Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోని కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, అన్ని గ్రామాల్లోనూ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలు కావడం లేదు. అన్నిచోట్ల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. కార్పొరేషన్, పురపాలక అధికారులు, సిబ్బంది గత కొన్ని సంవత్సరాల నుండి కనీసం నామమాత్రంగ ానైనా దాడులు చేయక పోవడం, వినియోగాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరించడంతో సమస్య తీవ్రమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, మిగతా కార్పొరేషన్లు, అన్ని పురపాలికల నుంచి ప్రతిరోజూ సేకరిస్తున్న చెత్త నుంచి 25 శాతం ప్లాస్టిక్ కవర్లు వస్తుండటం ఆందోళన కలిగించే విషయం. అన్ని జిల్లాలలో, నగరాలలో, పురపాలికల్లో రోడ్ల మీద, వీధుల్లో ఎటుచూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. మురుగు కాల్వలు, చెరువులు, కుంటలు, చెత్తకుప్పల్లో పాలిథిన్ సంచులే దర్శన మిస్తున్నాయి. పర్యావరణానికి ముప్పు తెస్తున్న ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని క్రయ, విక్రయదారులతో పాటు అధికారులు, సిబ్బంది ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణ లున్నాయి. 2016లో ప్లాస్టిక్ నిషేధం అమలులోకి తెచ్చారు. ఆహారాన్ని ప్లాస్టిక్ కాగితాల్లో ప్యాక్ చేయడం, సరఫరా చేయడం నిషేధమంటూ కచ్చితమైన నిబంధన తీసుకొచ్చారు. అయినా అది ఎక్కడా అమలు కావడం లేదు. జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల పరిధిలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం కోసం తీర్మానాలు చేసినా ఆచరణలోకి రావడంలేదు. అన్ని జిల్లాలలోని పురపాలక సంఘాల పరిధిలో ఎక్కడపడితే అక్కడ పాలిథిన్ కవర్లను వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లలో 90శాతానికిపైగా 50మైక్రాన్ల కంటే తక్కువ ఉండే కవర్లను ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లు, పురపాలక సంఘాల పరిధిలో రోజుకు అధిక మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ కవర్ల వినియోగం జరుగుతున్నా ప్రత్యేకంగా దృష్టి సారించిన సందర్భాలు లేవు. పురపాలక సంఘాల్లోని శానిటరీ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ అంతంతమాత్రంగానే ఉంది. నిషేధిత కవర్లను బహిరంగంగానే విక్రయిస్తున్నా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేస్తున్న దాఖలాలు లేవు. దుకాణదారులతో కొంతమంది మున్సిపల్ సిబ్బంది 'మిలాఖత్' అయ్యారని బహిరంగంగ విమర్శలు వస్తూ ఉన్నాయి. మరోవైపు విజయవాడ, హైదరాబాద్, చెన్నై వంటి ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ కవర్లు టన్నుల కొద్దీ దిగుమతి అవుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన, ప్రత్యామ్నాయ పద్ధతులు ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలకు మరో మార్గం లేకపోవడం కూడా వినియోగం పెరగడానికి ఓ కారణమవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు దీనిపై కఠినంగా వ్యవహరించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
- కామిడి సతీష్ రెడ్డి, 9848445134