Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెట్రోలు ధర నూట ఇరవై. డీజిల్ కూడా దాని ధరకు దగ్గర దగ్గరగా ఉంది. ఆ నూట ఇరవైని నూట ముప్పై ఐదు చేస్తారని పిపీలకరావుకు వాట్సాప్పు సందేశం వచ్చింది. వామ్మో చస్తి కదరా అనుకున్నాడు. అయినా నాతొ పాటు చచ్చేవాళ్ళు ఇంకెందరో ఉన్నారు కదా వాళ్లకు లేని ఇది నాకెందుకు అని జాగ్రత్తగా బండి యాక్సిలేటరు నొక్కి ఇంటిదారి పట్టాడు. ఆ ధర ఏ నూట యాభయ్యో, రెండువందలో అయితే తనది డుగ్గు డుగ్గు బుల్లెట్ బండి కాకపోయినా, మామూలు మోటారు సైకిలైనా అమ్మేయాల్సిందే. ఆ ధరలు పెట్టి బండి నడిపే సమస్యే లేదు. హాయిగా షేర్ ఆటోలో పోవచ్చు అనుకోని, మళ్ళీ సందేహంలో పడ్డాడు. అందరికీ పెట్రోలు ధర పెరిగినప్పుడు బండి అదీ సెకండ్ హ్యాన్డ్ బండి ఎవరు కొంటారు, ధర ఎంత వస్తుంది అన్న అనుమానాలతో పాటు, బండి లేకపోతె కనీసం సైకిలున్నా బాగుంటుంది అదేదో సినిమాలో కోటేష్ బాబు సైకిలు మీద ఎంత స్టయిలుగా వెళ్తాడు నేనూ అలాగే పోవచ్చు అని సంబర పడతాడు కూడా. ఆ సంబరమూ కొన్ని సెకండ్లే . ఈ వయస్సులో, అదీ అలవాటు తప్పిపోయాక, ఈ ట్రాఫిక్కులో సైకిలు తొక్కడం సంభవమేనా అనీ అనుకున్నాడు. ఇంటిలోపల అన్న రామారావు పాత పాట ''సంభవం నీకే సంభవం'' గుర్తొచ్చింది, చిరు పాట అదీ సైకిలు పందెం మీద ''నీ దారి పూల దారి పోవోయి బాటసారి'' అనీ గుర్తొచ్చింది, తెగ ఆనందపడ ిపోయాడు. మల్లీ షరా మామూలే ఆ ఆనందం కొన్ని క్షణాలే. అలా పోతూ ఉంటే పిపీలకరావుకు దాదాపు సంవత్సరం నుండీ ప్రజా సంఘాలు పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించాలంటూ చేస్తున్న ధర్నాలు, రాస్తా రోకోలు గుర్తుకొస్తున్నాయి.
ఓ కార్మిక నాయకుడిని ఆ ధర్నా దగ్గరే ఓసారి తానో ప్రశ్న వేశాడు పిపీలక రావు. ఇన్నిసార్లు ఇన్ని పోరాటాలు చేస్తున్నారు కదా, రోజుకు ఏంతో కొంత పైసల్లోనైనా వాటి ధరలు పెంచుతున్నారు కదా అసలు ఈ పోరాటాలను ఎవరు గమనిస్తున్నారు, ఎంతమంది మీకు మద్దతు ఇస్తున్నారు, పెట్రోలు బంకు దగ్గర ఎవరంతకు వాళ్ళు డబ్బులిచ్చి వేయించుకొని పోతున్నారు కదా వాళ్లలో ఎవ్వరు ఈ ధర్నా దగ్గర లేరు కదా, మరి వాళ్లకెలా తెలిసేది, వాళ్ళెప్పుడొస్తారు ఈ ధర్నాలోకి, అందులో సగం మంది వచ్చినా ప్రభుత్వం దిగొస్తుంది కదా అని తన ధర్మ సందేహాలను ఒక్కటొక్కటిగా ఏకరువు పెట్టాడు.
కార్మిక నాయకుడు ఒకటే మాట చెప్పాడు మేము చేస్తున్నది వాళ్ళ కోసమే కదా, మరుసటిరోజు పేపరులో చూస్తారు, ఈరోజే మన కార్యక్రమం చూసేవాళ్ళు కొందరు. మొత్తం మీద వాళ్ళ కోసం చేస్తున్నామని వాళ్లకు తెలుస్తుంది కదా అన్నాడు. తెలుస్తుంది సరే ప్రభుత్వానికి తెలిసేదెలా అని మరో సందేహం వదిలాడు. వాళ్ళూ చూస్తున్నారు కదా, వాళ్లకు ఇంటెలిజెన్స్ శాఖలున్నాయి, ఎక్కడెక్కడ మేము ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాం అన్నది ఆరా తీస్తారు అని సందేహ నివృత్తి చేసాడు . ఊరకే ఆరా తీయడమే కానీ తగ్గించింది లేదు కదా అని మరో సందేహ బాణం వదిలాడు. కార్మిక నాయకుడిది మామూలు ఓపిక కాదు కాబట్టి వాళ్ళూ దిగిరాక తప్పదు లేదంటే ప్రజల కోపాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటారు అన్నాడు. ఏమైనా సరే మీరు రమ్మన్నందుకు వచ్చాను కానీ ఈ ధరలు తగ్గుతాయని నాకు నమ్మకం లేదు అనేశాడు రావు. కార్మిక నాయకుడు నవ్వాడు. చూద్దాం అన్నాడు నవ్వుతూనే.
పిపీలకరావుకి ఓ సలహా కూడా ఇచ్చాడు. అదేమంటే రావిశాస్త్రి ''పిపీలకం'' కథ చదవమన్నాడు. అలాగే చదివాడు మన రావు. అందులో ఓ చీమ తానెవరు అనుకుంటూ ఎందరో పండితుల దగ్గరికి, మునుల దగ్గరికి పోయి అడుగుతుంది. సమాధానం దొరకదు. మిగతా చీమలు నీవెవరవు చీమవు, తల బద్దలు కొట్టుకోక మాతో పాటు పని చేయమన్నాయి. ఇదేమో మెదడున్న చిట్టి చీమ. తానెవరో, తన శక్తి ఏమిటో తెలుసుకోవాలన్న తపన ఎక్కువ. ఒక ఋషి నీలోను శక్తి ఉంది దాన్ని ఉపయోగించు అని మునుల పరిభాషలో చెప్పాడు. అప్పుడు దానికి ఓ రాక్షసుడు ఎదురై చీమకు చెప్పిండట నేను సుఖభోగిని నీవు పనిచేసే చీమవు అని. మీలాంటి కష్ట జీవుల పైనే మాలాంటి తిష్ట జీవులు బతుకుతారని కూడా చెప్పిండు. చెప్పడమే కాదు పని పురమాయించిండు. ఆమాటలకు చీమ అహం దెబ్బ తినింది. బాగా కోపమొచ్చి తనవారందరినీ కూడగట్టి ఆ రాక్షసుడిని చంపేసి భూభారం తగ్గిస్తుంది. కథ అంతా చదివిన తరువాత మన రావుకు ఇది సాధ్యమేనా అన్న ఆలోచన వఛ్చి, తన సహజ ధోరణిలో ఇంటికి పోయాడు. చీమలన్నింటినీ కూడగట్టడం ఎలా అనీ ఆలోచించాడు. పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించమని చేసే ఆ ధర్నాల దగ్గర ఉన్నది మామూలు చీమలు కావు, కథలో రాక్షసుడిని చంపే చీమలు. ఎంతటి బ్రహ్మ రాక్షసుడినైనా అన్నీ కలిస్తే చంపేస్తాయి. ఆ చీమల్లో తానూ కలవాలి. ఫలితం ఎక్కడో ఎప్పుడో తప్పక వస్తుంది. ప్రజలకు ఈ విధంగా విషయాలు తెలపాలి అన్న కార్మిక నాయకుడి మాటలు కూడా గుర్తొచ్చాయి.
మామూలుగానే తానో మామూలు జీవిని అనుకుంటూ రావు ఆఫీసుకు బయలుదేరాడు ఆరోజు కూడా. పెట్రోలు ఇండికేటరు ఎరుపులో ఉంది. సరే అని పెట్రోలు బంకు దగ్గర ఆగాడు. రేటు చూసాడు, ఐదు రూపాయలు తగ్గింది. అరే అనుకుంటూ కళ్ళు నిలుపుకుని మరీ చూసాడు, నిజమే, తనను తాను గిచ్చుకున్నాడు... అప్పుడు పెట్రోలు వేసే అబ్బాయి చెప్పాడు నిన్న పెట్రోలు ధర కేంద్రం తగ్గించింది కదా సార్ రాష్ట్రాలు కూడా తమ పన్నులను తగ్గించాయి అందుకే ఐదు రూపాయలు తగ్గింది. అయినా మొన్న ఎన్నికల ఫలితాల్లో దెబ్బ తిన్నారు కదా!! అనీ అన్నాడు. అప్పుడర్థమైంది మన పిపీలకరావుకి ఎప్పుడూ ధర్నాలు చేసే వాళ్ళ గురించి, వాటి ఫలితాల గురించి. నిజమే ప్రజలు చీమలైనా రాక్షసుడిని మట్టు పెడతాయి అని పొంగి పోయాడు. ఇది చిన్న దెబ్బే , పెద్ద దెబ్బ ముందుంది అనుకొని కార్మిక నాయకుడికి ఫోను చేసాడు ''పిపీలకం గెలిచింది కామ్రేడ్'' అని.
- జె. రఘుబాబు
సెల్: 9849753298