Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదయాన్నే పళ్ళు తోముకుంటున్నాను. ఎవరో వాలంటీరు వచ్చాడు.
''సార్ పళ్ళు తోముకుంటున్నందుకు రోజుకు ఐదు రూపాయల ప్రకారం యూజర్ ఛార్జీలు పడతాయి'' అన్నాడు.
''నా పళ్ళూ, నా బ్రష్షు, నా పేస్టు... వాడుకుంటు న్నందుకు కూడా డబ్బులు కట్టాలా?'' అన్న నా ప్రశ్నను పట్టించుకోకుండా...
''ఉదయాన్నే తల దువ్వుకున్నారా'' అన్న ప్రశ్న విని మతిపోయి దానికి కూడా ఛార్జీలు కట్టాలేమోనని భయపడి
''లేదు'' అన్నాను.
''దువ్వుకుంటే రెండు రూపాయలు, దువ్వుకోకుంటే ఒక్క రూపాయి కట్టాలి. ఇలా రోజుకు ఎన్నిసార్లు మీ క్రాపు దువ్వుతారు అన్న దాన్ని లెక్కలోకి తీసుకొని ఒక సర్వేలో తేలిన దాన్ని బట్టి, మీకు భారం కాకుండా రోజుకు ఐదు సార్లుగా లెక్క వేసి క్రాపు దువ్వుకునే దానికి పది రూపాయలు కట్టాలి''.
''మరి బట్ట తల ఉంటే?''
''దానికీ ఉంది మార్గం''
''ఏమిటది''
''యూజర్ ఛార్జీలకే ఇలాంటి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఫైనుతో కలిపి రోజుకు పదిహేను రూపాయలు వేస్తున్నాం.''
''లేదు... ఏ తిరుపతో అన్నవరమో పోయి గుండు చేయించుకుంటే...?''
''అలా చేయించుకున్నందుకు ప్రభుత్వానికి రుసుము యాభై రూపాయలతో పాటు, జుట్టు పెరిగి క్రాపు వచ్చేదాకా ఇంతకు ముందు చెప్పుకున్న బట్టతల ఉదాహరణలో ఉన్న రుసుము దీనికీ వర్తిస్తుంది.''
''మరి దీనిపై సర్వీసు టాక్సు ఉంటుందా...''
''అది కేంద్ర ప్రభుత్వ బాదుడు అన్న అంశంలోకి వస్తుంది కాబట్టి దానికి నా దగ్గర సమాధానం లేదు.''
ఇంతలో శ్రీమతి వంట హడావిడిలో బయటకొచ్చి పెరట్లో ఉన్న కొత్తిమీర కోసుకొని పోతూ పోతూ...
''ఎవరండి పాపం నిలబెట్టే మాట్లాడుతున్నారు, కూచోమనరాదూ'' అని ఉచిత సలహా వేసిపోయింది.
''ఏమో కుర్చీలో కూచ్చున్నందుకు యూజర్ ఛార్జీలు వేస్తారేమోనన్న అనుమానంతో వేయలేదు'' అని లోపల అనుకునేది పోయి పైకే అనేశాను.
''అబ్బా బాగా గుర్తు చేశారు సార్!! మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఆడవాళ్ళెందరు, మగవాళ్ళెందరు? విద్యార్థులెందరు, ఉద్యోగస్తులెందరు? మీ ఇంట్లో కుర్చీలు, మంచాలు ఎక్సెట్రా ఫర్నిచరు ఏమున్నాయి?''
''కుటుంబ సభ్యుల వివరాలు ప్రభుత్వ లెక్కల్లో అన్నీ ఉన్నాయి కదా! కుర్చీల్లో కూచున్నా, మంచంపై పడుకున్నా ఛార్జీలు వేస్తారా?''
''జనాభా లెక్కలు వేరే సార్. ఇది పూర్తిగా యూజర్ ఛార్జీలకు సంబంధించింది. టీవీ ఎన్ని ఛానళ్లు చూస్తున్నారు? సీరియళ్లు చూస్తున్నారా?''
ఇంతలో నా శ్రీమతి వచ్చి బయట తీగ మీద ఉతికిన బట్టలు ఆరేసి పోయింది.
''సార్ బట్టలు ఉతకడానికి బక్కెట్ వాడుకున్నారు, నీళ్ళు వాడుకున్నారు, సబ్బు, మంచి వాసన కోసం కంఫర్టు వాడారు. వీటన్నింటినీ వాడుకున్నందుకు ఛార్జీలు తప్పవు.''
''మా చేతులు, కాళ్ళూ... వాడుకున్నందుకు కూడా వేస్తారా ఈ ఛార్జీలు?''
''వాటిపైన ఎందుకు వేస్తాం సార్? అవి మీవే కదా?''
''ఇందాక మీరు చెప్పినవి కూడా మావే కదా''
''వస్తువులు వాడుకోవడం వేరు, మనుషులు వేరు''
''మరి మనుషులతో చేయించుకునే పనులకు కూడా వేస్తున్నారుగా ఛార్జీలు''
''ఇతర మనుషుల కథ వేరు, మీ సొంతం వేరు. అయినా ఇది కూడా ఆలోచించవలసినదే. నేను పైకి రాసి పంపిస్తాను. గొప్ప ఐడియా''
''బాబ్బాబూ... ఏదో నోరు జారి అన్నాను. నీవు సీరియస్సుగా తీసుకోవద్దు. నీవు పైకి రాయొద్దు, కిందికి రాయొద్దు. ఇప్పటికే చచ్చిపోతున్నాము''
''ఇక పోతే గడ్డం అయ్యాక స్నానం చేస్తారుగా''
''అయితే...''
''వస్తా, వివరాల్లోకి వస్తా''
''డోరు వేసుకున్నందుకు, సబ్బు, షంపూ రాసుకున్నందుకూ ఇలా అన్నింటికీ వేస్తారా''
''అబ్బ, మీరు ఏ డిపార్టులో పనిచేస్తారో తెలీదు కాని, మా దాంట్లోకి రావలసినోళ్ళు సార్''
''నాకు పొగడ్తలొద్దు, ఇంక మీ యూజర్ ఛార్జీల లిస్టు ఆపండి. నాకు కళ్ళు తిరుగుతున్నారు''
''కళ్ళు తిరుగుతున్నాయా?''
''ఏం, అలా తిరిగితే కూడా వేస్తారా? బాగయిపోయింది, ఇప్పుడు కళ్ళు తిరగడం లేదు''
''ఆగిపోయినందుకూ ఉంటాయి ఛార్జీలు''
నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయాను. మొహం మీద శ్రీమతి నీళ్ళు చల్లుతోంది వాలంటీరును తిట్టుకుంటూ.
''మొత్తం ఎన్నిసార్లు కొట్టారు నీళ్ళు'' వాలంటీరు అడిగాడు.
ఈసారి కళ్ళు తిరగకున్నా పడిపోయాను.
శ్రీమతి అరుపులకు వాలంటీరు 'మళ్ళీ వస్తాను మేడం' అంటూ పారిపోవడం వినిపిస్తోంది.
- జర