షమందిర్ పేర్కొన్నాడు. 'లవ్ జీహాద్' ఆరోపణలు చేస్తూ అనేక మంది జంటలను అరెస్ట్ చేశారు. హత్యలు, అత్యాచారాలు లాంటి నీచమైన నేరాలకు పాల్పడిన రాష్ట్రం వ్యక్తిగతమైన సాన్నిహిత్యాన్ని ఒక తీవ్రమైన నేరంగా ముద్ర వేయడానికి అత్యుత్సాహాన్ని చూపిస్తుంది. అధికారంలో ఉన్నవారి అవసరాలకు అనుగుణంగా చట్టాలను దుర్వినియోగం చేయడం లేదా అసలు చట్టాలను వినియోగించక పోవడం లేదా చట్టాలను పరిమితంగా ఉపయోగించడం నేటి ఉత్తరప్రదేశ్ కొత్త న్యాయ విధానం.
అసోం, త్రిపుర లాంటి రాష్ట్రాలు కూడా అదే విధానాన్ని అనుసరించాయి. అసోం రాష్ట్రంలోని దారంగ్ జిల్లాలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేసుకోండి. అధికారిక ఫొటోగ్రాఫర్, అతడు ఒక వ్యక్తి శవాన్ని తన్నుతున్నట్లు చూపించే వీడియో ఇబ్బందికరమైన సమయంలో పరిస్థితులను తెలియజేస్తుంది. నిజమైన ప్రజాస్వామ్యం లేకుండా మనిషికి గౌరవం ఉండదు. ''సమానమైన గౌరవం, ఎదుటివారిని రక్షించాలనే కోరిక సమన్యాయ పాలనకు ఉండే ముఖ్య లక్షణాల''ని న్యాయవేత్త, రోనాల్డ్ డ్వార్కిన్ అభిప్రాయపడ్డారు. సమానత్వ భావనకు,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు చర్చించడానికి వీలులేని మూడు కోణాలు.
న్యాయవేత్త, ఏ వీ డైసీ వివరించినట్లు రాజ్యాంగానికి లోబడి ఉండే ప్రజాస్వామ్యాలలో, సమన్యాయ పాలన అధికార నిరంకుశత్వాన్ని తిరస్కరిస్తుంది. చట్టం నేడున్న రాజకీయాలకు మించి ఉన్నతంగా ఉండాలి. కానీ ఉత్తరప్రదేశ్ నమూనాలో చట్టం రాజకీయ అధికారం చేతిలో కేవలం ఒక ఆయుధం మాత్రమే. లఖీంపూర్ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థల వైఫల్యాల గురించి కొన్ని గ్రంథాలకు సరిపోయే సమాచారాన్ని అందిస్తుంది.
(''ఇండియన్ ఎక్స్ ప్రెస్'' సౌజన్యంతో)
(వ్యాసకర్త సుప్రీంకోర్టు న్యాయవాది)
అనువాదం: బోడపట్ల రవీందర్, సెల్: 9848412451.
- కాళీశ్వరం రాజ్