Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిన భారతంలో ఇటీవలి ఉప ఎన్నికలు సమాధానం లేని పలు ప్రశ్నలను రెకెత్తిస్తున్నాయి. రాబోయే రోజుల్లో 'అత్యంత ఖరీదైన' ఎన్నికల స్వరూప స్వభావాల విపరీతాలను హుజూరాబాద్? ఉప ఎన్నికలు తేటతెల్లం చేస్తున్నాయి. సర్వాధికారాలను లాకప్‌లో బంధించిన ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కట్టుకు కూర్చుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా చూపిన రుజువులు ఎండమావిలో నీళ్లు అయ్యాయి. ధన ప్రవాహంలో ప్రజాస్వామ్యం కొట్టుకు పోయింది. పోలింగ్ బూతు ల్లోనే డబ్బుల పంపిణీ యదేచ్ఛగా సాగి పోయింది. 'మా ఓటుకు నోట్లు అందలేదని' రోడ్లపైన దర్నాలు చేయడం కళ్లప్పగించి ఛానెల్స్‌లో చూస్తూ బిత్తరబోయాం. ఎన్నికల నియమావళి బందీ కావడం, అరాచక రాజకీయ క్రీడల నిస్సిగ్గు చేష్టలను చూసి నివ్వెరపోయాం. 'ధనమూలమిథం జగత్' అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. ఓటు అంటే వేలంలో కొనుక్కోవడమని తెలుస్తున్నది. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, ఓడింది మాత్రం ప్రజాస్వామ్యమే అని విధితమైంది. ఒకే రోజు దాదాపు 300 కోట్ల నోట్లు ఇంటింటికీ వరదలా ప్రవహించాయని వింటున్నాం. ప్రజాస్వామ్యాన్ని బరితెగించి బజారుకు ఈడ్చారు. పార్టీలు, సిద్ధాంతాలు, అభ్యర్థుల సచ్ఛీలతలు, ఎన్నికల మానిఫెస్టోలు చెత్త బుట్టలో పడ్డాయి. నగదే నవ మంత్రమయ్యింది. గతంలో డబ్బు పంచడం తెర వెనుక జరిగేది, నేడు బజారున పడడం నిత్యకత్యమైంది. గత 3-4 మాసాలుగా కుల సంఘాలు, మత సమూహాలు, గ్రామాలకు చుక్క బొక్కల రుచి చూపడంతో ప్రజలు మద్యానికి శాశ్విత బానిసలుగా మారడం జరిగింది. ప్రభుత్వ ఉచిత 'బంధు' పథకాల ప్రకటనలు, వర్గాల వారీగా సంక్షేమ పథకాల వరాల జల్లులతో ప్రజలు తడిసి ముద్దైనారు. ఎన్నికల పర్యవేక్షకులు, సిసిటివీ కెమెరాలు, పోలీసు/మిలటరీ సాయుధ కవాతులు, ఎన్నికల సంఘ కఠిన నియమనిబంధనలు, జిల్లా యంత్రాంగం ప్రేక్షక పాత్రగా మారాయి. ప్రజాస్వామ్యం పట్టపగలే అమ్ముడుపోవడం చూస్తూ నివ్వెరపోయాం. ప్రజాస్వామ్య నిర్వచనమే మారిపోయి 'నోటుస్వామ్యం' అయిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఉచిత పథకాల ప్రకటనలు హౌరెత్తి పోయాయి. పరస్పర ధూషనలు సర్వ సాధారణమయ్యాయి. చీకట్లో జరగాల్సిన నీచ కార్యాలు పట్టపగలే బాహాటంగా జరగడం కన్నాం. 'మా డబ్బే తిరిగి మాకు ఇస్తున్నారని' వాదించడం విన్నాం. ఎన్నికల్లో నిలబడటానికి వందల కోట్లు సిద్ధం చేసుకోవడమే అర్హతని, సామాన్యులు నిలబడటానికి అనర్హులని అర్థం అయ్యింది. ఇప్పటికైనా జాతీయ/ప్రాంతీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పథకాలు, పాలన సామర్థ్యాలపైన మాత్రమే ఓట్లను ఆకర్షించడానికి తలుపులు తెరవాలి. డబ్బు ఆశ చూపి గెలిచినా, ప్రజల దృష్టిలో ఓడినట్లే అని తెలుసుకోవాలి. నోట్ల పంపిణీతో గెలిచిన అభ్యర్థులు 100 రెట్లు సంపాదనకు దారులు తెరుస్తారని అవగాహనకు రాకపోతే ప్రజా సంక్షేమం, సమగ్రాభివద్ధి గాల్లో దీపాలవుతాయనేది వాస్తవం. ప్రజలిది గుర్తెరిగి ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం చేయాలి. ప్రజలే రాజులుగా నాయకులే సేవకులుగా మారాలి. నోటుస్వామ్యం అంతరించి ప్రజాస్వామ్య పునర్ ప్రతిష్ట జరగాలి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి
సెల్: 9949700037