Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశపౌరులు, ప్రత్యేకించి విమర్శనాత్మక పాత్రికేయులు, రాజకీయ ప్రత్యర్థులు, తమను బలపర్చే అధికారులు, కొందరు న్యాయమూర్తుల ఫోన్లపై కూడా నిఘా వేసేందుకు మోడీ ప్రభుత్వం పెగాసస్ అనే పరికరాన్ని వినియోగించడంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీం కోర్టు నిర్ణయించడం కీలక పరిణామం. ఈ నిర్ణయానికి ముందు ప్రభుత్వం నుంచి కొంతైనా సమాచారం సమాధానం రాబట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం పలుసార్లు పలువిధాలుగా ప్రయత్నం చేసింది. ఇజ్రాయిల్ నుంచి కొనుగోలు చేసిన పెగాసస్ స్పైవేర్ ప్రపంచ వ్యాపితంగా 50 వేలమంది సంభాషణలపై నిఘాపెట్టిందని అంతర్జాతీయ మీడియా బృందం బయిటపెట్టింది. మన దేశంలో 300మంది పేర్లు బయిటకు వచ్చిన ఆ ఆపరేషన్‌పై పరిశోధనాత్మక కథనాలలో 'దవైర్' భాగస్వామి అయింది. నిఘాకు గురైన ఫోన్ల యజమానుల నెంబర్లు ఇవ్వడమే గాక వారితోనూ ముందుగా మాట్లాడి పేర్లు బయిటపెట్టింది. ఎక్కడో ఒకచోట చెదురుమదురు వ్యవహారంగా గాక ఇంతలోతైన పరిశోధనతో పకడ్బందీగా విషయం బయిటపెట్టేసరికి ప్రభుత్వం సమాధానం చెప్పలేని స్థితిలో పడింది. దాటవేతలూ దబాయింపులతో సరిపెట్టాలనుకున్నా చెల్లలేదు. కేసు ఏకంగా సుప్రీం కోర్టుదాకా వెళ్లేసరికి సమాధానం ఇవ్వక తప్పని స్థితి. సమాంతరంగాా పార్లమెంటులోనూ పెగాసస్ ప్రకంపనలు నడిచాయి. అక్కడ కూడా ప్రభుత్వం ఆకుకు అందకుండా పోకకు పొందకుండా జవాబులు చెప్పింది. పౌరుల మీద నిఘా వేయలేదంటూనే రక్షణ కోసం నిఘాపరికరాలు వాడటం జరుగుతున్నట్టు ఒప్పుకుంది. వాస్తవానికి ఈ కథనం రాగానే ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్వో తాము తమ ప్రభుత్వ అనుమతితో ఇతర దేశాల ప్రభుత్వాలకు మాత్రమే పెగాసస్ అమ్ముతామని స్పష్టం చేసింది. ఆ విధంగా భారత ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు పరోక్షంగా చెప్పేసింది. అయితే ప్రభుత్వం మాత్రం కొనుగోలు చేసిన నిఘా పరికరాలలో పెగాసస్ ఉందా అంటే నిర్దిష్టంగా సమాధానం చెప్పడం రక్షణను బలహీనపరుస్తుందని వింతవాదన చేసింది. దేశానికి, పార్లమెంటుకు మాత్రమే గాక సుప్రీం కోర్టుకు కూడా అదే డొంకతిరుగుడు సమర్థన సమాధానంగా చెప్పడంలో ప్రభుత్వ బరితెగింపు కనిపిస్తుంది.
దేశ రక్షణా? హక్కుల ఉల్లంఘనా?
దీనిపై సుప్రీంకోరు మొదట్లోనే తామూ దేశ రక్షణకు భంగం కలిగించాలని భావించడం లేదని తగు సమాధానమే చెప్పింది. పెగాసస్ తీసుకున్నారా లేదా, పౌరుల గోప్యతకు భంగం కలిగించేలా వాడారా లేదా అన్నదే తెలుసుకోగోరుతున్నామనీ, దీనిపై వివరమైన అఫిడవిట్ వేయాలనీ ఆదేశించింది. కేంద్రం మాత్రం పాడిందే పాడినట్టు అరిగిపోయిన రికార్డు వేయడంతో తానేతేలుస్తానని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ధర్మాసనం గత సెప్టెంబరు 23న తుదితీర్పును వాయిదా వేసింది. అక్టోబర్28న ఇచ్చిన ఉత్తర్వులో సుప్రీం కేంద్రం సాకులన్నీ తోసివేసింది. ''దేశ రక్షణ పేరుతో ఏదైనా చేయొచ్చు, చెప్పకుండా దాచేయవచ్చుననుకుంటే కుదరద''ని స్పష్టం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులను గోప్యతను కాపాడటం తన విధి అని పేర్కొంది. పైగా పాత్రికేయులకు తమ సమాచార వనరు ఏమిటో చెప్పకుండా ఉండే గోప్యత హక్కు ఉంటుందని, పెగాసస్ వంటివి ఆ హక్కును కాలరాస్తాయని స్పష్టం చేసింది. పాత్రికేయులకు మేధావులకు మాత్రమే గాక సాధారణ పౌరులకూ గోప్యత హక్కు ఉంటుందని గుర్తు చేసింది. ఈ కోణంలో ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం లేకపోవడంతో తానే స్వతంత్రంగా దర్యాప్తు జరిపించాల్సి వచ్చినట్టు ప్రకటించింది. ఇటీవలి కాలంలో చెప్పుకోదగిన తీర్పులలో ఇదొకటిగా ఉంటుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుతో సహా చాలా విషయాలలో రక్షణ, దేశ ప్రయోజనాలంటూ సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంది. కాని ఇక్కడ వందలాది మంది పౌరుల పేర్లు ఉన్నాయి. వారి హక్కులకు భంగం కలిగినట్టు ఆధారాలు చెబుతున్నాయి. ఎందుకంటే పెగాసస్ సాధారణ పరిభాషలో చెప్పుకునే ఫోన్‌ట్యాపింగ్ వంటిది మాత్రమే కాదు. రహస్యంగా వినడంతోపాటు ఆ మొబైల్స్‌లో కంప్యూటర్లలో బూటకపు సాక్ష్యాలు జొప్పించే ఏర్పాటు కూడా కలిగివుంటుంది. ఫొటోలు కూడా తీసుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఇది పౌరుల ప్రాథమిక హక్కులపై అనేక విధాల జరిగిన అతి తీవ్ర ప్రత్యక్ష దాడి. రక్షణ పేరుతో విదేశీ పరికరాన్ని ప్రయివేటు ఏజన్సీ ద్వారా కొని, రాజకీయ అవసరాలకోసం వాడటం ప్రజాస్వామ్య పాలనా సూత్రాలకే విరుద్ధం. వైర్లో ఈ వివరాలు వచ్చిన తర్వాత, పాత్రికేయుల పేర్లు కూడా ఉన్నాయని తేలాక కూడా పెగాసస్‌ను ప్రధాన వార్తాంశంగా చేయకపోవడం మన మీడియా ప్రస్తుత పరిస్థితికి ఒక ఉదాహరణ. గతంలో రాజీవ్‌గాంధీ హయాంలో బోఫోర్స్, యూపీఏలో 2జి వంటివాటిపై ఇదే మీడియా సంస్థలు ఎంతగా ముందకు తెచ్చిందీ మనం చూశాం. కానీ, ఇప్పుడు అంతకంటే అనేక రెట్లు తీవ్రమైన ప్రమాదకరమైన పెగాసస్ వీటికి పెద్దగా పట్టింది లేదు.
రెండు కీలకాంశాలు
నిజానికి 2019లోనే ఈ విషయం బయటకు రాగా సీపీఐ(ఎం) సభ్యుడు ఎలగారం కరీమ్ రాజ్యసభలో ప్రశ్న వేశారు. అప్పట్లోనూ పైపైన ఖండించిన ప్రభుత్వానికి ఇప్పుడు దేశ దేశాల మీడియా కలసికట్టుగా గొలుసుకట్టు ప్రచురణ చేశాక కాదనడం అసాధ్యంగా పరిణమించింది. అందుకే అరకొర ప్రకటనలతో తప్పించుకునేందుకు తంటాలు పడింది. ఇది సుప్రీం కోర్టు కూడా ఆమోదించలేకపోయింది. ఫలితమే ఈ స్వతంత్ర దర్యాప్తు. ఇటీవలి చాలా దశాబ్దాలలో ఈ స్థాయి సమస్యలో న్యాయస్థానం స్వంతంగా అడుగేసిన ఉదాహరణ కనిపించదు. తప్పు జరగలేదని తనకు తనే కితాబునిచ్చుకుంటూ అసలు జరిగిందేమిటో దాచేయడం ద్వారా సుప్రీం కోర్టు ఈఅడుగువేయక తప్పని స్థితిని ప్రభుత్వమే కల్పించింది. అసలు ప్రభుత్వ సంస్థలకు ఇలాంటి రహస్య నిఘా పరికరం ఉందా లేదా అనేది కూడా చెప్పడానికి నిరాకరించింది. అంతిమంగా ఇప్పుడు సుప్రీం కోర్టు ఇచ్చిన 46పేజీల ఉత్తర్వులో చెప్పిన రెండు మౌలికాంశాలు పౌరస్వేచ్ఛకు రక్షణ కావలసివుంటుంది. ఈ విధంగా రహస్యంగా నిఘావేసే పద్ధతి అటుంచి అలా జరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా కోర్టు జోక్యం చేసుకోవలసి వస్తుంది. దేశరక్షణ కార్డు వాడినంతమాత్రాన అత్యున్నత న్యాయస్థానం న్యాయసమీక్షకు పరిమితులు ఉంటాయి గాని నిషేదం ఏదీ ఉండదు. రక్షణావసరాలు, భద్రత అనేపేరుతో పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన వివాదంలో ఏదీ చెప్పబోనని ప్రభుత్వం మూగనోము పట్టడానికి ఉచిత అనుమతి ఉన్నట్టు కాదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. దేన్నయినా రహస్యంగా ఉంచాలనుకుంటే దాన్ని మీరు కూడా దూరం పెట్టాలని ప్రముఖ నవలాకారుడు జార్జి ఆర్వెల్ చేసిన వ్యాఖ్యను జస్టిస్ రమణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పెగాసస్ వ్యవహారం ప్రజ్వరిల్లిన తర్వాత చాలా దేశాలు తీవ్ర చర్యలే తీసుకున్నాయి. వెంటవెంటనే ప్రత్యేక కమిటీలను నియమించాయి. కొందరిని బాధ్యతల నుంచి తప్పించాయి. కాని మోడీ ప్రభుత్వం మాత్రం 'నిఘాకు అవకాశం లేదు, వివరాలు చెప్పడానికి లేదు' అని రెండే వాదనలతో మొండికేసింది. పోనీ ఈ మేరకు వివరమైన అఫిడవిట్ దాఖలు చేయమంటే అదీ చేయలేదు. వాట్సాప్ వినియోగదారులపై పెగాసస్ నిఘా వేసినట్టు ప్రభుత్వమే 2019లో పార్లమెంటులో అంగీకరించిన దానిపైనైనా ఏ చర్య తీసుకున్నారని సుప్రీం నిలదీస్తే సమాధానం లేకపోయింది. ఈ పరిస్థితుల్లోనే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ పర్యవేక్షణలో పోలీసు ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులతో కూడిన కమిటీ నియామకాన్ని ప్రకటించింది. ఎనిమిది వారాలలోగా ఈ కమిటీ నివేదిక నివ్వాల్సి ఉంటుంది. పిటిషన్‌దార్లు దేశ రక్షణ కోసం నిఘా వేసే అవసరాన్ని ఆక్షేపించడంలేదు. కేవలం పౌరుల గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా అది వాడారా అన్నదానిపైనే వివరాలు కోరారు అని కూడా సుప్రీం ఉత్తర్వు స్పష్టం చేసింది.
దర్యాప్తు కమిటీ బాధ్యత
న్యాయపరిభాషలో సున్నితంగా చెప్పడం ఒకటైతే విద్యాసంస్థలతో సహా దేశ వ్యాపితంగా ప్రభుత్వ దాడులకు గురైన తీరు అందరికీ తెలుసు. పోలీసులు నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు ఏవో సాక్ష్యాలు దొరికాయని దేశద్రోహం ముద్ర వేయడం పరిపాటి అయింది. ఇదే వైర్పత్రికతో సహా అనేక మీడియా సంస్థలపైనా, లాయర్లపైనా, పాత్రికేయులపైనా రోజుల తరబడి ఐటి దాడులు చేసి కంప్యూటర్లను తీసుకుపోవడం మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం ఎన్నోసార్లు చూశాం. పెగాసస్ స్పైవేర్ దొంగ సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టగలదన్న మాట గుర్తు చేసుకుంటే ఇదెంత ఘోరమైన పర్యవసానాలకు దారితీయవచ్చునో అర్థమవుతుంది. దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ దర్యాప్తు బాధ్యత తీసుకోవాలని తాము సంప్రదించిన అనేక మంది రకరకాల సాకులతో విముఖత వ్యక్తం చేశారని స్వయంగా న్యాయమూర్తులే వెల్లడించారు. మరోవైపున ఎన్ఎస్వో అనేది ప్రయివేటు సంస్థ అయినా, ఇజ్రాయిల్ ప్రభుత్వ అనుమతి లేకుండా లావాదేవీలు జరపడానికి లేదనీ, నిఘా పరికరాలు ప్రభుత్వాలకే అమ్ముతుందని భారతదేశంలో ఇజ్రాయిల్ రాయబారి గోలిన్ ప్రకటించారు. భారత ప్రభుత్వం తీసుకుందా లేదా అనేది చెప్పడం అంతర్గత వ్యవహారం అని దాటేసినా ఈ వ్యాఖ్యలు కేంద్రానికి తొలివికెట్ పడగొట్టాయని చెప్పాలి. యూదు జాత్యహంకార ఇజ్రాయిల్ ఎంత నిర్బంధ నిఘా నీడలో పాలించే రాజ్యమో చెప్పనవసరం లేదు. మోడీ హయాంలో దాంతో స్నేహం వేగంగా విస్తరిస్తున్నది. టెర్రరిజం అణచివేత శిక్షణ కూడా అక్కడే తీసుకుంటున్నారు. ఇవన్నీ ఒకే తరహా నిర్బంధ నిరంకుశ పాలనకు బాట వేస్తున్నాయి. కనుకనే ఇప్పుడు నియమించిన నిపుణుల కమిటీ భవిష్యత్తులో ఇలాటి దుర్వినియోగాలు ఎలా నిరోధించాలి, జరిగితే ఫిర్యాదు చేసే అవకాశమెలా కల్పించాలి అన్న సూచనలు కూడాచేయవలసి ఉంటుంది. ప్రపంచ వ్యాపితంగా హ్యాకింగ్లు, మాల్వేర్ వంటివి పెరిగిపోతున్న తరుణంలో సామాన్య పౌరులహక్కుల రక్షణకు ఇది మరింత అవసరం. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా కేంద్రం మాత్రం ఇది తాము చెప్పిన దానికి అనుగుణంగానే ఉందని సమర్థించుకోవడం హాస్యాస్పదం. అలా అంటున్న పాలకులు ఈ కమిటీకి నిజమైన సహకారం అందిస్తారా అన్నది కూడా ఆచరణలో చూడాలి.
- తెలకపల్లి రవి