Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2014 ముందు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల విషయంలో ఖాళీ గ్యాస్ మొద్దులను ప్రదర్శిస్తూ, ఆటోలను, మోటార్ సైకిళ్లను తాళ్లతో లాగుతూ, రాస్తారోకో, భారత్ బంద్ లాంటి అస్త్ర శస్త్ర కార్యక్రమాలతో ధరల పెరుగుదలపై గగ్గోలు పెట్టిన మోడీ, స్మృతి ఇరానీ లాంటి అనేక మంది బీజేపీ నేతలు అధికారానికి రాచబాటలు వేసుకొని నేడు అంతకు మించిన ధరా భారాలుమోపుతున్నారు. లీటర్ పెట్రోల్ రూ.111.18కి, లీటర్ డీజీల్ ధర రూ.104.32కి పెంచి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. నిత్యావసరాల ధరలన్నీ ఆకాశన్నంటుతుండగా, ప్రజల ఆదాయాలు మాత్రం పాతాళానికి చేరుతున్నాయి. ఇవేమి భారాలు మహాప్రభో అంటూ జనాలు విలపిస్తుంటే, ఇంధనంపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బుతోనే ప్రజలకు ఉచిత బియ్యం, వంటగ్యాస్, కోవిడ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం విధించటం సరైందేనని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉన్నది. మోడీ ఏలుబడికి ఏడేండ్లు గడిచిపోయినా, ఇంకా ఎంతకాలం తమ వైఫల్యాలకు సాకులు చెబుతారు? 2010-11లో బ్యారెల్ ముడి చమురు ధర రూ.85.09 డాలర్లుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ల ఎగుడు దిగుళ్ల వల్ల అది పెరుగుతూ 2013-14లో 105.52 డాలర్లకు చేరింది. అప్పుడు పెట్రోల్ ధర సుమారు రూ.71.41గా నమోదయింది. ఆ తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ, భౌగోళిక కారణాల వల్ల ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చాయి. 2015 -16లో బ్యారెల్ ధర 46.17 డాలర్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత 2016 నుంచి 2020 వరకు ఎప్పుడు లేనంతగా ముడి చమురు ధరలు తగ్గాయి. కానీ దేశంలో పెట్రోల్ ధరలు ముడి చమురు ధరలతో నిమిత్తం లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, మనదేశంలో ధరలు పెరగడమనేది జీర్ణించుకోలేని అంశం. 2014లో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి రూ.71.41గా ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఆ తర్వాత నిరంతరం పెరుగుతూ మొన్నటి పెంపుతో రూ.111.55కు చేరింది. 2013 వరకూ పెట్రోల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకం రూ.9.48, డీజిల్‌పై రూ.3.56 ఉండేది. అంటే కేంద్రం, రాష్ట్రాలు విధించే పన్నులు దాని అసలు ధరలో 44శాతం వరకూ ఉండేవి, ఇప్పుడు అవి 100 నుంచి 110 శాతం వరకూ పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే కాలంలో వంట గ్యాస్ బండ ధరను కూడా ఎడా పెడా పెంచేస్తున్నారు. జనవరిలో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.746.50 ఉండగా, ప్రస్తుతం రూ.937 నుంచి రూ.952కి పెరిగింది. త్వరలో వెయ్యికి కూడా చేరుకోనుంది. ఇది సామాన్యుల కుటుంబాలలో కన్నీళ్లు తెప్పిస్తున్నది. 2020 నాటికి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ వరుసగా రూ.32.98, రూ.31.83 అంటే దాదాపు 10రెట్ల భారం ప్రజలపై పడింది. బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ పెట్రోల్‌పై ఇంత భారీగా పన్నులు లేవు. బ్రిటన్‌లో 61శాతం, ఫ్రాన్స్‌లో 59శాతం, అమెరికాలో 21శాతం పన్నులు విధిస్తున్నారు. ఇక పెట్రోలియం ఉత్పత్తుల నుంచి కేంద్రానికి వెళ్లే ఆదాయం 2014-15లో రూ.1,26,025 కోట్లుగా ఉంటే 2020-21 నాటికి అది రూ.2,63,351 కోట్లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2014-15లో రూ.4527 కోట్ల ఆదాయం రాగా, 2020-21లో రూ.5678 కోట్ల ఆదాయం వచ్చింది. 2016 నుంచి 2020 వరకు పెట్రోలియం రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు ఏటా సుమారు రూ.5.50లక్షల కోట్లు మొత్తం సమకూర్చింది. భారత ప్రభుత్వం ద్రవ్య లోటును పూడ్చుకునేందుకు ఇంధనంపై భారీ స్థాయిలో పన్నులు విధిస్తోందని, ఇప్పటి వరకు ఈ పన్నుల ద్వారా రూ.20 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాలో చేరాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లపై పన్ను విధించడానికి బదులు 2015-16లో రూ.1,15,176 కోట్లు, 2016-17లో రూ.1,30,184 కోట్లు, 2017-18లో రూ.1,20,069 కోట్లు, 2018-19లో రూ.1,25,891 కోట్లు, 2019-20లో రూ.1,16,260 కోట్ల రాయితీలు ఇచ్చింది. ఈ లోటును పూడ్చుకోవడానికే పెట్రోల్, డీజిల్‌పై పన్నులు వేసి జనాన్ని పీల్చి పిప్పి చేస్తోంది.
ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు వాటా పంచనక్కరలేని కొత్త సెస్‌లు విధిస్తూ పోవడానికి కేంద్రానికి చమురు తేరగా దొరికింది. పెట్రోల్, డీజిల్ ఇంధనాలకు గతంలో నియంత్రిత ధర ఉండేది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర అపరిమితంగా అసాధారణ స్థాయికి పెరిగిపోయినప్పుడు దాని దిగుమతికి అయ్యే ఖర్చులో కొంత భాగాన్ని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా భరించేది. మొత్తం ధర ప్రజల నెత్తిన పడకుండా సబ్సిడీ ఇచ్చేది. ఆ పద్ధతిని తొలగించి 2017 జూన్ నుంచి కేంద్రం డైలీ ప్రైస్ మెకానిజంతో ఇంధన ధరలను లింక్ చేసింది. దాంతో రోజువారీగా యాభై పైసల చొప్పున పెట్రో ధరలు పెరుగుతున్నాయి. అయితే ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు పతనమైనప్పుడు ఆ మేరకు దేశంలో ధరలు తగ్గిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. గత ఏడాది మార్చిలో అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర ఎన్నడూ లేనంతగా 27.10 డాలర్లకు పడిపోయింది. 1991 తర్వాత క్రూడాయిల్ ధర ఆ విధంగా తగ్గిపోవడం అదే మొదటిసారి. అయినా కూడా మనదేశంలో ఇందనపు ధరలు తగ్గలేదు. మనం వాడే బ్రెంట్ రకం క్రూడాయిల్ ధర గతేడాది ఏప్రిల్‌లో 50శాతం తగ్గిపోయి బ్యారెల్ 26 డాలర్లకు పతనమైంది. అప్పుడు కూడా ఆ మేరకు ఇక్కడ ధరలు తగ్గలేదంటే పెట్రో ధరలు పెరగడానికి చమురు రంగాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడమే కారణం. పెట్రోల్ ధరలో 67శాతం, డీజిల్ ధరలో 6శాతం పన్నులే ఉంటున్నాయి. ఈ పన్నులు లేకుంటే రూ.30లకే లీటర్ పెట్రోల్ ఇవ్వొచ్చు. ప్రపంచ మార్కెట్లో ధర తగ్గినప్పుడు ఆదా అయిన విత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకొని అక్కడ పెరిగినప్పుడల్లా ఆ మేరకు భారాన్ని ప్రజల మీద పడేస్తున్నది. ఇది వారే ప్రవేశపెట్టిన అనియంత్రిత ధరల వ్యవస్థ ధర్మాన్ని కూడా దారుణంగా అతిక్రమించడమే తప్ప మరోటి కాదు. చమురును జీఎస్టీ పరిధిలోకి తెస్తే తమ నిరవధిక దోపిడీ సాగదు కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం మానేసి వేర్వేరు పేర్లతో పన్నులూ, సుంకాలూ వడ్డించేస్తున్నాయి. ఏం చేసినా రాష్ట్రాలే చేయాలని కేంద్రం, ఆ పాపం మొత్తం పూర్తిగా కేంద్రానిదేనని రాష్ట్రాలూ బాధ్యతా రహితంగా జనాన్ని పీల్చేస్తున్నాయి. దేశంలో ఒక్క కేరళలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో ధరల మంటను ఇక ఏమాత్రం భరించలేని స్థితికి సామాన్యుడు చేరుకున్న వాస్తవాన్ని కూడా గుర్తించ నిరాకరిస్తున్నాయి. దేశంలో ఒక్క కేరళ రాష్ట్రం మాత్రమే వాటి ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల భారం పడుతున్నా లెఫ్ట్ ప్రభుత్వం ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించింది.
అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సంప్రదింపులు చేసుకొని ఇంధన ధరల పెరుతరతగుదలను అదుపు చేయాలని వామపక్షాలు గతంలో రెండుసార్లు దేశ వ్యాప్త బంద్‌ను విజయవంతంగా నిర్వహించాయి. ఇంతటి నిరంకుశత్వాన్ని పాలకులు ప్రజల పట్ల ప్రయోగిస్తే భవిష్యత్ ప్రజాగ్రహానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- నాదేండ్ల శ్రీనివాస్
9676407140