Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తొలిపొద్దయి ఉదయించే సూరీడు అతడు.
కాలుతున్న కడుపుల్లో...బుక్కెడు బువ్వయి
ఆకలినితీర్చే అన్నదాత అతడు.
స్వేదపు చుక్కలని నీటిదారలుగా పారించి
పుడమితల్లి ఎదపై మెతుకుపూలను పూయిస్తాడు.
కాలం కనికరించకపోయిన...
పెట్టుబడి కొండంత పేరుకుపోయిన...
కారం బువ్వతో కడుపునింపుకొని...
విశ్వానికి పంచభక్ష పరమాన్నాలను అందిస్తాడు.
ఊరిపోలిమేరలన్ని కనుచూపుమేర పచ్చగా
ఉన్నాయంటే ఈ కర్షకుడి పనితనమే.
చెరువుల్లోని నీరంతా అలలై ఎగసిపడుతున్నాయి.
తూములు కాలువల్లో పారుతున్న జలం...
రైతన్న నాటిన విత్తును ముద్దాడాలని
పోటీపడి పరుగులుతీస్తున్నాయి.
పంటపొలాల్లో ఉదకమంత మొదట తాకేది..
సేద్యకాడి పాదాలనే.
జొన్నకంకుల చుట్టూ తిరుగుతున్న పిచ్చుకలన్నీ..
ముచ్చటించేది పంటకాపు గురించే.
పురుడుపోసుకుంటున్న వరిపైరులన్ని
తలచుకునేది క్షేత్రజీవుడినే.
చీడపిడలన్నీ తొలిచేది ఏ కాయనో పండునో కాదు.
నేద్యకాడి హృదయాన్నే
అవి అన్నం పెట్టే చేతులు
ఆ హస్తాలకిపుడు సంకెళ్లు బిగిస్తున్నారు.
కొత్తచట్టాలను చుట్టాలుగా తీసుకొచ్చి...
సేద్యకాడి మెడకు ఉరితాళ్లను బిగిస్తున్నారు.
కార్పొరేట్ కాకులకు హాలికున్ని..
ఎరగా వేస్తున్నారు.
కాయ కష్టాన్ని నమ్ముకున్న రైతన్నకు
అభయ హస్తాలై కన్నీరును తుడుద్దాం.
రైతన్న పండిస్తున్న పంటకు ...
పసిడి సిరులు కురిపిద్దాం.
- అశోక్ గోనె. సెల్: 9441317361.