Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఆయన మా గౌరవాధ్యక్షుడే కావచ్చు. ఆయనతో మాకు ఒరిగేదేం లేదు. అప్పుడెప్పుడో ఉద్యమ సమయంలో గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నాం. నామ్ కే వాస్తే ఇప్పటికీ కొనసాగిస్తున్నాం. మా సమస్యలు వేరు... ఆయన శాఖ వేరు. ఈ మధ్యకాలంలో ఆయన్ని మేం ఎప్పుడూ కలవలేదు. మా సమస్యలు చెప్పలేదు. ఆయనతో మాకు వచ్చేదీ లేదు... పోయేదీ లేదు'' ఎక్సైజ్, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఉద్దేశించి తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్న మాటలు ఇవి. ప్రెస్‌క్లబ్‌లో ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు తమ సమస్యల గోడును విలేకరుల ఎదుట వెళ్లబోసుకున్నారు. 'అదేంటీ... మీ గౌరవాధ్యక్షులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కదా! మీ లెటర్‌హెడ్‌లో ఆయన పేరే ఉందికదా! ఆయనతో మాట్లాడారా?' అని విలేకరులు ప్రశ్నిస్తే... ఒంటికాలిపై లేస్తూ పై విధంగా స్పందించారు. 'అప్పుడెప్పుడో ఆయన మా గౌరవాధ్యక్షుడు... పోన్లే అని లెటర్ హెడ్లో అలాగే ఉంచేశాం' అంటూ అసహనాన్ని వెళ్లగక్కేశారు. ఏడేండ్లలో మీరు రెండుసార్లు సమ్మెచేశారు. మళ్లీ సమ్మెకెళ్తాం అంటున్నారు. పాత సమస్యలే కదా... అప్పుడెందుకు విరమించారు? ఇప్పుడెందుకు మళ్ళీ సమ్మె అంటున్నారు? అని విలేకరులు ప్రశ్నించగానే... దిక్కుమాలిన ప్రభుత్వం సార్, అప్పట్లో కడియం శ్రీహరి, శ్రీనివాస్‌గౌడ్ లాంటి మంత్రులు మా సమస్యలు పరిష్కరిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత 'తూ నా బొడ్డు' అన్నారు. ఈ సారి అలాగేం ఒప్పుకోం. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం... అంటూ చెప్పుకొచ్చారు. మా లారీ యజమానులం ఏటా రూ.100 కోట్లు పన్నుల రూపంలో సర్కారుకు చెల్లిస్తున్నాం. మా సొమ్ము తీసుకుంటూ మాపైనే ఉల్టా కేసులు పెడుతున్నారు... అంటూ దుమ్మెత్తిపోశారు. 'ఆయనేం రవాణామంత్రో... ప్రగతి భవన్ నకల్ లెక్కున్నాడు. కనీసం కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు' అంటూ మంత్రి పువ్వాడ అజరుకుమార్పై కస్సున లేచారు. ఏపీ మంత్రి పేర్ని నాని నయం... మేం వెళ్లి అడగ్గానే లెటర్ హెడ్ మీద సింగిల్ పర్మిట్‌కు మేం రెడీ... మీరు రెడీనా అంటూ రాసిచ్చారు. ఆ మాత్రం ధైర్యం కూడా ఇక్కడి రవాణామంత్రికి లేదంటూ దెప్పిపొడిచే మాటలు అందుకున్నారు. ఇప్పటికే రైల్వే, ఆర్టీసీ సంస్థలు కార్గో పేరుతో మా నోళ్లు కొడుతున్నాయి. రోడ్ టాక్స్, ఇన్సూరెన్స్, స్పేర్ పార్ట్స్, పర్మిట్లు, ట్రాఫిక్ చలానాలు, ఓవర్ లోడ్ అంటూ వేర్వేరు పేర్లతో పన్నులు వసూలు చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గంజిలో మెతుకుల్లా తీసేస్తుంది... దీనె.... అంటూ తీవ్ర అసహనం, ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కారు... ఇక వారిని కదిలించడం మంచిది కాదని పాత్రికేయులు మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి