Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్. అందునా గులాబీ దళపతికి అత్యంత దగ్గరివాడు. అంతకు మించి అన్న ఎన్టీఆర్ హయాంలో కారు సారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా మామనే అంటిపెట్టుకుని ఉన్న రాంబంటు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి, ఆ తర్వాత గులాబీ సర్కారులో ముఖ్య భూమిక పోషిస్తున్న లీడర్. దీనికితోడు పార్టీకి, ప్రభుత్వానికి ఎలాంటి ఆపదలు, ఇబ్బందులెదురైనా 'నేనున్నానంటూ...' ముందుకొచ్చే ఆపద్భాంధవుడు. అందుకే అటు టీఆర్ఎస్ అభిమానులు, ఇటు మీడియా వాళ్లూ ఆయనకు ముద్దుగా 'ట్రబుల్ షూటర్...' అనే పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన్ను హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి అడిగితే... 'ఏం లేదు... అంతా అయిపోతుంది... అందర్నీ సెట్ చేసినం. మనమేం గెలుస్తాం... గెలుస్తున్నం...' అంటూ ధీమా వ్యక్తం చేశారాయన. చివరకు ఫలితం మాత్రం తేడా కొట్టింది. గతంలో దుబ్బాక ఉప ఎన్నికకు కూడా ఆయనే ఇన్‌ఛార్జి. అక్కడ కూడా ఇదే మాదిరిగా దెబ్బ పడింది. దాంతో ఆయన రెట్టింపు కసితో ఈసారి హుజూరాబాద్‌లో పనిచేసినా... జనాలు కారును ఆదరించలేదు. దీంతో పాపం.. ట్రబుల్ షూటర్‌కే ట్రబులొచ్చిందే...' అంటూ ఆ అమాత్యుడిపై ఇప్పుడు టన్నులకొద్ది సానుభూతి కురుస్తున్నారు జనాలు. మరోవైపు హుజూరాబాద్‌లో గెలిస్తే... సీఎం కేసీఆర్ ఛరిష్మా, ప్రభుత్వ పథకాలు, దళిత బంధు వల్ల గులాబీ జెండా రెపరెపలాడింది అనేవారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి, మంత్రి ప్రయత్నించినా ఫలితం దక్కలేదనే అపవాదును, అవమానాన్ని మూట కట్టుకోవాల్సి వస్తున్నదంటూ ఆయన అభిమానులు వాపోతున్నారు. ఒక పెద్దాయన 'విజయానికి అందరూ బంధువులే.. అపజయమే అనాథ...' అని చెప్పారు ఇందుకేనేమో...
-బి.వి.యన్.పద్మరాజు