Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్వాతంత్య్రానంతర భారతదేశంతరతలో విద్య అనేది విజ్ఞానాన్ని, నైపుణ్యాలను విద్యార్థులకు అందించేదిగా మాత్రమే గాక ''జాతినిర్మాణానికి'' (ఇదొక గందరగోళ పరిచే పదం) దోహదపడేదిగా కూడా ఉండాలని ఆనాటి తరం అభిలషించారు. ''భారతదేశం'' అనేభావన చాలాకాలం క్రిందటినుంచే (అమీర్‌ఖుస్రో రచనలలో ఇది కానవస్తుంది) ఉన్నప్పటికీ, జాతీయోద్యమం సాగుతున్న క్రమంలోనే ఇది ఒక వాస్తవ రూపం తీసుకుంది. అందుచేత ''జాతి నిర్మాణం''లో విద్య తన పాత్ర పోషించాలంటే ఆ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం గురించిన అవగాహనను కల్పించాలి. అది జరగాలంటే ముందు ఆ సామ్రాజ్యవాదుల పాలనలో మన దేశంలోని పరిస్థితులు ఏవిధంగా ఉండేవో, ప్రజలపై వలసపాలకులు ఏవిధంగా దోపిడీ సాగించేవారో తెలియజెప్పాల్సి ఉంటుంది. ఈ అవగాహన కేవలం సామాజిక శాస్త్రాలను చదివే విద్యార్ధులకో, లేక భాషా సాంస్కృతిక విషయాలను చదివే విద్యార్థులకో కలిగిస్తే సరిపోదు. ప్రకృతి శాస్త్ర విజ్ఞానాన్ని, ఇంజనీరింగ్ వంటి కోర్సులను చదివే విద్యార్థులకు కూడా కలిగించాల్సిన అవసరం ఉంది. ప్రజలనుండి ''సేంద్రియ మేధావులు'' (ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్, లేదా సహజసిద్ధమైన మేధావులు) తయారుకావాలని ఆంటోనియో గ్రాంస్కీ చెప్పినట్టుగా మనదేశంలో జాతినిర్మాణానికి అవసరమైన మేధావులు అప్పుడే తయారవుతారు.
ఆవిధంగా సేంద్రియ మేధావులు తయారుకావాలంటే అందుకు వీలుగా బోధనాంశాలు మన ఉన్నత విద్యలో భాగం కావాలి. సంపన్నదేశాలలో ఉన్నతవిద్యలో బోధనాంశాలుగా ఉన్నవాటికంటే ఇవి భిన్నంగా ఉండాలి. ఉదాహరణకు : సంపన్నదేశాలలోని ఉన్నతవిద్యలో వలసవాదం ఆయా వలసదేశాలలోని ప్రజలను పేదరికంలోకి నెట్టిన వైనం గురించిన ప్రస్తావన ఎక్కడా కనిపించదు. ప్రఖ్యాత బ్రిటిష్ శాస్త్రవేత్త జెడి బెర్నెల్ అభిప్రాయం ప్రకారం ప్రకృతి శాస్త్రాలలో కూడా భారతదేశం వంటి దేశాలలో ఉండవలసిన సిలబస్, దాని సారాంశం ఈ దేశపు ప్రత్యేకతలకు తగినట్టుగా ఉండాలే తప్ప సంపన్నదేశాలలో ఉండే సిలబస్‌నే మక్కీకి మక్కీగా అనుసరించకూడదు. ఉదాహరణకు: మనదేశపు వైద్య విద్యలో ఈ ప్రాంతాల ప్రజానీకానికి సోకే రోగాల స్వభావానికి అనుగుణంగా పాఠ్యాంశాలు ఉండాలి. అంతే తప్ప ఏ బ్రిటిష్ దేశపు పాఠ్యాంశాలనో యధాతధంగా మన వైద్య విద్యార్థులు నేర్చుకోవడంవలన ఉపయోగం ఉండదు.
సంపన్నదేశాల చదువులనే యధాతధంగా నేర్చుకోకూడదు అంటే భౌతిక శాస్త్రంలోనో, రసాయన శాస్త్రంలోనో, లేక గణితంలోనో ఉండే ప్రాథమిక, మౌలిక పరిజ్ఞానం కూడా వేరుగా ఉండాలని అర్థం కాదు. అటువంటి పరిజ్ఞానాన్ని మనదేశ పరిస్థితులకు, అవసరాలకు అనుగుణంగా ఉండే ఒక బోధనాంశాల చట్రంలో అమర్చి బోధించాలే తప్ప సంపన్న దేశాల చదువులనే, అదే మూసలో నేర్పకూడదు. ఈ అవగాహననే చాలాకాలం నుండీ మనదేశంలోని విద్యారంగ నిపుణులు ఆమోదించారు కూడా.
అయితే నయా ఉదారవాద కాలంలో దీనికి పూర్తి వ్యతిరేకమైన దిశలో పరిణామాలు జరుగుతున్నాయి. ప్రపంచం అంతటా స్వైరవిహారం చేస్తున్న బహుళజాతి కంపెనీలు తమ ఉద్యోగులను ఒక దేశం నుండి ఇంకొక దేశానికి తమకు నచ్చిన విధంగా తరలించే వీలు ఉండాలని కోరుకుంటాయి. ఉద్యోగులే కాకుండా ఆ బహుళజాతి కంపెనీల పెట్టుబడి కూడా స్వేచ్ఛగా అన్ని దేశాలలోనూ సంచరిస్తూవుంటుంది. ఆ ప్రక్రియ కొనసాగాలంటే అన్ని దేశాలలోనూ ఒకే విధమైన వాతావరణం (వ్యాపార వాతావరణం) ఉండాలి. ఆ సంస్థలు నియమించుకునే ఉద్యోగుల తీరుతెన్నులు, నడవడికలు, మేధోపరమైన స్పందనలు ఒకే తీరుగా ఉండాలి. ఈ బహుళజాతి సంస్థలు ఎక్కువగా చదువుకున్న మధ్యతరగతినుండి తమకు కావలసిన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. తమ తమ సంపన్న దేశాలలోని మధ్యతరగతి ఏవిధంగా ఉంటారో, ఏ విధంగా స్పందిస్తారో, ఆలోచిస్తారో, అదేవిధంగా ఉండే వారినే ఇతరదేశాలనుండి కూడా నియమించుకోవాలని చూస్తాయి.
అందుచేత ఈ బహుళజాతి కంపెనీలు ప్రపంచం అంతటా ఒకే విధంగా ఉండే విద్యా విధానాన్ని కోరుకుంటాయి, ప్రోత్సహిస్తాయి. తద్వారా తమకు అవసరమైన ఉద్యోగులను ఎంచుకోవడంతో బాటు ప్రపంచం అంతటా తమకు మద్దతుగా ఉండే సామాజిక తరగతిని కూడా అవి ఏర్పరచుకోగలుగుతాయి. భారతదేశంలో కూడా ఇదే విధంగా విద్యావిధానం ఉండాలని అవి కోరుకుంటున్నాయి. మోడీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం సరిగ్గా ఈ కోరికను నెరవేర్చేందుకే రూపొందించబడింది.
ఈ విధమైన ''ఏకరూప'' విద్యావిధానం హిందూత్వ ఎజండాకు కూడా సరిగ్గా అతుకుతుంది. మన భారతదేశపు ''మహత్తరమైన ప్రాచీనత'' గురించి, ఆ ప్రాచీన కాలంలో భారతీయ సైన్సులో, లేదా గణితంలో ఇక్కడో, అక్కడో సాధించిన మహాద్భుతాల గురించి (ఆ అద్భుతాలలో ఇస్లామిక్ కాలంలోని అద్భుతాల ప్రస్తావన మాత్రం ఎక్కడా ఉండదు సుమా) మధ్య యుగాలలో హిందువులపై సాగినట్టుగా చెప్పబడుతున్న ''అణచివేత'' గురించి హిందుత్వ వాదులు ప్రచారం చేస్తూంటారు. హిందువులను, ముస్లింలను అందరినీ ఏకకాలంలో అణచివేసి, దేశ సంపదను యధేచ్ఛగా కొల్లగొట్టిన సామ్రాజ్యవాదుల వలసపాలన గురించి వారి ప్రచారంలో ఎటువంటి ప్రస్తావనా ఉండదు సుమా! అంతకు ముందెన్నడూ ఈ దేశం చవిచూడని తరహాలో ఆ సామ్రాజ్యవాద దోపిడీ మనదేశం మీద సాగింది. దాని పర్యవసానంగా ఈ దేశంనుండి చాలా ఎక్కువగా సంపద కొల్లగొట్టబడింది. అంతేగాక ఈ దేశపు చేతివృత్తుల పరిశ్రమలు, వాటిలో పనిచేసేవారి నైపుణ్యం నాశనం అయాయి. ఈ రెండు ప్రక్రియల కారణంగా ఆధునిక భారతదేశంలో విస్తృత ప్రజానీకం పేదరికంలోకి నెట్టబడ్డారు. కాని మన హిందుత్వ వాదులు మాత్రం వలసపాలన దుర్మార్గం గురించి నోరెత్తరు.
మన భారతదేశ విద్య సిలబస్ ను, బోధనావిషయాల సారాంశాన్ని తక్కిన నయా ఉదారవాద ప్రపంచంలో నేర్పేటట్టుగానే, సంపన్న దేశాల యూనివర్సిటీలనుండి తెచ్చుకుని, దానికి కొంత హిందుత్వ సిద్ధాంతాన్ని జోడించి ప్రవేశపెట్టడం మోడీ ప్రభుత్వపు రాజకీయ ఎజండాకు సరిగ్గా అతుకుతుంది. దేశ రాజకీయాలలో కార్పొరేట్-హిందుత్వ కూటమి ఏ విధంగా జతకట్టి పెత్తనం సాగిస్తున్నదో, అదేవిధంగా విద్యారంగంలో ఈ విద్యావిధానం పెత్తనం చేస్తున్నది. మనదేశంలోని కార్పొరేట్ శక్తులు ప్రపంచ పెట్టుబడితో మమేకమై ఉన్నందున విద్యారంగంలోని ఈ ఏకరూపత పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏకరూపతలో ఎక్కడా (ఆ ప్రపంచ పెట్టుబడి గతంలో సాగించిన) వలసపాలన గురించి గాని, అప్పటి దోపిడీ గురించిగాని ప్రస్తావన ఉండదు. అదే సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక స్వయంసంపూర్ణమైన, (ప్రత్యామ్నాయం అవసరంలేని) వ్యవస్థగా చిత్రీకరించబడు తుంది. ఇక హిందుత్వ శక్తులు తమకు ప్రాచీన భారతదేశ మహత్తు గురించి చెప్పుకునే అవకాశం దక్కినందుకు చాలా ఆనందంగా ఉన్నాయి.
ఈ ఏకరూపతను విద్యారంగంలో ప్రవేశపెట్టే క్రమంలోనే పేరెన్నిక గన్న కొన్ని విదేశీ యూనివర్సిటీలకు మన దేశంలో తమ శాఖలను ఏర్పాటు చేసుకోడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఈ ధోరణికి మోడీ ప్రభుత్వమే ఆద్యుడు కాదు. గతంలోని యూపీఏ ప్రభుత్వమే ఇందుకు తెర తీసింది. ఇది నూతన విద్యావిధానం యొక్క నయా ఉదారవాద స్వభావానికి నిదర్శనం. ఈ విధంగా విదేశీ యూనివర్సిటీలు వస్తే దానివలన మన భారతీయ యూనివర్సిటీలు కూడా ప్రపంచస్థాయి యూనివర్సిటీలుగా ఎదుగుతాయన్నది ప్రభుత్వాలు చేస్తున్న వాదన. ఈ వాదన పూర్తిగా తప్పు. ''ప్రపంచ స్థాయి'' యూనివర్సిటీలు అన్న భావనను అంగీకరించి, ఆ కొలబద్దకనుగుణంగా మన దేశీయ యూనివర్సిటీలను తయారుచేయడం అంటేనే సంపన్న దేశాల యూనివర్సిటీల ఆధిపత్యాన్ని మనం అంగీకరించినట్టు అవుతుంది. ''ప్రపంచ స్థాయి ఉన్నదీ, లేనిదీ నిర్థారించేది, ఆ స్థాయి ఏమిటో నిర్వచించేది ఆ సంపన్న దేశాలే. ప్రపంచ స్థాయి జర్నల్స్‌లో ప్రచురించబడడం అనేది పరిశోధనల స్థాయికి కొలబద్దగా నిర్ణయించినదీ ఆ సంపన్నదేశాలే. ఆ ప్రచురణ కోసం పంపే రచనల్లో ఎక్కడైనా వలసపాలనలోని దోపిడీ గురించి ప్రస్తావన గనుక వస్తే అటువంటి రచనలు ఆ జర్నల్స్‌లో ప్రచురణకు నోచుకోవు.
మన విద్యావిధానానికి కావలసినది ఈ ఏకరూపత కాదు. మన యూనివర్సిటీలు ఈ ''ప్రపంచస్థాయి'' కోసం వెంపరలాడకుండా ''జాతి నిర్మాణానికి'' కావలసిన సహజ మేధావులను తయారుచేయడం మీద దృష్టి కేంద్రీకరించాలి. మన ఉన్నత విద్యా సంస్థలలో దారుణంగాఉన్న ఎకడమిక్ పరిస్థితులను చూడకుండా కళ్ళు మూసేసుకోవాలని కాదు దీని అర్థం. ఆ విద్యా సంస్థలను మన స్వంత అవసరాలను బట్టి, మనం రూపొందించుకునే కొలబద్దలను బట్టి అంచనావేయాలి తప్ప సంపన్న దేశాలు రూపొందించిన కొలబద్దలను బట్టి కాదు. మన విద్యా రంగంలో తీసుకురావలసిన మార్పులకు, సంస్కరణలకు ''జాతి నిర్మాణం'' ప్రధాన లక్ష్యం కావాలి.
పేరెన్నిక గన్న సంపన్న దేశాల యూనివర్సిటీలను అనుకరించడం ద్వారా మన యూనివర్సిటీల నాణ్యత పెరుగుతుందనుకోవడం కూడా పొరపాటు. ఒక ఆక్స్ఫర్డ్నో, హార్వర్డ్నో, కేంబ్రిడ్జ్నో అనుకరిస్తే మన యూనివర్సిటీలు శాశ్వతంగా నాసిరకం ఇమిటేషన్ సరుకుల్లా మిగిలిపోతాయి. దాని పర్యవసానంగా మన విద్యా వ్యవస్థ యావత్తూ నాసిరకంగా తయారవుతుంది. విదేశీ యూనివర్సిటీలే ఆదర్శంగా పరిగణించే వాతావరణం దేశంలో నెలకొన్నప్పుడు ఆ విదేశీ యూనివర్సిటీలతో పోల్చితే మౌలిక సదుపాయాలు కాని, బోధనాధ్యాపకులుగాని ఏ మాత్రమూ సరితూగని స్థితిలో ఉన్న మన ఉన్నత విద్యా సంస్థలలో (ఈ స్థితిలో మన ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ దాదాపు ఉన్నాయి) తాము అన్నింటా తక్కువే అన్న ఆత్మన్యూనతాభావం నెలకొంటోంది. ఈ పరిస్థితుల్లో మనదేశ విద్యార్ధులకు కనీసం బతుకుతెరువు చూపడానికి అవసరమైన చదువును కూడా అవి అందించలేని స్థితి వస్తున్నది. పోనీ, విదేశీ యూనివర్సిటీలతో పోటీ పడడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఉన్న విద్యా సంస్థలను చూసుకుంటే, అక్కడ బోధనాధ్యాపకులను విదేశీ యూనివర్సిటీలు తమవైపు నిత్యం ఆకర్షిస్తూనే ఉంటాయి. యేల్ యూనివర్సిటీని అనుకరించి నడుస్తున్న మన దేశపు ఒకానొక యూనివర్సిటీలో బోధించే అధ్యాపకుడు తనకు ఆ యేల్ యూనివర్సిటీలోనే బోధించే అవకాశం వస్తే వదులుకుంటాడా? ఇమిటేషన్ సరుకును కోరుకుని ఒరిజినల్‌ను పొందే అవకాశాన్ని ఎవరైనా చేజార్చుకుంటారా? అందుచేత కేవలం ఆర్థిక వనరులు ఉంటే చాలదు. మన విద్యా విధానమే విభిన్నంగా ఉండాలి తప్ప అనుకరణకు దిగజారకూడదు.
ఒకే విధమైన సిలబస్, ఒకే తరహా బోధనా సారాంశం కలిగివుండే ఏకరూప విద్యా విధానంలో విద్యార్థులను చేర్చుకునేటప్పుడు కూడా ఒకే తరహా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. అత్యధికంగా మధ్యతరగతి నుండే ఈ ఎంపిక జరుగుతుంది. వారికి ప్రేరణ కల్పించే తీరు కూడా ఒకే విధంగా ఉంటుంది. (ఎక్కువ జీతం, ఎక్కువ పెర్క్స్ వంటివి)
ప్రజలకోసం ఏర్పరచిన ఒక సంస్థలో తన శక్తిసామర్ధ్యాలను వినియోగించి అతి సామాన్యుల బిడ్డలను తీర్చిదిద్దాలనే లక్ష్యం అంతరిస్తుంది. దానికి బదులు మన దేశంలోఉన్న ఈ ఇమిటేషన్ సంస్థలనుండి సంపన్న దేశాలలో ఉన్న ఆ ఒరిజినల్ సంస్థలలోకి ఏదోఒక విధంగా ఎగిరిపోవాలన్న వాంఛ పెరుగుతుంది.
భారతదేశం వంటి మూడవ ప్రపంచ దేశాలలో స్థాయి, సామర్ధ్యం గల విద్యా సంస్థలు పెంపొందాలంటే, జాతి నిర్మాణం కోసం కాకపోయినా, కనీసం విద్యాపరంగా ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలంటే, ముందు విదేశీ విద్యాలయాలను అనుకరించాలన్న వత్తిడిని పూర్తిగా తిరస్కరించాలి. విదేశీ చదువులే గొప్పవి అన్న భావనను కూడా తిరస్కరించాలి. అవి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగినవైనా, మనదేశ వాస్తవిక పరిస్థితులకు, ఆ విదేశీ యూనివర్సిటీలకు ఏ సంబంధమూ లేదన్న సంగతిని ముందు గుర్తించాలి. లేకపోతే ఎప్పుడూ మన సంస్థలు నాసిరకంగానే మిగిలిపోతాయి.
ఈ ఏకరూపత వలన మన భారతీయ సమాజపు ప్రత్యేక సవాళ్ళు - కుల అణచివేత వంటివి - విద్యా విషయికంగా ప్రాధాన్యతకు నోచుకోవు. అంతర్జాతీయ పెట్టుబడికి ఇటువంటి సమస్యలు ఏమాత్రమూ ప్రాధాన్యత కలిగినవి గా ఉండవు. ఇక హిందుత్వ వీరులకు ఈ కుల అణచివేత ఒక కప్పిపుచ్చవలసిన అంశంగానే ఉంటుంది. ఎందుకంటే వారి ''మహత్తు కలిగిన ప్రాచీన భారతీయ నాగరికత''కు ఈ కుల అణచివేత గురించి మాట్లాడటం ఒక తీవ్రమైన ఇబ్బంది కలిగించే అంశం కదా. అందుచేత దానిని ఏదోఒక విధంగా పైకి కనిపించకుండా కప్పిపుచ్చడానికే చూస్తారు. ఈ నూతన విద్యా విధానంలో ఎక్కడా కుల సమస్య ప్రస్తావనే లేకపోవడం కాకతాళీయంగా జరిగినది కాదు. ఈ కుల వివక్షతను నిర్మూలించే నిర్దిష్ట కార్యక్రమం గాని, ఉద్యోగ నియామకాలలో, విద్యార్థుల అడ్మిషన్లలో, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు గురించి గాని ఎక్కడా పేర్కొన్నదే లేదు. ఈ కుల అణచివేత విషయంలో నూతన విద్యా వ్యవస్థ పాటిస్తున్న మౌనం సైతం 'ఏకరూపత'కు నిదర్శనమే.
(స్వేచ్ఛానుసరణ)
- ప్రభాత్ పట్నాయక్