Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తనదాకా వస్తేగానీ తత్వం బోధపడదంటారు మహనీయులు. మన కుర్చీ కిందికి నీళ్లొస్తేగానీ అసలు కథ అర్థం కాదంటారు పెద్దలు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగి, సామాన్యుల జీవితాలు అథోగతి పాలవుతున్నా 'దేశం కోసం... ధర్మం కోసం' తప్పదు, మనం భరించాల్సిందే అంటూ ఇన్నాళ్లూ ప్రవచనాలు వల్లె వేసిన అరివీర భయంకరులు ఇప్పుడు... వ్యవసాయ నల్ల చట్టాల దెబ్బకు కండ్లు తేలేస్తున్నారు. 'ఒరేయ్ బాబూ... ఆ చట్టాలు అంబానీ, ఆదానీలకు ఉపయోగపడేవి, మన వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాయిరా నాయనా...' అంటే, అవునా.. అయినా సరే 'దేశం కోసం, ధర్మం కోసం...' తప్పదు, కేంద్రం ఏం చేసినా మన మంచికే చేస్తున్నది అంటూ గుక్కతిప్పుకోకుండా లెక్చరర్లు దంచిన 'మేధావులు...' ఇప్పుడు వరి వేస్తే ఒక్క గింజ కూడా కొనమనే రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ప్రకటనలతో ఆయాసమొచ్చి తల్లకిందులై పోతున్నారు. 'ఇన్నాళ్లూ వరినే పండించాం. మా భూములన్నీ ఆ పంటకే అనుకూలమైనవి. ఇవిగాక ప్రత్నామ్నాయ పంటలేసే నైపుణ్యత, అందుకనుగుణంగా సౌకర్యాలు లేనేలేవు... మరి వరి వేయకపోతే ఏ పంటలు సాగు చేయాలి...' అంటూ తెగ ఇదై పోతున్నారు. ఇక్కడే ఓ గమ్మత్తు దాగుంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్లో భాగంగా... ఇప్పటి వరకూ ధాన్యాన్ని కొనుగోలు చేసిన భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ఇకనుంచి ఆ పని చేయదు. దీంతో రైతులు ప్రయివేటు, కార్పొరేట్ కంపెనీలకు ఆయా కంపెనీలు అడిగిన రేటుకే ధాన్యాన్ని అమ్మాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని కమలం పార్టీ నేతలు ఎక్కడా విడమరిచి చెప్పరు. మోడీ సర్కారుతో పైకి కుస్తీ, లోన దోస్తీ చేస్తున్న కారు పార్టీ నాయకులు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎక్కడా ఫైట్ చేయరు. మరోవైపు రైతు వ్యతిరేక చట్టాలను తయారు చేసిన బీజేపీ బృందమే... ఇప్పుడు రాస్తారోకోలు, ధర్నాలకు దిగుతున్నది. ఈ కారు, కమలం కొట్లాటలో దిక్కుతోచక వరి రైతులు బిక్కమొహమేస్తున్నారు. ఇంకో విషయమేమంటే... ఇప్పుడు వరి పండిచొద్దంటూ గులాబీ సర్కారు వారు... చిలుక పలుకులు పలుకుతున్న క్రమంలో మరి ఇప్పటి దాకా వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులు, వందల కోట్లతో తవ్వించిన కాల్వలను ఏం చేయబోతున్నారో అర్థంగాని పరిస్థితి. అందుకే ఇప్పుడు తెలంగాణ రైతు... వరి విషయంతో తెగ వర్రీ అయిపోతున్నాడు. మొన్నటిదాకా 'దేశం కోసం.. ధర్మం కోసం...' అంటూ నినదించిన ఓ ఆప్తమిత్రుడు ఇప్పుడు ఇదే రీతిలో ఏం చేయాలో తోచక తలపట్టుకున్నాడు.
-బి.వి.యన్.పద్మరాజు