Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవకాశం చిక్కినప్పుడల్లా అచ్చేదిన్ అంటూ మాటల్ని వండి వార్చే గౌరవనీయ ప్రధాని మోడీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయాలేమిటీ అన్నది సగటు భారతీయ పౌరునికి ప్రశ్నగానే మిగులుతుంది. ప్రజాస్వామ్యం, దేశభక్తి వంటి అంశాల గురించి ఎప్పుడూ మాట్లాడే ఈ నేతల నిర్ణయాలు నిశితంగా చూస్తే ఇదేం దేశభక్తి అనే సందేహం కలగక మానదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ''కాంగ్రెస్ దేశాన్ని అమ్ముతుందని, నేను దేశాన్ని అమ్మనివ్వన''ని చెప్పిన మోడీ నేడు దేశంలో ప్రభుత్వరంగాన్నంతా అమ్మకానికి పెడుతూ, ప్రభుత్వం ఉన్నది పాలించడానికి కానీ వ్యాపారం చేయడానికి కాదని చెబుతుండటం గర్హనీయం. ఈ దేశానికి స్వాతంత్య్ర సిద్ధి జరిగిన తొలి నాళ్లలో పేద ప్రజల్ని, ప్రయివేటు అవినీతిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రభుత్వ నియంత్రణతో నడిచే ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్మించడం జరిగింది. కానీ నేడు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అంటూ దేశ సొత్తుని కొందరి చేతుల్లో పెడుతూ ఆ సొమ్ముతో బీజేపీ తన భావజాల వ్యాప్తి కార్యక్రమం పెట్టుకుంది. మోడీ పర్యటన ప్రకటనల కోసమే రూ.4,880 కోట్లు ప్రజాధనాన్ని ఖర్చు చేశారంటే ప్రజల ధనాన్ని ఎంత వృధా చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అతి సున్నితమైన దేశ రక్షణ ఒప్పందాల్లో కూడా రాజకీయాలు చేస్తూ, తేజస్ వంటి యుద్ధ విమానాలు తయారు చేసిన అనుభవం ఉన్న హెచ్ఏఎల్ సంస్థను రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం నుంచి తప్పించి, ఆ రంగంలో అనుభవ శూన్యుడైన అనిల్ అంబానికి పారిస్ తీసుకెళ్లి మరీ చేతుల్లో పెట్టడం కార్పొరేట్, రాజకీయాల అనైతిక సంబంధాలకు నిలువెత్తు నిదర్శనం. దేశంలో పేదవాణ్ణి ముంచే విధంగా తీసుకున్న నిర్ణయాల్లో వస్తుసేవల పన్ను, పెద్దనోట్ల రద్దు ముందు వరుసలో ఉంటాయి. భారత ప్రభుత్వ పెద్దనోట్ల రద్దు అంశాన్ని అతిపెద్ద వైఫల్యంగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో వాణిజ్య తరగతుల్లో బోధించడం మనం సిగ్గుపడాల్సిన అంశం. దేశంలో ఎవడు ఏం తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ దేవుణ్ణి నమ్మాలి అనే అంశాల మీద తన తొత్తు మీడియా, వాట్సాప్ విశ్వవిద్యాలయ మేధావుల్ని ఉపయోగిస్తూ దేశంలో సాంస్కృతిక వైవిధ్యం మీద తిరుగులేని దాడి చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తున్నది. భారత్ బయోటెక్ వంటి ప్రతిష్టాత్మక ఔషధ సామర్ధ్యాన్ని ఉపయోగించకుండా, కోవిడ్ తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ముందస్తు పార్లమెంట్ స్థాయిసంస్థ నివేదిక ఉన్నా ఆక్సిజన్ ఎగుమతి చేసి దేశంలో ఆక్సిజన్ కొరత సృష్టించి లక్షలాది శవాలు గంగానదిలో కొట్టుకువెళ్లే పరిస్థితి సృష్టించి అంతర్జాతీయ సమాజం ముందు మనదేశ ప్రతిష్టను దిగజార్చింది.
వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలోకి వచ్చే అంశమని తెలిసినా ఆహారశుద్ధి పరిశ్రమ అనే చట్టంలోని లొసుగుని ఉపయోగించి వివాదాస్పద వ్యవసాయ బిల్లుల్ని రాష్ట్రాల అనుమతి లేకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆమోదించడం, ఆ తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం ఏడాదిన్నర పాటు వాటిని నిలుపుదల చేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అద్దంపట్టే అంశం. ఎనభైశాతానికిపైగా సన్నకారు రైతులున్న దేశంలో రైతుల మరణానికి కేంద్రప్రభుత్వమే వ్యవసాయ చట్టాలు అనే ఉరితాళ్ళు పేనడం అమానుషం. ప్రత్యక్ష పన్నుల వ్యవస్థలో అతిపెద్ద సంస్కరణగా చెప్పుకుని తీసుకొచ్చిన వస్తుసేవల పన్ను ఏ రకంగా విఫలమైందనేది మనందరికీ తెలుసు. రాజ్యాంగబద్ధమైన రాష్ట్రాల పన్ను వాటాను గుంజుకుని హామీతో చట్టం చేసి నేటికీ రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల్ని జీఎస్టీ వాటా కోసం చెప్పులు అరిగేలా తిప్పుతూ సమాఖ్య స్ఫూర్తిని మంట గలుపుతున్నది.
భావోద్వేగాలతో రాజకీయాలు...
హైదరాబాద్ నగరపాలిక ఎన్నికల సమయంలో హైదరాబాద్ పేరుని భాగ్యనగరిగా మారుస్తామని మాట్లాడి ఇక్కడ ఓ విశ్వాసాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఆ వర్గం నుంచి ఓట్లు పొందే ప్రయత్నం జరగడం విచారకరమైన అంశం. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారనే పనికిరాని అంశాల్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లాభం పొందాలని బీజేపీ నేతలు దిగజారుతూ మాట్లాడడం, రోహింగ్యాల రాకపోకలు కేంద్ర హౌంశాఖ పరిధిలో ఉంటాయనే కనీస ఇంగితం కూడా లేని వారి అజ్ఞానాన్ని చూపిస్తున్నది. గాల్లో తిరిగే విమానాల ఇంధన ధరల కన్నా నేల మీద తిరిగే ద్విచక్ర వాహనాల ఇంధన ధరలే ఎక్కువ ఉండడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఓ పక్క అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలతో నిమిత్తం లేకుండా పెట్రోలు ధరలు పెంచి సామాన్య ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్న ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఎలా వంచాలో ప్రజలే తేల్చుకోవాల్సి ఉంది.
కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ప్రజల్ని హామీల మాయలో పడేసే పనిలో హడావుడిగా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు విషయంలో చేతులెత్తేసి, వరి ఎక్కువగా పండించే తెలంగాణ, కర్నాటక వంటి రాష్ట్రాలకు మొండి చేయి అందించిన బీజేపీకి హుజురాబాద్, ఇతర రాష్ట్రాల ఉప ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు ఉందా అన్నది ఆలోచించాల్సిన విషయం.
- పి. నాగఫణి
సెల్: 8074022846