Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జహీర్ బేగ్, కర్నాటక రాష్ట్రంలోని చిక్బల్లాపూర్ జిల్లాలో బాగిపల్లి తాలూకాలోని దిగవనెట్టకుంటపల్లికి చెందిన ఒక వ్యవసాయ, వలస కార్మికుడు. గ్రామంలోని ప్రధాన రహదారిలో ఉన్న ఇంటి ముందు భాగంలో అతని కుటుంబం ఒక చిన్న కూరగాయల దుకాణాన్ని కూడా నడుపుతుంది. బాగేపల్లి తాలూకాలోని గ్రామాలలో ఏప్రిల్, జూన్ మాసాల మధ్య కాలంలో కోవిడ్-19 రెండవ దశ వ్యాపించడం వలన బేగ్, అతని స్నేహితుడు ఖలందర్ ఖాన్ అనే వ్యవసాయ కార్మికుడు (భారత ప్రజాతంత్ర యువజన సంఘం (డీవైఎఫ్ఐ) కార్యకర్త) ప్రతీరోజూ ఉదయం 8 గంటల సమయంలో మందుల పెట్టెతో బేగ్ కూరగాయల దుకాణం ముందు కనిపించేవారు. వారు గ్రామంలో కోవిడ్-19 లక్షణాలున్నవారిని పర్యవేక్షించడానికి అవసరమైన ప్రాథమిక శిక్షణ కూడా పొందారు.
1200 జనాభా ఉన్న గ్రామంలో, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, ఇతర లక్షణాలున్న గ్రామస్థులు బేగ్ దుకాణం వద్దకు చేరుకునేవారు. మొదటి రోజు ఆ లక్షణాలున్న వారికి బేగ్ జ్వరం, శ్వాస రేటును నమోదు చేసి, ప్రాథమిక డోస్‌కు సంబంధించిన మందులు (డోలో-650, సిట్రిజిన్, డాక్సీ సైక్లిన్) డాక్టర్ అనీల్ కుమార్ అవులప్ప సలహా మేరకు ఇచ్చేవాడు. బేగ్ ప్రతీ రోగికి సంబంధించిన వివరాలను ఒక నోట్ బుక్‌లో నమోదు చేసేవాడు. ఆ గ్రామంలోని 60 మందికి మొదటి డోస్ మందులు ఇస్తే 60 మంది పూర్తిగా కోలుకున్నారు.
దిగవనెట్టకుంటపల్లికి 10కీ.మీ దూరంలో ఉన్న నరిమద్దిపల్లికి చెందిన మబ్బాషా (అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘానికి అనుబంధంగా ఉన్న కర్నాటక రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘానికి చెందిన కార్యకర్త), అతని బృందంలో ఉన్న ముగ్గురు వాలంటీర్లు, ఆ గ్రామంలోని 2వేల మంది ప్రజలలో కోవిడ్ లక్షణాలను పర్యవేక్షించారు. అక్కడ వెయ్యి మందికి మొదటి డోస్ మందులు ఇచ్చారు. పక్కనున్న జంగాలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మిక సంఘం సభ్యుడు సీ.ఎం.వేమన్న, నలుగురు రోగులకు మొదటి డోస్ మందులు ఇచ్చినప్పటికీ వారిలో రోగ లక్షణాలు తీవ్రంగా ఉండడంతో డాక్టర్ అనీల్ కుమార్ అవులప్ప సలహా మేరకు రెండో డోస్ మందులు ఇవ్వడంతో వారు కోలుకున్నారని చెప్పాడు.
బేగ్, ఖాన్, మబ్బాషా, వేమన్నలు 160 గ్రామాలలో సేవలందిస్తున్న 480 వాలంటీర్లలో ఉన్నారు. బెంగుళూర్‌కు వంద కీ.మీ దూరంలో ఉన్న బాగేపల్లి, గుదిబండ తాలూకాలకు చెందిన గ్రామాల ప్రజలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు డా.అనీల్ కుమార్ అవులప్ప 480 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. బాగిపల్లిలో అవులప్పకు 30 పడకల ప్రజావైద్యశాల ఉంది. కర్నాటక రాష్ట్రానికి వెనుక భాగంలో ఉన్న కరువు ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన మెజారిటీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వ్యవసాయ కార్మికులు.
డా.అవులప్ప కరోనాను అదుపుచేసేందుకు అనుసరించిన సాధారణ పద్ధతులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకునేందుకు ''ఫ్రంట్ లైన్'' బాగిపల్లి తాలూకా పరిధిలోని నరిమద్దిపల్లి, సోమనాథపుర గ్రామపంచాయతీ పరిధిలోని 7 గ్రామాలను సందర్శించింది. అవులప్ప ప్రయివేట్, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో సరియైన సౌకర్యాలులేని ప్రాంతాల్లో కరోనాను అదుపుచేసేందుకు వాలంటీర్లకు శిక్షణ ఇచ్చాడు. బాగిపల్లి తాలూకాలో ప్రతీ రెండు పంచాయతీలకు కేవలం ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఈ ఏడు గ్రామాల్లోని వాలంటీర్లు కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు డా.అవులప్ప సలహా ప్రకారం వారు ఏ విధంగా వైద్యసేవలను అందించారనే విషయాలను ఫ్రంట్ లైన్‌కు తెలిపారు.
వాలంటీర్ వ్యవస్థ
గత సంవత్సరం కోవిడ్-19 పట్టణ, నగర ప్రాంతాలు దాటి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించినప్పుడు, అవులప్ప వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో చొరవ చూపాడు. బాగేపల్లి తాలూకాలోని గ్రామాలకు ఈ మహమ్మారి వ్యాపిస్తే (అక్కడున్న ఆరోగ్య మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకొంటే), చాలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని ఆయన తెలుసుకున్నాడు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కూడా అయిన ఈ డాక్టర్, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అనుబంధ సంఘాలైన డీవైఎఫ్ఐ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలకు చెందిన వాలంటీర్ దళాలను బాగేపల్లి, గుదిబండ తాలూకాలలో ఒక్కచోటకు చేర్చాడు. ఆ ప్రాంతంలో సీపీఐ(ఎం) ఒక ఘనమైన, సుదీర్ఘమైన పోరాట చరిత్రను కలిగి ఉండడం వలన ఆయన చొరవ చేసి మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి చాలా సహాయపడిందన్న మాట వాస్తవం. వెంటనే మూడు నుంచి ఐదుగురు వాలంటీర్లున్న బృందాలను, అవులప్ప నెట్ వర్క్ విస్తరించిన 160 గ్రామాలలో (గ్రామానికి ఒక బృందం చొప్పున) అందుబాటులో ఉంచారు.
గత సంవత్సరం అవులప్ప వాలంటీర్లకు, కోవిడ్-19 లక్షణాలు, దాని నివారణా చర్యలను వివరిస్తూ, పద్నాలుగు శిక్షణా సమావేశాలను నిర్వహించాడు. కరోనా మహమ్మారి మొదటి దశ వ్యాప్తి సమయంలో, అవులప్ప వ్యవసాయ కార్మికులలో వివిధ జబ్బులతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి వైద్య సేవలు అందించడానికి తన విస్తృతమైన నెట్ వర్క్‌ను ఉపయోగించాడు. కార్మికులలో అనేక మంది కొద్ది మొత్తంలో వ్యవసాయ భూములను కలిగి ఉన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం లాంటి పథకాల కింద పని చేస్తూ, వచ్చిన కొద్దిపాటి వేతనాలతో బతుకులీడుస్తున్నారు.
''కరోనా మొదటి దశలో సీనియర్ సిటిజన్స్, అనారోగ్యంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతూ, ప్రమాదపుటంచున ఉన్న బలహీనవర్గాల ప్రజలపై కేంద్రీకరించాం, కానీ వైరస్ వల్ల కలిగే ప్రమాదాల పట్ల సామాన్య ప్రజానీకంలో భయంకరమైన ఉదాసీనత ఉండేది. కరోనా రెండవ దశ వ్యాప్తిలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామాలలో ప్రజలు అకాస్మాత్తుగా భయాందోళనలకు గురై వాలంటీర్ల సహాయాన్ని కోరారు. ఆ సమయంలో నేను, దక్షిణాఫ్రికాలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్ శంకర్ చెట్టి అనుసరించిన పద్ధతుల గురించి విన్నాన''ని అవులప్ప చెప్పాడు.
చెట్టి విధానాన్ని అనుసరిస్తూ, అవులప్ప తన బృందాలకు వైద్యానికి సంబంధించిన నియమనిబంధనలను తెలియజేస్తూ ముందుకు సాగాడు. రెండు ప్రభుత్వేతర సంస్థలు, ద రోటరీ బెంగళూర్ స్పందన Ê ద రైట్ టు లివ్ ఫౌండేషన్ (ఆర్టీఎల్ఎఫ్)లు థర్మల్ స్కానర్లు, పల్స్ ఆక్సీ మీటర్లు, మందులను సమకూర్చడం ద్వారా సహాయం చేశాయి. అవులప్ప అనుసరించిన విధానం పూర్తిగా ప్రత్యేకమైనది. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ ప్రజాస్వామికంగాను ఉంది కాబట్టి మా సంస్థ అవులప్పకు సహాయం అందించడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుందని ఆర్టీఎల్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టీ వీ శ్రీధర్ ఫ్రంట్ లైన్‌తో చెప్పాడు. ఆ విధంగా ప్రతీ గ్రామీణ కేంద్రంలో (వాలంటీర్లలో ఎవరో ఒకరి ఇల్లు) కోవిడ్ లక్షణాల పర్యవేక్షణకు అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉండేవి.
ఏప్రిల్ నెలలో కర్నాటకలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో, అవులప్ప ఆసుపత్రి కోవిడ్ రోగులతో నిండి పోయేది, కానీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఆయన వాలంటీర్ల సందేహాలను తరచుగా నివృత్తి చేసేవాడు. కోవిడ్ లక్షణాలు ఏ మాత్రం తగ్గని రోగులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించాడు. ఈ నూతన కార్యక్రమ పర్యవేక్షణను కర్నాటక రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంపీ మునివెంకటప్ప, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు సావిత్రమ్మ, ఆర్టీఎఫ్ఎల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్, డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు హరీషాలు పర్యవేక్షించారు. ప్రతీ రోజు ఉదయం ఆ ముగ్గురు బాగపల్లి నుండి బయలుదేరి కోవిడ్ నియంత్రణా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట మందులు సరఫరా చేసే పనిలో నిమగమై ఉండేవారు.
ప్రతీ రోగికి సంబంధించి వాలంటీర్ల దృష్టిలో ఉన్న రోగుల ఆరోగ్య నేపథ్యం, అవులప్ప నిష్కపటంగా నిర్వహించిన సేవల ప్రభావాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకు, బెస్తపల్లి గ్రామంలో కల్పన అనే ఒక అంగన్వాడీ కార్యకర్త, ఐద్వా సభ్యురాలు, మొదటి డోస్ మందులు తీసుకున్న 26 మంది గ్రామస్థుల వివరాలున్న ఒక నోట్‌బుక్ చూపించింది. ఆమె నమోదు చేసిన వివరాలలో, వ్యక్తి పేరు, భర్త లేదా తండ్రి పేరు, ఆక్సిజన్ స్థాయి, జ్వరం, వయసు, తేదీ (మొదటిసారిగా లక్షణాలు తీసుకున్నపుడు), రోగి లక్షణాలు, మందుల వివరాలు కోలుకున్న తీరు ఉండేవి. మొదటి డోస్ మందులు తీసుకున్న 26 మంది పూర్తిగా కోలుకున్నారని ఆమె చెప్పింది.
''గ్రామ స్థాయిలో ప్రజలు ఇంటి దగ్గర ఉండి ఏదైతే కోరుకున్నారో, అవులప్ప, అతని బృందం అదే చేశారు. ఆసుపత్రులకు వెళ్ళేందుకు గ్రామస్థులు భయపడిన సమయంలో వారు ప్రజలకు సేవలందించారు. కోవిడ్-19ను నియంత్రించడంలో వారి సేవల ప్రభావం చాలా ఉందని'' బాగిపల్లి తాలూకా ఆరోగ్య అధికారి డా. సీ ఎన్ సత్యనారాయణ రెడ్డి అన్నారు.
వాలంటీర్ల నుండి వివిధ గణాంక వివరాలను సేకరించే బాధ్యతను తీసుకున్న హరీషా అందించిన గణాంకాల ద్వారా, విజయవంతమైన ఈ కోవిడ్ నియంత్రణా చర్యలను అంచనా వేయవచ్చు. ''మే మొదటి వారం నుంచి జూన్ 15 వరకు, 1288 మందికి మొదటి డోస్ మందుల ద్వారా వైద్యం చేశారు. వారిలో ఎక్కువ మందికి మూడు, నాలుగు రోజుల తరువాత కోవిడ్ లక్షణాలు పూర్తిగా లేకుండా పోయాయి. కేవలం 43మందికి మాత్రమే రెండో డోస్ మందుల అవసరం ఏర్పడింది, కానీ వైరస్ సోకి చనిపోయిన వారెవ్వరూ లేరు, ఏ ఒక్కరూ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడలేదని'' హరీషా చెప్పింది.
''అవులప్ప చొరవతో చేపట్టిన తన చర్యలను ''సామాజిక పటిష్ట వ్యూహంగా'' వర్ణించాడు. ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు తగినన్ని లేనప్పుడు, మామూలు ప్రజల నాయకత్వం లో ప్రజానీకం యొక్క భాగస్వామ్యంతో చేపట్టిన చర్యలు ఉపయుక్తమైనవని స్పష్టంగా రుజువైంది.'' కోవిడ్-19 పెట్టుబడి దారీ వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది'' కాబట్టి ప్రజలు చేపట్టే చర్యల అవసరం ఉంటుందని మునివెంకటప్ప అన్నాడు.
రాబోయే కరోనా మూడో దశతో పోరాడే చర్యలను అవులప్ప సమర్థిస్తున్నాడు. ''గ్రామీణ భారతంలో ఆరోగ్య సంరక్షణా సేవలు భారీగా విస్తరించినప్పుడు మాత్రమే కరోనా మూడో దశ వ్యాప్తిని నిలువరించగలం. 1918-1920 మధ్య కాలంలో స్పానిష్ ఫ్లూ వ్యాప్తి చెందిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలలో మార్పు వచ్చింది. రష్యాలో ఆరోగ్య సేవలను ఉచితంగా అందించారు. యునైటెడ్ కింగ్ డంలో జాతీయ ఆరోగ్య సేవల స్థాపనకు దారితీసింది. కరోనా మహమ్మారి అంతం అయిన తరువాత, కార్పొరేట్ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను వదిలించుకొని, భారతదేశం ప్రజారోగ్య సంరక్షణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేయాలని'' అవులప్ప అంటున్నారు.
(''ఫ్రంట్ లైన్'' సౌజన్యంతో)
తెలుగు:బోడపట్ల రవీందర్, 9848412451
వికార్ అహమ్మద్ సయీద్