Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవటం కేవలం ప్రణాళికా లోపమే. పూర్తి నిర్లక్ష్యం, అసమర్థత ఫలితమే. దేశంలో విద్యుత్ సరఫరా సజావుగా సాగాలంటే బొగ్గు, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. మోడీ ప్రభుత్వం ఈ సమన్వయం సాధించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతోంది. ఎవరిని బలి చేయాలా అని దిక్కులు చూస్తోంది. ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కటంతో పెరిగే విద్యుత్ గిరాకీకి తగ్గట్లు మార్కెట్ శక్తులు అంతా సిద్ధం చేసుకుంటాయని, ఆపత్కాల నిల్వలు సిద్ధంగా ఉంచకోవాల్సిన అవసరం లేదని మోడీ ప్రభుత్వం గుడ్డిగా నమ్మింది. స్వంత క్యాబినెట్లో మంత్రుల మధ్య సమన్వయం లోపించటం, మార్కెట్ శక్తులు ప్రత్యేకించి ప్రయివేటు శక్తులు దేశ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయని ఆశించి ప్రభుత్వాలకు స్వత:సిద్ధంగా ఉండాల్సిన ప్రణాళికా వ్యవస్థను కుప్పకూల్చటం వల్లనే నేడు దేశం ఈ సమస్యను ఎదుర్కొంటోంది.
ప్రజలందరూ పండగలు జరుపుకోవటానికి సిద్ధమవుతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం దేశంలో విద్యుత్ సరఫరాలో కృత్రిమ కొరతకు తెరతీసింది. కోవిడ్ రెండో ఉప్పెన తర్వాత ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కుతున్నప్పుడు సహజంగానే విద్యుత్ వినియోగం పెరుగుతుందన్న అంచనా కనీస ఇంగితం గలవారెవరికైనా ఉంటుంది. దీంతో పాటు పండుగలు కూడా కలిసి రావటంతో విద్యుత్ వినియోగం పెరగటం సహజం. ప్రస్తుతం సాయంత్రంపూట ఎక్కువగా విద్యుత్ వాడే సమయంలో (సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకూ) వినియోగించే విద్యుత్‌కు అవసరమైన సరఫరా కంటే ఏడు వేల మెగావాట్లు తక్కువగా సరఫరా అవుతోంది. ఈ కొరత ప్రధానంగా పంజాబ్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్‌లో ఉంది. మరికొన్ని రాష్ట్రాలు సుదీర్ఘ విద్యుత్ కోత భయంతో ఉన్నారు. ఢిల్లీలో లోడ్ షెడ్డింగ్ జరగనున్నట్లు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. మిగిలిన రాష్ట్రాలు కూడా విద్యుత్ కొరతకు సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరుతున్నాయి.
ఈ కొరత కృత్రిమంగా సృష్టించబడిందన్న వాస్తవాన్ని మనం గమనించాలి. దేశంలో 3,90,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం ఉంది. ప్రస్తుతం సాయంత్రం పూటల్లో బాగా వినియోగిస్తే అయ్యే ఖర్చు 170000 మెగావాట్లు. అంటే ఉత్పత్తి సామర్థ్యంలో సగం కూడా వినియోగించుకోవటం లేదు. అలాంటప్పుడు పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్‌లో విద్యుత్ కొరత ఎందుకు తలెత్తింది?
ఒకవేళ విద్యుత్ వినియోగం పెరిగిందనే అనుకున్నా విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ... పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అవసరమైన ఉత్పత్తికి తగ్గట్లు బొగ్గు సరఫరాకు వీలుగా ఎందుకు సమన్వయం చేసుకోవటం లేదు? దేశంలోని 135 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందని విద్యుత్ శాఖ చెప్తోంది. కనీసం విద్యుత్ కేంద్రంలో 20రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ నాలుగు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయని కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ ప్రకటిస్తోంది.
వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి పరిమితంగా ఉంటుందన్నది తెలిసిందే. ఈ సంవత్సరం బొగ్గు గనులు ఎక్కువగా ఉన్న తూర్పు భారతంలో భారీ వర్షాలు, వరదలు కారణంగా బొగ్గు ఉత్పత్తి కుంటుపడింది. అందుకే వర్షాకాలం కంటే ముందే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తమకు కావాల్సిన ఆపత్కాల నిల్వలు సమకూర్చుకోవాల్సిందిగా కోల్ ఇండియా కంపెనీ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఎన్టీపీసి మొదలు ఏ విద్యుత్ ఉత్పత్తి కేంద్రమూ ఈ సలహాను పాటించలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో గత సంవత్సరం 60 డాలర్లుగా ఉన్న టన్ను ధర ఈ సంవత్సరం 180 నుండి 200 డాలర్లకు పెరగటం కూడా కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. టాటా, అదానీలు గుజరాత్‌లోని ముంద్రాలో నడుపుతున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ప్రధానంగా దిగుమతయ్యే బొగ్గు ఆధారంగా నడుస్తాయి. పైన చెప్పినట్లు అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు పెరగటంతో ఈ కంపెనీలు దిగుమతులు తగ్గించాయి. ఆ మేరకు ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.16-20 వరకూ ఉత్పత్తి వ్యయం అవుతోంది. అది కూడా బాగా గిరాకీ ఉన్న సమయంలో కావాల్సినంత విద్యుత్ సరఫరా సిద్ధంగా ఉంచటానికి వీలుగా మాత్రమే దేశీయ బొగ్గుతో పాటు దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే భారతదేశంలోనే బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. అటువంటిది మన దేశంలో బొగ్గు సరఫరా కొరత ఏమిటి? అందులోనూ కీలకమైన విద్యుత్ రంగానికి సరఫరా చేయలేనంత కొరత ఎందుకు వచ్చింది? గత కొన్ని నెలలుగా నామమాత్రపు నిల్వలతో ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు నడుస్తున్నాయి? ఆర్థిక వ్యవస్థ కోవిడ్ అనంతరం పట్టాలు ఎక్కుతుందని చెప్తున్న ప్రభుత్వం తదనుగుణంగా పెరుగుతున్న విద్యుత్ గిరాకీకి అనుగుణంగా సరఫరా చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదనంగా పండగల సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని కూడా ఈ ప్రభుత్వానికి తెలిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? ఇది దుర్మార్గమైన నిర్లక్ష్యం కాకపోతే మరేమిటి?
భారీ వర్షాలు, అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు పెరగటం వల్ల ఈ సమస్య తలెత్తిందని బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. గుడ్డిలో మెల్ల. బొగ్గు కొరత ఉంది అని అంగీకరించారు. సహజంగా ప్రభుత్వ లోపాలు, వైఫల్యాలు అంగీకరించే లక్షణం మోడీ ప్రభుత్వానికి గానీ, దాని అధికార ప్రతినిధులకు గానీ లేదు. ఈసారి ఎందుకో విదేశీ కుట్ర రాగాలాపన అందుకోలేదు. ఈ సంక్షోభానికి ప్రతిపక్షాలే కారణమన్న యథాప్రకారపు ఊకదంపుడు కూడా ఈసారి వినపడలేదు.
ఈసారి ప్రపంచంలోనే అతి పెద్ద బొగ్గు గనుల కంపెనీ అయిన కోల్ ఇండియాపై అభాండం మోపారు. 2016 నాటికి కోల్ ఇండియా వద్ద యాభై వేల కోట్ల రూపాయలుగా ఉన్న నగదు నిల్వల్లో 2021 నాటికి రూ.30 వేల కోట్లు ఆవిరయ్యాయి. రూ.20 వేల కోట్లు మాత్రమే మిగిలాయి. ప్రధానంగా డెవిడెండ్లు, ఇతర చెల్లింపుల రూపంలో ఈ రూ.30 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియా నుండి పీల్చేసింది. దీని అర్థం ఏమిటి? బొగ్గు గనుల తవ్వకానికి కావాల్సిన నిధులు సమకూర్చటానికి బదులు మోడీ ప్రభుత్వపు ఆర్థిక లోటును పూడ్చటానికి కోల్ ఇండియా తనవద్ద ఉన్న నగదు నిల్వలు కరిగించేసింది. ఇంకా సూటిగా చెప్పాలంటే మోడీ ప్రభుత్వం టాటాలు, అదానీలు, అంబానీలు, బిర్లాల నుండి వసూలు చేయాల్సిన వేల కోట్ల రూపాయలు వసూలు చేయకపోవటం వల్ల వచ్చిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలను ఊడ్చేస్తోంది.
దేశంలో బొగ్గు సరఫరా ప్రధానంగా రైల్వేల ద్వారానే జరుగుతుంది. ఈ రకంగా చూసినప్పుడు రైల్వేల ఆదాయంలో గణనీయమైన వాటాను కోల్ ఇండియా సమకూరుస్తుంది. బొగ్గు గనులు ప్రయివేటీకరించటం యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాల విధానాలుగా ఉన్నప్పటికీ దేశంలో అవసరమైన బొగ్గులో 85శాతం కోల్ ఇండియా సరఫరా చేసేదే. మౌలిక వసతుల రంగాన్ని అభివద్ధి చేయటానికి ప్రైవేటు రంగం ఒరగబెట్టిందేమీ లేదన్నది బొగ్గు సరఫరా విషయాన్ని పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఈ వాస్తవాన్ని అంగీకరించటం మార్కెట్ మాంత్రికులకు మింగుడుపడని విషయమే.
గత రెండేండ్లుగా కోవిడ్ 19 వాతపడిన అన్ని రంగాల్లాగానే బొగ్గు ఉత్పత్తి కూడా మందగించింది. విద్యుత్ వినియోగం కూడా మందగించింది. కోవిడ్ నియంత్రణలు రద్దు చేసి ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుతున్నప్పుడు విద్యుత్ వినియోగం పెరుగుతందని అర్థం చేసుకోవటానికి రాకెట్ తయారీ కోసం కష్టపడినంతగా శ్రమ పడనక్కర్లేదు. విద్యుత్ వినియోగం పెరగటం అంటే విద్యుత్ తయారీకి అవసరమైన బొగ్గు వినియోగం కూడా పెరగటం అన్నది ఇంగిత జ్ఞానానికి అందే విషయమే. జులై నుండి అక్టోబరు మధ్య కాలంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో అవసరమైన బొగ్గు నిల్వ చేసేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ, బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నాలేమిటి ?
ప్రతి విద్యుత్ ఉత్పత్తి కేంద్రమూ కనీసం 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉంచుకోవాలన్నది కనీసంగా పాటించాల్సిన నియమం. ఈ నియమాన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఎందుకు పాటించలేదు? అర్థం చేసుకోవటం తేలికే. ఆపత్కాల అవసరాలకు నిల్వ చేయటం అంటే అదనపు ఖర్చుకు సిద్ధపడటమే. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఎంత తక్కువ బొగ్గు నిల్వలు ఉంటే అంత ఎక్కువ లాభం. అవసరానికి మాత్రమే వాడుకోవటం అన్న పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానపు సూత్రాల్లో భాగమే ఇది. ప్రయివేటు పరిశ్రమల వద్ద నిల్వలు తక్కువగా ఉంచుకోవటమే లాభార్జన మార్గాల్లో ఒకటి. దీనివల్ల సరఫరాకు అంతరాయం వచ్చినా, ఇతర నష్టాలు జరిగినా ఆయా పరిశ్రమల నిర్వాహకులకేమీ పట్టదు. ఇవే పెట్టుబడిదారీ ఉత్పత్తి చలన సూత్రాలు. ప్రభుత్వ రంగం ఇవి తెలుసుకోలేకపోతోందనే సంస్కరణవాదుల ఏడుపు.
దేశీయ బొగ్గు కొరతను అధిగమించటానికి గత కొంత కాలంగా ఇండొనేషియా, ఆస్ట్రేలియాల నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ సంవత్సరం దిగుమతి చేసుకోలేదు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కూడా కోవిడ్ బారి నుండి క్రమంగా విముక్తి చెందుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు మూడు రెట్లు పెరిగాయి. గతంలో టన్నుకు 60 డాలర్లుగా ఉంటే ఇప్పుడు 200 డాలర్లు అయ్యింది. దాంతో ప్రధానంగా దిగుమతి చేసుకున్న బొగ్గుపైనే ఆధారపడిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఈ పెరిగిన ధరలకు కొనుగోలు చేయలేక ఉత్పత్తిని తగ్గించుకుంటూ వచ్చాయి.
గిరాకీ, సరఫరా ఒకదానితో ఒకటి పొసగనప్పుడు అవసరాలు తీర్చుకోవటానికి వీలుగా ఆపత్కాల నిల్వలు సిద్ధం చేసుకోవటం ఏ రంగానికైనా, ఏ ఉత్పత్తికైనా తప్పని పరిస్థితి. అయితే విద్యుత్ రంగంలో కీలక సమస్య ఉత్పత్తి అయిన విద్యుత్‌ను నిల్వ చేయటం. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మన అవసరాలకు తగినట్లుగా ఉత్పత్తి తగ్గించుకోవటమో పెంచుకోవటమో చేయొచ్చు. కానీ ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి వనరులైన పవన విద్యుత్ లేదా సోలార్ విద్యుత్‌లకు మళ్లిన తర్వాత ఇటువంటి పరిస్థితి తలెత్తితే దేశానికి ఉన్న మార్గం ఏమిటి ?
ఇక్కడ సమస్య కేవలం సోలార్ లేదా పవన విద్యుత్ సరఫరాల్లో ఎగుడు దిగుళ్లే కాదు. సాధారణంగా మనం సాయంత్రం వేళల్లో ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాము. ఆ సమయంలో సూర్యరశ్మి ఉండదు. ఇటువంటి పరిస్థితిని అధిగమించటానికి బ్యాటరీలతో కూడిన విద్యుత్ గ్రిడ్ నిర్మాణం ఓ ప్రత్యామ్నాయంగా చెప్తున్నారు. అంటే పగటి పూట సూర్యరశ్మి ఆధారంగా తయారయ్యే విద్యుత్‌ను ఇటువంటి భారీ బ్యాటరీల్లో భద్రపర్చి రాత్రుళ్లు వాడుకోవచ్చని చెప్తున్నారు. తాజా విద్యుత్ సంక్షోభం కేవలం రాత్రి, పగలు మధ్య విద్యుత్ కొరతలో తేడాల గురించిన సమస్యనే కాక రుతువుల ఆధారిత సమస్యలను కూడా ముందుకు తెచ్చింది. ఉదాహరణకు ప్రపంచంలోనే పవన విద్యుత్‌పై ఎక్కువగా ఆధారపడ్డ దేశం జర్మనీ. కానీ ఈ సంవత్సరం అనేక పర్యావరణ సమస్యల రీత్యా అక్కడ గాలి స్థంభించటంతో విద్యుత్ ఉత్పత్తి ఆశించినంత జరగలేదు. ఎంతవేగంగా గాలి ఉంటే అంత ఎక్కువగా పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దాంతో మరో మార్గం లేక మూలనపెట్టిన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను దుమ్ము దులిపి మళ్లీ ఉత్పత్తి ప్రారంభించి జర్మనీ తమకు అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకుంది.
ప్రత్యామ్నాయ విద్యుత్‌కు మళ్లిన తర్వాత ఇటువంటి సమస్యలు తలెత్తితే మనం ఎలా ఎదుర్కోబోతున్నాము? దేశ అవసరాలకు తగ్గట్లు ప్రణాళికలు రూపొందించగల మేధావులు మనకు ఇంకా మిగిలి ఉంటే వాళ్లు పరిశీలించాల్సిన మరో ప్రత్యామ్నాయం జల విద్యుత్. మనకున్న జలవిద్యుత్ వనరులను పైన చెప్పిన భారీ బ్యాటరీల్లాగా ఉపయోగించుకునే మార్గం ఉంది. విద్యుత్ గ్రిడ్‌లో అధిక విద్యుత్ సరఫరా అవుతున్నప్పుడు దాన్ని ఉపయోగించి భారీ రిజర్వాయర్లలో నీళ్లు తోడేయటం. గ్రిడ్‌కు సరఫరా తగ్గినప్పుడు అదే రిజర్వాయర్లలోని నీటిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేయటం. అయితే ఈ మార్గంలో పెట్టుబడిదారులకు తక్షణ లాభాలేమీ రావు. కాబట్టి మార్కెట్ శక్తులు ఇటువంటి ప్రత్యామ్నాయాలకు సిద్ధపడరు. కానీ ఈ ప్రత్యామ్నాయం సమాజానికి దీర్ఘకాలంలో ఉపయోగంగా ఉంటుంది. కానీ తక్షణ లాభాలు ఆర్జించే భారీ బ్యాటరీలతో కూడిన గ్రిడ్‌కు మొగ్గు చూపుతున్నారు. అక్కడ లాభాలు ఎక్కువ.
బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవటం కేవలం ప్రణాళికా లోపమే. పూర్తి నిర్లక్ష్యం, అసమర్ధత ఫలితమే. దేశంలో విద్యుత్ సరఫరా సజావుగా సాగాలంటే బొగ్గు, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. మోడీ ప్రభుత్వం ఈ సమన్వయం సాధించటంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతోంది. ఎవరిని బలి చేయాలా అని దిక్కులు చూస్తోంది. ఆర్థిక వ్యవస్థ పట్టాలెక్కటంతో పెరిగే విద్యుత్ గిరాకీకి తగ్గట్లు మార్కెట్ శక్తులు అంతా సిద్ధం చేసుకుంటాయని, ఆపత్కాల నిల్వలు సిద్ధంగా ఉంచకోవాల్సిన అవసరం లేదని మోడీ ప్రభుత్వం గుడ్డిగా నమ్మింది. స్వంత క్యాబినెట్లో మంత్రుల మధ్య సమన్వయం లోపించటం, మార్కెట్ శక్తులు ప్రత్యేకించి ప్రయివేటు శక్తులు దేశ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయని ఆశించి ప్రభుత్వాలకు స్వత:సిద్ధంగా ఉండాల్సిన ప్రణాళికా వ్యవస్థను కుప్పకూల్చటం వల్లనే నేడు దేశం ఈ సమస్యను ఎదుర్కొం టోంది. మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిటి అయోగ్... ప్రణాళికా సంఘం పోషించిన పాత్ర పోషించలేదని మరోసారి రుజువైంది.
- అనువాదం: కొండూరి వీరయ్య, 8971794037
ప్రబీర్ పురకాయస్త