Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)ను తాజా పరిచే ప్రక్రియ... 2021 జనాభా లెక్కల ఎజెండాలోకి మళ్లీ వచ్చింది. 'హిందూ' (అక్టోబరు 27) పత్రికలో వచ్చిన వార్తా కథనం ప్రకారం, ఈ అప్డేషన్ (తాజా పరచడం)కు ఫారమ్‌ను కూడా జారీ చేశారు. అన్ని రాష్ట్రాల సెన్సస్ అధికారుల కోసం ఇచ్చిన హ్యాండ్‌బుక్‌లో భాగంగా ఈ ఫారమ్‌ను కూడా అందచేశారు. ఆగస్టు 18న ఆన్లైన్ వ్యవస్థ ద్వారా దీన్ని రూపొందించారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జిల్లా సెన్సస్ అధికారులకు అందచేసిన డాక్యుమెంట్లో ఈ ఫారమ్ ఉంది. 2010లో మొదట సమాచారాన్ని సేకరించి, తర్వాత 2015లో ఆధునీకరించిన ఎన్పీఆర్ సమాచారాన్ని మళ్ళీ తాజా పరిచేందుకు కుటుంబ సభ్యులందరికి సంబంధించిన 14 ప్రామాణికాల వివరాలను సేకరిస్తారని 'హిందూ' కథనం పేర్కొంది. జనాభా లెక్కల మొదటి దశలో భాగంగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయనే జాబితా తీస్తారు. ఎన్పీఆర్ను తాజా పరిచేందుకు ఇళ్ల లెక్కలను కూడా ఉపయోగిస్తారు. తొలుత, 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబరు వరకు ఒకేసారి వీటిని నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, కోవిడ్ కారణంగా ఇది నిరవధికంగా వాయిదా పడింది. అంటే దీనర్థం రాబోయే రోజుల్లో జనాభా లెక్కల మొదటి దశతో పాటు ఎన్పీఆర్ సర్వే కూడా మోడీ ప్రభుత్వం నిర్వహించనుందని స్పష్టమవుతోంది. ఇంటింటికి తిరిగి జరపాల్సిన సర్వే ఎప్పుడు చేపడతారనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఎన్పీఆర్ను తాజాపరచడానికి అభ్యంతరం ఎందుకు? 2019 డిసెంబరులో పార్లమెంట్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వచ్చిన తీవ్ర వ్యతిరేకత గురించి... జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్), జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సీ) లకు దీనికి గల సంబంధం గురించి ఒక్కసారి పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. సీఏఏ, ఎన్ఆర్సీలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఇవి రెండూ జంట చర్యలు. ఎన్ఆర్సీని సన్నద్ధం చేయడం కోసం ఎన్పీఆర్ అనేది మొదటి దశగా ఉంది. పౌరసత్వానికి గల నిర్వచనాన్ని మార్చడానికి మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు ఈ మూడింటికి సంబంధం ఉంది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మాదిరిగా కాకుండా పొరుగు దేశాల నుండి ఎలాంటి సరైన పత్రాలు లేకుండా ముస్లింలు వచ్చినట్లైతే, వారిని పౌరసత్వం నుండి ప్రత్యేకంగా మినహాయించాలని సీఏఏ కోరుతోంది. తద్వారా పౌరసత్వానికి మతపరమైన ప్రామాణికతను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దేశంలో పౌరులుగా తమ హక్కులను వినియోగించు కుంటున్న ముస్లిం 'చొరబాటుదారుల'ను వదిలించుకోవడానికి ఎన్ఆర్సీ ఉద్దేశించబడింది.
సీఏఏ, ఎన్ఆర్సీ మధ్య ఎలాంటి సంబంధం లేదంటూ తోసిపుచ్చడానికి కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నారు. పైగా ఎన్పీఆర్కి ఎన్ఆర్సీతో ఎలాంటి సంబంధం లేదంటున్నారు. అమిత్ షా పార్లమెంట్లో చేసిన ప్రకటనల ద్వారా ఈ వాదనల్లోని అబద్ధం గురించి, హౌం మంత్రిత్వశాఖ నివేదికల ద్వారా ఎన్పీఆర్, ఎన్ఆర్సీ మధ్య గల సంబంధం గురించి చాలా స్పష్టంగా బట్టబయలైంది. పౌరసత్వ చట్టం 1955కి సవరణ తీసుకురావడం ద్వారా జాతీయ పౌరుల రిజిస్టర్, జాతీయ జనాభా రిజిస్టర్ అనే భావనను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం వీటికి అవసరమైన నిబంధనలను రూపొందించింది. జాతీయ జనాభా రిజిస్టర్‌ను పరిశీలించిన తర్వాత ఎన్ఆర్సీ ఖరారు అవుతుందని ఆ నిబంధనలు చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఎన్పీఆర్ అనేది ఎన్ఆర్సీ మొదటి దశ అని హౌం మంత్రిత్వశాఖ చెబుతోంది. ఎన్పీఆర్ ప్రశ్నావళి సెన్సస్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్‌బుక్‌లో చేర్చబడింది. గతేడాది ఖరారు చేసిన 14 ప్రామాణికాలు, ఈ ప్రశ్నావళి ఒకటే. వీటిల్లో తల్లిదండ్రులు పుట్టిన స్థలం, పుట్టిన తేదీలు, మాతృభాష, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి కార్డు తదితర గుర్తింపు కార్డుల వంటివి ఇందులో ఉన్నాయి. స్థానికంగా జనాభా రిజిస్టర్‌ను రూపొందించేటప్పుడు తాలుకా స్థాయి అధికారి ఎవరినైనా సందేహాస్పదంగా నిర్ణయించగలిగేలా నిబంధనలు అవకాశం కల్పిస్తాయి. ఇటువంటి కేసులో, సదరు వ్యక్తి తాను భారత పౌరుడినేనని నిరూపించుకోవడానికి అవసరమైన రుజువులు చూపించాల్సి ఉంటుంది.
సీఏఏకి వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమం ఎన్ఆర్సీకి కూడా విస్తరించింది. ఎందుకంటే ఈ రెండూ కూడా జంట చర్యలే. హిందూత్వ సిద్ధాంతం ఆధారంగా పౌరసత్వం నుండి ప్రజలను మినహాయించే లేదా తిరస్కరించే చర్యలే. ఎన్పీఆర్ను తాజా పరిచేందుకు 2019 డిసెంబరులో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించినప్పుడు ఇందుకోసం రూ.8500 కోట్లు మంజూరు చేసింది.
సీపీఐ(ఎం) ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎన్ఆర్సీని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించిన ముఖ్యమంత్రు లందరికీ ఎన్పీఆర్ సర్వే క్రమాన్ని తమ రాష్ట్రాల్లో నిలిచిపోయేలా చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. డిసెంబరు చివరి నాటికి, 13 మంది ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఎన్ఆర్సీని రూపొందించబోమని ప్రకటించారు. వారిలో కేరళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు ఉన్నారు. తమ రాష్ట్రాల్లో ఎన్పీఆర్ను తాజాపరిచే ప్రక్రియను నిర్వహించబోమని వారు చెప్పారు. వాస్తవానికి, ఎన్పీఆర్ ప్రక్రియను కేరళలో నిలిపివేస్తామని, కేవలం జనాభా లెక్కల ప్రక్రియ మాత్రమే చేపట్టబడుతుందని ప్రకటించడం ద్వారా కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ముందు వరసలో ఉంది. అయితే ఆ తర్వాత కోవిడ్ కారణంగా మొత్తంగా ఈ వ్యవహారమంతా నిరవధికంగా వాయిదా పడడంతో ప్రజల దృష్టి నుండి ఈ విషయం పక్కకు మళ్ళింది. ఇప్పుడు, జనాభా లెక్కల మొదటి దశ సమయంలోనే ఎన్పీఆర్ను తాజా పరుస్తారని స్పష్టమైంది. జాతీయ పౌరుల రిజిస్టర్‌ను రూపొందించే మొదటి దశ... విభజన, మినహాయింపు ప్రక్రియగా ఉండే అవకాశమున్నందున ఇది జరగరాదు. అసోంలో ఎన్ఆర్సీ రూపొందించేటప్పుడు ఏం జరిగిందో మనం చూశాం. దాదాపు 19 లక్షల మంది ప్రజలను మినహాయించారు. వీరందరూ నిరుపేదలు. అన్ని కమ్యూనిటీలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. ప్రభుత్వం అడిగిన పత్రాలన్నింటినీ వీరు చూపలేరు. ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్పీఆర్ ఆధునీకరణ జరగకుండా చూడాలి. జనాభా లెక్కలు నిర్వహించాల్సింది, ఎన్పీఆర్ ఆధునీకరణ చేపట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బందే. అందువల్ల ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు జనాభా లెక్కల నిర్వహణకు వెసులుబాటు కల్పించాలి కానీ, ఎన్పీఆర్ను తాజాపరిచే ప్రక్రియకు కాదు. ప్రభుత్వం గనుక ఎన్పీఆర్ ప్రాజెక్టుపై పట్టుబట్టినట్లైతే, ఎన్పీఆర్ను తాజాపరిచే ప్రక్రియకు సహకరించరాదని, కేవలం జనాభా లెక్కలకు సంబంధించిన ప్రశ్నావళికి మాత్రమే సమాధానం చెప్పాలని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం