Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత దిగ్గజ పౌర విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఈరోజు టాటా కంపెనీ కి అమ్మడాన్ని ఎందరో కీర్తిస్తున్నారు. ఒక సంస్థను ఒక వ్యక్తి నడుపుకోలేక ఇతరులకు అమ్మివేస్తే ఆ వ్యక్తిని చేతగానివాడుగా పరిగణిస్తోంది సమాజం. కానీ ప్రభుత్వం ఎయిర్ ఇండియాను నడపలేక ప్రయివేటు వ్యక్తులకు అప్పగిస్తే, ప్రభుత్వాన్ని నిందించకుండా కీర్తించడం విడ్డూరం కాదా! అంతటితో ఆగక, ఇది ఘర్‌వాపసీ అంటూ టాటాల సంస్థ టాటాలకే చేరింది అని కూడా వక్కాణిస్తున్నారు! 1932లో జె.ఆర్.డి.టాటా ఎయిర్ ఇండియాను స్థాపించిన మాట వాస్తవమే. అప్పుడది ఒక నామమాత్రపు సంస్థ మాత్రమే. 1953లో జాతీయకరణ జరిగిన తర్వాత కదా దేశంలో అనేక పట్టణాలలో పేద ప్రజల నుంచి భూమిని సేకరించి ఎయిర్‌పోర్టులు నిర్మించి విమానయాన రంగం విస్తరణ జరిగింది. స్వాతంత్య్రానికి పూర్వమే 1940-45 ప్రాంతంలోనే, స్వాతంత్రం సాధించిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి రూపం ఇవ్వాలన్న దానిపై ఏర్పడిన బాంబే ప్లాన్‌లోని 20 మంది భారత ప్రముఖుల సలహాల మేరకే జాతీయకరణ అనే అంశం పుట్టుకొచ్చింది. ప్రయివేటు సంస్థలేవి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలిక ప్రాజెక్టులను నిర్మించలేవు కాబట్టి ప్రభుత్వమే హామీ ఇస్తూ చిన్న మొత్తాల రూపంలో సేకరించి దీర్ఘకాలిక ఎదుగుదలకు శ్రీకారం చుట్టాలని భావించినప్పుడే కదా ఈ జాతీయకరణ అనే అంశం బయటికి వచ్చింది. ప్రభుత్వమే ఏయిర్ పోర్టులను నిర్మించి, విమానాల కొనుగోళ్లకు నగదు సమీకరించి టాటా సంస్థ విస్తరణకు సహాయపడాలని కోరినప్పుడే కదా, ఆ పనులన్నీ ప్రభుత్వమే చేసినప్పుడు జాతీయకరణ చేయడమే సబబు అని భావించింది. ఇవన్నీ పక్కనపెట్టి అదేదో టాటా కంపెనీ నుండి ఎయిర్ ఇండియాను నెహ్రూ ప్రభుత్వం లాక్కున్నట్లు పిక్చర్ ఇవ్వడం చాలా తప్పు. ఈరోజు కొనియాడాలి అనుకుంటే ఎయిర్ పోర్టు నిర్మాణానికి అత్యంత చౌక ధరలకు భూములను వదులుకున్న రైతులను, ప్రతి చిన్న వస్తువుపై పన్నులు కడుతున్న ప్రజలను కీర్తించాలి. అప్పనంగా కేవలం 2700 కోట్ల రూపాయలను చెల్లించి 18 వేల కోట్ల రూపాయలకు ఒక సంస్థను దక్కించుకున్నట్లు సంబర పడిపోతున్న టాటా గ్రూపు సంస్థను, ప్రభుత్వాన్నీ కాదు. టాటా కంపెనీ ఏదో మెహర్బానీ తో ఈ ఒప్పందానికి ముందుకు రాలేదు. విమానయాన సంస్థలన్నీ కలిసి లోపాయికారీ అవగాహనతో తక్కువ రేటుకు ఎయిర్ ఇండియాను టాటాకు దక్కేలా చేశాయి. ఇదివరకే టాటా గ్రూపు సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో కలిపి ఎయిర్ విస్టా అనే సంస్థలో 51శాతం వాటా కలిగి ఉన్నది. ఏయిర్ ఏషియాలో కూడా 84శాతం వాటా కలిగి ఉన్నది. 1948 నుండి ఇప్పటి వరకు శ్రమించి నిర్మించిన మహారాజా ఎయిర్ ఇండియా సంస్థ, టాటా సంస్థలకు ఇప్పుడు ప్రభుత్వమిస్తోన్న వజ్రోత్సవ వసంతపు బహుమతి.
రోజుకు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని స్వయానా కేంద్ర మంత్రి ప్రకటించే ముందు ఆ నష్టానికి ఎవరు బాధ్యులో వివరించక పోవడం తప్పు. 65562 కోట్ల అప్పులు ఉన్నాయని 5వేల కోట్ల నష్టం ప్రతి సంవత్సరం వాటిల్లుతుందని, 75కోట్ల స్థూల నష్టాలు ఉన్నాయని బహిరంగంగా ప్రకటించే ముందు వాటికి కారణాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఇలాంటివి మాట్లాడకుండా నష్టాలు వస్తున్నాయి కాబట్టి దీనిని అమ్మి వేస్తున్నాం అని ప్రకటించడం చేతకాని తనమే. ఇదే దేశంలో ఇతర ప్రయివేటు కంపెనీలు లాభాల్లో నడుస్తున్నప్పుడు మరి ఎయిర్ ఇండియా ఎందుకు నష్టాల్లోకి వెళ్లింది. ప్రభుత్వ నియమనిబంధనలకు లోబడే ఇతర విమానయాన సంస్థలు తమ రూట్లను, ప్రయాణ రేట్లను నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఏమి పోయేకాలం వచ్చింది? అత్యధిక లాభాలను ఆర్జించి పెట్టే ప్రధానమైన బాంబే నుంచి ఢిల్లీ, పూణే, హైదరాబాదు, మద్రాసు, అమెరికా, ఇంగ్లాండ్, దుబారు వంటి రూట్లలో ఎయిర్ ఇండియాకు తక్కువ అవకాశాలు కల్పించారన్నది వాస్తవం కాదా? ఎయిర్ ఇండియా విమానాలను ఎయిర్‌పోర్టులలో నిలపడానికి ప్రయివేటు సంస్థల కన్నా ఎక్కువ పార్కింగ్ ఛార్జి చెల్లించవలసి వస్తున్నది. ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు జరుగుతున్నది. విమానయాన సంస్థలకు నష్టాలు వాటిల్లుతుంటే మరి రవాణా రేట్లు ఎందుకు పెంచుకోలేదు? ప్రయాణ ఛార్జీలు పెంచితే ధర్నాలు రాస్తారోకోలు ఎవరైనా చేశారా? ధనికులు మాత్రమే ప్రయాణించే ఈ విభాగంలో సంస్థలకు నష్టాలు రాకుండా ఉండేవిధంగా ప్రయాణ ఛార్జీలను, సరుకు రవాణా చార్జీలను సరిచూసుకోవలసిందిగా! పేద మధ్య తరగతి ప్రజలు ఎప్పుడూ మాకు విమానయాన సౌకర్యం కల్పించండి అని డిమాండు చేయలేదే! ఆ సౌకర్యం కల్పించలేనందుకు ప్రభుత్వాలే తల వంచుకోవాలి.
ఎయిర్ ఇండియా ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రజలకు ఏదో నష్టం జరుగుతుంది అన్నది అంశం కాదు. విమానయాన రంగం అత్యంత కీలకమైనది. విపత్కర పరిస్థితులలో ప్రయివేటు రంగాలు అక్కరకురావు. గత సంవత్సరం కోవిడ్ మహమ్మారిలో విదేశాల నుండి వందేభారత్ పేరుతో విదేశాలలోని భారతీయులను రప్పించడానికి ఎయిర్ ఇండియా ఎంతో కష్టపడి పని చేసింది. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నది కాబట్టే సాధ్యమైంది. గల్ఫ్ యుద్ధ కాలంలోనూ లక్షల మందిని చేరవేయడానికి 440 ట్రిప్పులు ఇండియా విమానాలు తిరిగినట్లుగా రికార్డుల్లో ఉన్నది. గత ప్రభుత్వంలోని ప్రఫుల్ పటేల్ పౌరవిమానయాన మంత్రిగా పనిచేస్తూ తన కుమారుని పెళ్లికి కూడా ఎయిర్ ఇండియా విమానాలను మళ్ళించారని అనేక విమర్శలు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్య ఆయనపై తీసుకోలేదు. ఎయిర్ ఇండియా ప్రయివేటీకరణ వల్ల ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలకు లేదా రాజకీయ పెద్దలకు ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే వారు యధావిధిగా ప్రయివేటు చార్టర్డ్ ఫ్లైట్లను ఉపయోగించి తమ ప్రయాణాన్ని ముగించుకుని సదరు చార్జీలను ప్రభుత్వ ఖజానా నుండి తీస్తారు. చివరకు నష్టపోయేది ప్రజలే. ప్రభుత్వాలు ప్రజల మెడలు వంచి సాగు భూమిని సేకరించి, అదే ప్రజల నుండి సేకరించిన పన్నుల నుంచి ఎయిర్ పోర్టుల నిర్మాణం చేపట్టి చక్కగా వాటిని తీర్చిదిద్ది ఇప్పుడు అదాని వంటి వారికి నిర్వహణకు కాంట్రాక్టు ఇచ్చారు. భూమిని ఇచ్చిన ప్రజలు, నిర్మాణం చేపట్టిన ప్రభుత్వాలు నిశ్చేష్టులై చూస్తుంటే... అదాని సంస్థ ఎయిర్ పోర్టులో కాలు పెడితే పన్నులు వసూలు చేసుకుంటూ ఉండడం యాదృశ్చికమా? దురదృష్టమా?
టాటా సంస్థకు ఎయిర్ ఇండియాను అమ్మిన తరువాత కూడా తీర్చవలసిన అప్పు దాదాపు 44 వేల కోట్లు. దీనిని చెల్లించడానికి ప్రభుత్వం బాండ్ల రూపంలో ప్రజల నుండి సేకరించడానికి సిద్ధమైంది. ప్రభుత్వ బాండ్లు అనగానే ప్రజలు ఎగబడతారు కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి ఇదే బాండ్లను ప్రయివేటు సంస్థలు విడుదల చేసి సేకరించవచ్చుగా? ఇప్పుడు విడుదల చేసే ప్రభుత్వ బాండ్లను కొంతకాలం తర్వాత ప్రజలకున్న క్షమాగుణాన్ని ఆసరా చేసుకుని అతి తక్కువ రాబడి ఇస్తూ ప్రభుత్వం వదిలించుకుంటుంది. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్ లైన్స్‌లలో మొదటిది విదేశీ ప్రయాణాలను నిర్వహిస్తే రెండవది స్వదేశీ అంతర్గత ప్రయోజనాలను నిర్వహించే సంస్థ. ఈ రెండింటిని 2007లో విలీనం చేశారు. ఈ విలీనం అవసరం లేకున్నప్పటికీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల మరింత నష్టాల్లోకి సంస్థ వెళ్ళింది. 2018లో 74శాతం వాటాను అమ్మడానికి 49 వేల కోట్ల రూపాయలుగా లెక్కలు వేసిన వారు నేడు వంద శాతాన్ని 18 వేల కోట్లకు అమ్మడం ఆశ్రిత పక్షపాతం కాదా?
నేడు 12085మంది ఎయిర్ ఇండియా ఉద్యోగుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాబోయే సంవత్సర కాలం వరకూ ఉద్యోగ భద్రత ఉంటుంది అని చెప్పారు. అంటే సంవత్సరకాలం తర్వాత ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధమైనట్లే. ముంబైలోని ఎయిర్ ఇండియా కాలనీల్లో నివసిస్తున్న ఉద్యోగులందరూ తక్షణమే వారి క్వార్టర్స్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఎప్పుడు వెళ్ళిపోతారోనన్న దానికి సంబంధించి 28 అక్టోబర్ 2021 వరకు ఒక అండర్ టేకింగ్ ఇవ్వవలసిందిగా ఉద్యోగులను ఆదేశించారు. ఇంతటితో ఆగక ఈ నిబంధనలు పాటించని వారు పదిహేను లక్షల రూపాయల జరిమానా, క్రమశిక్షణ చర్యలకు లోనవుతారని హుకుం జారీ చేసారు. దాదాపు ఏడు వేల మంది ఉద్యోగులు ఈ కాలనీల్లో నివసిస్తున్నారు. ఈ ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకపోతే సమ్మెలోకి దిగుతామని ఉద్యోగులు హెచ్చరించి నప్పటికీ బదులు రాలేదు. టాటా సంస్థకు ఏయిరిండియా చేరకముందే ఉద్యోగుల దీనస్థితి ఇది.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016