Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బౌద్ధం ఒక మతం కాదు. అది అత్యంత సంస్కారయుత సంఘ జీవన మార్గం. దానిలో ఒక మతానికి ఉండే ప్రాథమిక అంశాలైన దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం, పూజలు, బలులు, మంత్రాలు, తంత్రాలు మొదలైన అంధ విశ్వాసాలకు తావులేదు.
బుద్ధుడు - దేవుడు కాదు, ఈ భూమి మీద పుట్టిన తొలి సామాజిక విప్లవ కారుడు. మొట్టమొదటి ప్రపంచ స్థాయిసంఘ సంస్కర్త. శాస్త్రీయ దృక్పథంతో యోచించిన తొలి సామాజిక దార్శనికుడు. అంతే గాని, ఆయన దేవుడు కాదు. దేవుడనేది ఒక ఊహ, ఒక కల్పితం, ఒక విశ్వాసం. బుద్ధుడు కాల్పనిక అవతార పురుషుడు కాదు. ఈ నేల మీద పుట్టి, పెరిగి, నడయాడిన మహనీయుడు. ఆయన చూపిన మార్గం అభూత కల్పన కాదు. సత్యమార్గం! దానితోనే ప్రపంచ దేశాల్ని ఒక వెయ్యేళ్ళ పాటు ప్రభావితం చేసిన సృజనశీలి. మొట్టమొదటి సారిగా ఈ విశ్వంలో కార్యకారణ సంబంధంతోనే ప్రతిదీ జరుగుతూ ఉందని గ్రహించిన బుద్దిశాలి. అందుకే తధాగతుడైనాడు. అంటే సృష్టిలో కార్యకారణ సంబంధం ఎలాగైతే నడుస్తూ ఉందో ఆ ప్రకారమే నడుచుకునేవాడు - 'తథా..గతుడు' - అని మనం అర్థం చేసుకోవాలి. ఎటు నుండి ఏ అవకాశమూ లేని సమయంలో, ఏ అవగాహన పెరగడానికి వీలులేని సమయంలో ఈ సృష్టికి కార్యకారణ సంబంధం ఉందని చెప్పడం ఆ మహానుభావుడి గొప్ప విజయం. ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలన్నీ అదే విషయాన్ని ధృవపరిచాయి..కదా?
సుమారు 2,500 ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన విషయం ఈ అత్యాధునిక యుగానికి కూడా ఎలా పనికొస్తుందో గమనించండి... ''పరిశీలించకుండా ఏ విషయాన్ని గుడ్డిగా అనుసరించవద్దు. మత గ్రంథంలో రాసి ఉందని గానీ, ఓ పెద్ద గురువు చెప్పాడని గానీ, తాత ముత్తాతల నుండి పాటిస్తున్నారని గానీ, సంప్రదాయంగా వస్తూ ఉందని గానీ, అధికారులు, ధనవంతులు, పండితులు ఆచరిస్తున్నారని గానీ, ఓ వ్యక్తి చాలా కళాత్మకంగా చెప్పాడని గానీ, నువ్వు కృతజ్ఞత చూపించవలసిన వ్యక్తి చెప్పాడని గానీ, నీకు కృతజ్ఞుడైన వ్యక్తి విన్నవించాడని గానీ, ఎక్కువ మంది పాటిస్తున్నారని గానీ, లేక నీ అంతట నీవే ఊహించుకుని గానీ - దేనినీ గుడ్డిగా విశ్వసించవద్దు! దానిని ఓ 'అనుభవం' అనే గీటు రాయిపై పరీక్షించి చూడు. అది సర్వజనులకు హితాన్ని, సుఖాన్ని కలిగిస్తుందో లేదో పరిశీలించు. తగు యోగ్యమైనదని తేలితేనే స్వీకరించు - లేకపోతే అవతలపెట్టు'' అని అన్నాడు గౌతమ బుద్ధుడు (కాలామసుత్త: అంగుత్తర నికాయ 3.65)
గుడ్డిగా దేన్ని బడితే దాన్ని నమ్మేస్తూ, విచక్షణ లేకుండా విశ్లేషణ లేకుండా మెదళ్ళ మొద్దుబారించుకుని, ఉంటున్న జనం ఇప్పుడైనా తక్షణం తమ ఇంగిత జ్ఞానాన్ని తట్టి లేపాలి. చుట్టూ జరుగుతున్న విషయాల్ని, హేతుబద్ధంగా, వైజ్ఞానిక అవగాహనతో పరిశీలించుకోవాలి. ముఖ్యంగా యువతరం తమ గొర్రెదాటు పోకడల్ని మానుకోవాలి. చార్వాకులు చెప్పింది, బుద్ధుడు చెప్పింది ఈ దేశంలో ఎందుకు, ఎలా నాశనమయ్యాయో, ఎలా కుట్రలు జరిగాయో తెలుసుకోవడం చాలా అవసరం.
బౌద్ధ ధమ్మంలో మనిషి జీవితానికి ఎల్లప్పుడూ ఆవశ్యకమైనవి.. త్రి శరణాలు, చతురార్య సత్యాలు, పంచశీల, అష్టాంగ మార్గం మాత్రమే.. బుద్ధుడి పంచసూత్రాలు ఇవి.. 1. ఆత్మహత్యచేసుకోగూడదు. హత్య చేయగూడదు. 2. ఎవరూ ఇవ్వనిది తీసుకోగూడదు. దొంగతనం అసలే కూడదు. 3. ఇంద్రియానుభావాల కోసం వెంపర్లాడకూడదు. అంటే ఇంద్రియాలను దుర్వినియోగం చేయకూడదు. 4. చెడు మాట్లాడకూడదు. ఇతరుల గూర్చి చెడు చెప్పగూడదు. 5. మెదడును మొద్దుబార్చే మత్తుపదార్థాలను త్యజించాలి. మత్తెక్కించి నిర్వీర్యం చేసే విషయాలను కూడా దరికి చేరనీయగూడదు. ఈ పంచశీలతో పాటు 'నేనూ-నాది' - అనేది కూడా తునా తునకలై పోవాలన్నాడు బుద్ధుడు. ''అనిత్య అనత్త దు:ఖ'' అనేవి స్వ అనుభూతితో వస్తాయని అన్నాడు. ఇలా చాలా విషయాలు చెప్పాడు బుద్ధుడు. ప్రజ్ఞగల వారు - ఎలా ప్రజ్ఞావంతులవుతారో ఏ స్థితిలో అవుతారో కూడా వివరించాడు. జీవితంలో వేదన, సంవేదన అనేవి సంతోషాన్నిచ్చేవి కావొచ్చు. బాధ కలిగించేవీ కావొచ్చు. ఆ రెండింటినీ విచక్షణ లేకుండా గమనించడమే సమతాభావం. అలా సమతా భావంలో (సాక్షీ భవంలో) ఉండగలిగిన వారే స్థిత ప్రజ్ఞులవుతారు. విషయం స్థూలమైన దైనా, సూక్ష్మమైనదైనా వాటిని దూరంగా పెట్టి గమనించగలవాడే స్థిత ప్రజ్ఞుడు. చిత్తాను పశ్యన-ద్వారా ఆలోచనా రహిత స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ధమ్మను పశ్యన - ద్వారా మనో మాలిన్యాలను వదిలించుకునే అవకాశము ఉంటుంది.
కుక్క కుక్కను చంపదు. కాకి కాకిని చంపదు. కేవలం మనిషి మాత్రమే మనిషిని చంపుతున్నాడు. జంతువుల్లో నైతిక విలువలు బోధించడానికి ప్రవక్తలు లేరు. ప్రవచన కారులు లేరు. మత బోధకులు లేరు. అయినా అవి తమ తోటి జంతువుల్ని చంపుకోవు. మనుషుల్లో వీళ్ళంతా ఉన్నారు. కానీ ఏం లాభం? మనిషిపట్ల మనిషికి ఏహ్య భావాన్ని పెంపొందిస్తున్నారు. ఘర్షణలకు దారులు వేస్తున్నారు. మారణ హౌమానికి ఆజ్యం పోస్తున్నారు. హేతువాదం, నైతికాచరణ అంటే ఏ మతానికీ నచ్చదని ఎప్పుడో తేటతెల్లమయ్యింది. అందుకే చూడండి... ఈ దేశాన్నించి బౌద్ధాన్ని తరిమేయడంలో హిందువుల పాత్ర డెబ్బయిశాతం ఉంది. ముస్లింల ప్రమేయం ఇరవైశాతమైతే, క్రైస్తవుల జోక్యం పదిశాతం ఉంది. ఎక్కువో తక్కువో మతాలన్నీ కలిసికట్టుగా బౌద్ధాన్ని నాశనం చేస్తూ వచ్చాయి.
భారత దేశంలో బౌద్ధాన్ని నాశనం చేయడానికి వైదిక మత గురువులు, మత ప్రబోధకులు, కొంతమంది పరిపాలకులు ఏమేం చేశారని కాదు, ఏమేం చేయలేదో ఆలోచించాలి. బుద్ధుడి కాషాయాన్ని స్వంతం చేసుకున్నారు. సన్యాస భావనను బాపనీయం చేశారు. బుద్ధుడి అష్టాంగ సూత్రాలను కాపీకొట్టి, నాశనం చేసి దాన్నే మళ్ళీ అష్టాంగ యోగమన్నారు. బుద్ధుడి అహింసను, భూత దయను తమదే అయినట్లు ప్రకటించుకున్నారు. బౌద్ధారామాలు ధ్వంసం చేశారు. బౌద్ధ భిక్షువుల తలలు నిర్ధాక్షిణ్యంగా నరికేశారు. బౌద్ధ విద్యాలయాలను తగులబెట్టారు. బౌద్ధం - ఒక అనైతిక అసాంఘిక ధర్మమని అన్యాయంగా బురద చల్లారు. ఎంత చేసినా ప్రజల్లో బౌద్ధానికి ఆదరణ తగ్గలేదు. ఇక అప్పుడు బుద్ధుడు విష్ణువు అవతారమేనని కాళ్ళబేరానికి వచ్చారు. పుక్కిటి పురాణాలకు తెరలేపారు. దేశంలో బుద్ధుడి నామరూపాలు చెరిపేసి, ఆయన నెలకొల్పిన విలువలను ధ్వంసం చేసినా వారికి తృప్తి కలగలేదు. ఇప్పటికీ బుద్ధుడి పేరు చెపితే వైదిక మత గురువులకు, మనువాదులకు వెన్నులోంచి వణుకు ప్రారంభమవుతుంది. ఎన్నో తరాలు మారిపోయ్యాయి. ఇప్పటి తరం బుద్ధుడి బోధనలు తెలుసుకుని ఆకర్షితులయితే.. ఎక్కడ వారి హిందుత్వ విద్వేష దుకాణం మూతపడుతుందోనని.. దేశాన్ని పరిపాలిస్తున్న ప్రస్తుత పాలకులు ఇప్పటికీ హడలి ఛస్తున్నారు.
ఇంతెందుకూ? అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా తెచ్చుకోవడానికి నేటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎంత హైరానా పడిందో, చీఫ్ జస్టిస్ను ఎలా లోబరుచుకుందో, ప్రతి భారతీయుడూ గమనించాడు. కొంచెం అయోధ్య వివరాల్లోకి పోతే విషయాలు అర్థమవుతాయి. బౌద్ధ గ్రంథం - 'సమ్యూత నికాయ'లో బుద్ధ నివాసం, అయోధ్య గురించిన ప్రస్థావనుంది. అలాగే చైనా యాత్రికుడు ఫాహియాన్ దీన్నే 'షా-చే' అని పిలిచాడు. అంటే సకేతను అలా పలికి ఉంటాడు. ఎందుకంటే పురాతన బౌద్ధ గ్రంథాలలో కనిపించే సకేత - జైన గ్రంథాలలోని విశాక, వినయ, వినిత వంటి పేర్లన్నీ ఆనాటి అయోధ్యకున్న పేర్లే. ఈ 'సకేత'నే వైదికులు 'సాకేత పురం' అనీ 'సాకేత పురావాసా' అని (రాముణ్ణి పిలవడానికి) మార్చుకున్నారు. క్రీ.శ. 400 (సి.ఈ)లో భారతదేశం పర్యటించిన ఫాహియాన్ - దేశంలో మంచి పంటలు పండుతున్నాయని, పండ్లు, పూలతో కనుల విందుగా ఉందని, ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులున్నాయని.. ప్రజలు మంచిపనులు చేయడానికి ఉత్సాహపడుతుంటారనీ రాశాడు. అంతే - రాముడి గురించి, రంగడి గురించి, వైదికుల పూజల గురించి రాయలేదు. అంటే అప్పటికి అవి అక్కడ లేవు. ఆ తరువాత క్రీ.శ. 7వ శతాబ్దం (సి.ఈ)లో హ్యూయెన్ త్సాంగ్ పర్యటించినప్పుడు, దేశం గుప్తరాజుల ఆధీనంలో ఉంది. అప్పటికి మూడువేల మంది బౌద్ధభిక్షువులు వెయ్యి మఠాలలో బౌద్దం లోని మహాయాన - హీనయాన గ్రంథాలను అధ్యయనం చేస్తున్నారని రాశారు. 1975-76 (సి.ఈ)లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయోధ్యలో తవ్వకాలు చేపట్టినప్పుడు అక్కడ బౌద్ధరామాలు, శిల్పాలు, శిథిలాలు మాత్రమే లభించాయి. జైన సన్యాసినిగా గుర్తించిన టెర్రకోట శిథిలాన్ని వెలికితీశారు తప్పిస్తే - ఏ హిందూ దేవాలయ ప్రాకారాలు, ఆలయ నిర్మాణాలూ అక్కడ లభించలేదు. ఒక అబద్దాన్ని జబర్దస్తీగా నిజమని నమ్మించి, ఒక రామాలయనిర్మాణం ప్రస్థుతం అక్కడ జరుగుతోంది. దేవుడే అబద్ధం - గతంలో - అయోధ్యలో రామాలయం ఉండేదనేదీ అబద్ధమే. అబద్దాలు ప్రచారం చేసుకుని అధికారం చేపట్టిన వారు నిజాల్ని ఎలా గ్రహిస్తారూ?
ఇలాంటివెన్నో అధ్యయనం చేసి, వైదిక మూర్ఖత్వానికి విసిగిపోయి బౌద్ధం స్వీకరించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఇలా అన్నారు... ''నేను ఎందుకు బౌద్ధానికి ప్రాధాన్యం ఇచ్చానంటే.. అది మూడు సిద్ధాంతాల కలయిక. మతాలన్నీ భగవంతుడు, ఆత్మ, మరణాంతర జీవితం గురించి చెపుతాయి. బౌద్ధం ప్రజ్ఞ గురించి బోధిస్తుంది. మూఢనమ్మకాలకు, అతీత శక్తులకూ వ్యతిరేకంగా కరుణను బోధిస్తుంది. సమతను బోధిస్తుంది. భూమి మీద ఆనందంగా బతకడానికి ప్రతివ్యక్తికీ ఇవి అవసరం. బౌద్ధంలోని ఈ మూడు అంశాలు నన్ను ఆకర్షించాయి. ఆ మూడు సిద్ధాంతాలే ప్రపంచాన్ని ప్రభావితం చేయాలి! భగవంతుడు గానీ, ఆత్మగానీ సమాజాన్ని కాపాడలేవు. నా సామాజిక తాత్త్వికత మూడు మాటల్లో ఇమిడి ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం..'' ఆయన చెప్పిన ఈ విషయాల గూర్చి ఈ దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సి ఉంది.
-వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.
డాక్టర్ దేవరాజు మహారాజు