Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ ఒకటవ తేదీన తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలను తెరువాలని నిర్ణయించింది. కోర్టు ఆదేశాలతో గురుకుల పాఠశాలలను, సంక్షేమ హాస్టల్స్‌ను తెరవకుండా మిగతా విద్యా సంస్థలను తెరిచారు. తెరిచిన నెల రోజులకు కూడా 26 వేల ప్రభుత్వ బడులలో కేవలం 67శాతం హాజరు కాగా 10 వేల ప్రయివేటు స్కూల్స్‌లో 32లక్షల మందికి కేవలం 12.67(39శాతం) లక్షల మంది విద్యార్థులు మాత్రమే హాజరు అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెపుతున్నాయి. కరోనాకు ముందు ప్రభుత్వ ఉపాధ్యాయుల ఖాళీల స్థానంలో దాదాపు 12వేల మంది విద్యా వాలంటీర్లు పనిచేసేవారు. వాళ్ళను తిరిగి నియామకం చేయకుండానే దాదాపు రెండు నెలలు గడిచిపోయింది. అలాగే వందల మంది పర్యవేక్షణ అధికారులైన మండల విద్యా అధికారులు లేకుండానే ఈ నెల కూడా గడచిపోయింది. ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకే అదనపు బాధ్యతలను అప్పగించారు. అటు పాఠశాలకు న్యాయం చేయలేక ఇటు పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వర్తించలేక పని భారంతో విద్యార్థుల సామర్థ్యాలు పర్యవేక్షణ చేయడంలో విఫలం అవుతున్నారు. బడులలో సహయకులుగా ఉన్న వేలాది మంది పని వాళ్ళను విధుల నుండి తొలగించారు. కరోనా నిబంధనలను పాటించడానికి సరైన వసతులు కల్పించడానికి టీచర్లు గ్రామ సర్పంచ్, మున్సిపల్ కౌన్సిలర్ల చుట్టూ తిరుగడంలోనే సమయం వృధా అయ్యింది. పిల్లలు తక్కువ మంది ఉన్నారని మధ్యాహ్న భోజనం వన్డే ఏజెన్సీలు వంట చేయమని పట్టుబడితే వాళ్ళను బ్రతిమిలాడి వంట చేయించడంతో మరికొంత సమయం వృధా అయ్యింది. టీచర్లకు పిల్లలకు బోధన చేసే సమయం దొరికింది అంతంత మాత్రమే. గత ఒకటిన్నర సంవత్సరాలుగా ఇంటివద్ద బందీలయిన పిల్లలు కొంత ఊపిరి పీల్చుకుని తమ స్నేహితులతో కలిసి టీచర్లతో కలుసుకునే అవకాశం దొరికినందుకు కొంత సంతోషంగానే ఉన్నారు.
కానీ బడులు నడిచిన ఈ నెల కాలంలో బడులకు రాకుండా ఉన్న సగం మంది పిల్లల గురుంచి ఆలోచించిన దాఖలాలు ఎక్కడా లేవు. రాష్ట్రంలో అన్ని గురుకులాలలో కేజీబీవీలలో చదువుతున్న దాదాపు 5లక్షల మంది పిల్లలు ఇంకా బడికిపోకుండా ఇంటి వద్దనే ఎప్పుడు తెరుస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. పేద వర్గాలకు చెందిన పిల్లలు అత్యధిక శాతం మంది పనులలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. కార్మిక శాఖ దీనిపై దృష్టి పెట్టిన దాఖలాలు ఏమీలేవు. మళ్ళీ బడికి తీసుకురావడానికి కరోనాకు ముందు ఉన్న విద్యార్థుల ప్రతి ఒక్కరి వివారాలు సేకరించి పంచాయతీ పరిధిలోని పిల్లలందరూ బడులకు వెళ్ళేలా ప్రణాళికలు వేయాలి.
కరోనాకు ముందు ప్రయివేటు బడులకు వెళుతున్న పేద వర్గాల కుటుంబాల పిల్లలు ఫీజులు చెల్లించలేక, అటు ప్రభుత్వ బడులకు రాలేక ఇటు ప్రయివేటు బడులకు పోలేక ఇంటి వద్ద ఉన్న పిల్లలు కొందరైతే మరి కొందరు ప్రభుత్వ బడులలో చేరడానికి కావలసిన దృవీకరణ పత్రాలు లేక నానా ఇబ్బంది పడుతున్నారు. ఎనిమిదవ తరగతి వరకు ఎటువంటి పత్రాలు లేకున్నా ప్రభుత్వ బడులలో చేర్చుకోవాలని విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ క్షేత్ర స్థాయిలో ప్రయివేటు స్కూల్స్‌లో కరోనా కాలంలో విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని ఫీజులు కంప్యూటర్లో చైల్డ్ ఇన్ఫోలో విద్యార్థి పేరును తొలగించక పోవడంతో ప్రభుత్వ బడిలో చేరిన పిల్లల పేర్లు నమోదు కాక పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులలో ఉన్నారు. బడికి వెళ్ళిన టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు కొంత సర్దుకుంటున్న సమయంలో ఈ లోపల అక్టోబర్ ఆరవ తేది నుండి దసరా సెలవులు అంటూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేశారు. మళ్ళీ బడులకు దాదాపు 15 రోజులు సెలవులు ప్రకటించడంతో మొదలు పెట్టిన చదువులు లయ తప్పిన విధంగా మారిపోయాయి. కరోనా కాలంలో విద్యార్థులు అన్లైన్ తరగతులలో గానీ మరే ఇతర మాధ్యమాల ద్వారా కానీ విద్యను అందుకోలేక చాలా వెనుకబడి పోయారు. నేర్చుకున్న విద్యను చాలా వరకు మరచిపోయారు. కరోనా వలన చాలా కుటుంబాలు ఆర్థికంగా ఛిద్రమైనాయి. వాటి ప్రభావం పిల్లల మీద చాలా పడింది. బడులలో అందించే మధ్యాహ్న భోజనం అందలేదు. పౌష్టికాహారం అందక విద్యార్థులు తమ వయసుకు తగ్గ బరువు లేకుండా అయ్యారు. బడులలో చదువులు సరిగ్గా నడవడమే లేదు. ఒకటిన్నర సంవత్సరాలుగా చదువుకు దూరమున్న పిల్లలు తరగతికి దగ్గ సామర్ధ్యాలకు ఎంతో దూరంలో ఉన్నారని యునిసెఫ్, ప్రపంచ బ్యాంక్, ఎన్.సి.ఇ.ఆర్.టి., పలు స్వచ్చంద సంస్థల నివేదికలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. నేర్చుకోవడంలో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఇవ్వాలని ఎప్పటి లాగా మామూలు స్థితిలో కాకుండా ప్రత్యేక ప్రణాళికలు వేయాలని పలు నివేదికలు తెలియచేస్తున్నాయి. అయినా అటుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు లేవు.
2021 జూన్ నెలలో తెలంగాణలోని 25జిల్లాలలో సామాజిక కార్యకర్తలు చేసిన సర్వే ప్రకారం 3వ తరగతి నుంచి 6వ తరగతి చదివే పిల్లలు 52శాతం మంది తేలిక పదాలు కూడా రాయలేక పోయారని, 56శాతం మందికి కూడికలు తీసివేతలు చేయడం రాలేదని తెలిసింది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాసామర్థ్యాలు అందిచకపోవడం అంటే సమాజంలో నూతన అసమానతలకు భీజం వేయడమే అని గుర్తించాలి. విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రకారం పిల్లలందరికీ తరగతి వారి విద్యాసామర్థ్యాలను అందించేందుకు విద్యాశాఖలో ఉన్న ప్రతి అధికారీ పూర్తి బాధ్యత వహించాలి. ఉన్నత అధికారులు ఒక్కో జిల్లాను దత్తత తీసుకుని పర్యవేక్షించాలి.
ఇక ప్రభుత్వ ఇంటర్ విద్య మరీ గందర గోళంగా ఉంది. బోధన చేసే లెక్చరర్లు లేరు. ఉన్నా కాంట్రాక్ట్ పద్ధతిలోనో గెస్ట్ ఫాకల్టీ పేరుతోనో తుమ్మితే ఊడిపోయే ముక్కులా బద్రతలేని ఉద్యోగాలతో పనికి దగ్గ వేతనాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. కాలేజీలు తెరిచి నెల గడుస్తున్నా సిబ్బంది లేకుండానే రోజులు వెళ్లదీశారు. సరిపడా బోధనా సిబ్బంది లేకుండానే సెప్టెంబర్ నెల కాస్త గడిచిపోయింది. చదువులు ఏ మాత్రం సాగడంలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇంటర్ బోధనా సిబ్బంది సతమతమవుతుంటే అక్టోబర్ నెలలో పరీక్షల షెడ్యూలే విడుదల చేసి మరింత ఆందోళనకు గురి చేశారు. ఒక వైపు వేల సంఖ్యలో ఖాళీలు, మరో వైపు నిరుద్యోగుల నిరాశ నిస్పృహలు. ఇంటర్ విద్య ఇంత సంక్షోభంలో ఉండగా ఇవన్నీ ఏమి పట్టనట్లు ప్రభుత్వం ఇంటర్ మొదటి సంవత్సరానికి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. చదువులు చెప్పడానికి లేని శ్రద్ద ఏకంగా పరీక్షల నిర్వహణలో ఏమిటో ఎవరికి అర్ధం కావడం లేదు. వేల మంది విద్యార్థులు పరీక్షలకు మానసికంగా సిద్దంగా లేమని ఆందోళన చెందుతున్నారు.
విద్యాశాఖ మంత్రి కానీ లేదా ముఖ్యమంత్రి కానీ తెలంగాణలో విద్య మీద సరయిన శ్రద్ద వహించడం లేదనేది అర్థం అవుతున్నది. క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న నిర్ణయాలకు అసలే పొంతన లేకుండా ఉంది. ఉపాధ్యాయులతో క్షేత్ర స్థాయిలో కరోనా వలన విద్యార్థులకు ఉపాధ్యాయులకు కలిగిన కొత్త సవాళ్ళు ఏమిటి? వాటికి పరిష్కార మార్గాలు ఎలా చేయాలి? అనే చర్చలు జరిగినట్లు కనపడలేదు. ఇప్పటికైనా విద్యాశాఖ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలి. విద్యకు దూరం అయ్యారని ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు ఒక నమ్మకాన్ని ఇవ్వాలి. విద్యార్థులకు నేర్వగలరు అనే ఒక విశ్వాసాన్ని ఇవ్వాలి. ప్రతి విద్యార్థి మీద శ్రద్ద వహించాలి. కరోనా మహమ్మారి దీర్ఘ కాల విద్యా వ్యవస్థలో విధ్వంసం సృష్టించింది. ఈ విధ్వంసాన్ని ఎదురుకొనడానికి విద్యా నిపుణులతో ఒక కమిటీ వేయాలి. కమిటీ సిఫారసులపై ఎప్పటికప్పుడు తరతకనీసం నెలకొకసారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం నుండి బయట పాడుతాం. ఒక తరాన్ని విద్యకు దూరం కాకుండా కాపాడిన వారము అవుతాం.
- జాతీయ కన్వీనర్, ఎం.వి.ఫౌండేషన్.
- ఆర్. వెంకటరెడ్డి