Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టి.ఎస్.ఆర్.టి.సి. పయనం ఎటు?
తార్నాక ఆసుపత్రిలో ఇటీవల అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆసుపత్రిలోని కొన్ని గదులను ప్రయివేటు హాస్పిటల్వారు స్వాధీనం చేసుకోవడం, ప్రయివేటువారి ఆధ్వర్యంలో ఐ.సి.యు.ను సుమారు 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 24/7 మందుల సరఫరా, వైద్యం, పరీక్షల నిర్వహణ ఉంటుందంటున్నారు. తార్నాక ఆస్పత్రి స్థలాన్ని కూడా వివిధ అభివృద్ధి పేర్లతో ప్రయివేటు వారికి అప్పగించే సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. వీటిపట్ల కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాపితంగా ఉన్న ఆర్టీసీ విలువైన భూములను కూడ సంస్థ అభివృద్ధి పేరుతో ప్రయివేటు వారికి ధారాదత్తం చేయాలనే ఆలోచన యాజమాన్యం చేస్తున్నట్లుగా అనేక వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే రెండు డిపోలున్నచోట ఒకే డిపో చేయాలని, వినియోగంలోలేని స్థలాలపేరుతో ముషీరాబాద్, కూకట్పల్లి, మియాపూర్ లాంటి చోట్ల ఉన్న విలువైన భూములను కూడ అభివృద్ధి ముసుగులో ప్రయివేటు వారికి అప్పగించే సన్నాహాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ పాటికే హైదరాబాద్-3, రాణిగంజ్, హయత్నగర్ లాంటి డిపోల నుండి సర్వీసులను ఇతర డిపోలకు బదిలీ చేయడం ప్రారంభమైనట్లు కూడ తెలుస్తున్నది.
కార్మికులలో వ్యతిరేకత అభ్యంతరాలు లేకుండా చేయడానికి, కార్మికులను మంచి చేసుకునే ప్రయత్నాలలో భాగంగానే 1వ తేదీననే జీతాలు చెల్లించడం, పి.ఎఫ్., సిసిఎస్, ఎస్ఆర్బిఎస్, రిటైరైన కార్మికుల బకాయిలలో కొంత మేర చెల్లించడం లాంటి తాయిలాల ప్రక్రియ మొదలైనట్టుగా కార్మికులు అనుమానిస్తున్నారు. తుఫానుకు ముందు ఏర్పడే ప్రశాంత వాతావరణం లాగా ఈ పరిణామాల వెనుక కథ నడుస్తున్నదనే అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నింటినీ నిశితంగా పరిశీలించి చూసిన వారికి టిఎస్ఆర్టిసి భవితవ్యం, కార్మికుల భవితవ్యం అంధకార బంధురం కాబోతున్నదనే భయాందోళనలు ప్రారంభమైనాయి. ఇటువంటి సమయంలోనే ఆర్టీసీ కార్మికులు మరింత అప్రమత్తంగా ఉంటూ నిరంతరం జరుగుతున్న పరిణామాలను జాగరూకతతో పరిశీలిస్తూ, సంస్థను కాపాడుకోవడానికి, సంస్థ ఆస్తులను రక్షించుకోవడానికి, తద్వారా మన ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు భగం కాకుండా కాపాడుకోవడానికి అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
తార్నాక ఆవిర్భావం : ఉమ్మడి రాష్ట్రంలోని ఎపిఎస్ఆర్టిసి తన సిబ్బందికి, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని, ఈఎస్ఐ నుండి మినహాయింపు తీసుకొని తనే స్వంతంగా జిల్లా కేంద్రాలలో డిస్పెన్సరీలను, రాష్ట్ర కేంద్రంలో తార్నాక ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకు అవసరమైన స్థలం కోసం ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ పెద్దలతో సంప్రదించి ఒప్పించింది. నాడు కార్మికుల జీతాల నుండి కూడ కొంత డబ్బు సేకరించి ఆసుపత్రిని నిర్మించారు. కాబట్టి ఇది కార్మికుల, ప్రజల ఆస్తి. దీనిని ప్రయివేటు వారికి అప్పగించే ప్రయత్నాలను కార్మికులు సహించరాదు. మెరుగైన వైద్యం కొరకు తార్నాకను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చాలని, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని, కార్మికులు, కార్మిక సంఘాలు అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలోనే యాజమాన్యం మొత్తం పరిస్థితిపై అధ్యయనం చేసి సవివరమైన నివేదిక కూడ సిద్దం చేసింది. దీని అమలు ఇష్టంలేని నాటి పెద్దలు దానిని బుట్టదాఖలు చేశారు.
ప్రతినెలా వైద్యం కోసం రిఫరల్ ఆసుపత్రులకు సుమారు రూ.3 కోట్లు చెల్లిస్తున్నారు. అంటే సంవత్సరానికి రూ.36కోట్లు. యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే ఇందులో ఒక్క సంవత్సరం డబ్బు ఖర్చు పెడితే మనమే స్వయంగా తార్నాకను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చుకొని కార్మికులకు మెరుగైన వైద్యం అందించవచ్చు. ఆ తర్వాత కార్మికుల పిల్లలకు వైద్య కళాశాలను కూడ అందుబాటులోకి తేవచ్చు. కార్మికులు ఎన్నో సంవత్సరాల నుండి పోరాడు తున్న ఈ అంశాలను పరిష్కరించకుండా ప్రయివేటు వారికి అప్పగించాలని చూడటం, వారికి ఇప్పుడందుతున్న ఈ మాత్రం వైద్యాన్ని కూడ దూరం చేయడమే.
డిపోలను తగ్గిస్తే ఆర్టీసీ లాభాలలోకి వస్తుందా : రోగం ఒకటైతే మందొకటి వేసినట్లున్నది ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన. తార్నాకను ప్రయివేటు వారికి అప్పగించడంతోపాటు, డిపోలను తగ్గించడం ద్వారా ఖర్చులను తగ్గించుకొని సంస్థను లాభాలలోకి తేవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా పత్రికలలో వచ్చింది. ఈ ఆలోచన తను కూర్చున్న కొమ్మను తానే నరుక్కోవడం అవుతుంది. సంస్థకు 85శాతం ఆదాయం ప్రయాణీకుల టిక్కెట్లు అమ్మడం ద్వారానే వస్తుంది. అందుకు ప్రయాణీకుల సంఖ్య పెరగాలి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రతి సంవత్సరం 12శాతం రవాణా సదుపాయాలు పెరగాలని అనేక సర్వేలు చెపుతున్నాయి. అదీకూడ ప్రభుత్వ రవాణా పెరిగినట్లైతే వాయు కాలుష్యం తగ్గి ప్రజారోగ్యం మెరుగువుతుంది. విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యి ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం పెరుగుతుంది. స్వంత వాహనాలు తగ్గి రోడ్ల వినియోగం తగ్గుతుంది. ప్రమాద మరణాలు తగ్గుతాయి. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఇప్పటికే ఈ అంశాలన్నీ అనేక సర్వేల నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇవన్నీ ''ప్రభుత్వ రవాణా'' ఆవశ్యకతను తెలియ జేస్తున్నాయి.
అందువలన డిపోలను కుదించడం అంటే మన ఎదుగుదలకు మనమే శిలువ వేసుకోవడంతప్ప మరొకటికాదు. మారుతున్న పరిస్థితులు, ప్రయాణీకుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టిఎస్ఆర్టిసి భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి డిపోల మూసివేత, ప్రయివేటు వారికి అప్పగించడం అత్యంత ప్రమాదకరం. అందుచేత ఖాళీ స్థలాలు ఆర్టీసీ యాజమాన్యం సక్రమంగా, ప్రయోజనకరంగా, లాభదాయకంగా వినియోగించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. తెలివి తేటలు, మేధోసంపత్తి, నైపుణ్యం కలిగిన అనేకమంది ఉద్యోగులు, అధికారులు టిఎస్ఆర్టిసికి తరగని ఆస్తులుగా ఉన్నారు. వారిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. ఆర్టీసీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో, పారదర్శకంగా వ్యవహరించాలి. జరుగుతున్న వాస్తవాలను, తమ ప్రణాళికలను కార్మికుల ముందు, ప్రజల ముందు ఉంచి అందరి ఆమోదంతో సరైన దిశలో చర్యలు తీసుకోవడమే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది.
- నిర్మలారావు