Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ పరిణామ క్రమంలో పాతరాతియుగం నుంచి నేటి నవ్య నానో డిజిటల్ యుగం వరకు జరిగిన శాస్త్రసాంకేతిక విప్లవంతో మానవాళి జీవనశైలిలో సమూలంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచమే ఓ కుగ్రామమై పోయింది. ఈ-మెయిల్, యూట్యూబ్, వాట్స్ అప్, ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ లాంటి సామాజిక మాధ్యమాలు మన నిత్యజీవితంలో భాగం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల వ్యవస్థను రిమోట్ కంట్రోల్ ద్వారా అనుసంధానం చేస్తూ సమాచారాన్ని ఒకరి నుండి మరొకరికి చేర్చడాన్ని అంతర్జాలంగా చెప్పుకుంటున్నాం. ఇంటర్నెట్ లేదా ఇంటర్‌కనెక్టెడ్ నెట్వర్క్ వాడకుండా గంట గడవడం అసాధ్యంగా తోస్తున్నది. అరచేతిలో వైకుంఠం చూపే స్మార్ట్ ఫోన్ మానవ శరీరంలో ఒక శాశ్వత అంగమై కూర్చుంది. నేటి 'వరల్డ్ వైడ్ వెబ్ (డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ)'ను 1989లో 'టిమ్ బెర్నర్స్ - లీ'లు కనుగొన్నారు. వరల్డ్ వైడ్ వెబ్, అంతర్జాల (ఇంటర్నెట్) ప్రక్రియల ఆవిష్కరణల తరువాత గత 30సంవత్సరాలుగా సాంకేతిక విప్లవం కొత్తపుంతలు తొక్కుతోంది. 29 అక్టోబర్ 1969 రోజున ప్రప్రథమంగా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో 'చార్లీ క్లైన్, లియొనార్డ్ క్లీన్రాఖ్'ల చోరవతో తొలి ప్రయత్నంగా 'యల్' అండ్ 'ఓ' అనే 'లాగిన్' పదాన్ని ఎలక్ట్రానిక్ ఇంటర్నెట్ మెసేజ్ ద్వారా విజయవంతంగా పంపించడం జరిగింది.
అంతర్జాల అద్భుత ఆవిష్కరణతో ప్రపంచ వ్యాప్తంగా పలు ఆధునిక డిజిటల్ రంగ అనువర్తనాలు వ్యక్తి జీవితంలో పెను మార్పులకు దారి తీస్తున్నాయి. అంతర్జాల డిజిటల్ విప్లవ ప్రాధాన్యతను గమనించిన సాంకేతిక సమాజం 2005 నుండి ప్రతియేటా 29 అక్టోబర్ రోజున ''అంతర్జాతీయ అంతర్జాల దినం (ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ డే)'' పాటించడం జరుగుతున్నది. ప్రారంభంలో ఇంటర్నెట్ను 'ఆర్పనెట్'గా పిలిచేవారు. ప్రస్తుత రూపం 'ఇంటర్నెట్'గా పిలువబడుతూ అసాధారణ విస్తరణతో 'ఇన్ఫర్మేషన్ సూపర్‌హైవే' స్థాయి రావడం వెనుక అనేక మంది శాస్త్రజ్ఞులు, ప్రోగ్రామర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కృషి దాగి ఉందని గమనించాలి. ఇంటర్నెట్లో 'సర్ఫింగ్' అనే పదాన్ని 1992లో 'జీన్ ఆర్మర్ పోల్లీ (నెట్ మమ్ అని కూడా పిలుస్తారు)' ప్రవేశపట్టడం జరిగింది. గూగుల్ సహాయంతో ఒక ప్రశ్నకు కంప్యూటర్ 0.2 సెకన్లలో సమాధానం ఇస్తున్నది. అంతర్జాల సహాయంతో ఫేస్బుక్ సామాజిక మాద్యమాన్ని 2004లో 'మార్క్ జుకెర్‌బర్గ్' కనిపెట్టడం జరిగింది. 1971లో 'రే టాంలిన్సన్' ప్రప్రథమ ఈ-మెయిల్ పంపడంతో ఆరంభమై, నేడు 3.6 బిలియన్ల ఈ-మెయిల్ అకౌంట్లతో రోజుకు 294 బిలియన్ల ఇంటర్నెట్ ఈ-మెయిల్స్ ప్రపంచవ్యాప్తంగా పంపించే స్థాయికి చేరింది. 1990లో మైక్రోసాఫ్ట్ విండోస్, 1994లో యాహూ, 1995లో ఇంటర్నెట్ ఎక్సప్లోరర్, 1998లో గూగుల్, 2006లో ట్విట్టర్ లాంటి అనేక యాప్‌లు వాడుకలోకి వచ్చాయి. 23 ఏప్రిల్ 2005న తొలి 'యూ ట్యూబ్' వీడియోను సాంకేతిక నిపుణుడు 'సాన్ డీగో జూ' అప్లోడ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడడానికి 50మిలియన్ హార్స్ పవర్ విద్యుత్తు అవసరం అవుతున్నది. ప్రస్తుతం గూగుల్‌ను 'కింగ్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్స్'గా పిలుస్తున్నారు. గూగుల్ పదానికి విస్తరణగా 'గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్'ను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, ట్యాబులు, కంప్యూటర్లు, లాప్‌లాప్‌లు, కెమెరాలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు వైఫై సహాయంతో ఇంటర్నెట్ సౌకర్యాలను పొందడం వరంగా మారింది. నేడు విశ్వవ్యాప్తంగా ఒక బిలియన్ వెబ్సైట్లు వాడుకలో ఉన్నాయి. అంతర్జాల ఆధార కంపెనీలు మైక్రోసాఫ్ట్ 75 బిలియన్లు, ఆపిల్ 45 బిలియన్లు, ఫేస్బుక్ 44 బిలియన్లు, గూగుల్ 35 బిలియన్ల అమెరికన్ డాలర్ల బడా వ్యాపారం చేస్తున్నాయి.
అంతర్జాలంతో ఎలక్ట్రానిక్ మెయిల్స్, పరిశోధనలు, డౌన్లోడ్ ఫైల్స్, ఆన్లైన్ చర్చలు, గేమ్స్, ఈ-విద్య, స్నేహం, ప్రింట్ మీడియా, సామాజిక మాద్యమాలు, విజ్ఞాన వినిమయం, చలన చిత్రాలు, ఫైల్ ట్రాన్సఫర్, వర్చువల్ సమావేశాలు, ఈ-లైబ్రరీ, కృత్రిమ మేధ, ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలగు అనేక రంగాలలో విస్తృత ఉపయోగాలు ఉన్నాయి. మానవాళికి అంతర్జాలం గొప్ప వరంగా మారినప్పటికీ, మరో కోణంలో శాపంగా పరిణమించడం విచారకరం. పిల్లలకు కరోనా విధించిన ఆన్లైన్ ఈ-తరగతులతో ఉపయోగపడుతున్న స్మార్ట్ ఫోన్లు మరో వైపు అశ్లీల అభ్యంతరకర అంతర్జాల మాద్యమాలు అరచేతిలో అందుబాటులోకి రావడం వారి భవిష్యత్తుకే ప్రమాదకరంగా మారుతోంది. స్మార్ట్ ఫోన్ వినియోగం దుర్వ్యసనంగా మారింది. నీలికాంతితో కంటి చూపు దెబ్బతినడం, సమయం వ్యర్థం చేయడం, నేర ప్రవృత్తికి బీజాలు పడడం, ఓపిక నశించడం, అనారోగ్య సమస్యలు, ఏకాగ్రత లోపించడం, సమాజానికి దూరంగా ఒంటరితనం కోరుకోవడం, దురలవాట్లను ప్రేరేపించడం, అశ్లీల సైట్లకు అలవాటు పడడం, పనిలో శ్రద్ద తగ్గడం, స్థూలకాయ రుగ్మతలు, అనవసర వస్తువులు ఆన్లైన్లో కొనడం, నిద్రలేమి, సైబర్ నేరాలు మొదలగు విష ప్రభావాలను సమాజం చవిచూడవలసి వస్తున్నది. అంతర్జాల నేరాలను కట్టడి చేయడానికి సైబర్ నేరాల అదుపునకు సంబంధించిన కొత్త చట్టాలు కూడా అందుబాటులోకి రావడం చూస్తున్నాం. ఇంటర్నెట్ను సురక్షితంగా మానవాళి అభివృద్ధికి వాడుతూ, దుష్ప్రభావాలకు దూరంగా ఉంటూ ముందుకు సాగాలి. అంతర్జా లాన్ని మానవాళి సుఖజీవనానికి, సామాజిక ప్రగతికి వినియోగించుకుందాం. 'ఇంటర్నెట్ ఈజ్ ఫర్ బెట్టర్‌మెంట్' నినాదాన్ని ప్రచారం చేద్దాం.
(29 అక్టోబర్ ''అంతర్జాతీయ అంతర్జాల దినం'' సందర్భంగా)
డాక్టర్ బి.ఎం.ఆర్. రెడ్డి, సెల్: 9949700037