Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత 20 సంవత్సరాల నుంచి ఎయిర్ ఇండియా అమ్మకం వాయిదా పడుతుండగా... ఈ నెల 15న అమ్మకపు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ముగించింది. 67సంవత్సరాల తర్వాత టాటా కంపెనీ తిరిగి ఎయిర్ ఇండియా యాజమాన్యం పగ్గాలు చేపట్టిందని పలు పత్రికలు ప్రశంసించాయి. ప్రభుత్వం ఎయిర్ ఇండియాను టాటా కంపెనీకి రూ.18 వేల కోట్లకు అమ్మింది. వెంటనే రూ.2700 కోట్లు చెల్లిస్తాననగా అందుకు కేంద్రం ఆమోదించింది. రూ.15,300 కోట్లు బ్యాంకుల లోను టాటా కంపెనీ వాయిదాల పద్ధతుల్లో చెల్లిస్తుంది. రూ.2700 కోట్లు కూడా బ్యాంకులే అప్పులిస్తాయి. ఇదీ వీరి అమ్మకపు నాటకం. ఎయిర్ ఇండియా అమ్మకంలో ఉన్న అసలు బాగోతాన్ని పరిశీలించడం ఎంతైనా అవసరం. త్రివర్ణ పతాకాన్ని గగనతలాన రెపరెపలాడిస్తూ ప్రపంచంలోని అన్ని దేశాల్లో కనిపించే ఏకైక విమాన కంపెనీ ఎయిర్ ఇండియా మాత్రమే. దేశభక్తి గురించి గొప్పలు చెప్పే బీజేపీ ప్రభుత్వం ఆకాశవీధిలో త్రివర్ణ పతాకం ఎగరకుండా రెక్కలు విరిచేసింది. 1950 నుంచి టాటా ఆధ్వర్యంలో నడిచిన సంస్థలో అభివృద్ధి లేకపోవడంతో 1953లో కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. అటువంటి సంస్థను మోడీ ప్రభుత్వమిప్పుడు ప్రయివేట్ టాటా కంపెనీకి కారుచౌకగా కట్టబెట్టింది.
ఎయిర్ ఇండియా దేశానికి చేసిన సేవలు అమోఘం. ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఉచిత సేవలందించిన ఏకైక కంపెనీ అది. గల్ఫ్ యుద్ధ కాలంలో లక్ష మందిని 440సార్లు విమానాల ద్వారా భారత దేశానికి చేర్చిన చరిత్ర ఉంది. కోవిడ్ సమయంలో ప్రపంచంలోని అత్యధిక దేశాల నుంచి ప్రజలను భారత దేశానికి చేర్చింది ఎయిర్ ఇండియా. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రజలను క్షేమంగా కాపాడిన ఏకైక సంస్థ ఎయిర్ ఇండియా.
గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, నేడు అధికారంలో ఉన్న బీజేపీలు పోటీపడి మరీ ఎయిర్ ఇండియాను ప్రయివేట్‌కు ఇవ్వాలని కుట్ర చేశాయి. ఈ కుట్రలో భాగంగానే 2005లో అవసరం లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్ ఇండియా కంపెనీకి 68 బోయింగ్ విమానాలు, 43 ఇండియన్ ఎయిర్‌బస్ విమానాలు కొనుగోలు చేయించింది. ఆనాడు ఎయిర్ ఇండియా వార్షిక ఆదాయం రూ.7 వేల కోట్లు మాత్రమే ఉన్నా విమానాల కొనుగోలుకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేయించింది. అవసరం లేకపోయినా విమానాలు కొనడం వల్ల నష్టాలు రావడం ప్రారంభమయ్యాయి. 2006 సంవత్సరంలోనే రూ.10 వేల కోట్ల నష్టాలు చవిచూసింది. ఈ నష్టాలు పెరిగి రూ.67 వేల కోట్ల అప్పుల ఊబిలో దింపడానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణం. ప్రభుత్వ రంగంలోని విమాన రంగాన్ని బలహీనపర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లను (విదేశాలకు వెళ్లే విమానాలు, స్వదేశాల్లో తిరిగే విమానాలు) కలిపివేసింది. రెండు విమాన కంపెనీలను ఒకేసారి ప్రయివేట్ వారికి చౌకగా అమ్మేయాలనే దురుద్దేశంతోటే ఈ మెర్జర్ జరిగింది.
ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్లే అనుమతులు, దిగే ప్రదేశాలకు అనుమతి ఉన్న ఏకైక కంపెనీ ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియాకు ఉన్న ల్యాండింగ్ ప్రదేశాల విలువే సుమారు రూ.18 వేల కోట్లకు ఉంటుంది. అంటే ఒక్కశాతం కంటే తక్కువ విలువకు ఎయిర్ ఇండియాను అమ్మిందని ఆర్థికవేత్తల విశ్లేషణ. 2017లో పి.ఎం.ఓ ఆఫీసు సలహతో నిటి అయోగ్ ఎయిర్ ఇండియా అమ్మకానికి తెరలేపింది. ఎయిర్ ఇండియా వాటాల్లో 76శాతం రూ.49 వేల కోట్లకు అమ్ముతామని, మిగిలిన 24శాతం కేంద్ర ప్రభుత్వం తమ వాటాగా ఉంచుకుంటామని 2018లో ప్రకటించింది. ప్రయివేట్ కంపెనీలు కుమ్మక్కై ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. దానితో కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుని నూరుశాతం వాటాలు అమ్మడానికి సిద్ధమైంది. కార్పొరేట్లకు అనుకూలంగా వారు పాడిందే బీజేపీ పాట అని ఎయిర్ ఇండియా అమ్మకంలో రుజువైంది.
టాటా కంపెనీ విమాన సర్వీసులను నడపడంలో విఫలమైందనేది గత చరిత్ర. నేడు కూడా టాటా కంపెనీ కొన్ని విమాన సర్వీసులు నడుపుతున్నది. విస్ట్రా (సింగపూర్‌తో కలిసిన జాయింట్ వెంచర్ 51.49 శాతం వాటాలు), ఎయిర్ ఏసియా ఇండియా అనే కంపెనీల్లో 84శాతం వాటాలున్నాయి. కాని ఈ కంపెనీలు అంత గొప్పగా నడవడంలేదని అందరికీ తెలుసు. అలాగే టాటా కంపెనీ దేశంలో పెద్ద పెట్టుబడిదారుడు. స్వాతంత్య్రం ముందు నుంచి వందల కంపెనీలకు ఆధిపత్యం వహిస్తున్నారు. తమ కంపెనీల్లో యూనియన్ లేకుండా చేయడంలో ఘనాపాటి. టాటా స్టీల్ కంపెనీల్లో మొట్టమొదటి యూనియన్ స్థాపించింది సుభాష్ చంద్రబోస్. ఆ యూనియన్ను లేకుండా చేయడానికి టాటా కంపెనీ సర్వ ప్రయత్నాలు చేసింది. కార్మికుల సభ జరుగుతుండగా లారీతో కార్మికులపై తొక్కించింది. పెట్టుబడిదారుల్లో తేడాలుంటాయని అనుకోవడం పొరపాటు. ఎయిర్ ఇండియాలో కార్మికులు సమ్మెలు చేస్తే ఎక్కువ జీతాలు వచ్చే పౖౖెలట్లు, ఎయిర్ హోస్టెస్‌లు సమ్మె చేస్తున్నారని వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రకటనలు చేసింది. శ్రీశ్రీ చెప్పినట్లు 'గనిలో, వనిలో, కాలేజీల్లో, కార్ఖానాల్లో శ్రమించే వారంతా శ్రమజీవులే''. విమానాల్లో పని చేసేవారు కూడా శ్రామికులే కాని పెట్టుబడిదారులు కారు. అత్యంత నైపుణ్యం కలిగిన వీరికి ఉండవలసిన ఉన్నత జీతాలు, సౌకర్యాలు కరువైనప్పుడు పోరాడకతప్పదు. కాని నేడు ఏ ప్రయివేట్ విమాన సంస్థలోను యూనియన్లను అనుమతించకపోవడం ప్రభుత్వ, కార్పొరేట్ అనుకూల విధానాలకు అద్దం పట్టినట్లుగా ఉంది.
దేశ సంపదను ప్రయివేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మడం బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానం. ఎయిర్ ఇండియాను అమ్మడం ద్వారా వారి విధానం పూర్తిగా అర్ధమవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముతాం లేదా మూసివేస్తాం అనే విధానం కార్పొరేట్ కంపెనీలకు కల్పతరువుగా మారింది. ఈ అమ్మాకాలను బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలకు విస్తరిస్తున్నది. 400 రైల్వే స్టేషన్లు, 90 పాసింజర్ రైళ్లు, 1400కి.మీల రైల్వే ట్రాక్, 265 గూడ్స్ షెడ్లు అమ్మకానికి పెట్టింది. 25 ఎయిర్ పోర్టులు, 262 పవర్‌గ్రిడ్ సబ్స్టేషన్లు, 120 బొగ్గు గనుల నిక్షేపాలు రాబోయే నాలుగు సంవత్సరాల్లో అమ్ముతామని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు కాకపోయినా ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టింది. 26,700కి.మీ జాతీయ రహదారి అమ్మకానికి పెట్టింది. ఒకవైపు పెట్రోలియం ధరలు పెంచడమే కాకుండా మరోవైపున రైళ్లు, విద్యుత్ వగైరా అన్ని ఛార్జీలు ఆకాశాన్నంటుతాయి. లక్షల మంది ఉపాధి కోల్పోతారు. రిజర్వేషన్ల అమలు ఉండదు. అన్నిటినీ ప్రయివేట్‌కు అప్పగిస్తే సామాన్య ప్రజలు సర్వం కోల్పోతున్నారు. ఎయిర్ ఇండియా, విశాఖ స్టీల్, విద్యుత్, ఇన్సూరెన్స్, బ్యాంకులు వగైరాలన్నింటి ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలి. బీజేపీ విధానాలను కార్మిక, కర్షక మైత్రితో తిప్పికొట్టడమే ఏకైక మార్గం. బీజేపీ విధానాలను ఓడించడమే ప్రజల సమస్యలకు పరిష్కారం.
- సిహెచ్ నర్సింగరావు