Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనేక సంవత్సరాలుగా, ద్వేష పూరిత ప్రసంగాలవల్ల హత్య చేయడం వారిని సంతృప్తి పరచలేక పోయింది. అందుకే పోలీసులచే కాల్చి చంపబడిన రైతు మృతదేహంపై ఒక ఫొటో గ్రాఫర్ గంతులు వేయడాన్ని చూడాల్సి వచ్చింది. ఈ సంఘటన ఆర్‌యస్‌యస్, బీజేపీ శక్తులు అసోంలో, వారి మద్దతుదార్ల మెదళ్ళలో ఏవిధమైన రాజకీయ ద్వేష భావాలను పథకం ప్రకారం జొప్పించడానికి ప్రయత్నించారో తెలియజేస్తోంది. పోలీసు సిబ్బంది చంపిన తరువాత కూడా, అతని శరీరంపై లాఠీల వర్షం ఆగలేదు. ఈ ఘోరమైన సంఘటన విచక్షణతో, లోతుగా ఆలోచించే వారిని కుదిపివేసింది. భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా బహిరంగ నిరసనలకు దారితీసింది.
హేమంత్ బిస్వా శర్మ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమమైన ఆక్రమణల పేరుతో రైతులను తమ భూములనుండి వెళ్ళగొట్టి, వారిని నిరాశ్రయులను చేయటానికి ఉత్సాహ పడుతున్నది. దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటున్న రైతులను నిరాశ్రయులను చేయటానికి బలగాలను ప్రయోగిస్తున్నది. ఈ సమస్యకు సంబంధించి గౌహతి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రైతులకు ముందుగా కనీసం తగిన నోటీసు కూడా ఇవ్వకుండా, ఖాళీ చేయించే ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం కల్పించిన అందరికీ సమానత్వం, భద్రత అనే హమీలు దారుణంగా ఉల్లంఘించ బడ్డాయి. బీజేపీ ప్రభుత్వ వాదన ఏమంటే, 77 వేల భిగాలలో సహకార వ్యవసాయాన్ని ఏర్పాటు చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దానివల్ల స్థానిక యువకులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలుకుతున్నది. పెద్ద మొత్తంలో భూములను ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేస్తూ కుయుక్తు లతో, ప్రజలను సామాజికంగా విడదీయడానికి, చిన్న రైతులను భూమి నుండి ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నది.
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ శివదాసన్, అఖిల భారత న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు బికాష్ రంజన్ భట్టాచార్య, అసోం క్రిషక్ సభ అధ్యక్షులు గజన్ బర్మన్, కోశాధికారి మసద్దర్ హుస్సేన్, ఏఆర్ సిక్తర్, అసోం ఆలిండియా లాయర్స్ యూనియన్ కార్యదర్శి, ఇతరులు ఒక బందంగా, అసోంలోని దరాంగ్ జిల్లా సిపాజర్ ప్రాంతానికి చెందిన ఈ ధల్ పూర్-గోరుఖుటిని సందర్శించాము. మేము ఆ ప్రాంతానికి చేరుకోవడానికి అనువైన రహదారులన్నీ పోలీసుల రక్షణ వలయంలో ఉన్నందున మా బృందం నీటిలో మోటార్ బైకులతో ప్రయాణించవలసి వచ్చింది.
అక్కడ వేలాది మంది ప్రజలు నివాసయోగ్యంకాని ప్రదేశాల్లో నివసించవలసి వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ క్రూరమైన దాడులను నిర్బంధాలను ఎదుర్కొనగలిగే ఎలాంటి ఏర్పాట్లు లేవు.! మహమ్మారి సమయంలో పారిశుధ్యం, ఆరోగ్య సౌకర్యాలు తగినట్టు లేకపోవడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు పెరిగాయి. బీజేపీ ప్రభుత్వ ఉదాసీనత, దీనితోపాటు ''మియా''(ముస్లింల) ఓట్లు తనకు అవసరంలేదని ముఖ్యమంత్రి నిరంతరం చేసే ప్రకటనలు వీరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ విషయాల పట్ల ముఖ్యమంత్రి తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, ఆ ప్రాంతంలోని రైతాంగాన్ని ఖాళీ చేయించడాన్ని సమర్థించుకున్నాడు. తాను సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాక, జిల్లా యంత్రాంగాన్ని, అసోం పోలీసులను 4500 భిగాలను ఖాళీ చేయించి, స్వేచ్ఛ కలిగించినందుకు 800 గృహ సముదాయాలను తొలగించినందుకు, అక్రమంగా నిర్మించిన మతపరమైన నిర్మాణాలను, ఒక ప్రయివేటు సంస్థను కూల్చినందుకు అభినందనలు తెలిపాడు. పునరావాసం, పునరావాస ప్రణాళిక విషయంలో పరస్పర అంగీకారం లేకుండా, వేలమంది ప్రజలు బలవంతంగా తొలగించబడుతూ ఉంటే, ప్రజలెన్నుకున్న ప్రతినిధి ఇలా ఎలా చేయగలుగుతున్నాడు!? అక్రమ వలసదారులనే నెపంతో, సొంత ప్రదేశాల నుండి ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నం, ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని పురికొల్పి వారి మధ్య వైరుధ్యాలను సృష్టించి రాష్ట్రాన్ని మతపరంగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
దాదాపు 1170 కుటుంబాలలో ఆ ప్రాంతంలో నివసిస్తూ, జీవనోపాధిని పొందుతున్న వారిని ఇప్పుడు బలవంతంగా ఖాళీ చేయించారు. ప్రధానంగా బార్పేట, కామరూప్ జిల్లాలనుండి అనేకమంది స్థిరనివాసులు, భూమి కోత వల్ల దిగువ అసోం నుండి ఈ ప్రాంతానికి వలస వచ్చారని నివేదికలు తెలియ జేస్తున్నాయి. బ్రహ్మపుత్రానది వరదల కారణంగా, ఎక్కువ మంది పేద రైతాంగ కుటుంబాలు, స్థాన మార్పు వల్ల ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. అనేక వేలమంది ఐదు దశాబ్దాలుగా ఇక్కడ భూమిని, వివిధ రకాల నిబంధనలతో సాగు చేస్తున్నారు. వాటిలో పాక్షిక చట్టపరమైన ఏర్పాట్లతో ఇఖోనా(వార్షిక వ్యవసాయ హక్కులు లేక ఫైన్ చెల్లిస్తూ నియమిత కాల పట్టాలతో) తౌజి(ఫైన్ కడుతూ కొనసాగుతున్న ప్రక్రియతో శాశ్వత పట్టా పొందే పద్ధతి) కొంత మంది మయాది (తగిన భూమి పత్రాలతో) పద్ధతిలో చిన్న వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు, మత్స్యకారులు, చేతి వృత్తి దారులు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకుని, తమ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారితో పూర్తి సామరస్యంతో మనుగడ సాగిస్తున్నారు. ఈ కుటుంబాలు స్థిరపడిన ప్రాంతమంతా, నదీ పరివాహక ప్రాంతం లేక నదీ ప్రాంత దీవి. అసోంకు సంబంధించిన నివేదికల ప్రకారం ప్రధానంగా ఛార్(నదీ ప్రాంత దీవులను ఆవిధంగా పిలుస్తారు) ప్రాంతంలో 35లక్షల మంది ముస్లిం ప్రజలు నివసిస్తారని నివేదిక తెలియజేస్తున్నది. పైన తెలిపిన విధంగా చట్టపరమైన ఏర్పాట్లతో లక్షల మంది నదీ పరివాహక ప్రాంతానికి వెలుపల ప్రభుత్వ భూములలో గానీ, అడవులలో గానీ నివసిస్తున్నారు.
అయినల్ హక్ (50సంవత్సరాలు) అనేక సంవత్సరాలుగా ఆప్రాంతంలో నివాసం ఉంటూ, అక్కడే విద్యాభ్యాసం గావించాడు. ఆయన ఆ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, వారిని అక్రమ ఆక్రమణ దారులుగా, చట్టవ్యతిరేకమైన బంగ్లాదేశ్ వాసులుగా ముద్రవేస్తున్నారని విలపిస్తూ తెలియ జేశాడు. సాయుధ పోలీసులు స్థానిక ఆందోళన కారులపై హింసాత్మకంగా వ్యవహరించడమేకాక, నడుము పైభాగంపై కాల్పులు జరుపుతూ చంపేందుకు ప్రయత్నించారు. చనిపోయిన వారికి, గాయపడిన వారికి గాయాలు నడుము పై భాగంలోనే ఉన్నాయి. కొందరు బాధితుల పొట్టపై, ఛాతిపై, భుజాలపై బులెట్ గాయాలు ఉన్నాయి. 12 సంవత్సరాల బాలిక హస్నాబాను పోలీసు దాడిలో విరిగిన తన చేతిని చూపించింది. గడ్డి బీడులో పశువులను మేపుతూ జీవించే 26 సంవత్సరాల సద్దామ్ తన ఛాతీ కింద బుల్లెట్ గాయంతో ఉన్నాడు.13 సంవత్సరాల అష్రాఫుల్, బుల్లెట్స్‌తో ఏర్పడిన రెండు గాయాలను, వాచిన భుజాలను మా బృందానికి చూయించాడు. మా బృందం పోలీస్ కాల్పుల్లో మరణించిన 32సంవత్సరాల మోయినల్ హక్, 12 సంవత్సరాల షేక్ ఫరీద్ కుటుంబాలను సందర్శించి తమ సంతాపాన్ని తెలియజేసింది. భర్తను కోల్పోయిన మోయినల్ హక్ భార్య ఇద్దరు చిన్నపిల్లలతో, వృద్ధురాలైన తల్లితో ఎలాంటి ఆదాయ వనరులు లేకుండా ఉంది. షేక్ ఫరీద్ తల్లి తండ్రులు ఓదార్చలేని స్థితిలో ఉన్నారు. చనిపోయిన కుటుంబాలకు, అఖిల భారత కిసాన్‌సభ తరఫున ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందజేశాము. చనిపోయిన వారికి, గాయపడిన వారికి ఆలిండియా న్యాయవాదుల యూనియన్ కూడా తన వంతు సహాయం చేసింది.
బెలియాగార్డ్ ప్రజలు వారి నివాస స్థలాల నుండి బలవంతంగా బయటకు నెట్టి వేయబడ్డారు. అసోం పోలీసు బలగాలు వారి భూములను వ్యవసాయానికి అనువుగా లేకుండా చేశారు. అసోం పోలీసులు పంటలను, చెట్లను కూడా మినహాయించలేదు. ఈ విధ్వంసంలో భాగంగా ప్రజల నివాసాలు కూడా కూల్చివేయబడ్డాయి. నిస్సహాయమైన ప్రజలు, వారి గృహాలను బుల్డోజర్తో ధ్వంసం చేయడాన్ని ప్రత్యక్షంగా చూసారు. వారి వాహనాలు, నీటి పంపులను తగలబెట్టారు. ఆహార ధాన్యాలను కూడా నాశనం చేశారు. ప్రజలు నీటిని తోడుకునే వీలులేకుండా, ట్యూబ్ వెల్స్‌ను కూడా పెకిలించి వేశారు. వయసు మళ్లిన వృద్దుడైన, అమీర్ షేక్ మాట్లాడుతూ.. తాము 1975 నుండి ఆ ప్రాంతంలో నివసిస్తున్నామని, ముందుగా తగిన నోటీసులు కూడా ఇవ్వలేదని, తమకు చెందిన వస్తువులను సేకరించుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని, పునరావాసానికి, స్థిర నివాసానికి ఎలాంటి హామీ ఇవ్వకుండా బలవంతంగా నివాసాలను వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారని తెలిపారు. ఎలాంటి అనుమానం లేకుండా 50సంవత్సరాల నుండి, భారతదేశ పౌరునిగా ఆ ప్రదేశంలో నివసిస్తున్నామని, ఖాళీ చేయించబడిన ప్రజలవద్ద, భూమి దస్తావేజులు, ఆధార్ కార్డులు, ట్రెజరీలో చెల్లించిన రసీదులు, రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. తాము అక్రమ వలసదారులమైతే, వివిధ ప్రభుత్వాలు 38 అంగన్వాడీలను, 42 సర్వశిక్ష లోయర్ ప్రాథమిక పాఠశాలలను, హైస్కూల్లను, ఒక 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, రెండు ఉప కేంద్రాలను తమ అవసరాలు తీర్చడానికి ఏ విధంగా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో అన్ని పాఠశాలల్లో అస్సామీ బోధనా భాషగా ఎలా ఉన్నదని ప్రశ్నించారు.
ప్రజలను ఖాళీ చేయించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని ట్రాక్టర్లతో దున్నించారు. ప్రస్తుతం ఖాళీ చేయించ బడిన ప్రజలు, తిరిగి ప్రదేశానికి రాకుండా రహదారులను మూసివేశారు. ప్రస్తుతం అసోం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో మానవతా దృష్టిలేదు. రైతులను అక్రమ వలస దారులని ముద్ర వేయకూడదని గాని, పరస్పరం అంగీకరించబడిన స్థిర నివాసం, పునరావాసంతో వారికి జీవనోపాధిని పొందడానికి అవకాశం కల్పించడం గాని, దానితోపాటు వ్యవసాయ యోగ్యమైన భూమిని సమకూర్చడంలోగాని, ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది. గతంలో పాలించిన కాంగ్రెస్, అసోం గణపరిషత్ ప్రభుత్వాలు కూడా వారు ఆ ప్రాంతంలో నివసించడానికి అనుమతినిచ్చినప్పటికీ, భూమి యాజమాన్య హక్కును గాని, గృహ వసతినిగాని కల్పించలేదు. ఈ లోపాన్ని బీజేపీ ప్రభుత్వం అవకాశంగా తీసుకొని, తమ స్పష్టమైన ప్రణాళికతో వారిపై వేటు వేయడానికి ప్రయత్నిస్తున్నది. ఈ ప్రాంతంలో మతపరమైన విభజనకు సైతం ప్రయత్నం చేస్తున్నది. ప్రత్యేకంగా, ముస్లిం రైతాంగంచే సాగుచేయబడు తున్న భూములే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇతర ప్రాంతాలలో గిరిజన ప్రజలను కూడా ఖాళీ చేయించారు. ఇది రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించాడానికి పన్నిన కుట్రలో భాగమే.
ప్రజాస్వామ్య శక్తుల సత్వర కర్తవ్యమేమంటే, రైతుల పక్షాన నిలబడి వారిని కష్టాలలో ఆదుకోవడంతోపాటు ఉపశమనం కల్పించాల్సి ఉంది. ద్వేషంతో కూడిన రాజకీయాలను అనుమతించమని బలమైన, స్పష్టమైన సందేశాన్ని పంపవలసి ఉంది. తమ సొంత భూమి నుండి వెళ్ళగొట్టబడి, నిరాశ్రయులైన వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంది. దరాంగ్ ప్రాంత ప్రజలు, బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటించిన సాంప్రదాయం కలవారు. ఆ క్రమంలోనే 1894లో పోధోర్ ఘాట్ వద్ద భూమిశిస్తు పెంపునకు వ్యతిరేకంగా నిరాయుధులైన140 మంది రైతులు ప్రాణాలర్పించిన చరిత్ర ధరాంగ్ ప్రజలకు ఉంది. ఆ రైతాంగం యొక్క భూమి హక్కును కాపాడడానికి ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకు పోవలసి ఉన్నది.
- విజూ కృష్ణన్
వ్యాసకర్త: ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి
అనువాదం:మల్లెంపాటి వీరభద్రరావు,
సెల్: 9490300111