Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆది మానవుని నుంచి నేటి ఆధునిక మానవుని వరకు జరిగిన పరిణామ క్రమంలో అనేకం. మానవుడు ఊహలలోనుంచి ఉద్భవించినదే.. దేవుడు సృష్టికర్త అనేది ఒక ఊహ. ప్రపంచంలోని అనేక దేశాలలోని ప్రజలు అనేక రకాల ఊహలను ఊహించినందునే అనేక దేవుళ్ళు, మతాలు, కులాలు, మూఢనమ్మకాలు ఏర్పడటం జరిగింది. బానిస సమాజంలో వర్గదోపిడీ మొదలైననాటి నుంచీ దేవుళ్ళను, మతాలను, మూఢనమ్మకాలను, దోపిడీదారులు ఉపయోగించుకుని నేటికి కూడా తమ దోపిడీని కొనసాగిస్తున్నారు. మరొక వైపున వేల సంవత్సరాల నుంచీ శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి అవుతూ కొన్ని మూఢనమ్మకాలను నిర్మూలిస్తూ వస్తున్నప్పటికీ దోపిడీ దారులు కొత్తకొత్త దేవుళ్ళను, క్రతువులను, మూఢనమ్మకాలను ప్రవేశపెడుతూ తమ దోపిడీకి ఆటంకం కాకుండా చూసుకుంటున్నారు.
సుమారు యాభై సంవత్సరాల క్రితం వరకూ పండుగలకు, పబ్బాలకు గ్రామ, పట్టణ గుడులలో పురాణ పఠనాలు, హరికథలు, బుర్రకథలు ,నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, శాంతియుతంగా, సాధారణ స్థాయిలో జరిగేవి. డెబ్భయ్యవ దశకంలో నాటి భారతీయ జనసంఫ్‌ు (నేటి బీజేపీ) జనతాపార్టీలో విలీనమయి అధికారానికి వచ్చిన తరువాతనే హిందూ మతతత్వ కార్యక్రమాలు పెరగటం, సమాతరంగా ఇతర మతతత్వ కార్యక్రమాలు కూడా పెరగటంతో పోటీతత్వం పెరిగి, హంగులు, ఆర్భాటాలతో కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతున్నది. ఒక వైపున పాత వాటిని పునరుద్ధరిస్తూ, వేల, లక్షల కోట్ల రూపాయలతో గుళ్ళు, మసీదులు, చర్చిలు, ఇతరత్రాలు నిర్మించబడుతున్నవి. నేడు దేశంలో రోజు రోజుకు సమస్యలు పెరిగిపోతున్నాయి. సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలి. కానీ ప్రభుత్వాలే పనికిరాని సమస్యలను లేవదీస్తూ ప్రజలను ప్రక్కదారి పట్టిస్తున్నవి. ఈమధ్య కాలంలో ప్రజల్లో భక్తిభావం తగ్గి, హంగులు, ఆర్భాటాలతో రక్తి పెరిగిపోతున్నది. ఆకాశానికి తాకే హనుమాన్ విగ్రహాలు, లక్షదీపోత్సవాలు, కోటి పూవోత్సవాలు లాంటి అనేక కొత్తకొత్త కార్యక్రమాలు నిర్వహించబడుతూ సమయం, ధనం వృధాకావటంతో పాటు కాలుష్యం కూడా పెరగటం జరుగుతున్నది. ఒకవైపున లక్షల ఎకరాల్లో పూలు పండించబడి పూజలనంతరం మట్టిపాలు చేయటం జరుగుతున్నది. మరొకవైపున వంటనూనెలను దిగుమతి చేసుకుంటూ వేలకోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం హరింపచేస్తున్నాం. పూలస్థానంలో నూనె పంటలు పండించాలి. నగరాలు, పట్టణాల్లో సుమారు ఒక చదరపు కిలోమీటరు పరిధిలోనే దేవాలయాలు, చర్చిలు, మసీదులు అనేకం నిర్మించబడుతూ కోట్ల రూపాయల పెట్టుబడి అనుత్పాదక రంగానికి ఖర్చుకావడం తిరిగి రాని బూడిదలో పోసిన పన్నీరు చందమవుతున్నది. పండుగులకు రంగు రంగుల భారీ విగ్రహాలు తయారు చేయబడి పూజలనంతరం నిమజ్జనం చేయటంతో ఖర్చు వృధాకావటంతో పాటు కాలుష్య సమస్యలను తెచ్చుకుంటున్నాం. ఈ అనుత్పాదక రంగంపై ఖర్చుచేయబడే వేల, లక్షల కోట్ల రూపాయలు ఉత్పాదక రంగాలయిన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై ఖర్చుచేసినట్లయితే కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధులు లభించి నిరుద్యోగ సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. దేవునిపేరు మీద వివిధ ప్రాంతాల దర్శనాలకై చేసే ప్రయాణాల వలన ప్రతిరోజూ లక్షల వాహనాలు ఉపయోగించబడి లక్షల లీటర్ల పెట్రోలు, డీజిలు ఖర్చవుతూ వాయు కాలుష్యం పెంచబడుతున్నది. ఈ ప్రయాణాలు తగ్గితే వేలకోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
నేడు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు, సినిమాలు దేవునిపేరు మీద అనేక మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాయి. ప్రజలలో తర్కజ్ఞానం పెరగకుండా చేస్తున్నాయి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కూడా గుడ్డిగా మూఢనమ్మకాలను అనుసరిస్తున్నారు. దేవునిపై నమ్మకం, భక్తి అనేవి వ్యక్తిగతంగానే ఉండాలి. నమ్మకాలను సామాజికం చేయాలనుకోవటం ద్వారానే డబ్బు వృధా కావటం, కాలుష్యాలు పెరగటం, తర్కజ్ఞానం నశించటం, మత కల్లోలాలు లాంటి అనేక అనర్థాలు జరుగుతున్నవి. కాబట్టి ప్రజలు భక్తి భావం పెంచుకుంటే పర్వాలేదు. కానీ రక్తి పెరగకుండా చూసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు సెక్యులర్‌గా వ్యవహరించాలి.
సెల్: 9908503997
తుమ్మల మోహనరావు