Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు ముల్లోకాలు వెదుకు తున్నాడు. కాని ఫలితం లేదు. తిరిగి తిరిగి అలసిపోయాడు. భూలోకానికి తిరిగి వచ్చి అడవుల్లో కూడా వెదికాడు. అయినా లాభం లేదు! ఇక ఓపిక లేక ఒక మర్రిచెట్టు కింద కూలబడ్డాడు! బాగా అలసిపోయాడేమో నిద్రలోకి జారిపోయాడు. కాని అంతలోనే ఎవరో పిలిచినట్లై లేచి కూర్చున్నాడు. ఎదురుగా నర్సింహాస్వామి, చెంచులక్ష్మీ సమేతంగా ఉన్నాడు. పక్కనే ప్రహ్లాదుడు కూడా ఉన్నాడు.
''నమో నారసింహా! ధన్యుడను నీ దర్శనం కోసమే ముల్లోకాలు తిరిగి అలసిపోతిని, నీవెమో అడవుల్లో దర్శనమిస్తున్నావు. పైగా ఎన్నడూ లేనిది నీ పరమ భక్తుడు ప్రహ్లాద సమేతంగా విచ్చేశావు. ఏమిటీ చిత్రం తండ్రీ!'' అన్నాడు నారదుడు.
''నేను చిత్ర విచిత్రాల గురించి తర్వాత చెబుతాను. కాని నీవు నాకోసం ఎందుకు వెదుకుతున్నావో ముందు చెప్పు!'' అన్నాడు నర్సింహస్వామి.
''ఏమీలేదు స్వామి! ఇటీవల తిరుపతి వెళ్ళి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాను. ఆయన చాలా బాధతో ఉన్నాడు. పైగా ఆయనలో కొంత అసూయ కూడా పొడసూపినట్లున్నది!'' అన్నాడు నారదుడు.
''అసూయ ఎందుకు నారదా!'' అడిగాడు నర్సంహస్వామి నవ్వుతూ
''ఎందుకేమిటి స్వామి! తిరుమలను మించిపోయేలా యాదగిరి గుట్టను కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నాడు. ఇందుకోసం కిలోల కొద్ది బంగారాన్ని కూడా విరాళం సేకరిస్తున్నాడు. వందల కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చు చేస్తున్నాడు. తొందరలోనే తిరుమలను యాదగిరి మించిపోతుందేమోననీ, తన వద్దకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గిపోతుందేమోననీ, తనకు నీవు పోటీగా మారావని వెంకటేశుడు ఆందోళన చెందుతున్నాడు! పైగా కేసీఆర్ వరస చూస్తుంటే ప్రహ్లాదుడిని మించిన భక్తి, ప్రవక్తులు కనబర్చుతున్నాడు'' అన్నాడు నారదుడు.
''అయితే నాకు వెంకటేషుడికి తగాదా పెట్టదల్చుకున్నావన్న మాట!'' అన్నాడు నర్సింహస్వామి.
''అయ్యో! ఎంతమాట స్వామి! మీ ఇద్దరి మధ్య నేను తగాదా పెట్టగలనా? పైగా మీ ఇద్దరికీ తేడా ఏమున్నది? మీరిద్దరూ విష్ణుమూర్తి అంకే కదా! ప్రజలు అనుకుంటున్న మాటలకు వెంకటేశుడు అలా అనుకుని ఉండవచ్చునని అన్నాను. అంతే స్వామి!'' అన్నాడు నారదుడు.
''గుళ్ళూ, గోపురాలు నాకెందుకు నారదా! భక్తి అనేది హృదయాలలో ఉండవలసినది గాని, ప్రదర్శనకు పెట్టవలసినది కాదు! ప్రజలు తమకు ఇష్టం వచ్చిన దేవుడి వద్దకు వెళతారు. అంతేకాని వారిని బలవంతాన మార్చుట తగదు కదా!'' అన్నాడు నర్సింహస్వామి.
''అదేమిటి స్వామి! అట్లా మాట్లాడుతారు? తిరుపతిని మించి యాదగిరి గుట్టను అభివృద్ధి చేయటం ద్వారా కేసీఆర్ మీకు ఎంతో సేవ చేస్తున్నాడు. అతడు మీ ఆదరణకు పాత్రుడు కావల్సినవాడు! ఇంకా చెప్పాలంటే ప్రహ్లాదుడి కన్నా ఎంతో మెరుగు. హిరణ్యకశ్యపుడిని అంతమొందించాక ప్రహ్లాదుడిని మీరు ముల్లోకాలకు అధిపతినిచేసితిరి! కాని ఒక్క లోకంలో కూడా మీకో చిన్న గుడిని ప్రహ్లాదుడు కట్టంచలేకపోయాడు! కానీ కేసీఆర్ చూడండి. కేవలం ఐదేండ్ల పాటు ఉన్న పరిమిత అధికారంతో మీకు ఎంతో సేవ చేస్తున్నాడు. అంతటి భక్తుడిని మీరు తక్కువ చేసి మాట్లాడటం ఏమీ బాగాలేదు!'' అన్నది చెంచులక్ష్మి నిష్టూరంగా!
నర్సింహాస్వామి చిన్నగా నవ్వాడు.
''ఎంతమాట చెంచులక్ష్మీ! కేసీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి! నీవు చెప్పినట్లే ఐదేండ్లు ప్రజలకు సేవ చేయవల్సిన బాధ్యత గలవాడు. పైగా తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినప్పుడు ప్రజలకు ఎన్నెన్నో వాగ్దానాలు చేశాడు. అనుకున్నట్లే తెలంగాణా సిద్ధించింది! తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాల అమలుకు రెండోసారి అధికారాన్ని కేసీఆర్‌కే ప్రజలు అప్పగించారు. ఆ బాధ్యత పక్కనపెట్టి గుళ్ళూ, గోపురాలగోల ఎందుకు దేవీ!'' ప్రశ్నించాడు నర్సింహ్మస్వామి.
''గుడి కట్టించటం నేరమా స్వామీ!'' అన్నది మరింత నిష్టూరంగా చెంచులక్ష్మి.
''గుడి కన్నా ముఖ్యమైనవి మరెన్నో ఉన్నాయి దేవి! ప్రజలు తమ సమస్యలు తీర్చమని కోరుకునేందుకు గుళ్ళకూ, గోపురాలకు వస్తారు. ఉద్యోగాలు దొరకాలని, ఇళ్ళు కట్టించుకోవాలని, ప్రమోషన్లు దొరకాలని, పిల్లలు గొప్ప చదువులు చదవాలని, జీవితంలో స్థిరపడాలని, భూమి లేనివారు భూమి కొనాలని ఇలాంటి కోరికలు కోరుకుంటారు. గతంలో 10శాతం భక్తులు మాత్రమే ఇలా కోరుకునే వారు. ఇప్పుడేమో అందరూ కోరుకుంటున్నారు! వారందరి కోరికలు తీర్చుట నా వల్ల కావటం లేదు!...'' అంటుండగానే చెంచులక్ష్మి అడ్డం వచ్చింది!
''నేను అడిగింది ఒకటి, మీరు చెప్పేది మరొకటి! ఎందుకిలా దారి మళ్ళించుతారు? కోపంగా అడిగింది చెంచులక్ష్మి.
''కోపం ఎందుకు దేవి? సాంతం సావధానంగా విను! అన్నీ అర్థమవుతాయి! ప్రజలకు కోరికలు ఉండటం సహజం! అవసరం కూడా. కాని ప్రభుత్వాలే ప్రజల కోరికలు తీర్చకుండా నాకు అడ్డుకట్టలు వేస్తున్నారు. ఉద్యోగాలు కావాలన్న కోరిక తీర్చాలంటే ప్రభుత్వరంగ సంస్థలు ఉండాలి. కాని ప్రభుత్వరంగ సంస్థలను, కార్పొరేట్లకు అగ్గువకు అమ్ముకునేది ప్రభుత్వాలు! మరి నేనెలా ఉద్యోగాల కావాలన్న కోరిక తీర్చగలను? భూమిలేని పేదలకు భూమి దొరికితే జీవితంలో స్థిరపడతారు. మరి ప్రభుత్వం భూపంపిణీ చేయటం మాని, ఉన్న భూములే లాక్కుంటుంది! భూమి కొనటానికి కూడా పేదలకు అవకాశం లేని విధంగా ధరలను పెంచుతున్నారు. నిరుపేదల కోరికలు తీర్చగల అవకాశం నాకెక్కడిది?'' అన్నాడు నర్సింహస్వామి.
''ప్రజల కోరికలకు, ప్రభుత్వం బాధ్యతలకు సంబంధం ఏమిటి? ఈరెండింటికీ మీ గుడికి ఉన్న సంబంధం కూడా ఏమిటో సెలవు ఇవ్వండి దేవా?'' అన్నాడు నారదుడు.
''అదే చెప్పబోతున్నాను నారదా! ప్రజలు నా గుడికి వచ్చి కోరుకునే ప్రతి కోరికా ప్రభుత్వాలు తీర్చగలిగినవే. తెలంగాణలో ప్రజల కోరికలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దినదినమూ పెరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వం తన బాధ్యత గుర్తెరగాలి. దళితులకు మూడెకరాల భూమి పంచుతానని కేసీఆర్ చేసిన వాగ్దానం నెరవేర్చితే దళితుల సమస్యలు 90శాతం పరిష్కారం అవుతాయి! నా గుడికి రావల్సిన అవసరమే రాదు కదా! రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలు అన్నీ కేసీఆర్ భర్తీ చేస్తే, నిరుద్యోగులు నా గుడికి ఎందుకు వస్తారు! మొత్తం నేను చెప్పదల్చుకున్నదేమిటంటే.. కేసీఆర్ తాను చేసిన వాగ్దానాలు అన్నీ నెరవేర్చితే ప్రజలు గుళ్ళూ గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు. కాని తాను చేయవల్సిన పనిని మానేసి, ప్రజలను గుళ్ళూ, గోపురాలవైపు ఆధ్యాత్మికవైపునకు దారి మళ్ళించుతున్నారు! ఇదీ అసలైన సమస్య! ఇది ప్రజలకు అర్థమయ్యేలా నీవే చెప్పుము నారదా!'' అన్నాడు నర్సింహ్మాస్వామి!
''అవశ్యం! మీ ఆజ్ఞ శిరసావహిస్తాను! మరొక్క సందేహం నివృత్తి చేయండి! ఇంత గొప్ప గుడి కట్టించి, కిలోల కొద్ది బంగారం మీకు సమర్పిస్తున్న కేసీఆర్‌కు ఏ ఫలితముదక్కనుంది స్వామి?'' అడిగాడు నారదుడు.
చిన్నగా నవ్వాడు నర్సింహ్మాస్వామి!
''చేసిన వాగ్దానాలు విస్మరించి, గుళ్ళూ, గోపురాలు మీద శ్రద్ధ పెట్టినందుకు తక్షణ ఫలితాన్ని ప్రజలే అందించారు. దేశంలోనే ప్రజాగ్రహం పొందిన ముఖ్యమంత్రి! అన్న ఫలితం అందింది కదా! ప్రజాస్వామ్యంలో ఏ ఫలితాన్నైనా ప్రజలే అందిస్తారు నారదా! నేను నిమిత్త మాత్రుడను సుమా!'' అంటూ నర్సింహ్మస్వామి, చెంచులక్ష్మి, ప్రహ్లాదుడూ మాయమైపోయారు!
-ఉషాకిరణ్