Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బతికించుకుందాం రా'' అంటే ఇదేదో సినిమా పేరనుకునేరు. కాదు. నిజంగా మనం బతికించుకోవడానికి చాలా విషయాలున్నాయి. మనల్ని మనం బతికించుకోవడం అటుంచి, మన భాషను, మన సంస్కృతిని ఇంకా మన దేశాన్ని, ప్రజలని, ప్రజల ఆస్తులను ఇలా ఎన్నింటినో బతికించుకోవాలి. ఎందుకు బతికించుకోవాలి, అసలు దేన్ని బతికించుకుంటారు అంటే చనిపోయేదాన్ని లేదా కొందరు చంపడానికి రెడీగా ఉన్నారని తెలిసినప్పుడు వాటిని రక్షించుకోవాలి అన్న నిర్ణయానికొస్తాము. చావడానికి రెడీగా ఉన్నవి కొన్ని ఉన్నాయనుకుంటే అవి ఎందుకలా మారవలసి వచ్చింది అని తెలుసుకోవాలి, బాగా ఉన్నదాన్ని చావుకు దగ్గరగా తీసుకుపోయే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అని కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడే మన కర్తవ్యం మనకు బోధ పడుతుంది.
యూ ట్యూబులో ఎన్నో విడియోలు పెడుతుంటారు. మనం మన స్మార్టు ఫోను తెరిచీ తెరవంగానే ఓ జింకల సమూహంపై, ఓ గేదెలు దున్నల సమూహంపై సింహాలు వెటాడడానికి వస్తాయి. ఒకదాన్ని నేర్పుగా మందలోంచి తప్పించి దాన్ని చంపి తినేస్తాయి. సమూహంలోని మిగతా జంతువులు చేతకాకుండా, దీనంగా చూస్తుంటాయి. కామెంట్రీ చెప్పే వారు ఎంత అలవోకగా, ఎంత నేర్పుగా దాన్ని చంపిందీ, మిగతా సింహాలు కూడా దానిపై పడి ఎలా చంపుతోందీ మనకు వివరిస్తుంటారు. అది వీడియో తీస్తున్న వాళ్ళూ, ఇతరులు ఆ ఘోరాన్ని ఆపలేరా అని మనమనుకుంటాం. అడవిలో సహజ న్యాయాన్ని, వాటి సహజ జీవితాన్ని భంగపరచకూడదంటారు. అది నిజమే కదా!! రోడ్లపైన ప్రమాదాలు జరిగితేనే వీడియోలు తీసేవాళ్ళున్న నేటి పరిస్థితుల్లో మనకు ఆ ఘోరాన్ని ఆపడం సాధ్యపడదు. ఇతరులను పట్టించుకోకపోవడం చాలా సహజంగా కనిపిస్తున్న రోజులివి. సహజమైనదేదో, అసహజమైనది ఎదో అన్నది అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా కష్టమైపోయింది.
ఒకోసారి తమ సహచరిని వేటాడేది సింహమైనా, తన బలం తనకు తెలియని ఓ జంతువుకు కోపమొచ్చి తన కొమ్ములతో ఆ సింహాన్ని ఎత్తి పడవేస్తుంది. అప్పుడు ధైర్యమొచ్చి మిగతా జంతువులూ కలిసి సింహాల సమూహాన్ని చెల్లా చెదురు చేస్తాయి. నిజంగానే అందులోని చాలా జంతువులకు ఆ బలం ఎప్పుడూ ఉంటుంది కాని ఆ సంగతి వాటికి తెలియదు. వాటి తెలియనితనమే సింహానికి బలం. కాబట్టి మొదట తమ శక్తిని బతికించుకోవాలి. ఆ తరువాత తమ నమ్మకాన్ని బతికించుకోవాలి. ఇవి అడవిలోని ఆ జీవాలకంటే మనుషులకు ఎక్కువగా తెలియాలి. ''నీ అధికారంతో నీ మిత్రులను బాగా బతికించడం కాదు, మా బతుకుల్ని చంపొద్దు'' అని తెలిసేలా అందరూ ఒక్కటై మనవైన ప్రభుత్వ సంస్థల్ని, ప్రజల ఆస్తుల్ని బతికించుకోవాలి. అంతకంటే ముందు వాళ్ళ దుష్ట పన్నాగాలని ఎండగట్టి ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి.
అసలు ఈ బతికించుకుందాం అన్న ఆలోచన, ఆచరణ ఎప్పుడొస్తాయి బ్రో అంటే అవతలివాడు ఫలానాది చంపుదాం రా అని అన్నప్పుడో, అనుకున్నప్పుడో, చేయడం మొదలు పెట్టినప్పుడో వస్తాయని, రావాలని తెలుసుకోవాలి. అందుకు మనమేం చేయాలి సిస్టర్ అని కలిసికట్టుగా ఆలోచించి, ఆచరించగలిగే ప్లాను వేయాలి. ఈ ప్రపంచంలో ఒకటి పొతే గాని ఇంకోటి రాదు అన్న నమ్మకం జనాల్లో బలంగా నాటుకుపోయింది. అంటే ఫలానాదాన్ని చంపితేగాని ఇంకొకటి బతికి బట్ట కట్టదు అన్న సిద్ధాంతమన్నమాట. అంతెందుకు ఈ భూమి పై జరిగే ఆహార చక్రాన్ని ఒకసారి చూడండి. మీకే తెలుస్తుంది. కొన్ని కోట్ల జీవరాసులు ఇంకెన్నో కోటానుకోట్ల జీవరాశుల్ని అనుక్షణం హతమారుస్తుంటాయి. చిన్నచేపను పెద్ద చేప ఫార్ములా అన్నమాట. పాండవులు బతకాలంటే కౌరవులు చావాలి, కృష్ణుడు బతకాలంటే కంశుడు, శిశుపాలుడు చావాలి, ఇంకో దేవుడు బతకాలంటే ఒక సైతాను చావాలి, ఇలా చిన్నప్పటి నుండీ మన మనసుల్లో నూరిపోశారు. అంతెందుకు ఒక పెద్దాయన తన మిత్రులను బతికించుకోవడం కోసం ఇంకెందరినో చంపాలనుకున్నాడు. అందుకే ప్రభుత్వరంగం ఉన్నదే చావడానికి అనేశాడు. ఏదో నోరుజారి అనివుంటాడులే అనుకోకండి నిజంగానే, మెలకువలోనే, అందరికీ తెలిసేటట్టుగానే అదేపనిగానే అన్నాడు. అందుకే చంపే పని మొదలు పెట్టాడు. ఇటువైపు ఎందరో వాటిని ''బతికించుకుందాంరా'' అని కదిలారు. అయినా అవేవో గ్రహ శకలాలు వచ్చి పడ్డప్పుడు పెద్ద పెద్ద డైనోసారులు అంతరించిపోయాయని చదువుకున్నాం. అలా కాకుండా ఈ భూమిపైనే, మనతో పాటు ఉండే మనుషులే మనవాటిని మనకు కాకుండా చేస్తున్నారని మరువరాదు. పుట్టిన ప్రతి ప్రాణి చావడం ఖాయం నాయనా దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని పాత కథలు చెబితే, ఆ చచ్చే వాటిలో నీవూ ఉన్నావు, నీ పద్ధతులూ ఉన్నాయి, నీ రాజకీయమూ ఉంది అవి కూడా చస్తాయి కాస్త చూసుకో అని గట్టిగా బుద్ధి వచ్చేలా చేయాలి.
ఇక తిట్లను బతికించుకుందాం లేదంటే తరువాతి తరం వాటిని మరిచిపోతారు అనేమో కొందరు నాయకులు రోజూ తిట్ల దండకం మొదలు పెడతారు . నువ్వెంత అంటే నువ్వెంత, నీ తిట్లు ఎంత అంటే ఎంత, నా తిట్ల వయస్సంత లేదు నీ వయస్సు అని ఒక నాయకుడు అంటే ఇప్పటి వరకు నేను తిట్టినన్ని తిట్లు ఇంకో జీవితకాలం పూర్తయినా నీకు రావు, ఎప్పుడొచ్చావన్నది కాదన్నా బులెట్ దిగిందా లేదా, సరైన తిట్లు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యమని ఆ వైపు నుండి మాట రావచ్చు . ప్రజల సమయం నష్టమవుతోంది, చేయవలసిన పని ఇంకా ఎంతో ఉంది అన్న ఆలోచన లేదు కానీ ఇద్దరూ ఆ విషయాన్ని వదిలేసి తిట్లను బతికించుకునే పనిలో ఉన్నారు. ఇంకొందరు ఇంకొంత ముందుకు పోయి అసలు తిట్లకు సరైన అర్థాలు తెలుసుకోండి అని తెగ ఇదయిపోయి తెలుగును బతికిస్తున్నాం అన్నంతగా తిట్లకు నిఘంటువులు తయారు చేసినంతగా వాటిని బతికిస్తున్నారు. ప్రజలేమైపోయినా పరవాలేదు ఒకరమైన తరువాత ఒకరం అధికారంలోకి రావడమే ముఖ్యం అందుకే మా అధికారాన్ని మొదట బతికించుకోవాలి అని బిజీగా ఉన్నారు.
ఇలా ఎవరి వాళ్ళను వాళ్ళు బతికించుకుంటున్నప్పుడు మనం కూడా ఆ పని చేయాలి కదా. తప్పకుండా ''మనల్ని మనము బతికించుకుందాం రా'' అని మనసులో గట్టిగా నిర్ణయించుకోవాలి. అవతలివాడు కూడా మమ్మల్ని మేము బతికించుకునే పనిలో ఉన్నాము, కాదని ఎవడైనా వచ్చాడో చచ్చాడే అన్న రీతిలో మన రియాక్షన్ ఉండాలి. చర్యకు ప్రతి చర్య ఉన్నప్పుడే, అదీ వెంట వెంటనే జరిగినప్పుడే కొన్నింటి విలువలు తెలుస్తాయి. ''చలి, చీమలచేత చిక్కి చావదె సుమతి'' అన్నట్టు ఎంతటి బకాసురుడైనా, ఇంకో నియంత అయినా మట్టికరుస్తారని, ఇది చరిత్రలో చానా సార్లు రుజువైందని మరచిపోరాదు. అందుకే బతికించుకుందాం రా అని పోరాటాలు చేయాలి. అప్పుడు అవతలి వారు తమను తాము బతికించుకుందాం, కొన్నింటిని చంపితే మన మనుగడే కష్టమవుతుంది అన్న పాఠం వాళ్లకు నేర్పేటట్లుగా ఉండాలి. సో, కదులుదాం రండి ... బతికించుకుందాం రండి...
- జె. రఘుబాబు
సెల్:9849753298