Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొంత కాలంగా అంత ర్జాతీయ పత్రికలు, ఆర్థిక మ్యాగజైన్లను పరిశీలిస్తే బంగ్లాదేశ్ ఆర్థికాభివృద్ధిపై అనేక కథనాలు కనిపిస్తాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రజల తలసరి ఆదాయంలో ఎంతో పెరుగుదల వచ్చింది. అంతేకాకుండా 2021 జూన్‌లో పీస్ ఇండెక్స్ విడుదల చేసిన నివేదికలో దక్షిణాసియాలోనే మూడో శాంతియుత దేశంగా నిలిచింది. అయితే కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై జరుగుతున్న దాడులు అక్కడ జరుగుతున్న ప్రగతికి ప్రమాదకరంగా మారాయి. హిందువులపై జరుగుతున్న దాడులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. యూఎన్ఏ కూడా ఈ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, శాంతియుత దేశంగా మొన్నటి వరకు పేరు తెచ్చుకున్న బంగ్లాదేశ్‌కు ఇప్పుడు మైనార్టీలపై దాడులు, ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడం అభివృద్ధి నిరోధకంగా మారే ప్రమాదముంది.
బంగ్లాదేశ్‌లోని హిందూ సముదాయాలపై కొన్ని రోజులుగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. అక్కడ కమిల్లాలోని దుర్గా మండపంలో ఖురాన్ కనిపించిన నాటి నుంచి ఈ దాడులు మొదలయ్యాయి. అక్కడి నుంచి నొవొఖాలీ, ఢాకా, కిశోర్‌గంజ్, చాంద్‌పూర్ వంటి ప్రాంతాలకు విస్తరించాయి. అనేక దేవాలయాలతోపాటు హిందువుల ఇండ్లపై కూడా దాడులు చేశారు. సుమారు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 29ఇండ్లకు దుండగులు నిప్పంటించారు. మరో 66ఇండ్లను ధ్వంసం చేశారు. కొమిల్లా జిల్లాలో దుర్గామాత పూజల వేళ మొదలైన ఈ హింసాత్మక ఘటనలు.. ఆయా ప్రాంతాలకు పాకాయి. పవిత్ర గ్రంథాన్ని అవమానపర్చినట్టు ఫేస్బుక్లో వెలుగు చూసిన ఓ పోస్ట్ వల్ల ఇవి మరింత పెరిగాయి. అంతేకాకుండా దసరా రోజున ఇస్కాన్ దేవాలయంపై కూడా దాడి చేశారు.
చెప్పుకోవడానికే 'సెక్యులర్'
బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ దేశం. ప్రతి ఒక్కరూ తమ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది. అయితే ఇక్కడ హిందూ వ్యతిరేకత కొత్తగా వచ్చిందేమీ కాదు.. ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతూ వస్తోంది. ఒక రిపోర్టు ప్రకారం 2013 నుంచి ఇప్పటి వరకు హిందువులపై 3679 దాడుల ఘటనలు జరిగాయి. వీటిలో వెయ్యికి పైగా ఘటనల్లో హిందువుల ఇండ్లు, ఇంకా దేవాలయాలకు నిప్పు పెట్టేశారు. ఆ సమయంలోనే కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి పెద్ద దాడుల ఘటనలు జరగకపోయి ఉండేవని పలువురు పేర్కొంటున్నారు.
భారత స్పందన నామమాత్రం..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా పొరుగునే ఉన్న ఇండియా స్పందన అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం వాటిపై తీవ్రంగా స్పందించేది. బంగ్లాదేశ్‌లోని రాయబార కార్యాలయ ప్రతినిధులను పంపి నిరసన తెలిపేది. అయితే ఈ సారి అలా కాకుండా కేవలం ప్రకటనతో సరిపుచ్చారు. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీసుకుంటున్న చర్యలపై విశ్వాసం వ్యక్తం చేశారు.
నిరసనలు.. సంఘీభావం
మైనార్టీలపై దాడులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా వారికి ప్రపంచ దేశాల సంఘీభావం లభిస్తోంది. అధికార అవామీ లీగ్ పార్టీ ఇటీవల జరిగిన ఘటనలను ఖండిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా మత సామరస్య ర్యాలీలు, శాంతి ఊరేగింపులు నిర్వహించింది. ప్రతి ఒక్కరి మత స్వేచ్ఛను కాపాడేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ విద్యావేత్తలు, నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. మతాలకతీతంగా వేలాది మంది విద్యార్థులు, విద్యావేత్తలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. మైనార్టీలపై దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఢాకా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మైనారిటీల ప్రాణాలను, వారి హక్కులను కాపాడడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విఫలమైందని, భారతదేశం దౌత్యపరమైన ఒత్తిడిని పెంచాలని ఏఐయూడీఎఫ్ అధ్యక్షుడు, ఎంపీ మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ కోరారు. ఇంకా వివిధ దేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ వాయిస్‌ను వినిపిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు, అల్లర్లలో రాజకీయ కుట్ర దాగి ఉందేమోననే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రధాని షేక్ హసీనాను బలహీనపర్చడానికే అల్లర్ల కుట్ర పన్నారని పలువురు విమర్శిస్తున్నారు. దాడులకు పాల్పడిన వారు ఎవరైనా విడిచి పెట్టేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే హెచ్చరికలు చేశారు. అయితే ఈ రాజకీయ కుట్రలో, అల్లర్లలో, దాడుల్లో బలవుతోంది ఆ దేశ అభివృద్ధి. అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న బంగ్లాదేశ్‌లో ఇలాంటి ఘటనలు అభివద్ధిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఈ దాడులను ఖండిస్తూ అనేక మంది ఇప్పటికే రోడ్లపైకి వచ్చారు. అయితే సామాన్య ప్రజలు తమ మౌనాన్ని వీడాలి. మైనార్టీలకు అండగా నిలబడాలి. వారి ప్రాణాలకు, ఆస్తులకు అండగా నిలవాలి. రాజకీయ కుట్రలను తిప్పి కొట్టాలి. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. వాటి ఫలాలు అందరికీ అందుతాయి. లేదంటే మతోన్మాదం ఎవరికైనా ప్రమాదమే, ఎక్కడైనా ప్రమాదమే.
సెల్: 9640466464
ఫిరోజ్ ఖాన్