Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా సాగిన పోడు రైతుల ఆందోళన, పోరాటాల ఫలితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మెట్టు దిగిరాక తప్పలేదు. పోడు సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని, అర్హులైన అందరికీ పట్టాలు ఇస్తామనీ అసెంబ్లీలో ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పుడు జిల్లాలవారీగా అఖిలపక్ష సమావేశాలను మంత్రులు, అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తే మాత్రం, అటవీ హక్కుల చట్టాన్ని అమలు జరిపి అర్హులకు పట్టాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్లుగా అనిపించటం లేదు. గిరిజనులు, ఇతర పేదలు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలకు పూనుకున్న నేపథ్యంలో ఎన్నికల సంవత్సరాలలో ప్రభుత్వంపైన వ్యతిరేకత రాకూడదనే దూరాలోచనతో ఏదోవిధంగా మసిపూసి, మాయజేసి అతి కొద్దిమందికి పట్టాలు ఇచ్చినట్లుజేసి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. చట్టంలో స్పష్టంగా పేర్కొన్న అంశాలను కూడా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్న తీరే అందుకు నిదర్శనం.
వామపక్షాల పత్తిడి మేరకు 2006లో కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం తదితర మంచి చట్టాలతో పాటు గిరిజనులు, ఇతర పేదలు అనేక దశాబ్దాలుగా సాగుజేసుకుంటున్న అటవీ భూములకు పట్టా హక్కులు కల్పించే 'అటవీ హక్కుల చట్టం' తీసుకు వచ్చింది. చట్టమయితే తీసుకువచ్చింది గానీ దానిని అమలు జరిపే చిత్తశుద్ధిని మాత్రం ఆ ప్రభుత్వం కూడా ప్రదర్శించలేదు. చట్టం పాసయ్యాక కూడా నిబంధనలు రూపొందించటానికి తాత్సారం చేసి 2008లోగానీ రూల్స్ తయారు చేయలేదు. 2012లో కూడా మరికొన్ని సవరణలు జరిగాయి. ఇన్నేండ్లు గడిచినా ఇప్పటికీ సాగుజేస్తున్న అటవీ భూములలో సగం కూడా పట్టాలకు నోచుకోలేదు. తెలంగాణలో పరిస్థితి మరింత దారుణం. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏడేండ్ల కాలంలో ఒక్క ఎకరం కూడా పట్టా ఇవ్వకపోగా గతంలో ఏనాడూ లేనంతగా పోడురైతులపై రాక్షస నిర్భందాలతో విరుచుకుపడ్డారు. కేసులు, దాడులు, పంటల నాశనం ఇంకా అనేక రూపాల్లో పోడురైతులపై యద్ధం ప్రకటించారు. ఆ భూమితప్ప వేరే జీవనాధారం లేని పేదలు, గిరిజనులు తమ భూములు దక్కించుకోవటానికి తెగించి పోరాడారు. మొదటి నుంచీ ఈ పోరాటాలలో వివిధ జిల్లాల్లో ముందుండి ఉద్యమాలు నడిపిన గిరిజన, వ్యవసాయ కార్మిక, రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ఇప్పుడు ఉద్యమానికి మద్దతుగా ఉన్న ఇతర ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని ప్రభుత్వం సరైన పద్ధతుల్లో అమలు జరిపే విధంగా ప్రచారోద్యమాన్ని నిర్వహించి ప్రభుత్వంపై వత్తిడి తేవటం అవసరం. లేనట్లయితే పోడు రైతులకు మరోసారి అన్యాయం జరుగుతుంది.
1. 2006లో పార్లమెంట్ ఆమోదించిన అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ సభలు (అంటే ఆ గ్రామంలో ఉన్న వయోజనులందరి సమావేశం) జరిపి, అందులో అటవీ హక్కుల కమిటీని ఎన్నుకోవాలి. ఆ కమిటీయే సాగుదార్లనుండి దరఖాస్తులు కోరాలి. సాక్ష్యాలు సేకరించాలి. విచారించాలి. వారు అర్హులో కాదో నిర్ణయించాలి. తమ నిర్ణయానికి గ్రామసభ ఆమోదం పొంది పై కమిటీకి పంపాలి. కానీ అలా కాకుండా అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఎవరికి దరఖాస్తులు ఇవ్వాలి? గులాబీ నాయకులకా? మంత్రులు, ఎం.ఎల్.ఎ.లకా? ఇది చట్ట విరుద్ధం కాదా?
అలాగే గతంలో ఇచ్చిన దరఖాస్తులలో అత్యధికం తిరస్కరించారు. అలా తిరస్కరించటం సరిగాదని, తిరిగి వాటిని పరిశీలించి పరిష్కరించాలని వచ్చిన అభ్యర్థనల మేరకు కేంద్ర ప్రభుత్వ జోక్యంతో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జీవో కూడా ఇచ్చారు. కానీ ఆ జీవోను అమలు జరపలేదు. వెంటనే అమలు జరపాలి.
2. గ్రామ సభల ఏర్పాటు, విధి విధానాలు, చట్టం వివరాలు, వివిధ తేదీలు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తూ గైడ్లైన్స్ ఇవ్వాలి. అలాంటిదేమీ జరగలేదు. పైగా నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులు ఇవ్వాలని మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. మూడు నెలల కనీస సమయం ఉండాలని చట్టం చెబుతోంది. అవసరమైతే ఆ సమయాన్ని పొడిగించే హక్కు గ్రామ సభకు ఉంటుంది. ఇదంతా వదిలేసి మంత్రులు ప్రకటించటాలేమిటి? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
3. రాష్ట్రస్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వకుండా కొన్ని జిల్లాలకే పరిమితమై కలెక్టర్ల ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది సరిగాదు. ఉద్యమం, వత్తిడి ఎక్కువ ఉన్న కొన్ని జిల్లాలకే ఈ కార్యక్రమాన్ని పరిమితం చేయాలనే కుట్ర దీనివెనక ఉంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో ఒకే నోటిఫికేషన్ ఇవ్వాలి.
4. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ద్వారా ఈ తతంగం అంతా పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. చట్టంలో గ్రామసభల పైన డివిజనల్ కమిటీ, జిల్లా కమిటీ ఎవరెవరితో ఉండాలో స్పష్టంగా చెప్పబడింది. ఆ ప్రకారమే కమిటీలు ఏర్పడాలి. ఫారెస్టు డిపార్ట్మెంట్ ఇప్పటివరకూ శత్రుపూరితంగా వ్యవహరించి ఆదివాసులు, ఇతర పేదలపై అనేక కేసులు పెట్టి, దౌర్జన్యాలు చేసి అప్రదిష్ట పాలయింది. చాలా జిల్లాల్లో ఇప్పటికే పట్టాలు రికమెండ్ చేస్తామనే పేరుతో వారు లంచాలు వసూలు చేయటం కూడా ప్రారంభించారు. దీనిని అడ్డుకోవాలి.
5. శాటిలైట్ చిత్రాలపేరుతో పోడుసాగును అనేక రెట్లు తక్కువ చేసి చూపటానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. శాటిలైట్ చిత్రాలు సాక్ష్యాలుగా పనికిరావని అటవీ హక్కుల చట్టం స్పష్టంగా చెబుతున్నది. సాగుదార్లు ఎవరు దరఖాస్తు ఇచ్చినా గ్రామ కమిటీ స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్దారణ చేసుకోవాలి తప్ప శాటిలైట్ చిత్రాల ద్వారా నిర్ణయించటం సరైంది కాదు. 2005కంటే ముందు నుండీ సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చిన గ్రామాలను కూడా కొన్ని జిల్లాల్లో ఇప్పుడు పరిగణించాల్సిన లిస్టుల్లో చేర్చకపోవటాన్ని బట్టి ఈ కుట్రను మనం అర్థం చేసుకోవచ్చు.
6. సాగుదారు క్లెయిమ్ రుజువు కావటానికి సాక్ష్యాధారాలుగా చట్టం పేర్కొన్న అంశాలలో ప్రభుత్వం ఇదివరకు వివిధ రూపాల్లో జారీచేసిన పట్టా సర్టిఫికెట్లు అనేది కూడా ఉంది. అలా పట్టాలు ఇచ్చిన భూములకు కూడా ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో పట్టా రద్దు చేస్తున్నారు. ఉదా|| నాగార్జున సాగర్ భూనిర్వాసితులకు ఇచ్చిన పట్టాలు చెల్లవని తిరిగి ఇప్పుడు భూములు లాక్కుంటున్నారు. ఇలాంటి భూములకు కూడా ఈ చట్టం కింద తిరిగి పట్టాలు ఇవ్వాలి. భూమినుండి బేదఖళ్లు చేయరాదు. రైతు సాగులో ఉంటే ఏ రకం ఫారెస్ట్ అయినా పట్టా ఇవ్వాల్సిందే అని చట్టం స్పష్టంగా చెబుతున్న దానిని అమలు జరపాలి.
7. కొన్ని జిల్లాల సమావేశాలలో 2005 కంటే ముందు ఓటరు లిస్టులో పేరు ఉంటేనే పరిగణిస్తాం అని చెబుతున్నారు. ఓటరు లిస్టులో ఏ కారణం చేతనైనా పేరు లేకపోయినా దానిని బట్టి సాగుదారును తిరస్కరించటం సరైంది కాదు. ఇది చట్టాన్ని వక్రీకరించటమే. చట్టంలో పేర్కొన్న దాదాపు 25 రకాల సాక్ష్యాలలో ఏ రెండు సాక్ష్యాలు రుజువైనా అతని క్లెయిమ్ రుజువు అయినట్లుగానే భావించాలని చట్టం చెబుతోంది. అతని క్లెయిమ్ గురించి ఆ గ్రామంలోని పెద్దలను విచారించటం కూడా అందులో ఒకటి.
8. అటవీ గ్రామాలను తొలగించాలని గిరిజనులను బయటకు తరలించాలని అధికారులు చెబుతున్నారు. ఇదీ చట్ట విరుద్దమే. సెక్షన్ 3(1)(హెచ్) ప్రకారం ప్రతి అటవీ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మార్చాలని, ఇది చట్టం ప్రకటించబడగానే రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పూర్తి చేయాలని, ఆ గ్రామాలకు విద్యుత్, రోడ్లు, మంచినీరు, విద్య, వైద్యం వగైరా కనీస సౌకర్యాలను తక్షణమే కల్పించాలని కూడా చట్టం చెబుతోంది. ఈ మార్పులు ఇప్పటి వరకూ చేయకపోవటమే పెద్ద నేరం.
9. అడవిలో సాగు చేసుకుంటున్న భూమికి బదులు మైదాన ప్రాంతంలో వేరే భూమి కేటాయిస్తామనీ కూడా చెబుతున్నారు. ఇదీ చట్ట విరుద్దమే. అటవీ హక్కుల చట్టం సెక్షన్ 4(5) ప్రకారం సాగులో ఉన్న భూమినుండి అతని దరఖాస్తుపై విచారణ పూర్తయ్యేదాకా, ఎట్టి పరిస్థితిలోనూ బేదఖలు చేయరాదు. 2006లో పార్లమెంట్ ఆమోదించింది గిరిజనులు, ఇతర పేదలు ఇప్పటికే సాగుచేసుకుంటున్న అటవీ భూములకు పట్టా హక్కులు ఇచ్చే చట్టమే తప్ప, ఎక్కడో ఇతర చోట్ల భూమి చూపించే భూసంస్కరణలు లేక భూ పంపిణీ చట్టం కాదు. ఈ ప్రయత్నం అడవి బిద్డలను అడవికి దూరం చేయాలనే దుర్మార్గం తప్ప మరోటి కాదు. అంతేగాక ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకునేది 2005లోపుగా సాగులో ఉన్నవాళ్లవరకే కదా? మరి ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్లు తెలంగాణ ఏర్పడిన 2014 జూన్ దాకా సాగులో ఉన్న ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇవ్వటానికి, అందుకనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేయటం, కేంద్ర ప్రభుత్వం వద్దకు అఖిలపక్షం వెళ్లి చట్టంలో సవరణ కోరటం ఇదంతా జరగాలి కదా? ఆ ప్రక్రియ పూర్తయ్యేవరకూ ఆక్రమణలో ఉన్న ఏఒక్కరినీ తొలగించకూడదు. అలాచేస్తే ముఖ్యమంత్రి మాటలకు విలువేముటుంది?
10. కొన్ని గ్రామాలలో ఇపుడు సాగుచేస్తున్న భూమిలో కొంత రైతులకు ఇచ్చేసి, మిగతా కొంత ఫారెస్టులో కలుపుతామని రాజీ ప్రతిపాదనలు చేస్తున్నారు. ఇలాంటి రాజీలు భయపెట్టో, బ్రమపెట్టో గతంలో కూడా కొన్ని జరిగాయి. కానీ అవేవీ ఆచరణలో నిలవలేదు. మళ్లీ కొత్త అధికారి వచ్చినపుడల్లా పాత ఒప్పందాలు రద్దవుతూ వచ్చాయి. అందువల్ల చట్టబద్దంగా సాగులో ఉన్న భూమంతటికీ పట్టాలు ఇవ్వాలి తప్ప ఇలాంటి చాటుమాటు పద్ధతుల్లో పోడురైతులకు న్యాయం జరగదు.
11. ఇప్పటి వరకూ పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తి వేయాలి. ఇక నుండి పోలీసులుగానీ ఫారెస్ట్వాళ్లుగానీ గ్రామాల్లోకి వెళ్లరు, కేసులు పెట్టరు అని ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ప్రకటించారు. కానీ ఆ తరువాత కూడా పోలీసు దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా వేములపల్లి మండలం బుయ్యారంలో కేసులు పెట్టారు. అమ్రాబాద్ అడవుల్లో ఉడుమును పట్టుకున్నందుకు గిరిజనులపై కేసులు పెట్టారు. ఖమ్మంలో ఇంకా కొన్ని జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టటం కొనసాగుతూనే ఉంది. ఈ దాడులు, కేసులు వెంటనే ఆపేయాలి. ఉన్న కేసులన్నీ వెంటనే ఎత్తేయాలి.
12. సాగుచేస్తున్న పోడురైతులందరికీ అపుడే పట్టాలు ఇచ్చేసినట్లూ, ఇక నుండి అడవులను మేమే రక్షిస్తామని ప్రతిజ్ఞలు చేయాలనటం ఇపుడు సందర్భంకాదు. సాగుచేస్తున్న భూముల నుండి దౌర్జన్యంగా వెళ్లగొట్టటం, నిలువుమీదున్న పంటలను ధ్వంసం చేయటం, చిన్న పిల్లలు, పశువులను కూడా కేసుల్లో పెట్టటం, చట్టబద్దమైన పట్టా హక్కును నిరాకరించటం చేసిన ప్రభుత్వం ముందు తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చటం నేర్చుకోవాలి. చట్టాలను అమలు జరపటం దాని బాధ్యత. తామేదో అడవులను రక్షించేవారైనట్లు, అమాయక గిరిజనులు, ఇతర పేదలే అడవులన్నింటినీ నాశనం చేస్తున్నట్లు ఫోజులివ్వటం మానుకోవటం మంచిది. అడవులను ధ్వంసం చేస్తున్న కలపదొంగలకు వీరు ఎలా సహాయం చేస్తున్నారో, ఖనిజ సంపదకోసం వేలాది ఎకరాల అడవిని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టిన చరిత్రలేమిటో అందరికీ తెలుసు. అందువల్ల ఇపుడు ప్రకటించిన కార్యక్రమానికి పరిమితమై చట్టబద్దంగా పోడురైతులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని చిత్త శుద్దితో అమలు జరపటం మంచిది.
జిల్లా సమావేశాలలో మంత్రులు, అధికారులు ప్రదర్శించిన తప్పుడు వైఖరిని మార్చుకోవాలి. చట్టబద్దంగా పైన పేర్కొన్న అన్ని విషయాలతో గైడ్లైన్స్ ఇచ్చి ఎలాంటి, మాయమర్మాలకు, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పోడురైతులకు న్యాయబద్దంగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగించాలి. అబద్ధాలు చెబితే, అవకాశవాదం ప్రదర్శిస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో మన ముఖ్యమంత్రికి ఇటీవలి ఫలితాలతో తెలిసి రావాలి. అలాంటి మార్పు రాకపోతే, పోడు రైతుల పట్టాల పంపిణీ సక్రమంగా అమలు జరగకపోతే మళ్లీ పోడురైతులు పోరుబాట పట్టక తప్పదు.
ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల కార్యకర్తలు గ్రామ, గ్రామాన పోడురైతులను సమావేశపర్చి ఈ విషయాలను వివరించటం, కరపత్రాలు, బుక్లెట్స్ ద్వారా విస్తృత ప్రచారం చేయటం, అధికార్లకు మెమొరాండాలు సమర్పించి చట్టం ప్రకారమే పోడు విచారణలు జరిగే విధంగా కృషి చేయటం అవసరం.
- తమ్మినేని వీరభద్రం