Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్టోబర్ 25, 1917 (ప్రస్తుత క్యాలెండరు ప్రకారం నవంబరు ఏడు)న బోల్షివిక్కుల నాయకత్వంతో సాధించబడిన రష్యా విప్లవం ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. కామ్రేడ్ లెనిన్ నాయకత్వాన ఏర్పడిన ప్రభుత్వ మొదటి సంతకం మహిళలకు సమానత్వ హక్కుల చట్టంపై పెట్టబడింది. తదుపరి అనేక కార్మిక, కర్షక, శ్రమజీవుల అనుకూల చట్టాలు చేయబడి అమలు పరచబడ్డాయి. చట్టాలను క్షేత్రస్థాయి వరకు అమలు చేయవలసిన ప్రధాన బాధ్యత ఉద్యోగ వర్గానిది. లంచగొండితనం, అవకాశవాదాలు కలిగిన ఉద్యోగ వర్గాన్ని ఉపయోగించుకోవటం కోసం లెనిన్ మొదట ఉద్యోగులకు దండిగా జీతాలు పెంచి, ప్రభుత్వానికి అనుకూలంగావించుకుని చట్టాలను సరిగా అమలు జరిగేటట్లు చూశారు. అప్పటికీ ఎవరయినా అడ్డదారులు తొక్కితే కఠినంగా శిక్షించటం జరిగింది. ఈ విధంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తూ, అందరికీ పని కల్పిస్తూ పది సంవత్సరాల్లోనే ఎంప్లాయిమెంటు ఎక్సేంజీల అవసరం లేకుండా చేసి వాటిని రద్దు చేయటం జరిగింది. ఇదొక ప్రపంచ రికార్డు. అప్పటి వరకూ ఏదేశంలోనూ అమలు పరచని ప్రత్యామ్నాయ విధానాలు అమలు పరచి, అందరికీ పని కల్పించి పురోగమిస్తూ, రెండు వందల సంవత్సరాల్లో అమెరికా చేసిన అభివృద్ధిని రష్యా కమ్యూనిస్టు ప్రభుత్వం డెబ్భై సంవత్సరాలలోనే చేసి చూపింది. విద్యా విధానంలో సమూల మార్పులతో శాస్త్రీయ విధానాన్ని అమలు పరిచింది. 1945 ప్రాంతంలో మన దేశంలోని ఒక ప్రఖ్యాత విద్యా నిపుణుడు రష్యా సందర్శించి ఒక పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులను ''నేను ఒక కలం పది రూపాయలకు కొని పన్నెండు రూపాయలకు అమ్మితే లాభశాతం ఎంత'' అని ప్రశ్నించగా, అక్కడి విద్యార్థులు ''మీకు ఆరునెలలు జైలు శిక్ష విధించబడుతుంద''ని చెప్పారు. అంటే వస్తువులు ఉపయోగించుకోవటానికి కొనుక్కోవాలి గాని, లాభానికి అమ్ముకుంటానికి కాదనేది వారు చదువుకున్న చదువు. అక్కడ ప్రభుత్వపరంగా ప్రణాళికా బద్ధంగా అమ్మకాలు జరుగుతాయి. మన విద్యా విధానానికి, వారి విద్యా విధానికి ఎంత తేడా! బాగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ విధానం, తమ మార్కెట్ల కోసం సామ్రాజ్యవాదంగా మారుతుందని సూత్రీకరించిన కామ్రేడ్ లెనిన్ మాటలు 1939లో రెండవ ప్రపంచ యుద్ధంతో అక్షరాలా నిరూపించబడినవి. రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా గెలవటంతో ప్రపంచ వ్యాప్తంగా వలసదేశాల్లో స్వాతంత్య్ర పోరాటాలు వెల్లువెత్తి, మనదేశంతో సహా అనేక దేశాలు స్వాతంత్య్రాలు సాధించటం జరిగింది. అక్టోబరు విప్లవ విశిష్టతల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కాబట్టి ప్రత్యామ్నాయ కమ్యూనిస్టు విధానాలతో దోపిడీపై పోరాడి విప్లవాలు జయప్రదం కావించుకొనుటయే మనందరి కర్తవ్యం, సమస్త సమస్యలకు పరిష్కారం.
- నతుమ్మల మోహనరావు
సెల్: 9908503997