Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాశ్మీర్ లోయలో తీవ్రవాద గ్రూపులు మైనారిటీలను, వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ప్రాణాలు తీస్తున్న ఘటనలు మొత్తంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని తీవ్ర నిరాశా, నిస్పృహల్లో ముంచెత్తుతున్నాయి. స్కూలు టీచర్లను, వీధి వ్యాపారులను, వలస కార్మికులను చంపాలన్న వారి పైశాచిక లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఇది మతపరమైన విభజనను మరింత తీవ్రతరం చేస్తున్నది. అంతేగాకుండా ప్రజలు వేరే చోటుకు తరలిపోవడానికి దారి తీసే పరిస్థితులను సృష్టిస్తోంది.
2019 ఆగస్టు నుండి కేంద్ర పాలనలో ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మూ కాశ్మీర్ పట్ల ముఖ్యంగా కాశ్మీర్ లోయలోని ప్రజల పట్ల కేంద్రం ఏ రీతిన వ్యవహరిస్తున్నదో చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. 370, 35ఎ అధికరణలను రద్దు చేయడం, పైగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడమనేవి ప్రజలను, భారత్‌కు బాసటగా నిలబడిన లోయలోని లౌకిక రాజకీయ శక్తులను శిక్షించడానికి ఉద్దేశించిన ప్రతీకార చర్యలు. మత పరంగా జమ్మూ కాశ్మీర్‌ను విభజించడానికి, లోయలోని ముస్లిం జనాభాను అణచివేయడానికి, కాశ్మీరీయత్ను ధ్వంసం చేయడానికి చర్యలు తీసుకోవడంలో మోడీ-అమిత్ షా ద్వయానికి ఎలాంటి పరిధులు లేవు. కాశ్మీరు లోయలోని ప్రధాన రాజకీయ పార్టీలను అణచివేయడం ఈ ఎజెండాతో ముడిపడి ఉంది.
జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య రాజకీయాలకు స్థానం లేకుండా చేయడం, అసమ్మతి వ్యక్తం చేసే అభిప్రాయాలన్నింటినీ అణచివేయడం, మీడియా నోరు నొక్కడం, దీనికితోడు భారీ బందోబస్తు, ఇవన్నీ కలిసి తీవ్రవాద శక్తులు పెచ్చరిల్లడానికి, హింసాత్మక కార్యకలాపాలు పెరగడానికి దారి తీసింది. ఈ తీవ్రవాద శక్తులకు పాకిస్థాన్ నుండి తోడ్పాటు అందుతోంది. అమాయకులైన పౌరులను లక్ష్యంగా చేసుకున్న ఈ తీవ్రవాద శక్తులకు దొరుకుతున్న స్వేచ్ఛ చూసినట్లైతే... రాష్ట్రంలో పని చేస్తున్న తీవ్రవాద యంత్రాంగాలు అన్నింటినీ బల ప్రయోగంతో అణచివేశామని చెబుతున్న ప్రభుత్వ వాదనలు పాక్షిక సత్యాలేనని తేలుతోంది.
మతపరమైన, కాశ్మీరీ, కాశ్మీరీ యేతర అంశాల పైన విభజన తీవ్రతరం కావడమే తీవ్రవాద శక్తులు సాధించిన ప్రయోజనంగా ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విచ్ఛిన్నకర, హిందూత్వ విధానాలు కూడా ప్రజలను మరింత వేరు చేశాయి. అది తీవ్రవాద శక్తులకు మరింత సాయపడుతోంది. ఈ పోకడలను ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రజాస్వామ్య రాజకీయ కార్యాచరణ లేదు. తీవ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా నిరంతరంగా భద్రతా బలగాల కార్యకలాపాలు సాగుతున్నాయి. అయినప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించడం, రాజకీయ కార్యకలాపాలపై గల ఆంక్షలన్నింటినీ తొలగించడం, రాజకీయ చర్చలను, పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించడం మాత్రమే క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని మెరుగుపరిచే ఏకైక మార్గం. అప్పుడు తీవ్రవాద శక్తులను ఏకాకులను చేసే, తీవ్రవాదుల హింసను ఎదుర్కొనగలిగే ప్రజాస్వామ్య వాతావరణం నెలకొనగలుగు తుంది.
జమ్మూ కాశ్మీర్లో మైనారిటీలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న హింసను దేశంలో మిగిలిన ప్రాంతాల్లో జరుగుతున్న హింసతో వేరు చేసి చూడరాదు. ముస్లిం వ్యతిరేక ఎజెండాను ఒక పద్ధతి ప్రకారం పెంచి పోషించడంలో బీజేపీ -ఆర్.ఎస్.ఎస్ కూటమి తలమునకలై ఉంది. ముస్లింలపై దాడి జరిగిందన్న వార్తలు లేకుండా, మైనారిటీలపై విద్వేష ప్రచారం సోషల్ మీడియాలో రాకుండా ఒక్క రోజు కూడా గడవదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే హిందూత్వ సంస్థలకు రక్షణ కల్పించబడుతోంది. కర్నాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవ ఆరాధనా స్థలాలు, ప్రార్థనా సమావేశాల వేదికలు దాడులకు గురవుతున్నాయి. పాలక పార్టీ, హిందూత్వ సంస్థల మైనారిటీ వ్యతిరేక ఎజెండా... కాశ్మీర్‌లోని ఛాందసవాద, తీవ్రవాద శక్తులకు... తమ చర్యలను సమర్థించుకోవడానికి కావాల్సిన వాదనలను అందిస్తోంది.
బంగ్లాదేశ్‌లో హిందువులపై, ఆలయాలపై ఛాందసవాద శక్తులు ఇటీవల జరుపుతున్న దాడులు చూస్తుంటే, దక్షిణాసియా దేశాల్లో మతోన్మాద రాజకీయాలు, ఛాందసవాదం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయనేది గుర్తు చేస్తోంది. దుర్గాపూజ సమయాల్లో హిందువుల వ్యతిరేక భావనలు రెచ్చగొట్టడానికి గానూ ఖురాన్‌ను అవమానించేలా దైవ దూషణకు పాల్పడుతూ సోషల్ మీడియా ద్వారా సాగిన ప్రచారం అంతా ఒక ప్రణాళిక ప్రకారం జరిగినట్లు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చెలరేగిన మతోన్మాద హింసకు సంబంధించిన 17 ఘటనల్లో ఆరుగురు మరణించారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని షేక్ హసీనా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే వందలాది మంది అల్లరిమూకలను అరెస్టు చేసింది. కానీ, భారత్‌లో చోటు చేసుకుంటున్న ముస్లిం వ్యతిరేక దాడులు బంగ్లాదేశ్‌లో ఛాందసవాద శక్తులకు ఆజ్యం పోస్తున్నాయని బంగ్లాదేశ్‌లో విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
దక్షిణాసియా వ్యాప్తంగా మైనారిటీలపై మత, జాతి పరమైన దాడులు జరుగుతున్నాయి. మెజారిటీ కమ్యూనిటీకి చెందిన ఛాందసవాద, మతోన్మాద శక్తులు ఈ దాడులకు దిగుతున్నాయి. శ్రీలంకలో, సింహళ బౌద్ధమత దురభిమాన శక్తులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. పాకిస్థాన్‌లో, షియా వంటి మైనారిటీ ముస్లింలు నిరంతరం హింస భయంతోనే బతుకుతున్నారు. తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ మత పరమైన, జాతి పరమైన మైనారిటీలను సహించటం లేదు.
దక్షిణాసియా దేశాల్లోని పాలక వర్గాలు మత దురభిమానాన్ని, జాతి జాతీయవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ దేశాల్లోకెల్లా భారత్ చాలా శక్తివంతమైన దేశం. ఈ సమాజాల్లోని మతపరమైన, సామాజిక, సాంస్కృతిక సాంప్రదాయాల సంక్లిష్టత వల్ల భారత్‌లోని హిందూత్వ మతోన్మాదం, హిందూ జాతీయవాదం అనివార్యంగా తమ పొరుగు దేశాల్లో సమాంతర ప్రతిస్పందనలను రెచ్చగొడతాయి. సమాన అభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కీలకంగా గల రాజకీయాల్లో లౌకిక, ప్రజాస్వామ్య విలువలను నొక్కి చెప్పడం ద్వారా మాత్రమే దక్షిణాసియా ఉజ్వల భవితకు, ప్రగతికి మార్గం సుగమం కాగలదు. - 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం