Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన్మోహన్సింగ్ గవర్నమెంట్‌కు విధానపరమైన పక్షవాతం (పాలసీ పెరాలసిస్) వచ్చిందని, తానైతే ఎటువంటి శసభిషలు లేకుండా పెట్టుబడిదారుల కవరసమైన విధానాలు అమలు చేయగలనని (ఈమాట బహిరంగంగా ఆయన చెప్పలేదనుకోండి) ఘంటాబజాయించి 2014 ఎన్నికల ముందు మోడీ చెప్పారు. ''కావాలంటే దశాబ్దానికిపైగా నేను అభివృద్ధి చేసిన గుజరాత్‌ను చూడండి!'' అంటూ ఆయన తొడకొడ్తే పెంపుడు మీడియా వంతపాడింది. గుజరాతునంతా భూతద్ధంలో చూపింది. ప్రభుత్వరంగాన్ని దేశ, విదేశ కార్పొరేట్లకిస్తామని చెప్పి ఇవ్వలేక పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. కార్మిక చట్టాలన్నింటిని చుట్టిపారేస్తానన్న వాగ్దానం అమలు చేయలేక పోయింది. కార్పొరేట్లకు అవసరమైన పద్ధతుల్లో భూమి కూడ కట్టబెట్టలేకపోయింది. ఆయన ఉద్దేశంలో 2013 భూసేకరణ చట్టం ఉన్నట్లుంది. ఇవన్నీ విధానపరమైన పక్షవాతానికి నిదర్శనాలని మోడీసాబ్ అభిప్రాయం.
అధికార పగ్గాలు చేపట్టిన మొదటి స్వాతంత్య్ర దినోత్సవంనాడే ప్రణాళిక సంఘానికి మంగళం పాడారు. దానిస్థానం నిటి ఆయోగ్ తీసుకుంది. దానిపనే ప్రభుత్వరంగ పరిశ్రమలను కూల్చడం. మౌలికంగానే ఆరెస్సెస్, బీజేపీలు ప్రభుత్వరంగానికి, ప్రభుత్వ నియంత్రణలకు వ్యతిరేకం. స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలనేది దాని అభిమతం. జన సంఘం వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ రచనలే దీనికి నిదర్శనం. 1999 వాజ్‌పారు పాలనలో బాల్కో, హిందుస్థాన్ జింక్‌లు స్టెరిలైట్‌కు, ఐ.పీ.సీ.ఎల్.ను రిలయెన్స్‌కు, విఎస్ఎన్ఎల్ను టాటాలకు తెగనమ్మారు. ప్రయివేటు యాజమాన్యంలో ఇవన్నీ పూర్తిగా విఫలమైనాయి. దాంతో వ్యూహాత్మక అమ్మకాలకు తెరతీసింది మోడీ సర్కార్. అంటే 51శాతం మించి వాటాల అమ్మకం అన్నమాట. ఈనేపథ్యంలో నేడు దేశంలో జరుగుతున్న ప్రయివేటీకరణల్ని చూడాలి.
ఎయిరిండియా ''ల్యాండింగ్'' ఏమౌతుందో!
ఎయిరిండియా మళ్ళీ తండ్రి ఒళ్లోకి (తల్లి లేకపోతే ఏం చేస్తాం? రతన్‌టాటా ఘోటక బ్రహ్మచారి) చేరినందుకు ప్రభుత్వరంగం 'పీడ' విరగడైందని ఆర్థిక ''సంస్కర్తలు'' పండగ చేసుకుంటూంటే దాని పరిణామాలెలా ఉంటాయో ఊహించుకో(లే)ని జనం కొందరు ఆ బ్యాండు మేళానికి డాన్స్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యం తీవ్ర ఇక్కట్ల పాలయ్యే వారు సైతం ఈ బృందగానంలో గొంతు కలుపుతుండటం ట్రేడ్ యూనియన్ ఉద్యమ బలహీనతే!
''నాడు పదోన్నతులు ఆలస్యం చేయబడేవి. నేడు ప్రతినెలా జీతాలు కూడా ఆలస్యమే'' అన్నది ఇటీవల రిటైర్ అయిన కొందరు ఎయిరిండియా ఉద్యోగుల వేదన. నష్టాలపాలవుతున్న ఈ సంస్థలో గత ఏడు సంవత్సరాలుగా జీతాల్లో కోత పెడుతున్నారు. కోవిడ్ దెబ్బకి గత సంవత్సరం నుండి 60శాతమే జీతాలిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రయివేటు వారి చేతిలోకి పోయింది కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్ సంస్థల్లో లాగా తమ జీతాలు పెరుగుతాయని ఆశిస్తున్నామని ప్రస్తుతం ఎయిరిండియా నుండి టాటాసన్స్కు బదలాయించబడ్డ ఓ కుర్ర పీరు ఆశ వ్యక్తం చేస్తున్నాడు. పాపం! ఎవరైనా ఆశపడటంలో తప్పుండదు కాని, ప్రభుత్వరంగ కార్మికోద్యమం దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు ప్రయివేటులో కొనసాగుతాయనుకోవడం పేరాశే! మెడికల్ బిల్స్, రిటైరైన వారి కుటుంబాలకు ఫ్రీట్రిప్స్ వంటివి ఉంటాయో, ఊడతాయో సందేహమేనను కుంటున్నారు.
ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఎయిరిండియాలో ఉన్నారు. (8084+శాశ్వత +4001 కాంట్రాక్టు) రానున్న ఐదేండ్లలో 5000 రిటైర్ కానున్నారు. ఇప్పుడు సర్కార్‌వారి 'పాట' ప్రకారం ఒక సంవత్సరంపాటు ఏ ఒక్కర్నీ తొలగించరు. దీని అర్థం ఏ సాధారణ ట్రేడ్ యూనియన్ కార్యకర్త నడిగినా చెప్తాడు. ప్రభుత్వరంగంలో ఉండటం వల్లనే ఎయిరిండియా నష్టాల్లో ఉందనే వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశమేమంటే ఇదే టాటాగారి విస్తార ఎయిర్‌లైన్స్, ఎయిరేషియా రెండూ నష్టాల్లోనే ఉన్నాయి. ఎయిరిండియా కోసం బిడ్ వేసిన జెట్ ఎయిర్వేస్ కూడా నష్టాల్లోనే ఉంది. రకరకాల కారణాలతో ప్రపంచ వ్యాపితంగా అనేక ఎయిర్‌లైన్ సంస్థలు నష్టాలు మూటకట్టుకున్నాయి. ఇటీవల కోవిడ్ తర్వాత 'సింగపూర్ ఎయిర్‌లైన్స్' కూడా నష్టాలపాలైనట్టు తెల్పింది.
లాభ సముపార్జనార్థం...!
పెట్టుబడి లాభం వైపే పరుగెడుతుంది. ఇది పదే పదే రుజువు అయిన సత్యం. మనదేశంలో దీనికి వాళ్ళు ఎంచుకునే మార్గాలు అనేకం. దీనికి ఒక ఉదాహరణ... టిస్కోలో దుక్క ఇనుము తయారీ ఏనాడో ఆపేశారు. దుక్క ఇనుము తయారీ నష్టాలకు దోహదకారి. తనకీ లాభాలు రావాలని 1990వ దశకంలో సెయిల్ కూడా దుక్క ఇనుము ఉత్పత్తి తగ్గిస్తే బొంబాయిలో కొన్ని వేల ఫోర్జింగ్ పరిశ్రమలు మూతపడి లక్షమందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయినట్టు, విదేశాల నుండి వేల కోట్ల డాలర్లు వెచ్చించి దుక్క ఇనుము దిగుమతి చేసుకున్నట్టు ఆనాటి ఫైనాన్షియల్ పత్రికలు తెలిపాయి. అంటే వెరసి సెయిల్‌కి లాభాలు రావాలంటే దేశం నష్టాల పాలవ్వాలన్నమాట. రెండవది. పనిగంటలు పెంచడం ద్వారా, పని తీవ్రత పెంచడం ద్వారా లాభాలు సంపాదించుకోవడం. నేడు మోడీ పాలన ఈ రెంటినీ చేసిపెడుతోంది. మొన్న సెప్టెంబర్ నెలలో మన రాష్ట్రంలో జరిగిన పాదయాత్రలో వెలుగు చూసిన నిజాల్లో ఒక కీలకమైనది ఇదే. 12గంటల పనిదినం సర్వత్రా కనపడింది. అధునాతన యంత్రాల ప్రవేశం దోపిడీ తీవ్రతను పెంచింది. మూడవది. యజమాని - కార్మిక సంబంధాల్లో వచ్చిన మార్పు ఈ దోపిడీని ఎన్నో రెట్లు పెంచింది. ''సులభతర వ్యాపారం'' పేరుతో ప్రచారంలోకి వచ్చింది ఇదే. నాల్గవది. కార్మిక చట్టాల 'సరళీకరణ'. మొత్తం సంఘటిత రంగంలో కాంట్రాక్టు కార్మికులు 1985-96 మధ్య 10.54శాతం నుండి దాదాపు మూడింతలు పెరిగి 28శాతానికి చేరారు. 'యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండిస్టీస్' ప్రకారం 'నెట్ వాల్యూ యాడెడ్'లో వేతనాల భాగం 1980లో 30శాతం నుండి 2009 నాటికి 9.5శాతానికి, 2020-21 నాటికి ఇంకా తగ్గింది. నేడు దాదాపు కాంట్రాక్టు కార్మికులతోనే ఉత్పత్తి సాగుతున్నది. ఇదే దశలో లాభాలు 15శాతం నుండి 55శాతానికి పెరిగాయి. దీనికి ప్రధాన కారణం పైన తెలిపిన దోపిడీ పద్ధతులే! మరో కీలకాశం సహజవనరులైన భూమి, గనులు, అడవులు, స్పెక్ట్రమ్, రోదసి వరకు కార్పొరేట్ల పరం చేయడం. ఇది నేడు నిరాఘాటంగా జరిగిపోతున్నది. ఇవన్నీ సరళీకృత విధానాల 'పుణ్యం'. దీనికి మోడీ మొనగాడు.
దీనికీ గుజరాతే...!
గుజరాత్లో 1940ల నుండి 1987-88 వరకు ఎప్పటికప్పుడు విడుదలయ్యే అసెంబ్లీ పాస్ చేసిన చట్టాలమీదే భూసంస్కరణలున్నాయి. 1995-96లో బీజేపీ ప్రభుత్వం చేసిన ఒక సవరణ గుజరాత్లో ''జమిందారీ వ్యవస్థను పునస్థాపించడానికే''నని ఆర్. రామచంద్రన్ రాశారు. 1990-2000 సంవత్సరాల మధ్య లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిని పారిశ్రామిక అవసరాల కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రెండూ వినియోగంలోకి తెచ్చాయి. మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక అశ్రిత పెట్టుబడిదారీ విధానం మూడు పువ్వులు ఆరు కాయలుగా ''వర్థిల్లింది''. అదానీకి కచ్‌లో ఏడువేల హెక్టార్ల భూమి 2000 సంవత్సరంలో పునరుద్ధరణీయ లీజుకు 30సంవత్సరాలు ఇచ్చింది. బెంగాల్ నుండి ''లాక్కొచ్చు''కున్న టాటా నానో ప్లాంట్‌కు వెయ్యి ఎకరాలు అమ్మేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ లేదు, రిజిస్ట్రేషన్ చార్జీలు లేవు, భూమి బదలాయింపు చార్జీలు లేవు. రూ.9570కోట్లు 0.1శాతం వడ్డీకి 20ఏండ్లలో చెల్లించాలి. దాదాపు పుక్కట్లో కట్టబెట్టడమంటే ఇదేగా! 2012-13లో కాగ్ మొహం వాచేలా చీవాట్లు పెట్టినా తుడిచేసుకున్నాడు మోడీసాబ్.
ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ సాంఘిక లంచాలు(సోషల్ బ్రైబరీ) అన్న దాన్ని మనదేశంలో మొదట ప్రారంభించింది గుజరాతే! అమ్మకం పన్ను తగ్గించడం, లేదా మినహాయించడం 1990లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. బీజేపీ 1995 తర్వాత దాన్ని మరింత పెంచింది. 1997లో టర్నోవర్ టాక్స్ ఎత్తేసింది. 2001లో ఆక్ట్రారు పన్ను 143 పట్టణాలు, 14000 గ్రామాలకు రద్దు చేసింది. కనీస వేతనాలు పెంచలేదు. ఆ రకంగా నాడు గుజరాత్లో ప్రారంభమైన దాన్ని ఆ తర్వాత దేశమంతా వివిధ పార్టీలు అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో కార్మికులు ఏమి ఏడ్చినా, ఎంత ఏడ్చినా మొన్న బండి సంజరు పాదయాత్రలో గాని, కిషన్‌రెడ్డి పాదయాత్ర లాంటి దాన్లోగాని కార్మికుల కనీస వేతనాల గురించి మాట్లాడంది అందుకే! మోడీ డంబాలు కొట్టినట్టు గుజరాత్ ''గ్రోత్ ఇంజన్'' కాదు, ప్రజల జీవితాలను విధ్వంసం చేసే మోడల్. అదే ఆ తర్వాత వివిధ పాలక పార్టీలకు ఆదర్శమైంది.
''విజయానికి తండ్రు లెక్కువ!'' అనే విషయం మనకు తెలుసు. మన దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుండీ పారిశ్రామికంగా అభివృద్ధి అయిన రాష్ట్రం గుజరాత్. 1995 తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలు ముప్పిరిగొన్నాయి. రైతులను, కార్మికులను అణగదొక్కి పాలన చేశాయి మొదట కాంగ్రెస్, ఆ తర్వాత గత పాతికేళ్లుగా బీజేపీలు. 2014 నాటికి చివరి మొగల్ మోడీసాబ్. పాటిదార్ (పటేల్) ఉద్యమం గుజరాత్ మోడల్ డొల్లతనాన్ని బయటపెట్టింది. మిగిలిన ఆకాస్తానూ కరోనా బహిర్గతం చేసింది.
ఆర్. సుధాభాస్కర్