Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచాన్ని అక్టోబర్ మహావిప్లవం 'కుదిపేసి' వందేండ్లు దాటింది. విశ్వగతినే మార్చిన ఆ విప్లవం ప్రపంచ వ్యాపితంగా కార్మికుల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తూనే ఉంది. మానవ చరిత్రలో అది ఒక నూతన దశను ఆవిష్కరించింది. కార్మికవర్గంపై నయా ఉదారవాద విధానాల దాడి తీవ్రమైన నేటి దశలో ఆ విప్లవ ప్రాశస్త్యం ఇంకా పెరిగింది.
మానవజాతి చరిత్రలో తొలిసారి రైతాంగాన్ని, ఇతర కష్టజీవుల్ని కలుపుకుని కార్మికవర్గం సాగించిన ఆ విప్లవం దోపిడీలేని సమాజాన్ని సృష్టించింది. అది ఒక పాలకుడి స్థానంలో మరో పాలకుడ్ని నిలపడం కాదు. ఒక పార్టీ స్థానంలో మరో పార్టీని లేదా కూటమిని ప్రతిష్టించడం కాదు. లేదా అంతకు ముందు జరిగిన విప్లవాల్లా రాజ్యాధికారాన్ని ఒక దోపిడీవర్గం చేతిలో నుండి మరో దోపిడీ వర్గం చేతికి బదలాయించడం కాదు. శతాబ్దాలుగా దోపిడీకి గురవుతున్న కార్మికవర్గం పేదరైతాంగంతో కల్సి దోపిడీ వర్గాలను అధికారం నుండి కూలదోసిన అపురూప ఘటన అక్టోబర్ విప్లవం. అన్ని అధికారాలు సోవియట్లకే అన్న బోల్షివిక్ పార్టీ పిలుపు నందుకుని కార్మికులు, రైతులు, సైనికులు ఆనాటి (రష్యా) రాజధాని పెట్రోగ్రాడ్‌ను అప్పటివారి క్యాలండర్ ప్రకారం అక్టోబర్ 25న (నవంబర్ 7) ఆక్రమించారు. రష్యాలోని అన్ని పట్టణాల్లోనూ ఆ ఆక్రమణ జరిగింది.
ఈ విప్లవం పాత వ్యవస్థను ధ్వంసం చేసి కార్మికుల, పేదరైతుల, ఇతర కష్టజీవుల ప్రయోజనాల రక్షణకై నిలిచింది. ఉత్పత్తి సాధనాలైన పరిశ్రమలు, భూములు మొదలైన వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం అవి నిర్వహించబడ్డాయి. ప్రపంచంలో మొదటిసారిగా సోషలిస్టు ఉత్పత్తి విధానం ప్రారంభమైంది. ప్రజల అవసరాల కోసం 'ప్లాన్' చేయబడి ప్రజల అవసరాలకోసమే ఉత్పత్తి జరిగింది. పిడికెడు మంది పెట్టుబడిదార్ల ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకోలేదు. దోపిడీ శృంఖలాలను తెంచివేస్తే ఉత్పత్తి అంగలు పంగలుగా ఏవిధంగా పెరుగుతుందో ఆ వ్యవస్థ రుజువు చేసింది.
సోవియట్ రాజ్యం భూస్వామ్య విధానాన్ని రద్దు చేసింది. పేద రైతుల, వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు ప్రారంభమైనాయి. 1965 నాటికి, నాటి జపాన్ను మించి, ప్రపంచంలో అత్యధికంగా తలసరి ఆదాయం ఉన్న దేశంగా సోవియట్ మారింది. కొద్ది సంవత్సరాల్లోనే అవిద్యను నిర్మూలించింది. 15సంవత్సరాల వారందరికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించింది. దేశ పౌరులందరికి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించింది. ప్రపంచంలో మొట్టమొదటి సారి పంచవర్ష ప్రణాళికలు ప్రారంభించి పదేండ్లలో నిరుద్యోగాన్ని సంపూర్ణంగా నిర్మూలించింది.
శైశవ ప్రాయంలోని ఆ సోవియట్ యూనియనే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత (1918) పేట్రేగిన మహమ్మారి 'ఇన్ఫ్లుయెన్జా'ను విజయవంతంగా నియంత్రించింది. ఆ ప్రభుత్వం చేసిన మొదటి నిర్ణయాల్లో ప్రజారోగ్య పరిరక్షణ ఒకటి. నేటి పెట్టుబడిదారీ ప్రపంచం కోవిడ్ మహమ్మారికి తన ప్రజల్ని ఏవిధంగా గాలికి వదిలేసిందో ప్రస్తుత లాక్డౌన్లు, పెరిగిన నిరుద్యోగం, ఫలితంగా విస్తరిస్తున్న ఆర్థిక సంక్షోభం వంటివి చూస్తే నాటి సోవియట్ వ్యవస్థ ఔన్నత్యం స్పష్టమవుతుంది. విప్లవం జయప్రదం కాగానే మహిళలందరికి ఓటు హక్కు ఇవ్వబడింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా కీర్తించబడుతున్న అమెరికాలో శ్వేత జాతి మహిళలకు 1919లో ఓటుహక్కు రాగా, నల్లవారికి, మగ, ఆడ అందరికీ అతిపెద్ద పోరాటాల తర్వాత 1965లో ఓటుహక్కు వచ్చింది. ఇంగ్లండులో మహిళలకు ఓటు హక్కు 1928లో వచ్చింది.
పనిచేసే హక్కు ప్రాథమిక హక్కుగా సోవియట్ రాజ్యాంగం కల్పించింది. నిర్మాణరంగం, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు, అడవుల పెంపకం, గ్రామీణ విద్యుదీకరణ మొదలైనవి చేపట్టడం ద్వారా ఈ సమస్య పరిష్కరించారు. కార్మికులకు వారి జీతాల్లో 4-5శాతం ఖర్చుతో ఇల్లు, విద్యుత్ సదుపాయం కల్పించారు. అతి చౌకగా రవాణా సదుపాయం కల్పించబడింది. కార్మికులందరికి పెన్షన్ సదుపాయం కల్పించబడింది. కార్మికుల ఆరోగ్యం, వినోదానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆరోగ్య కేంద్రాలు, ఆటస్థలాలు, స్టేడియాలు వంటివి దేశమంతా నిర్మించబడ్డాయి. పారిశ్రామిక కార్మికులందరికి వారానికి ఐదు రోజులే పనిదినంగా ఉండింది. ప్రమాదకరమైన పని ఉండే పరిశ్రమల్లో పనిదినం ఏడుగంటలకే కుదించబడింది. మహిళా కార్మికులకు సమాన వేతనాలు ఇచ్చారు. మెటర్నటీ బెనిఫిట్లు మహిళా కార్మికులందరికీ ఇచ్చారు. పని ప్రదేశాల్లో క్రెచ్‌లు తప్పనిసరి చేశారు. తమ పిల్లలకు పాలిచ్చేందుకు మహిళలకు 'ఫ్రీటైమ్' ఇచ్చారు.
కార్మికవర్గ రాజ్యం ఏర్పడి, కార్మికుల, ప్రయోజనాల కోసం అది చేపట్టిన చర్యలు ప్రపంచ వ్యాపితంగా ఎంతో ప్రభావం కల్పించాయి. సోషలిస్టు సిద్ధాంతం విస్తరించకుండా ఉండాలంటే అన్ని అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లోనూ కార్మికులకు ఎన్నో కొన్ని చర్యలు చేపట్టాల్సిన స్థితి వచ్చింది. దాన్లో భాగమే ఐ.ఎల్.ఓ. ఏర్పాటు. తక్కువ సమయంలో వారి ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించడంలో అక్టోబర్ విప్లవం సాధించిన అద్భుత విజయాలు మనదేశంతో సహా అన్ని దేశాల వారికి స్ఫూర్తి నిచ్చింది. విప్లవకర ఆలోచనల్తో కార్మికవర్గాన్ని సంఘటితం చేసే ప్రయత్నం చేశారు. దాన్లో నుంచే 1920లో ఎ.ఐ.టి.యు.సి. ఆవిర్భవించింది. అటువంటి దోపిడీ రహిత సమాజం కోసం భారత కార్మికవర్గం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్రియాశీల పాత్ర పోషించింది.
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో ఆకాలంలో పెల్లుబికిన జాతీయ విమోచనా పోరాటాలను కూడా అక్టోబర్ విప్లవం ప్రభావితం చేసింది. భగత్‌సింగ్ ఆయన కామ్రేడ్లు కోర్టులో తమ విచారణ జరుగుతున్నప్పుడే లెనిన్ జయంతి సందర్భంగా సోవియట్‌కు శుభాకాంక్షలు పంపారు. రెండు కోట్ల మంది తమ పౌరుల ప్రాణాలుత్యాగం చేసి రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్ సాధించిన విజయం జాతీయ విముక్తి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.
మార్కిజం, లెనినిజం ఆధారంగా దోపిడీ రహిత సమాజ స్థాపనలో అక్టోబర్ విప్లవం మొదటి ప్రయోగం. అది సోషలిజం నిర్మించేలోపే సామ్రాజ్యవాద దేశాలు ఆ మొదటి కార్మికవర్గ రాజ్య పీక నులిమేందుకు పూనుకున్నాయి. సామ్రాజ్యవాదుల సాయంతో పెట్రేగిన ప్రతీఘాత విప్లవాన్ని అణిచివేయడానికి రెడ్ ఆర్మీకి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత అది అన్ని రంగాల్లో అమెరికన్ సామ్రాజ్యవాదంతో పోటీపడే స్థితికి అచిరకాలంలోనే చేరుకుంది. కార్మికవర్గంలో సోషలిస్టు చైతన్యం తరిగిపోవడం, రివిజనిస్టు సిద్ధాంతం ఆవహించడం, పారిశ్రామిక సంస్థలపై బ్యూరోక్రటిక్ పద్ధతులు వంటివి ఇతర కారణాలతో పాటు సోషలిజం నిర్మాణంలో కార్మికవర్గ నాయకత్వ పాత్రను బలహీనం చేశాయి. ప్రజల ఆశలు, అవసరాల మేరకు వివిధ సరుకులనందించడంలో రాజ్యం విఫలమైంది. సామ్రాజ్యవాదం పాత్రను తక్కువ అంచనా వేశారు. పెట్టుబడిదారీ ఆలోచనా విధానం లోనికి చొచ్చుకుని వచ్చింది. ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని సామ్రాజ్యవాదుల సాయంతో ప్రతీఘాత విప్లవశక్తులు సంపూర్ణంగా వినియోగించుకున్నాయి. సోషలిస్టు నిర్మాణం కూల్చివేయబడింది.
సోషలిజం కూలిపోయిన తర్వాత కార్మికవర్గ పరిస్థితి మరింతగా దిగజారింది. సోషలిస్టు సమాజంలో పొందుతూండిన సౌకర్యాలన్నీ ఉపసంహరించబడ్డాయి. దిగజారిన పని పరిస్థితులు, పని భద్రత కరువు, పెచ్చరిల్లిన నిరుద్యోగం, జీవన ప్రమాణాలు పడిపోవడం వల్ల నేడు రష్యన్ ప్రజలు తాము ఏమికోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు. ఇటీవల 'లెవాడా సెంటర్' 2021, ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 49శాతం ప్రజలు సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను కోరుతున్నట్టుగా తేలింది. కేవలం 18శాతమే ప్రస్తుత వ్యవస్థను, 16శాతం మంది పశ్చిమదేశాల ప్రజాస్వామ్యమే మంచిదని భావిస్తున్నారు. రాజ్యమే ప్లాన్ చేసి పంపిణీ చేసే ఆర్థిక వ్యవస్థే మంచిదని 62శాతం భావిస్తున్నారు. ప్రయివేటు ఆస్థిని, మార్కెట్ ఆర్థిక వ్యవస్థను కేవలం 24శాతం మందే మంచిదనుకుంటున్నారు. 75శాతం మంది ప్రజలు ''సోవియట్ యుగం'' తమదేశ చరిత్రలో అత్యున్నత దశగా భావిస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొన్నది కేవలం వృద్ధులే కాదు, అన్ని వయసులవారు ఉండటం విశేషం.
సోవియట్ విచ్ఛిన్నం తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదం ఆధ్వర్యంలోని ఏక ధృవ ప్రపంచంలో కార్మికవర్గంపై దాడి తీవ్రమైంది. ఇది ఆ సమాజంలో అంతరాలు పెంచింది. అన్ని పెట్టుబడిదారీ దేశాల్లోను కార్పొరేట్లకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ విధానాలు కార్మికుల దోపిడీని అనేక రెట్లు పెంచాయి. ఏ మితవాద శక్తులైతే ఈ దోపిడీని తీవ్రం చేయడానికి ప్రోత్సహించబడుతున్నాయో అవే ఒక పక్క కార్మికుల దోపిడీని పెంచుతూ ప్రజా సంపదను కార్పొరేట్ల జేబుల్లోకి బదలాయించేందుకు కృషి చేస్తున్నాయి. వర్గ ఐక్యతకు ఇవే ప్రమాదంగా మారాయి. అదే సమయంలో ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాపితంగా కార్మికవర్గంలోను, సాధారణ ప్రజల్లోను అసంతృప్తి పెరుగుతోంది. నయా ఉదారవాద విధానాలు నేడు అపఖ్యాతి పాలై ఉన్నాయి. అసలు పెట్టుబడిదారీ విధానమే సంస్థాగత సంక్షోభంలో పడుతున్నది. ప్రస్తుత దోపిడీ వ్యవస్థకు ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు.
75వ స్వాతంత్య్ర వేడుకల ముంగిట మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత, ప్రతిఘటన ఎదురవుతున్నా తన నయా ఉదారవాద ఎజెండాతో ముందుకు సాగుతున్నది. చిన్న రైతుల పునాదిగా ఉండే మన వ్యవసాయం కార్పొరేట్ల ఆధారం సాగే వ్యవసాయంగా మార్చేందుకుద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలపైనా మనదేశ రైతాంగం గత అనేక నెలలుగా పోరాడుతూనే ఉంది. తమని కట్టు బానిసలుగా మార్చే కార్మిక కోడ్లపై కార్మికవర్గం పోరాడుతోంది. తన కార్పొరేట్ తైనాతీలకు దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ ప్రారంభించిన నయా ఉదారవాద విధానాలను తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ అమలు చేస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం మనదేశపాలక వర్గాలు అవలంబించిన పెట్టుబడిదారీ పంథా కార్మికులు, ఇతర ప్రజలు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది. బ్రిటిష్ సామ్రాజ్యదోపిడీ స్థానంలో భారతదేశ పెట్టుబడిదార్ల, భూస్వాముల దోపిడీ వచ్చింది. పనిచేసే హక్కు, గౌరవప్రదమైన జీవితం, సార్వత్రిక విద్య, కష్టజీవులందరికి మెరుగైన విద్య, వైద్యం వంటివి ఈ వ్యవస్థ అందించలేకపోయింది.
అక్టోబర్ మహా విప్లవం దివాళాకోరు పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయాన్ని చూపింది. సోషలిజమే ప్రత్యామ్నాయం. 104వ అక్టోబర్ విప్లవ దినోత్సవం సందర్భంగా కార్మిక బాహుళ్యానికి దాని ప్రాధాన్యతను అర్థం చేయించాలి. కార్మికుల రోజువారి సమస్యలపై పోరాడుతూనే ప్రస్తుత దోపిడీ సమాజ అంతానికి వారిని సన్నద్ధులను చేయాలి.
స్వేచ్ఛానువాదం: ఆరెస్బీ
- హేమలత