Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాని పేరులోనే ఉంది అది చెడ్డ బ్యాంకు అని. దానినుండి ఎంతో మంచి జరుగుతుందని చెప్పచూడడం విడ్డూరమే! బ్యాడ్ బ్యాంకు అనగా బ్యాడ్‌లోన్స్(రాని బాకీలు)లను రికవరీ చేసే బ్యాంకు అన్నమాట. మరి అలాంటప్పుడు రికవరీ బ్యాంకు అని పేరు పెట్టినా బాగుండేది. అలా ఎందుకు పెట్టలేదు అంటే రికవరీ చేయడం దానిని స్థాపించిన వారి ప్రధాన ఉద్దేశం కాదు కాబట్టి!! రికవరీ చేయడమే ప్రధాన ఉద్దేశం అయినట్లైతే బ్యాడ్ బ్యాంకు చేపట్టబోయే పద్ధతులు, అధికారాలూ పేరేంట్ బ్యాంకుకే అప్పజెప్పవచ్చు. పేరెంట్ బ్యాంకు చేయలేని కొత్త తరహా థర్డ్ డిగ్రీ (నేరస్తుల నుండి వాస్తవాన్ని రప్పించడానికి పోలీసులు ఉపయోగించే ఒక ట్రిక్) ప్రయోగాలు ఏమేమి ఉంటాయో వివరించకుండానే బ్యాడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం బ్యాడ్ ప్రభుత్వపు బ్యాడ్ ఆలోచనగా అనిపిస్తుంది. ఇప్పుడు పని చేస్తున్న అనేక బ్యాంకుల్లో ఏ ఒక్క దానిని ప్రభుత్వమే పురుడు పోసి ప్రారంభించిన దాఖలాలు లేవు. దేశంలో దాదాపు ఉన్న బ్యాంకులన్నీ స్వయంభూఃలే, అనగా ఒక మహానుభావుని ఆలోచనలో పుట్టిన బ్యాంకులే. తర్వాతి కాలంలో కొన్నింటిని జాతీయకరణ చేయటం జరిగింది. కానీ బ్యాడ్ బ్యాంక్‌ను స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వమే 30,600 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ బ్యాంకు యొక్క మొదటి కర్తవ్యం - దేశంలోని వివిధ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులుగా పేరుకుపోయిన రుణాలన్నిటిని తనకు ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. అయితే ట్రాన్స్ఫర్ జరిగే ముందు బకాయి ఉన్న రుణ మొత్తాన్ని కాకుండా బకాయి ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బ్యాంకుల్లో సాలీనా ఏర్పరిచిన ఏర్పాట్లను (ప్రొవిజన్స్) మినహాయించి నికర రుణాలను లెక్కలోకి తీసుకుని వాటిని కూడా చట్టం ఏర్పరచిన ఆర్బిట్రేషన్ ప్రకారం కొంతమేరకు తగ్గించి బ్యాడ్ బ్యాంక్ ఖాతాలోకి తీసుకుంటారు. ఉదాహరణకు వెయ్యి రూపాయల రాని బాకీకి వంద రూపాయలు ప్రొవిజన్ ఉంటే నెట్ బాకీ 900 రూపాయలు. అందులో ఆర్బిట్రేషన్ నిర్ణయం ప్రకారం 800గా నిర్థారిస్తే ఆ 800 బ్యాడ్ బ్యాంకు ట్రాన్ఫర్ అవుతుంది. నిజానికి ప్రొవిజన్ ఏర్పాటు చేయడమే ఒక తప్పు, ఉన్న రుణాన్ని మరింత తగ్గించి బ్యాడ్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేయడం మరో తప్పు. అయితే ఈ ట్రాన్స్ఫర్ చేయబడిన రుణానికి 15శాతం మాత్రమే బ్యాంకు చెల్లిస్తుంది. మిగతాది ట్రేడబుల్ సెక్యూరీటీగా పేర్కొన్నారు. అంటే దాని భవిశ్యత్తు ప్రశ్నార్థకమే! ఈ నిర్ణయానికి ప్రభుత్వం ఎందుకు వచ్చింది అంటే వాణిజ్య బ్యాంకులలో గాని లేదా ఇతర బ్యాంకుల్లో గాని రాని బాకీలు మూడు శాతానికి మించి పేరుకు పోయినట్లయితే వాటి పని విధానం ఆశా జనకంగా లేదు అని భావించవలసి ఉంటుంది. ఫలితంగా అంతర్జాతీయ సమాజానికి భారత బ్యాంకింగ్ వ్యవస్థపై సరైన నమ్మకాలు ఉండవు. అందుచేత వాణిజ్య బ్యాంకుల ఖాతాలోంచి ఈ రాని బాకీలను ఎప్పటికప్పుడు తొలగిస్తే బ్యాంకు పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉన్నట్లు బ్యాలెన్స్ షీట్ల రూపంలో కనిపిస్తుంది. నిజానికి ఇది రోగానికి మందు వేసినట్లు కాదు. ఇది రోగాలను దాచిపెట్టి, మరింతగా పెంచే, పెట్టుబడిదారులను ప్రోత్సహించే చర్యగానే కనిపిస్తున్నది. మార్చి 31, 2021 నాటికి దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తులు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఐదేండ్లలో 11 లక్షల కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేసినట్లుగా కూడా ప్రకటన వెలువడింది. 2008-09 నుండి 2013- 14 వరకు 32,109 కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేస్తే 2014-15 నుండి 19-20 వరకు 68,3388 కోట్లను రైట్ఆఫ్ చేసినట్టు లెక్కలు చూపిస్తున్నారు. ఈ మొత్తం నిరర్థక ఆస్తులలో 90 శాతానికి పైగా బడా కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవే. దివంగత అరుణ్‌జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్టసీ అనే కోడ్ ద్వారా దివాలా చట్టాన్ని మరింత సరేళీకరించి రుణాల ఎగవేతకు అవకాశం కల్పించబడింది. ఇప్పుడీ బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుతో రుణ గ్రస్తులు రుణాలు ఎగవేయడానికి మరింత అవకాశం ఉన్నది. రుణాల రికవరీకి చట్టాలను సవరించి బ్యాంకులకు అటానమీ ఇవ్వాలని బ్యాంకులు కోరుతుంటే, అలాంటి చట్టాల ద్వారా కార్పొరేట్లను ఇబ్బంది పెట్టకూడదని వారికి సహకరించి ప్రోత్సహించాలని ప్రభుత్వం వాదిస్తున్నది. ప్రభుత్వ బ్యాంకులు ప్రభుత్వాల ప్రోత్సాహం వల్లనో లేదా బలవంతం వల్లనో బడా కార్పొరేట్లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చి ఎక్కువ మొత్తంలో నిరర్థక ఆస్తులు కలిగి ఉండవచ్చు. ప్రయివేట్ బ్యాంకులు ఆ రకమైన ప్రభావానికి తక్కువగా గురై రాని బాకీలు తక్కువగా ఉండవచ్చు. ఈ బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు తర్వాత ప్రయివేటు బ్యాంకులు కూడా ఎక్కువ మోతాదులో రుణాలు ఇవ్వడం, అవి రాని బాకీలు గా మారడం తదనం తరం బ్యాంకు వాటిని బ్యాడ్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసి చేతులు దులుపుకోవడం అంతా సవ్యంగా జరిగి పోయే ప్రక్రియలా విధితమౌతున్నది. వస్తు సేవలు వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించే సామాన్యులకు అంతుచిక్కని ఇలాంటి ప్రయోగాలే కార్పొరేట్లకు పరమపద సోపానాలు!
బాడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన 2021 బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. దాని సాంకేతిక నామధేయం ''నేషనల్ అసెట్ రీ కనస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్''. మొదటి విడతలో రెండు లక్షల కోట్ల రాని బాకీల రికవరీకి శ్రీకారం చుట్టి అందులో 90 వేల కోట్ల రూపాయల రికవరీ తక్షణమే చేపట్టబో తున్నారు. ఇందుకుగాను 500కోట్ల రూపాయల పైబడిన రుణాలన్నింటినీ బ్యాడ్ బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేస్తారు. బదలాయింపు జరిగే ముందే నికర రానిబాకీకి కొంత విలువ లెక్కగట్టి తీసుకుంటారు. దానిలో 15శాతం నగదు చెల్లించి బ్యాలెన్స్‌కి ట్రేడబుల్ సెక్యూరిటీ రసీదులు ఇస్తారు. ఇక బ్యాడ్ బ్యాంక్ యొక్క తదుపరి కర్తవ్యం ఏమంటే ఇండియా డెబ్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఐ.డి.ఆర్.సి.ఎల్) పేరుమీద ఒక మేనేజర్ని నియమిస్తారు. అట్టి మేనేజరు సదరు బాకీకి విలువ కట్టి వసూలుకు ప్రయత్నిస్తారు. లేదంటే లిక్విడేషన్ కూడా చేయి స్తారు. ఈ ప్రక్రియలో, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టుగా ఎలాగూ దివాలా చట్టం(ఐ.బి.సి) అందుబాటులో ఉన్నది. ఈ బ్యాడ్ బ్యాంకు కాన్సెప్ట్ ఏర్పడక ముందే బ్యాంకులను చట్టాల చట్రాల్లో చుట్టి రాని బాకీల మొత్తాల్లో నుంచి కొంత మొత్తాన్ని హెయిర్ కట్ రూపంలో తగ్గించి వేసే ప్రక్రియను మొదలుపెట్టారు. వోడాఫోన్ లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు బాకీ ఉంటే ఎంతకు, ఎలా మాఫీ జరిగిందో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయింది. వోడాఫోన్ ఇప్పుడు ఏ మాత్రం బాకీ లేని కంపెనీగా మారి ఐడియాను చేజిక్కించుకుంది. వీడియోకాన్ కంపెనీ 64 వేల కోట్ల రూపాయల బాకీ ఉండగా నాలుగు శాతం మాత్రమే చెల్లించి విముక్తి పొందింది. భూషణ్ స్టీల్ కంపెనీ 55 వేల కోట్ల రూపాయలు ఉండగా 25 వేల కోట్లకు రెజల్యూషన్ పొందింది. ఎస్సార్ స్టీల్, ఇతర కంపెనీలు ఇలాంటి రూపంలోనే విముక్తి పొందాయి. ఈ రుణాలు మంజూరు చేసేటప్పుడు గ్యారెంటీలు తీసుకోవడంలో ఏర్పడు తున్న లొసుగులకు కారకు లెవరో ప్రజలకు చెప్ప వలసిన బాధ్యత ప్రభుత్వానిదే. అలా వివరించకుండా బ్యాంకుల్లో నిరర్దక ఆస్తులు పేరుకు పోతున్నాయని, దానికి సత్వర మార్గాలను ఎంచుకోవడం సరైంది కాదు. కొన్ని ప్రపంచ దేశాల్లో ఈ బ్యాడ్ బ్యాంక్ విధానం అమలులో ఉన్నది. అయితే ఏ దేశంలోనూ రాని బాకీలు వందశాతం వసూలైన దాఖలాలు లేవు. పరిసమాప్తి చేయబడిన ప్రతి రుణానికీ ఏర్పాటు చేయబడిన ప్రొవిజన్స్, డిస్కౌంట్లు, దివాలా ప్రక్రియల వెనుక సామాన్య ఖాతాదారుల త్యాగం ఎంతో ఉన్నది. భారత బ్యాంకింగ్‌లో పేరుకు పోయిన నిరర్థక ఆస్థుల వ్యవస్థకు బ్యాడ్ బ్యాంక్ సర్వరోగ నివారిణి కాదు. 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను 12కు కుదించిన తరువాత బ్యాంకింగ్ సేవలలో వచ్చిన మెరుగుదల కన్నా సర్వీస్ చార్జీలు మరింత పెరిగాయి, స్వతంత్ర పదవీ విరమణ ద్వారా ఉద్యోగుల తగ్గింపు, కార్యాలయాల మూసివేతల వంటి తిరోగమన ఫలితాలనే చూశాము. పొలిటికల్ కార్పోరేట్ నెక్సస్(రహస్య ఒప్పందం) ఉన్నంత కాలం ఎగవేత దారుల సంఖ్య పెరుగుతూనే ఉంటది. ఎగవేత దారులకు ఇలా ఎర్ర తివాచీ పరిచి మరీ రుణ విముక్తుల్ని చేయడానికి ప్రయత్నించడం సరైంది కాదు.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016