Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలో పండుగ సీజన్లు మొదలయ్యాయి. వినాయకచవితి, రంజాన్, బతుకమ్మ, దసరా పండుగలు జరుపుకున్నాం. తమ జీవితాల్లో వెలుగులు నిండాలని కొద్ది రోజుల్లో దీపావళి పండుగను జరుపుకోబోతున్నారు. ఈ పండుగలంత సంప్రదాయబద్ధంగా జరుపుకోకపోయినా ఎప్పుడు ఎన్నికలొచ్చినా వాటిని కూడా ఎన్నికల పండుగొచ్చే అని మాట్లాడుకునేటోళ్లు. క్రమంగా ఆ పరిస్థితి మారుతున్నది. హుజూరాబాద్ ఉపఎన్నిక పండుగలా కాకుండా పైసల పండుగలా మారింది. ఇప్పటికే ఈ ఎన్నికపై ఎన్నో జోకులు, మరెన్నో కామెంట్లు వస్తున్నాయి. ఒక భార్య భర్తను ఇలా అడుగుతుంది. ఏమండీ విడిది కోసం ఒక కాస్ట్లీ ప్రదేశానికి తీసుకెళ్లండి అంది. ఒసీ అంతేనా... రేపే బయలుదేరుదాం... ఎక్కడికండీ అంటూ మళ్లీ ప్రశ్న. అదేనే హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా కాస్ట్లీ అంటున్నారు. అక్కడికిపోదాం అనగానే ఖంగుతినడం భార్యవంతైంది. ఓటర్లకు ఏ స్థాయిలో డబ్బులు పంచుతున్నారో దీనిని బట్టి అర్థమవుతున్నది. అప్పుడెప్పుడో హీరో మహేష్‌బాబు నటించిన బిజినెస్‌మేన్ సినిమాలో ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టాలి. ఎలా కొనాలి అనేది చాకచాక్యంగా చెబుతారు. పైసలుంటే ఎన్నికల్లో గెలువడం ఎంత సులువో చక్కగా వివరించారు. సినిమాల్లో కాకుండా హుజూరాబాద్ ఉపఎన్నికల్లో డబ్బులు వరదలా పారుతున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ పోటీ పడి పంచుతున్నాయి. డబ్బులు అందని ఓటర్లు రోడ్డెక్కి అడుగుతున్నారు. ఎక్కడో గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లకు పైసలు పంచి ఏమీ ఎరగని పిల్లికూనలా ఉండేవాళ్లు. డబ్బులు, మందు తీసుకోండి... ఓట్లు మాత్రం మాకేయండి అంటూ కాంగ్రెస్ ప్రచారం చేసింది. బీజేపీ మాత్రం కమలం గుర్తు ముద్రించిన సీల్డ్ కవర్లో పెట్టి జాగ్రత్తగా పంచినట్టు వీడియోలు వైరల్ అయ్యాయి. ఓటుకు పదివేలకుపైగా ఇస్తున్నారంటే అతిశయోక్తికాదు. గత నెలన్నర రోజులుగా టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం చేసి కూడా తమ విధానాలను చెప్పకుండా పైసల మీదనే ఆధారపడుతున్నాయి. హేమాహేమీలు ప్రచారం చేసినప్పటికీ వారి చరిష్మా పని చేయడం లేదు. పైసలే పరమావధిగా తయారైంది. ఈ ఎన్నికలను చూసిన తర్వాత నిజాయితీ పరులు, సేవా గుణం కలిగిన నేతలు పోటీ చేయాలంటేనే భయపడే రోజులొచ్చాయి. బడితే ఉన్నోడితే బర్రె అన్నట్టు... పైసలు ఉన్నోడిదే గెలుపు అనే పరిస్థితులు దాపురించాయని అశావాహులు వాపోతున్నారు.
- గుడిగ రఘు