Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2001 సమ్మె జరిగి రేపటికి సరిగ్గా 20 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. అక్కడ ఇక్కడ వేరు వేరు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ బంగారు తెలంగాణ నినాదంలో టిఎస్ఆర్టీసీ పరిస్థితులు మరింత దిగజారాయి తప్ప మెరుగుపడలేదు. అందుకే 2001 సమ్మె పూర్వాపరాలు, నేటి టిఎస్ఆర్టీసీ పరిస్థితులను ఒకసారి అవలోకిద్దాం.
2001 సమ్మె పూర్వరంగం : 1995 నాటికి ఎపిఎస్ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నది. అన్ని విభాగాలలో అత్యున్నత ప్రమాణాలతో, పని విధానంతో అనేక అవార్డులతో పాటు గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఆ స్థితిలో సంస్థ అప్పటివరకు బ్యాంకుల వద్ద తీసుకున్న వివిధ రకాల దీర్ఘకాలిక రుణాలను ముందస్తుగానే తీర్చాలని నిర్ణయించింది. బ్యాంకులను సంప్రదిస్తే పీనల్ వడ్డీతో కడితేనే ఒప్పుకుంటామన్నారు. అలా పీనల్ వడ్డీలతో బ్యాంకుల అప్పులు ముందుగానే తీర్చేసింది. అప్పుడే ప్రపంచ బ్యాంకు సంస్కరణలు మొదలయ్యాయి. ఆర్టీసీ లాంటి పెద్ద సంస్థలను డౌన్సైజ్ చేయాలని లేకుంటే ఇలాంటి జైంట్ ఆర్గనైజేషన్స్ను మెయిన్టైన్ చేయలేరని తాఖీదులు అందాయి. అందుకు ఆర్టీసీ రీ-స్ట్రక్చరింగ్ పేరుతో డీటెయిల్డ్ ''బ్లూ ప్రింట్'' కూడా తయారు చేయబడింది. అందులో ఆర్టీసీని 5 ముక్కలు చేయాలని, సంవత్సరాల వారీగా ఎన్ని బస్‌లు తగ్గించాలి, ఎంతమంది స్టాఫ్‌ను తగ్గించాలి, ఎన్ని డిపోలు మూసివేయాలి, అంతిమంగా ఆర్టీసీని లిక్విడేట్ చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రపంచ బ్యాంకు ఆదేశిత బ్లూ ప్రింట్ అమలు చేయాలంటే ముందుగా ఆర్టీసీని నష్టాలలోకి నెట్టాలి. అందులో భాగంగా నాటి ప్రభుత్వం 2,000 బస్సులున్న (ప్రత్యేకంగా ఆర్టీసీని దృష్టిలో పెట్టుకొని) ప్రతి యజమాని తనకి వస్తున్న రెవెన్యూపై 12శాతం ఎం.వి. ట్యాక్స్‌గా కట్టాలని, అప్పటివరకు ఉన్న ట్యాక్స్ విధానాన్ని మార్చివేసింది. ఆ తర్వాత దానిని దశలవారీగా 14శాతం, 15శాతంగా మార్చింది. ఫలితంగా సుమారు 3 వేల కోట్ల అదనపు భారం సంస్థపై పడింది. అదే సమయంలో ప్రభుత్వం 10వ తరగతి వరకు చదివే ఆడపిల్లలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. తద్వారా ఉన్నఫళంగా ఒకేసారి బస్‌పాస్‌ల భారం రెట్టింపు అయ్యింది. ఫలితంగా ఆర్టీసీ నష్టాల ఊబిలోకి నెట్టబడింది.
స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్డబ్ల్యుఎఫ్ కృషి) : ఆర్టీసీకి సమాధి కట్టే బ్లూ ప్రింట్‌ను అనేక కష్టాలకోర్చి ఎస్డబ్ల్యుఎఫ్ సంపాదించింది. దానిలోని అనేక అంశాలతో పాటు పన్నుల వల్ల నష్టాన్ని వివరిస్తూ బుక్లెట్ వేసి ప్రచారం చేసింది. దాంతో ఆర్టీసీ పరిరక్షణ అంశం ముందుకొచ్చింది. అంతకు ముందు విషం అయినా తీసుకుంటాను గానీ, ఐక్య కార్యాచరణకు రానన్న సంఘం కూడా అనివార్యంగా జాయింట్ యాక్షన్‌లోకి వచ్చింది.
జేఏసీ ఏర్పాటు - సమ్మె సన్నాహాలు : పైవిధంగా ఏర్పడిన జేఏసీ సమ్మె ఆవశ్యకత, డిమాండ్లపై కార్మికులలో ప్రజలలో విస్తృత ప్రచారం చేసి చైతన్యం కలిగించింది. సమ్మెకు కార్మికులను సన్నద్ధం చేయడమే కాకుండా విస్తృత ప్రజా మద్దతును కూడగట్టడానికి జేఏసీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించింది. జేఏసీ చేసిన కృషి ఫలితంగా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఆర్టీసీకి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నదనే విషయం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మొత్తం ప్రజానీకం గుర్తించగలిగాయి.
2001 అక్టోబర్ 14 నుండి నవంబర్ 6 వరకు 24 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమ్మెలో అప్పటివరకు ఎన్నడూ కానరాని విశాల ఐక్యత, పోరాట పఠిమ గోచరించాయి. కార్మికులందరూ ఉవ్వెత్తున ఉద్యమంలోకి వచ్చారు. సమ్మెకు ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, అధికార పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక, ఆర్టీసీ కార్మికులతో పాటు రోడ్లపైకి వచ్చారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ రంగంలో జరగని విధంగా సంస్కరణలు, ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె జరిగింది.
సమ్మెకు మద్దతిస్తున్నవారి పైన, కార్మికులపైన ప్రభుత్వం తీవ్రమైన దమనకాండను ప్రదర్శించింది. సమ్మెను అణచడానికి ప్రయివేటు వారికి కారుచౌకగా పర్మిట్లు ఇచ్చి ఇష్టారీతిన బస్‌లు తిప్పుకోమంది. జాతర లాగా కొత్త రిక్రూట్మెంట్కు ద్వారాలు తెరిచింది. కార్మికులకు షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, రిమూవల్స్ జారీ చేసింది. క్యాజువల్ కార్మికులను విధులలో నుండి తొలగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్మిస్లు కూడా చేసింది. వందల మందిని అరెస్ట్‌లు చేసి జైళ్ళకు పంపింది. ఇంతటి దమనకాండకు కూడా కార్మికులు భయపడకుండా మరింత ద్విగుణీకృత ఉత్సాహంతో, సంస్థను ప్రయివేటీకరణ ప్రమాదం నుండి రక్షించుకోవాలనే ఏకైక లక్ష్యంతో, ఏకోన్ముఖంగా ముందుకు కదిలారు.
ఈ హఠాత్పరిణామానికి ఖంగుతిన్న ప్రభుత్వం వెంటనే కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించింది. పలుదఫాల చర్చల అనంతరం ఎం.వి. టాక్స్ కొంతమేర తగ్గించడం, బస్‌పాస్‌ల మొత్తంలో 50శాతం చెల్లించడానికి ఒప్పుకుంది. ఈ ట్యాక్స్‌లు, బస్‌పాస్‌ల వల్ల లేని నష్టాలను మూటగట్టుకున్న ఆర్టీసీ, ఆ తరువాత కొంతమేర కోలుకునే అవకాశం ఏర్పడింది.
కార్మికుల చైతన్యం : అడుగడుగునా జేఏసీ విచ్ఛిన్నానికి జరిగిన ప్రయత్నాలను ఎప్పటికప్పుడు జాగరూకతతో ఉండి జేఏసీని చివరి వరకు నిలపడంలో కార్మికుల పాత్ర శ్లాఘనీయం. ఒక దశలో ఒక సంఘ నాయకత్వం జేఏసీ నుండి బయటికి పోవడానికి చేసిన ప్రయత్నాలను, ఆ సంఘ కార్యకర్తలే నిరోధించి అధినాయకత్వాన్ని సైతం తిరిగి జేఏసీలో ఉండే విధంగా చేశారు. చరిత్ర నిర్మాతలు ప్రజలే అనే దాన్ని ఆచరణలో ఆర్టీసీ కార్మికులు రుజువు చేశారు. తదుపరి నాటి ప్రభుత్వ ఓటమికి కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె ఒక ప్రధాన భూమిక పోషించింది.
ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాక్షాత్తు 'మే' డే నాడే రూట్లపై ఆర్టీసీ గుత్తాధిపత్యం లేదని చెప్పింది. హైదరాబాద్ సిటీలో సెట్విన్ బస్‌లు ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ముందు నుండే ప్రయివేటు బస్‌లు అక్రమంగా స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్నా చర్యలు తీసుకోలేదు. ఇటువంటి స్థితిలో మరోసారి సంస్థ రక్షణ ప్రమాదంలో పడిందని గమనించిన కార్మికులు 3రోజులు ఒకసారి, 2రోజులు ఒకసారి రెండు దఫాలు సమ్మె చేశారు. తద్వారా ఎం.వి. ట్యాక్స్‌లు 12శాతం నుండి 7.5శాతం, 5శాతానికి తగ్గాయి. 100శాతం బస్‌పాస్‌ల మొత్తాన్ని రీయింబర్స్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చింది. వరల్డ్ బ్యాంక్ సంస్కరణలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాడి ఆ సంస్కరణలను కొంతకాలం పాటైనా అటకెక్కించే విధంగా విజయం సాధించిన అతిపెద్ద పోరాటం ఆర్టీసీ కార్మికుల సమ్మె.
నేటి ఆర్టీసీ పరిస్థితి : నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వరంగం మొత్తాన్ని గంపగుత్తగా, కారుచౌకగా తమ అనుయాయులైన కార్పొరేట్లు, విదేశీ గుత్త పెట్టుబడిదారీ సంస్థలకు అమ్మేయాలని చూస్తున్నాయి. అందులో భాగంగానే అధినేత నోటివెంట ప్రభుత్వరంగం పుట్టిందే చావడానికి అనే బాధ్యతా రాహిత్యపు మాటలు వెలువడ్డాయి. ఆ క్రమంలోనే రాష్ట్రంలో కూడా 2019లో ''తెలంగాణ ఆర్టీసీ పరిరక్షణ'' సమ్మె సందర్భంగా కూడా సంస్థను ప్రయివేటీకరిస్తాం, సంస్థకు పైసా ఇచ్చేది లేదు, అందరూ డిస్మిస్ అయినట్లే, కనీసం 'ఎం.డి.'ని కూడా నియమించే స్థోమత లేదు అంటూ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి చివాట్లు తిన్న విధానం అందరూ కళ్ళారా చూశారు. నేటి చైర్మన్‌కూడా రాగానే వల్లించిన ప్రయివేటీకరణ జపం అందరకీ తెలుసు. తార్నాకను మెల్లమెల్లగా ప్రయివేటు కబంధాలలోకి నెడ్తున్నదీ గమనిస్తున్నాం. సర్వీసులు తగ్గించి, డిపోలను మూసివేస్తూ, ఖరీదైన స్థలాలను అభివృద్ధి పేరుతో ప్రయివేటు వారికి అప్పగించాలనే కుతంత్రాలను అవగాహన చేసుకుంటున్నాం. కేంద్రం మోటారు వాహనాల చట్ట సవరణల పేరుతో ఆర్టిసిలకు ఘోరీ కట్టాలని చూస్తుంటే దానిని పార్లమెంట్లో సపోర్ట్ చేసింది టిఆర్ఎస్ పార్టీ. కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మారిస్తే కిమ్మనలేదు. అంటే ఆర్టీసీని నాశనం చేసే విధానాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలుచేస్తున్నది.
నేటి మన కర్తవ్యం : 2001, 2005లలో సమ్మె చేయకపోతే కొంతమేరకైనా ట్యాక్స్, బస్‌పాస్ రాయితీలు వచ్చేవి కావు. ఆర్టీసీ రక్షించబడేది కాదు. కార్మికులు పోరాడి పరిరిక్షించుకున్న ఆర్టీసీకి ప్రమాదం పొంచి ఉంది. ఈ విషయాలన్నింటినీ ప్రజలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా సంఘాలలోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి. వారందరి సహాయ సహకారాలతో టిఎస్ఆర్టీసీ కార్మికులంతా ఏకోన్ముఖంగా మరో పోరాటం చేసైనా ఆర్టీసీని రక్షించుకోవాలి. ఇదే 2001 సమ్మె పోరాటం నేర్పిన పాఠం.
- నిర్మలారావు