Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టబద్దపాలనే ప్రజా స్వామ్యానికి ఆయువుపట్టు అని మరోసారి రుజువైంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఇదే మన భారత రాజ్యాంగం మనకు నిర్దేశిస్తున్నది. కానీ జాతీయ భద్రత పేరిట, బీజేపీ పాలకులు ప్రజల ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించే రీతిలో దాడిచేయడం ఎంతమాత్రమూ సరికాదని సుప్రీంకోర్టు తాజా తీర్పుద్వారా హెచ్చరించింది. ఇది నిజంగానే నిరంకుశ పాలకులకు చెంపపెట్టు. ప్రజాస్వామ్య ప్రియులకు, మానవ హక్కుల ఉద్యమకారులకు పెద్ద ఊరట.
పెగాసస్ స్పైవేర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ప్రజల పవిత్ర, వ్యక్తిగత జీవితాలపై నిఘాపెట్టే సర్వసత్తాక అధికారం రాజ్యానికి లేనేలేదని తేల్చి చెప్పింది. చట్టబ్దపాలన అమలు జరిగే ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తులపై విచక్షణా రహిత గూఢచర్యాన్ని అనుమతించలేం అని కుండబద్దలు కొట్టినట్టు నొక్కి చెప్పింది. పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ వేత్తల వ్యక్తిగత జీవితాలలో, వారి గోప్యతను భంగపరుస్తూ ఈ పెగాసస్ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించారన్న ఆరోపణలపై స్వతంత్ర విచారణకు నిపుణుల కమిటీని నియమిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు నిపుణులతో కమిటీని నియమించింది. జస్టిస్ రవీంద్రన్ పర్యవేక్షకునిగా, అలోక్ జోషి, సందీప్ ఒబెరారులు సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారు.
జస్టిస్ రవీంద్రన్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అలోక్ జోషి ఐపిఎస్ అధికారి, ఒబెరారు సైబర్ భద్రత నిపుణుడు. వీరికి తోడుగా డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రభాహరన్, డాక్టర్ అశ్విన్‌ల ఉన్నత సాంకేతిక బృందం కలిసి ఈ విచారణ కొనసాగిస్తుంది. ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఈ కమిటీని ఆదేశించింది. వ్యక్తి వికాసానికి, స్వేచ్ఛకు కావలసిన వసతులను కల్పించడం, సౌకర్యాలను సమకూర్చడం వంటి హక్కులనే మౌలికంగా ప్రజాస్వామ్య హక్కులని అంటారు. వ్యక్తిగత జీవితంలోని గోప్యత (ప్రైవెసీ) అందులో భాగమే.
రాజ్యం యొక్క విశేషాధికారాలను పరిమితం చేయడానికి, రాజ్యం పరిధిని నిర్ణయించడానికి ఈ ప్రజాస్వామ్య హక్కులు తోడ్పడతాయి. వ్యక్తి స్వేచ్ఛను అనుభవించడానికి దోహదపడే కనీస సదుపాయాలు విద్య, వైద్యం, ఉపాధి, గృహవసతి వంటివి ప్రజాస్వామ్యంలో పౌరహక్కులుగానే గుర్తించాలి. అందుకే పౌర హక్కులు రాజ్యం ఏం చేయకూడదో చెప్పాయి. వ్యక్తి స్వేచ్ఛకు సంక్షేమానికి రాజ్యం చేపట్టవలసిన కనీస కర్తవ్యాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి.
పెగాసస్ గూఢచర్యం ఆరోపణలను కేంద్రం ఊరికే ఖండిస్తే సరిపోదని, ప్రతిసారీ జాతీయ భద్రత పేరుచెప్పి తప్పించుకోజాలదని సుప్రీం స్పష్టం చేసింది. అసలు గూఢచర్యం జరిగిందో లేదో కూడా తేల్చిచెప్పమని సమయమిచ్చినా కేంద్రం స్పందించలేదని వ్యాఖ్యానించింది. కాగా, ఆరోపణలపై విచారణకు తామే ఒక కమిటీని నియమిస్తామన్న కేంద్రం అభ్యర్థనను కూడా సుప్రీం నిర్ద్వందంగా తిరస్కరించింది. 'కేంద్రం నిపుణుల కమిటీని నియమించాలని కోరుకోవడం న్యాయ సూత్రాలకే విరుద్ధం. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు కూడా కనిపించాలని' సుప్రీం వ్యాఖ్యానించడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా తయారైంది కేంద్రం పరిస్థితి. 'కన్నంలోనే దొంగ దొరికినట్లు' పాలకులు నేరం చేసినట్టు ప్రాథమికంగా బయటపడిందని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. చీకట్లో వెలుగులు నింపిన కీలక ఘట్టంగా సుప్రీం తీర్పును ఆయన అభివర్ణించారు.
ఎందుకంటే చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా తమ మీద నిఘా పెట్టడంపై ఫిర్యాదు చేసిన పౌరసమాజం వెనుక సుప్రీం నిలబడటమే కాదు, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించడం హర్షణీయమని పేర్కొన్నారు. మొత్తం ఈ పరిణామాన్ని కొందరు మానవ హక్కుల ఉద్యమకారులు స్వాగతిస్తూ, ప్రజల పవిత్రమైన గోప్యత హక్కును రక్షించడానికి అత్యున్నత ధర్మాసనం కంకణబద్దం కావడం శుభపరిణామం అని ప్రశంసించారు.
దేశంలో చట్టబద్దపాలనను ఈ తీర్పు ధృవపరుస్తున్నదని, ప్రభుత్వంతో పాటు విపక్షాలు, వివిధ ప్రయివేటు, స్వచ్ఛంద సంస్థలు ఈ తీర్పుద్వారా రాజ్యాంగ విలువలు గౌరవించేలా స్ఫూర్తిపొందాలని ఆకాంక్షించారు. ఇక ఇప్పుడు పెగాసస్ గూఢచర్య వ్యవహారంలో కేంద్రం బోనులో చిక్కుకున్నదనీ ప్రజలకు తప్పక సమాధానం చెప్పాల్సి ఉన్నదనీ సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. ప్రభుత్వ దాటవేత వైఖరివల్లనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్తంభించిపోయిన విషయాన్ని గుర్తుచేసింది.
పాత్రికేయులు, విపక్షనేతలు, ఉద్యమకారులతో సహా దేశంలో 300మందికి పైగా వ్యక్తులపై మొబైల్ ఫోన్ ద్వారా నిఘా ఉంచారని పేర్కొంటూ, ప్రముఖ జర్నలిస్టులు ఎన్. రారు, శశికుమార్, ఎడిటర్స్ గిల్డ్ బాధ్యులు ఎం.ఎల్.శర్మ, మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, సిపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిటాస్ ప్రభృతులు కేసుదాఖలు చేసిన విషయం తెలిసిందే.
భారత్‌తో సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన జర్నలిస్టులు, రాజకీయ వేత్తలు, సామాజిక కార్యకర్తలపై ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ మిలటరీ గ్రేడ్ స్పైవేర్ పరిజ్ఞానంతో గూఢచర్యానికి పాల్పడినట్టు పలు అంతర్జాతీయ, జాతీయ పత్రికల్లో గత జూన్‌లో వార్తాకథనాలు వచ్చాయి. ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. ఇలాంటి దుశ్చర్యల వల్ల దేశ భద్రతకే గాక, అంతర్గత ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళనలు వెల్లువెత్తాయి. ఆ ఆందోళనలకు, కలవరబాటుకు కొంత ఉపశమనంగా ఈ సుప్రీం తీర్పును మనం భావించవచ్చు. అయితే నిరంకుశ అప్రజాస్వామిక ధోరణిని ఎదిరించడానికి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఉద్యమమే ప్రధాన ఆయుధమని ప్రతిఒక్కరం గుర్తెరగాలి. అదే ప్రజాస్వామ్య చైతన్యం.
- కె. శాంతారావు
సెల్: 9959745723